నమ్మకాలు - నిజాలు : ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’

స్కానింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ శైలజ చందు
    • హోదా, బీబీసీ కోసం

నేను లోపల అడుగు పెట్టబోతుంటే, ఒకతను బయట నిలబడి ఉన్నాడు. ఖాళీ నీళ్ల బాటిల్‌తో అరచేతిలో తట్టుకుంటూ ఎటో చూస్తున్నాడు. నేను లోపలికి వెళ్తుంటే, తప్పుకుని దారిచ్చాడు.

స్కాన్ గది లోపలికి వెళ్లేసరికి, పేషెంట్ బెడ్ మీద పడుకుని ఉంది.

డాక్టర్ వర్షిత స్కాన్ చేస్తోంది. ఆమె నా అసిస్టెంట్. తన పని డిస్టర్బ్ చేయకుండా మౌనంగా వెనక నిల్చున్నాను.

పేషంట్ తల తిప్పుకుని ఉంది. ముఖమ్మీద కొంగు కప్పుకుని ఏడుస్తూ.

నొప్పిగా ఉందేమో!

పేషంట్ వైపు చూశాను. పొట్ట మీద స్కాన్ ప్రోబ్ కదలికలకూ, ఆమె దుఃఖానికీ సంబంధం ఉన్నట్టనిపించలేదు.

స్కాన్ ఇమేజ్ వంక చూశాను.

గర్భాశయం పక్కనే ఒక రింగ్ వంటిది కనిపిస్తోంది.

స్కాన్ మెషీన్ కు దగ్గరగా వెళ్లాను.

ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ.

స్కానింగ్

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని సార్లు గర్భాశయంలో కాకుండా, పక్కనే వున్న ట్యూబులో వస్తుంది ప్రెగ్నన్సీ.

ట్యూబు పరిమాణం సన్నగా వుంటుంది గనక, అందులో పిండం రెండు నెలల మించి పెరగలేదు.

వర్షిత స్కాన్‌లో అదెంత సైజో చూస్తోంది. "మేడం, 4.2 సెంటీమీటర్ " అంది.

అతి చిన్న పిండం. దానిలో మినుకు మినుకుమంటూ హార్ట్ బీట్.

ట్యూబులో వచ్చిన ప్రెగ్నన్సీ చిన్నదైతే కొన్ని సార్లు ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయొచ్చు.

పరిమాణంలో 3.5 సెమీ మించి ఉన్నా, దానిలోపల హార్ట్ బీట్ కనిపించినా వీలైనంత త్వరగా దాన్ని ఆపరేషన్ ద్వారా తొలిగించాల్సి ఉంటుంది. వెంటనే చికిత్స చేయకపోతే, కొన్ని సందర్భాలలో, ట్యూబు పలిగిపోయి ప్రమాదమవుతుంది.

"ఫాస్టింగ్?" మెల్లగా గొణిగాను.

"చివరిసారి ఏ టైముకి తిన్నారూ? ఏం తాగారు?" కనుక్కుంటోంది వర్షిత.

పేషంటుకు తినడానికేదో ఏర్పాటు చేద్దామని కాదు. ఆమె ఖాళీ కడుపుతో వుంటే వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేద్దామని.

"బంధువులెక్కడా?"

"హజ్బండ్ బయట ఉన్నాడు మేడం."

వివరాలు కనుక్కున్నాం. ఆమె వయసు నలభై పైనే వుంటాయి. కాలేజీ కెళ్లే పిల్లలున్నారట.

గదిలో కొచ్చిన దగ్గర్నుండీ గమనిస్తున్నాను. పేషంట్ యేడుస్తూనే వుంది.

నొప్పికి తట్టుకోలేక యేడుస్తోందనుకుని,

"ఏమ్మా, నొప్పిగా వుందా?" స్కాన్ ప్రోబ్ కు అంటుకున్న జెల్ తుడుస్తూ వర్షిత అడిగింది.

నొప్పి లేదన్నట్టు తల అడ్డంగా వూపింది కానీ దిగులంతా ముఖంలోనే వుంది.

