ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

ఫొటో సోర్స్, CGKHABAR/BBC

ఫొటో క్యాప్షన్, మావోయిస్టుల సమావేశం (ఫైల్‌ ఫొటో)
    • రచయిత, బళ్ల సతీశ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన తరువాత మావోయిస్టు హిడ్మా పేరు బాగా చర్చల్లోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయసు, సన్నగా ఉండే ఈ మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడిగా చెబుతున్నారు.

''ఈ వ్యక్తి ఇన్ని వ్యూహాలు రచించగలడా? అని ఆయనను కలిసిన వారు ఆశ్చర్యపోతారు'' అని హిడ్మా గురించి తెలిసినవాళ్లు, ఆయనతో పని చేసేవాళ్లు చెబుతారు.

గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి, బయటకు వచ్చిన కొందరితో బీబీసీ మాట్లాడింది. వారిలో హిడ్మాను ఒకట్రెండు సార్లు కలిసిన వారు కూడా ఉన్నారు.

''ఆయన చాలా సౌమ్యంగా, మృదువుగా మాట్లాడుతారు. ఆయన మాట తీరు విని ఈయనేనా ఇంత విధ్వంసం సృష్టించింది అనుకుంటారు'' అని చెబుతారు హిడ్మా గురించి తెలిసిన వారు.

సౌమ్యంగా మాట్లాడే ఆ హిడ్మాయే దాదాపు పదికి పైగా దాడుల్లో పదుల సంఖ్యల్లో భద్రతా బలగాల మరణానికి కారకుడుయ్యారు.

అసలు మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల ఆశ్చర్యకరమైన ప్రస్థానం. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి.

దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం ఆయన సొంతూరు. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు.

ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నారు.

తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఆయన చదివింది మాత్రం 7వ తరగతే.

''హిడ్మాను 2000వ సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెబుతారు.

ఆయుధాల తయారీ, రిపేర్లు చేసేవాడు. గ్రనేడ్లు, లాంఛర్లు స్థానికంగా తయారు చేయించాడు.'' అని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు ఒకరు బీబీసీకి చెప్పారు.

2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో ఎదిగారు హిడ్మా. తరువాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో చేరారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

ఫొటో సోర్స్, CGKHABAR/BBC

ఫొటో క్యాప్షన్, మావోయిస్టులు (ప్రతీకాత్మక చిత్రం)

అంచెలంచెలుగా ఎదుగుదల

2001-2007 ఏడు మధ్య హిడ్మా సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడుగానే ఉన్నారు. కానీ బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం ఎదుగుదల హిడ్మాను మరింత యాక్టివ్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిందంటారు మావోయిస్టు కార్యకలాపాలను విశ్లేషించిన వారు.

1990ల మధ్యలో ఒక దశలో బస్తర్‌లో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ మళ్లీ తిరిగి లేవడానికి ఒక రకంగా సల్వాజుడుంపై స్థానికుల్లో ఏర్పడ్డ ప్రతీకారేచ్ఛ కారణమని వారి విశ్లేషణ.

సరిగ్గా ఇదే పాయింట్ హిడ్మా విషయంలో కూడా పనిచేసింది అంటారు. ''తన వారిపై జరుగుతోన్న దారుణాలు అతణ్ణి అలా తయారు చేసి ఉండొచ్చు.'' అని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యులు ఒకరు అన్నారు.

2007వ సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇందులో 24 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మరణించారు. హిడ్మా నాయకత్వంలో ఈ దాడి జరిగిందని చెబుతారు.

''సీఆర్పీఎఫ్ వారు అక్కడ ఒక గ్రామాన్ని తగలబెట్టారు. ఆ విషయం తెలుసుకున్న హిడ్మా బృందం వారిని మార్గంలో అడ్డగించడానికి వెళ్లింది. తిరిగి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై హిడ్మా బృందం దాడికి దిగింది.'' అని పార్టీ మాజీ సభ్యులొకరు బీబీసీతో చెప్పారు.

