కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం

కొండబారిడి గ్రామం సేంద్రీయ వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచింది.
ఫొటో క్యాప్షన్, కొండబారిడి గ్రామం సేంద్రీయ వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచింది.
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

ఆరు దశాబ్ధాల కిందట దళారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆ ఊరు ఇప్పుడు సేంద్రియ విప్లవంలో విజేతగా నిలిచింది. విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని కొండబారిడి గిరిజన గ్రామం రాష్ట్రంలోనే తొలి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా ఆవిర్భవించింది.

ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడు గిరిజనులను దళారుల దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తే ఇప్పుడు మరో ఉపాధ్యాయుడు కొత్త పోరాట పాఠాలు నేర్పించారు. ఒకప్పుడు తుపాకులు పట్టిన కొండబారిడి గ్రామన్ని నేడు 100 శాతం ప్రకృతి వ్యవసాయ గ్రామంగా మార్చేశారు.

నక్సల్‌ గ్రామం పేరుతో పోలీసులు లాఠీల చప్పుడు, బూట్ల శబ్ధం వినిపించిన ఈ నేల ప్రకృతి వ్యవసాయ గ్రామంగా మారడంతో రాష్ట్ర, దేశ నాయకులు, అధికారులే కాదు ఐకరాజ్యసమితి ప్రతినిధులు కూడా సందర్శిస్తున్నారు.

సేంద్రీయ వ్యవసాయంపై గిరిజనులకు అవగాహన కల్పించారు పారినాయుడు
ఫొటో క్యాప్షన్, సేంద్రీయ వ్యవసాయంపై గిరిజనులకు అవగాహన కల్పించారు పారినాయుడు

ఒక కొండబారిడి- ఇద్దరు మాస్టార్లు

"కొండబారిడి ఓ గిరిజన కుగ్రామం. 1962-63 సమయంలో వెంపటాపు సత్యం అనే ఉపాధ్యాయుడు ఇక్కడి గిరిజనులపై జరుగుతున్న దోపిడిని గుర్తించి వారిని చైతన్యపరిచారు.

శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం అలా మొదలైంది. కొండబారిడి దళం కూడా ఏర్పడింది. ఆ గ్రామానికి నక్సల్ గ్రామంగా ముద్ర కూడా పడింది.

ఇప్పుడు అదే ఊరు ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న తొలి గ్రామంగా మారి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది." అని శ్రీకాకుళం రచయితల సంఘం ప్రతినిధి కొండలరావు అన్నారు.

గ్రామంలో స్తూపం

పార్వతీపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన డి.పారి నాయుడు గిరిజన బాల బాలికల కోసం 'జట్టు' ట్రస్టును నెలకొల్పారు. దానిలో పిల్లలకు ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పేవారు.

1998లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసిన పారి నాయుడు 'జట్టు' ట్రస్టు బాధ్యతలు మరొకరికి అప్పగించి ప్రకృతి వ్యవసాయానికి అంకితమయ్యారు. ఆయన ఆలోచనల ప్రతిరూపమే కొండబారిడి తొలి సేంద్రియ వ్యవసాయ గ్రామంగా నిలవడం .

"కొండబారిడిలో కొంత భూమిలో ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆవు పేడ, మొక్కల నుంచి రాలిపడే ఆకులు ఇతర సహజ సిద్ధమైన పదార్థాలతోనే సేంద్రియ ఎరువులను తయారు చేసి సాగు చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. గ్రామస్తుల్ని క్రమంగా భాగస్వాముల్ని చేశాం. పాత పద్ధతుల్లో చేసిన సాగుకంటే సేంద్రీయ పద్ధతుల్లో చేసిన సాగులో ఎక్కువ దిగుబడి రావడంతో గ్రామం మొత్తం ఆ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది.” అని పారి నాయుడు వివరించారు.

“ఐక్య రాజ్యసమితి అసిస్టెంట్ జనరల్ సత్యపాల్ త్రిపాఠి కొండబారిడితోపాటు మరికొన్ని ప్రకృతి వ్యవసాయ గ్రామాల్ని సందర్శించారు. ఇప్పటి వరకు వందశాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మారిన 93 గ్రామాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. సత్య .ఎస్. త్రిపాఠితో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి. విజయకుమార్ 93 గ్రామాల బయో గ్రామాల ప్రతినిధులను సత్కరించారు." అన్నారు పారినాయుడు.

ఐక్య రాజ్య సమితి ప్రతినిధులు కొండబారిడి గ్రామాన్ని పరిశీలించారు
ఫొటో క్యాప్షన్, ఐక్య రాజ్య సమితి ప్రతినిధులు కొండబారిడి గ్రామాన్ని పరిశీలించారు

త్వరలో 450 ప్రకృతి వ్యవసాయ గ్రామాలు

"గతంలో గిరిజనులు ప్రకృతి వ్యవసాయమే చేసేవారు. అయితే ఆధునిక పద్ధతులపై దృష్టి సారించకపోవడంతో దిగుబడి తక్కువ వచ్చేది. అంతే కాకుండా ఏదో ఒకటి లేదా రెండు పంటలకే పరిమితమయ్యేవారు. మేం స్థాపించిన 'జట్టు' ట్రస్టు ద్వారా గిరిజనులకు పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేయడం క్రమంగా అలవాటు చేశాం. ఇప్పడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి.” అని తన అనుభవాలను వివరించారు పారినాయుడు

“ఇవాళ పార్వతీపురం, కురుపాం మండలాలలోని 450 గ్రామాల ప్రజలు ప్రకృతి వ్యవసాయం నేర్పించమని అడుగుతున్నారు. కొందరైతే తమ గ్రామాల్ని దత్తత తీసుకోమని కోరుతున్నారు. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువుల వాడకం, స్వయంగా విత్తనాల ఉత్పత్తి, సరికొత్త సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించమే మా లక్ష్యం." అని పారినాయుడు వివరించారు.

