కరోనావైరస్ వ్యాక్సీన్: భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరడం అసాధ్యం

ఫొటో సోర్స్, SOPA IMAGES
- రచయిత, ప్రశాంత్ చాహల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా ప్రభుత్వం తమ దేశంలో తయారైన కరోనా వ్యాక్సీన్ ‘స్పుత్నిక్-5’ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారత్‌తో చర్చలు జరుపుతోంది.
తమ వ్యాక్సీన్‌ను వీలైనంత ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు భారత్ పారిశ్రామిక సదుపాయాలను, వాటి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని రష్యా భావిస్తోంది. అటు భారత్‌కు కూడా ఇది ప్రయోజనకరమైన విషయంగానే అనిపిస్తోంది.
భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ సంబంధిత జాతీయ నిపుణుల బృందం చీఫ్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ దాని గురించి మాట్లాడారు.
“భారత్ భారీ స్థాయిలో స్పుత్నిక్-5 వ్యాక్సీన్ ఉత్పత్తి చేయగలదు. అది రష్యాకు చాలా ప్రయోజనకరం. దానితోపాటూ భారత్‌కు కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. అంతే కాదు, ప్రపంచానికి కూడా మనం వ్యాక్సీన్ అందించగలుగుతాం” అన్నారు.
“రష్యా తమ కోవిడ్-19 వ్యాక్సీన్ స్పుత్నిక్-5 మూడో దశ పరీక్షలు నిర్వహించడంతో పాటు, భారత కంపెనీల్లో దాని తయారీ కోసం భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది” అని పాల్ చెప్పారు.
స్పుత్నిక్-5ను మొదటి రెండు ట్రయల్స్ గణాంకాలను భారత శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని, తర్వాత అవసరాన్ని బట్టి మూడో దశ ట్రయల్ కోసం చర్యలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ఔషధ కంపెనీల సహకారంపై ఆశలు
స్పుత్నిక్-5ను మార్కెట్లోకి తీసుకురావడానికి రష్యా ఫాస్ట్-ట్రాక్ పద్ధతిని అనుసరిస్తోంది. దాని కోసం పుతిన్ ప్రభుత్వం ఈ వ్యాక్సీన్‌కు కొన్ని అత్యవసర అనుమతులు కూడా మంజూరు చేసింది. కరోనాతో పోరాటంలో స్పుత్నిక్-5 మెరుగ్గా పనిచేస్తున్నట్లు తేలిందని లాన్సెట్ హెల్త్ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది.
ఈ వ్యాక్సీన్‌కు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేసి త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని రష్యా భావిస్తోంది. అయితే, రష్యాకు ఆ వ్యాక్సీన్‌ను భారీగా ఉత్పత్తి చేయడం ఎలా అనే ఒక పెద్ద సవాలు ఎదురైంది. అందుకే, ఇప్పుడు ఆ దేశం భారత ఔషధ కంపెనీల సహకారం కోసం భారత్‌తో చర్చలు జరుపుతోంది.
రష్యా వ్యాక్సీన్ తయారు చేయడానికి ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారని భారత ప్రభుత్వం దేశంలోని కంపెనీలను అడిగింది. ఇప్పటివరకూ మూడు కంపెనీలు దీని కోసం ముందుకు వచ్చాయి. తాము వ్యాక్సీన్ తయారు చేస్తామని చెప్పాయి. మరికొన్ని కంపెనీలు రష్యా ప్రభుత్వం ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయి. కొన్ని కంపెనీలు రష్యాలోని తమ సహచర కంపెనీలతో చర్చిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అందరి కళ్లూ కరోనావైరస్ వ్యాక్సీన్ పైనే
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2 కోట్ల 75 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 వల్ల సుమారు 9 లక్షల మంది చనిపోయారు.కరోనా పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసి, భారత్ రెండో స్థానానికి చేరుకుంది.
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరి కళ్లూ కరోనావైరస్ టీకాపైనే ఉన్నాయి. దాని తయారీ కోసం భారత్ సహా ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ కూడా ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నారు.
ఈ ఎదురుచూపుల మధ్య టీకా తయారు చేయగానే, ప్రజల కష్టాలు రాత్రికిరాత్రే తీరిపోవని, ఆ వ్యాక్సీన్‌ను సామాన్యుల వరకూ చేర్చడానికి ఒక సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది.
గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్(ప్రపంచ మేధోసంపత్తి హక్కులు) ప్రకారం టీకా తయారు చేసేవారికి 14 ఏళ్లు దాని డిజైన్ మీద, 20 ఏళ్లవరకూ పేటెంట్ మీద హక్కులు లభిస్తాయి. కానీ, ఈ అనూహ్య మహమ్మారి తీవ్రత చూస్తున్న ప్రభుత్వాలు ‘తప్పనిసరి లైసెన్సింగ్’ మార్గాన్ని కూడా అనుసరిస్తున్నాయి. అంటే, దీని ప్రకారం ఏదైనా థర్డ్ పార్టీ కూడా దీనిని తయారు చేయవచ్చు. అంటే, కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశాల ప్రభుత్వాలు కొన్ని ఔషధ కంపెనీలకు దీని తయారీ అనుమతులు ఇవ్వవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
భారత వ్యాక్సీన్ మార్కెట్ ఎంత పెద్దది?