సీఆర్పీఎఫ్ బృందం అక్కడి గ్రామాలను తగలబెట్టిందన్న విషయాన్ని బీబీసీ ధ్రువీకరించలేదు.

ఈ ఘటనకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అప్పటి వరకూ మావోయిస్టులు ల్యాండ్ మైన్ (మందు పాతర)లపై ఎక్కువగా ఆధారపడేవారు. కానీ, మొదటిసారి తుపాకులతో తలపడి, ఎదురు ఎదురుగా యుద్ధానికి దిగిన పెద్ద ఘటనగా దీన్ని చెబుతారు.

మావోయిస్టులను మందు పాతరల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మాది కీలక పాత్రగా చెబుతారు.

''నిజానికి హిడ్మా దూకుడు పార్టీ నాయకత్వనికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తరువాత కూడా ఆయన ఆ దూకుడును కొనసాగించాడు. అందుకే పార్టీ ఆయనకు పెద్ద బాధ్యతలు ఇస్తూ పోయింది.'' అని ఒక మాజీ మహిళా మావోయిస్టు వివరించారు.

2008-09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్ అయ్యారు హిడ్మా. ఈ ఫస్ట్ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది.

తరువాత 2011లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటిలో సభ్యుడు హిడ్మా సభ్యుడయ్యారు.

2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందని చెబుతారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తాజా ఎన్‌కౌంటర్‌ తర్వాత హిడ్మా పేరు బాగా వినిపిస్తోంది.

తుపాకీ పట్టడం అరుదు

2011 ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో హిడ్మా గురించి ఆసక్తికర చర్చ జరిగిందని అప్పట్లో మావోయిస్టు పార్టీలో ఉండి తరువాత బయటకు వచ్చిన ఒక మావోయిస్టు చెప్పారు.

''ఆ చర్చ ఆయన పోరాట శైలి గురించి. హిడ్మా అనేక పోరాటాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొన్నా, స్వయంగా తూటాలు పేల్చేది తక్కువ. దగ్గరుండి మిగిలిన మావోయిస్టులను నడిపిస్తారు.

ఎంతో తప్పనిసరి అయితే తప్ప తన దగ్గరున్న తుపాకీ ఉపయోగించడు. ఆయన నాయకత్వంలోని దళం చాలా చురుగ్గా పని చేస్తుంది. అలాగని ఆయన యుద్ధ భూమికి దూరంగా ఉండడు. పక్కనే ఉండి నడిపిస్తాడు'' అని ఆ మాజీ మావోయిస్టు హిడ్మా గురించి చెప్పారు.

''ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు తెలిసి 2012 వరకూ హిడ్మాకు ఒక్క చిన్న గాయం కూడా కాలేదు. అన్ని వేల బుల్లెట్ల పోరాటంలో అతనున్నా, చిన్న గాయం కాకుండా ఉండడం విచిత్రమైన విషయం. 2012 తరువాత అతనికి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది నాకు తెలియదు.'' అని వివరించారు.

మావోయిస్టుగా సుదీర్ఘ ప్రయాణం

గతంలో చాలా మంది బలమైన నక్సలైట్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారంతా ఎంతో దుందుడుకుగా పోలీసులపై దాడులకు దిగారు. కానీ, వారందరి కంటే హిడ్మా చురుకుగా ఉన్న సమయం ఎక్కువ.

బాగా పేరొచ్చి దుందుండుకుగా సాగే మావోయిస్టులు ఎక్కువ కాలం అలా ఉండలేరు. వారు చనిపోవడమో లేక లొంగిపోవడమో జరుగుతుంటుంది.