‘మా తాతలు చేసిందే.. కానీ మేం మరిచాం’

గతంలో ఇక్కడ సేంద్రియ వ్యవసాయం ఉండేదని, ఆధునికత కారణంగా అది కనుమరుగైందని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. రసాయన ఎరువులు నేలలో సారాన్ని లాగేశాయని వారు అన్నారు.

"మా తాతల కాలంలో రసాయన ఎరువులనేవే చూడలేదు. కానీ క్రమంగా మా గ్రామాల్లోకి కూడా అవి వచ్చేశాయి. అయితే 'జట్టు' ట్రస్టు కృషితో మేం మెల్లగా సేంద్రియ విధానంలోకి వచ్చేశాం. మా గ్రామం ప్రకృతి వ్యవసాయంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవబడం ఎంతో ఆనందంగా ఉంది." అని కొండబారిడి గ్రామానికి చెందిన రమణి, గోపినాధ్ చెప్పారు.

సాగు

'జట్టు' ట్రస్టు నమూనా...అర ఎకరంలో అన్నీ...

ఈ రోజుల్లో అందరికి సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతోంది. ఇళ్ల డాబాలపై సైతం మిద్దె తోటల పేరుతో కూరగాయలను పెంచుకుంటున్నారు. తక్కువ స్థలంలో కూడా ఎక్కువ రకాలను పండించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. 20 ఏళ్ల కిందటే 'అర ఎకరం' నమూనా పేరుతో సేంద్రియ వ్యవసాయాన్ని పారి నాయుడు గిరిజన గ్రామాల్లో ప్రవేశపెట్టారు.

"ఇప్పుడు 'అర ఎకరం నమూనా' పద్ధతిలో చేస్తున్నాం. మాకు ‘జట్టు’ ట్రస్టు సభ్యులు శిక్షణ ఇస్తారు. సేంద్రియ ఎరువులు తప్ప రసాయన ఎరువులు మా భూమిలో వేయం. మాకున్న మొక్కలు, పశువుల ఎరువులతో సేంద్రీయ ఎరువులు తయారు చేసుకుంటూ డబ్బులు కూడా ఆదా చేసుకుంటున్నాం. కొండబారిడి స్ఫూర్తితో మేం మా గ్రామాన్ని సేంద్రీయ గ్రామంగా మార్చుకున్నాం." అని వలసగూడ గ్రామవాసి రాజు బీబీసీతో చెప్పారు.

గ్రామంలో గోడలపై రాతలు

ఒకప్పుడు ఎర్రరాతలు ఇప్పుడు పచ్చగా మారాయి

కొండబారిడి అంటే ఇప్పటికీ నక్సల్ గ్రామంగానే చాలామందికి గుర్తు. రాష్ట్రంలో తొలి ప్రకృతి వ్యవసాయంగా మారిన ఈ గ్రామంలో నేటికీ వెంపటాపు సత్యం మాస్టారు అందరికీ జ్ఞాపకముండే వ్యక్తి. సత్యం మాస్టారి దగ్గర పాఠాలు నేర్చుకున్న కొండబారిడి గ్రామస్తులు కొందరు బీబీసీతో మాట్లాడారు.

"ఇప్పటికి ఇక్కడ వెంపటాపు సత్యం మాస్టారి పేరుతో ఏ కార్యక్రమం చేసినా పోలీసులు, అధికారులు అడ్డు చెప్తారు.

మా గ్రామంలో మహిళా సంఘాల దంపుడు బియ్యం కేంద్రానికి సత్యం మాస్టారి పేరు పెట్టుకుందామని అనుకున్నాం.

విషయం తెలిసిన అధికారులు వద్దన్నారు. దాంతో ఆ కేంద్రానికి 'సత్యగాంధీ దంపుడు బియ్యం తయారీ కేంద్రం'గా పేరు పెట్టుకున్నాం’’ అని చెప్పారు గ్రామానికి చెందిన పరశయ్య.

పరశయ్య వెంపటాపు సత్యం వద్ద మూడో తరగతి చదువుకున్నారు.

దంపుడు బియ్యం కేంద్రం

‘‘ఒకప్పుడు విప్లవ నినాదాలతో నిండిన మా ఊరి గోడలు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ సూత్రాలతో కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు సత్యం మాస్టారు, ఇప్పుడు పారినాయుడు మాస్టారు ఇద్దరూ మా కొండబారిడి పేరు ప్రజల మనసుల్లో ముద్ర పడేలా చేశారు" అన్నారు పరశయ్య.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)