"మీరు మరీ ఇలా దిగులు పడొద్దండీ. మేమంతా వున్నాం కదా. సమస్య లేదనను. కానీ చిన్నది. సర్జరీ మామూలుగా అరగంటలో అయిపోతుంది. లాపరోస్కోపీ గనక, కుట్లేమీ వుండవు. రెండో రోజు ఇంటికెళ్లొచ్చు. ఒక వారంలో పనికి కూడా వెళ్లొచ్చు." దగ్గరగా వెళ్లి చెప్పాను.

ముఖమ్మీద చెంగు తీయలేదు. వెక్కివెక్కి ఏడుస్తోంది.

"ఆపరేషనంటే భయమా?"

"ఊహూ."

"ఇంకేంటి?"

గర్భం

ఫొటో సోర్స్, Getty Images

" ఆయనేమంటాడో? అసలే కోపం."

"ఆయనా , ఆయనేమంటాడు?"

"ఇలా ఎప్పుడూ జరగలేదండి. అసలిది ప్రెగ్నన్సీయేనంటారా?"

"బీటా హెచ్ సీ జి ఎంత?" వర్షిత వైపు చూశాను

"6000 మేడం."

"గర్భం వుంది కాబట్టే ఆ హార్మోన్ అంత పెరిగింది. ప్రెగ్నన్సీ లేకపోతే అది సున్నా దగ్గర వుంటుంది. పైగా స్కానింగ్లో ప్రెగ్నన్సీ కనిపిస్తూనే వుంది. కాకపోతే యుటిరస్‌లో కాకుండా ట్యూబులో వచ్చింది. అవునూ , మీకా అనుమానమెందుకొచ్చిందీ?"

"ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉంటాం."

"జాగ్రత్త అంటే, గర్భ నిరోధక మాత్రలు గానీ, ఇంజెక్షన్లు గానీ, వాడుతున్నారా?"

"కాదండీ." చెప్పడానికి సంకోచిస్తోంది.

"ఆయనే..చూసుకుంటారవన్నీ."

"ఓ! కండోమ్స్ వాడతారా? అవి కూడా ఫెయిల్ అయే అవకాశం ఉంటుంది."

ఆమె ముఖం చూస్తుంటే, మా ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నామనిపించింది.

తలెత్తకుండా కళ్లు దించుకుని జవాబులు చెప్తోంది.

"లేదు లేదు. అలాంటివేమీ వాడం. ఆయనే, జాగ్రత్త తీసుకుంటారు."

మేమిద్దరం వింటున్నాం.

"చివరి నిముషంలో." కొంచం ఆగి ఆమే అంది.

ఆమె ఏం చెప్తోందో అర్థమైంది.

చివరి నిమిషంలో , వీర్యాన్ని గర్భాశయ ద్వారంలో కాకుండా బయట వదిలేయడమనే పద్ధతి.

"ఎన్నో ఏళ్ల నుండీ ఇలాగే చేస్తున్నాం. ఎప్పుడూ ఇలా జరగలేదు."

"జరగకపోవడం మీ అదృష్టం. అందుబాటులో వున్న గర్భ నిరోధక సాధనాలతో పోలిస్తే, ఈ పద్ధతి వల్ల రక్షణ తక్కువ."

"ఈ గర్భమెలా వచ్చిందని ఆయనకసలే కోపంగా వుంది."

"కోపమేంటి? ఆయనకెందుకు కోపం?" కోపంగా అంది వర్షిత.

"మీరు వాడే పద్ధతి అంత సమర్థవంతమైనదేమీ కాదు. గర్భం రాకుండా వంద శాతం రక్షణ ఇస్తుందనుకుంటే పొరపాటే. అది ఎందుకు ఫెయిలవుతుందో ఆయనతో చెప్తాను. దిగులు పడకండి. "

"ఎలా చెప్తారు?" అపనమ్మకంగా చూసింది.

'ఆ విషయాల గురించి అతనితో చర్చించడం, ఒకవేళ చెప్పినా అతను నమ్మడం, తేలికగా సమస్య తేలిపోవడం జరిగే పనేనా' అని ఆమె అనుమానం.

"మా భాష మాకుంటుంది. మీ ముందే చెప్తాను. మీకూ తెలియాలి ఆ పద్ధతి ఎక్కడ ఫెయిలవుతుందో. "

"అబ్బే, వద్దండీ."