ఇక, ఔషధాల విషయానికి వస్తే, జెనెరిక్ మందులు తయారీలో, వాటి ఎగుమతుల్లో టాప్‌లో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2019లో భారత్ 201 దేశాలకు జెనెరిక్ మందులు విక్రయించి, బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించింది.
ప్రపంచంలో వ్యాక్సీన్ ఉత్పత్తి, సరఫరా చేసే దేశాల జాబితాలో కూడా భారత్ ప్రస్తుతం టాప్ దేశాల్లో ఒకటిగా ఉందని ఇంటర్నేషనల్ మార్కెట్ ఎనాలసిస్ అండ్ కన్సల్టింగ్(ఐఎంఎఆర్‌సీ) గ్రూప్ నివేదిక చెబుతోంది. భారత్ ఒక్కటే యునిసెఫ్‌కు 60 శాతంమేర వ్యాక్సీన్లు తయారుచేసి అందిస్తోంది.
భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ఖర్చు తక్కువ, మిగతా దేశాలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. అందుకే,వ్యాక్సీన్ తయారీ కోసం మిగతా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌ను తగిన చోటుగా భావిస్తారు.
2020 జూలై 15న ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ్.. ‘కరోనా వ్యాక్సిన్ తయారీ దిశగా భారత్ ఎలాంటి సహకారం అందిస్తోంది’ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
“కరోనా టీకాను ప్రపంచంలో ఏ మూలైనా తయారు చేయవచ్చు. కానీ భారత్ సహకారం లేకుండా దానిని భారీగా ఉత్పత్తి చేయడం అసాధ్యం” అన్నారు.
60 శాతం వ్యాక్సీన్ ఉత్పత్తి
భారత ఫార్మా పరిశ్రమ సామర్థ్యం, దానిపై ఉన్న అంచనాల గురించి కూడా డాక్టర్ భార్గవ్ మాట్లాడారు.
“ఫార్మారంగంలో భారత్‌కు ప్రపంచంలోనే మంచి పేరుంది. ఆఫ్రికా, యూరప్, ఆగ్నేయాసియా, ఏ భాగంలో అయినా ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 60 శాతం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనా వ్యాక్సీన్ అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో భారత్ ఒకటి కాబోతోంది. ఆ అవకాశాన్ని మనం తోసిపుచ్చలేం” అన్నారు.
మెరుగైన సాంకేతికత అభివృద్ధి, భారీ కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థల వల్ల భారత వ్యాక్సీన్ ఉత్పత్తి సామర్థ్యం ఇంతకు ముందుతో పోలిస్తే, గత ఏడాది గణనీయంగా పెరిగినట్లు ఐఎంఆర్‌సీ నివేదిక చెబుతోంది.
2019 నివేదిక ప్రకారం భారత్ వ్యాక్సీన్ మార్కెట్‌లో గ్లాక్సో స్మిత్‌క్లైన్ అతిపెద్ద కంపెనీగా ఉంది. సినోఫీ ఎవెంటిస్, ఫైజర్, నోవార్టిస్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లోని పెద్ద వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థల జాబితాలో తర్వాత స్థానాల్లో నిలిచాయి.

ఫొటో సోర్స్, BHARAT BIOTECH
భారత ఫార్మా రంగం దశ మారిపోతుందా?
ప్రపంచవ్యాప్తంగా కనీసం 140 కరోనా వ్యాక్సీన్ల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో 11 వ్యాక్సీన్లకు మనుషులపై పరీక్షలు చేసేందుకు అనుమతులు లభించాయి. అవి వివిధ స్థాయిల్లో ఉన్నాయి. వీటిలో రెండు టీకాలను భారత కంపెనీలు తయారు చేస్తున్నాయి. హ్యూమన్ ట్రయల్ దశకు కూడా చేరుకున్న ఇవి విజయవంతం అవుతాయని ఆశిస్తున్నారు.
కరోనా వ్యాక్సీన్ తయారీలో విజయవంతం అయినట్లు చెబుతున్న కంపెనీల్లో మొదటిది హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ‘కోవాక్సిన్’ అనే టీకా తయారు చేసింది. ఇక రెండో కంపెనీ జైడస్ కాడిలా. దీని వ్యాక్సీన్‌కు ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి హ్యూమన్ ట్రయల్ అనుమతి లభించింది. ఈ రెండు కంపెనీలు వ్యాక్సీన్ రెండో, మూడో దశ ట్రయల్ అనుమతులు పొందాయి.
వ్యాక్సీన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ, ఇంతకు ముందు పోలియో, రోటా వైరస్, జికా వైరస్ లాంటి వాటికి కూడా టీకాలు తయారు చేసింది.
భారత్‌లో తయారైన వ్యాక్సీన్ ‘మొట్టమొదటి టీకా’గా మార్కెట్లోకి వస్తే, దానివల్ల భారత వ్యాక్సీన్, ఫార్మా ఇండస్ట్రీ దశ పూర్తిగా మారిపోతుంది.
ఇవి కూడా చదవండి:
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- కోవిడ్ చికిత్సకు ఆరోగ్య బీమా పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- శరీరంలో కరోనావైరస్ చనిపోయినా.. టెస్టుల్లో ‘పాజిటివ్’ అని తప్పుగా వస్తోందా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- హైపర్సోనిక్ స్క్రామ్‌జెట్ టెక్నిక్.. ధ్వనికన్నా ఐదు రెట్ల వేగం గల క్షిపణులతో భారత్ సాధించేదేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