కానీ, హిడ్మా అలా కాదు. చాలా కాలం నుంచీ క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

తాజా ఘటనలో హిడ్మా ప్రత్యక్షంగా ఉన్నాడని పలువురు పోలీసులు ధ్రువీకరించారు. హిడ్మాతో పాటూ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌ చీఫ్‌ దేవ్‌ జీ, తెలంగాణ కమిటీ కార్యదర్శి హరిభూషణ్ కూడా శనివారంనాటి ఘటనా స్థలంలో ఉన్నట్లు కొందరు పోలీసు అధికారులు బీబీసీతో చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పోలీసు బృందాలు

స్థానికంగా క్రేజ్

హిడ్మా బస్తర్ స్థానికుడు. అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. స్థానికులతో కలిసిపోతారు. వారితో సత్సంబంధాలు ఉంటాయి. అతనికి స్థానిక యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. ''అక్కడి వారు అతణ్ణి ఓ దేవుడిలా చూస్తారు'' అని దండకారణ్యం వార్తలు కవర్ చేసిన ఒక విలేకరి బీబీసీకి చెప్పారు. "ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవడం అతనికి అలవాటు'' అని హిడ్మా గురించి చెప్పారాయన.

''హిడ్మా విదేశాల్లో శిక్షణ పొందారన్నది తప్పు. నాకు తెలిసినంత వరకూ ఆయన ఎప్పుడూ ఏ పెద్ద నగరమూ చూసి ఉండరు. ఆయన బస్తర్, దండకారణ్యం దాటి ఉండకపోవచ్చు. అసలు మెయిన్ రోడ్లపై హిడ్మా ప్రయాణించిన దాఖలాలుకూడా లేవు'' అన్నారాయన.

ప్రస్తుతం అతని తలపై లక్షల రివార్డు ఉంది. హిడ్మా మావోయిస్టు పార్టీ అత్యున్నత కమిటీ అయిన పార్టీ కేంద్ర కమిటీలో సభ్యత్వం పొందారని, 2010 సెప్టెంబరులో 'ది హిందూ' పత్రిక రాసింది.

అయితే, హిడ్మా కేంద్ర కమిటీ సభ్యులు కాలేదని ఒక ఇంటిలిజెన్స్ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు. ఆయన కేంద్ర కమిటీలో ఉన్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియదు.

మావోయిస్టు పార్టీ నిర్మాణం ఎలా ఉంటుంది?

మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం.

పార్టీ: సంస్థాగత నిర్మాణం, సంఘాలు ఏర్పాటు చేయడం, మార్గదర్శకత్వం పార్టీ కమిటి చేస్తుంది. పార్టీయే వీరికి అత్యున్నత సంస్థ.

పార్టీ కేంద్ర కమిటీలు తుది నిర్ణయం తీసుకుంటాయి. పార్టీకి కేంద్ర కమిటి, రాష్ట్ర కమిటి, జోనల్, ఏరియా కమిటీలు ఉంటాయి.

పార్టీ ప్రభుత్వం, పార్టీ సాయుధ విభాగాలు కూడా పార్టీ ఆధ్వర్యంలోనే ఉంటాయి.

సాయుధ విభాగం: పోలీసులతో తలపడే విభాగం ఇది. మావోయిస్టుల్లో అందరూ తుపాకీ పట్టుకున్నప్పటికీ ప్రధానంగా సాయుధ బలగంగా ఉండేది వీరే. దీన్నే పీఎల్జీఏ లేదా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని కూడా అంటారు.

ఇది బెటాలియన్లుగా, ప్రాంతాల వారీ దళాలుగా ఉండి, కమాండర్ల నాయకత్వంలో, పార్టీ మార్గదర్శనంలో పనిచేస్తుంది.

జనతన సర్కార్: దీన్నే రెవల్యూషరీ పీపుల్స్ కమిటీ అంటారు. తమ ఆధిపత్యం పూర్తిగా ఉన్న ప్రాంతాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తారు.

అక్కడ ప్రభుత్వం తరహాలో అన్నీ వారే ఏర్పాటు చేస్తారు. ఆ పరిధిలో నివసించే ప్రజలకు కనీస వైద్య సేవలు అందించడం, కొంత విద్య నేర్పడం, వ్యవసాయంలో సలహాలు ఇవ్వడం వంటివి చేస్తారు.

ముఖ్యంగా ఆదివాసీలకు తరచూ ఎదురయ్యే మలేరియా, డయేరియా వంటి వాటికి వైద్యం అందిస్తారు.

ప్రస్తుతం మావోయిస్టులకు అంటే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవ రావు అనే తెలుగు వ్యక్తి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)