భార్య అలాంటి మాటలు వినడం ఆయనకిష్టముండదని ఈమెకు తెలుసు.

"వినకూడనివేమీ కాదు, ఆ వివరాలు. చాటున చేసేవన్నీ తప్పులు కాదండీ. స్నానం కూడా చేసేది చాటుగానే.."

"నేనే మీతో చెప్పిస్తున్నానని ఆయన అనుకుంటే?"

"అలా అనుకోవడానికి ఆస్కారముండదు. సైన్సుకు సంబంధించిన సత్యాలు అనుమానాలు తొలగిస్తాయి కానీ, సృష్టించవు."

మళ్లీ ఒక దుఃఖపు తెర.

ఈ విషయానికి పెళ్లి కాని అమ్మాయిలు నా ఆఫీసులో యేడవడం చూశాను.

ఈమెకు 40 ఏళ్లు. స్కూళ్లకు సంబంధించిన అధికారిణి. భర్త టీచర్‌గా పనిచేస్తాడు. భర్త కన్నా పెద్ద హోదా ఉద్యోగం.

ఈ వయసులో గర్భం.. దానికి ఆపరేషన్ అవసరం కావడం.. భర్త నమ్మడం లేదన్న బాధ.

మొదటి రెండు సమస్యలూ చిన్నవే, మూడవ దానితో పోలిస్తే.

గర్భాశయం

ఫొటో సోర్స్, Getty Images

భర్త బయట వరండాలో నిల్చున్నాడు. అంత ప్రసన్నంగా లేదు అతని ముఖం.

లోపలికి రమ్మన్నాం. ఖాళీ బాటిల్ పారేసి వచ్చాడు.

చెప్పిన వెంటనే సంతకం ఒప్పుకుంటాడన్నట్లు, వర్షిత ఆపరేషన్ సంతకాలకోసం సరంజామా అంతా తెచ్చి టేబుల్ మీద సర్దింది.

ముందు పొడిమాటలలో.. 'ఆమెకు ప్రెగ్నన్సీ వచ్చిందని, అది సాధారణంగా వచ్చే ప్రదేశంలో కాకుండా, పక్కనే ట్యూబులో వుందనీ, దాన్ని ఆపరేషన్ ద్వారా తొలిగించాల'ని చెప్పాను.

"హాస్పిటల్లో రెండు రోజులుండాల్సి వస్తుంది."

"ఏదైనా మందివ్వండి. ఇంటి దగ్గర అన్నీ వదిలేసి వచ్చాం. వెళ్లాలి."

"మందులతో కుదరదు."

"ఎందుకు కుదరదు. మా బావ మరిది భార్యకిలానే ట్యూబులో గర్భం వస్తే మందిచ్చారు పోయింది. చెప్పవేం?" గద్దించినట్టే భార్యతో అన్నాడు.

అతని వంక చూసి తలవంచుకుంది.

అతనికి విసుగ్గా ఉంది. ఇంటికెళ్లి పోవాలని ఉంది. త్వరగా వెళ్తే తన అసహనమంతా తీరికగా వెళ్లబుచ్చ వచ్చు. భార్య మీదా, భార్య తాలూకు డాక్టరమ్మ మీదా, ఆమె అసిస్టెంటు మీదా అందరిమీదా విసుగ్గానే ఉందతనికి.

ఈ డాక్టరమ్మ ఆఫీసులో కూలబడి, ఈవిడ చెప్పే సోది వినేంత తీరిక లేదు.

"అన్నగారూ ! మీతో కొన్ని విషయాలు చెప్పాలి."

అవును. సోదరులకు, కొడుకులకు కొన్ని విషయాలు తెలియాలి.

వర్షిత వైపు చూశాను. పేపర్ గ్లాసుల్లో నలుగురికీ కాఫీ తెప్పించింది.

"ఒక్క అయిదు నిమిషాలు నేను చెప్పేది వినండి. నేను చెప్పబోయేవి మీకు తెలియవని కాదు. అయినా వినండి. ముందు కూర్చుని కాఫీ తాగండి."

అభ్యర్థనలోనే, ఆదేశాలు కలిపి కాఫీ చేయడం నేర్చుకున్నానీ మధ్యన.

తెల్లకాగితమ్మీద గర్భాశయం, ట్యూబుల బొమ్మ గీశాను.

"గర్భాశయం పక్కన ఈ ట్యూబుల్ని గమనించండి. ఇవి రెండూ సన్నగా వుంటాయి. ఫెర్టిలైజేషన్ జరిగేది ఇక్కడే. అంటే , అండమూ, శుక్రకణమూ కలిసేది ఈ ట్యూబులోనే."

పెన్నుతో బొమ్మ గీసి చూపిస్తున్నా.

"ఫెర్టిలైజేషన్ తర్వాత ఎంబ్రియో , ఎన్నో కణాలుగా విభజన చెంది ఒక బంతిలా ఏర్పడి, నెమ్మదిగా జారుతూ వచ్చి గర్భాశయం లోపలి గోడలకు అతుక్కుంటుంది. ఆ తర్వాత బిడ్డలా ఎదుగుతుంది.

గర్భాశయపు గోడలు బలంగా వుంటాయి. తొమ్మిది నెలల వరకూ బిడ్డని మోయగలిగేంత వ్యాకోచం చెందగలవు. మూడు, నాలుగు కేజీల బరువున్న బిడ్డని సైతం ఇముడ్చుకోగలదు. కొన్ని సార్లు కవలల్ని కూడా.

ఇప్పుడు గర్భం ట్యూబులోనే వుండిపోయింది. అదేమో చాలా సన్నం."

రాస్తున్న పెన్ను చూపించి , "ఇదిగో ఇంత సన్నగా వుంటుంది. పిండాన్ని ఇముడ్చుకోలేక ఇబ్బంది పడుతుంది. నొప్పి వస్తుంది . బ్లీడింగ్ అవుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే, ట్యూబు పగిలిపోయి ప్రమాదం కావొచ్చు."

"పగిలిపోతే ప్రమాదమా?" అడిగాడు ఆమె భర్త.

"అవును. పొట్టలోపలే రక్తం పోతుంది. ఎక్కువ రక్తంపోతే, పేషంట్ షాక్ లోకి వెళ్లొచ్చు."

"మరి మా విశ్వం భార్యకు ఇలా ట్యూబులోనే వచ్చింది ప్రెగన్సీ. ఏవో మందులిచ్చినట్టు గుర్తు."

"అవును. అలా కూడా ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. కానీ గర్భం సైజు 35 మిమీ కన్నా తక్కువ వుండాలి. ప్రెగ్నన్సీ హార్మోన్ లెవెల్ 1500 నుండి 5000 మధ్యలో వుండాలి. అన్నిటికన్నా మించి ఆ పిండంలో హార్ట్ బీట్ కనిపిస్తే ఇంజెక్షన్ ద్వారా చికిత్సకు ప్రయత్నించకూడదు. ఆపరేషనే సరైన ట్రీట్మెంట్."

"నాకర్థం కాదూ. ట్యూబులోనైనా సరే, గర్భం ఎలా వచ్చింది. మేము జాగ్రత్త తీసుకుంటూనే ఉన్నాం."

"ప్రతి సంతాన నిరోధక పద్ధతికి ఫెయిల్యూర్ శాతం వుంటుంది. కొన్నిటికి ఎక్కువ, మరికొన్నిటికి తక్కువ.

గర్భ నిరోధక మాత్రలు వాడే వెయ్యి మందిలో ఒకరికి ఫెయిల్ అయితే, మీరు పాటించే సహజమైన పద్ధతికి ఫెయిల్యూర్ శాతం చాలా ఎక్కువ. ఇరవై శాతం!"

"అంటే? "

"ఇదే పద్దతి వంద మంది జంటలు, ఒక సంవత్సరం పాటు అనుసరిస్తున్నారని అనుకుందాం. ప్రతి అయిదుగురిలో ఒకరికి గర్భం వచ్చే అవకాశం వుంది. "

"అదెలా? కణాలన్నీ బయటే ఉండి పోతున్నపుడు గర్భమెలా వస్తుంది?"

"అక్కడే పొరపాటు పడుతున్నారు. అన్నీ బయటే పడుతున్నాయని మీరనుకుంటారు. కానీ కాదు. స్ఖలనానికి ముందు విడుదల అయే ద్రవంలో కొన్ని కణాలుంటాయి. అవి గర్భాశయ ద్వారంలో పడడం మీకు తెలియకుండా జరుగుతుంది."

"మరి ఇన్నేళ్లూ ఏ ప్రమాదమూ జరగలేదు."

"ప్రతి రోజూ నడుస్తుంటాము. ఎప్పుడో గానీ ఎదురు దెబ్బ తగలదు."

అనుమానాలు తీరినట్లే వున్నాయి. అతను సంతకం పెట్టాడు.

పెట్టాక, నాకెన్నో జాగ్రత్తలు, ఆమెకు ధైర్యమూ చెప్పి, ఇద్దర్నీ ఆపరేషన్ థియేటర్లోకి పంపించాడు.

స్కానింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి వున్నాడు. ఎలా జరిందని అడిగాడు. ఇదివరకున్న అప్రసన్నత లేదు.

మా కౌన్సెలింగ్ గదికి తీసుకెళ్లి ఆపరేషన్ జరుగుతున్నపుడు తీసిన వీడియోలను, ఫొటోలను చూపించాను.

"ఈ ట్యూబు వరకు తీసెయ్యాల్సి వచ్చింది. మిగిలిన భాగాలు ఆరోగ్యంగానే వున్నాయి."

"డాక్టర్, కొన్ని అనుమానాలున్నాయి."

"చెప్పండి."

"గర్భాశయ ద్వారంలో పడ్డ శుక్రకణం , ట్యూబు వరకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది?"

"దాదాపు అరగంట."

ఆ తర్వాత మా ఇద్దరి మధ్యా సెమినార్ వంటి సంభాషణ నడిచింది. చివరిలో మా ప్రొఫెసర్ అడిగే ప్రశ్నలకన్నా క్లిష్టమైన ప్రశ్నలే వేశాడు.

"బయట పడిన శుక్రకణం ఎన్ని రోజులు జీవించి వుంటుంది?"

"అండం విడుదల అయిన తర్వాత, ఎన్ని రోజుల పాటు ఫెర్టిలైజేషన్ ప్రక్రియకు సిద్ధంగా వుంటుంది."

"ట్యూబులో ఏర్పడిన పిండం గర్భాశయంలోనికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది."

కొన్నిటికి సమాధానాలు చెప్పాను.

"ఫెర్టిలైజేషన్ ట్యూబులో కాకుండా ఒకేసారి గర్భాశయంలో జరగడానికి ఏమైనా మందులు , పద్ధతులున్నాయా?"

"ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ రాకుండా వుండాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలుండవు. సమర్థ వంతమైన గర్భ నిరోధక సాధనాలను సరిగా వాడడమే."

"అలా కాదండీ. ఆ వివరాలు తెలిస్తే, టైమింగ్ అదీ నిర్ణయించుకోవచ్చు. ఇలా ఆపరేషన్ వరకూ రాకుండా, మేమే జాగ్రత్త పడతాం." అన్నాడు.

"రోడ్డు మీద వెళ్లాలంటే, ట్రాఫిక్ రూల్స్ తెలిస్తే చాలు. ట్రాఫిక్ మొత్తాన్నీ మీరే నియంత్రించాల్సిన అవసరం లేదు. అలా కుదరదు కూడా. "

*****

మర్నాడు భార్యను వెంటబెట్టుకుని వెళ్తుంటే, హాస్పిటల్ బయట కలిశాం.

"ఎక్కడా ఇల్లు?"

వాళ్లుండే కాలనీ పేరు చెప్పాడు.

"మరి ఇటు వెళ్తున్నారే?"

"ఎక్స్ప్రెస్ వే మూసేశారు. ద్వారకా నగర్ రూట్ లో పోదామనీ."

సరేనని వెళ్లబోతుంటే

"డాక్టర్, ఒక అనుమానం."

"ఊఁ"

"రెండిటిలో ఒక ట్యూబు తీసేశారు కదా. అంటే ప్రెగ్నన్సీ వచ్చే రిస్క్ సగం తగ్గినట్టేగా. ఇంకా జాగ్రత్తలు అవసరమేనా"

"అవసరమే "

ఇంకా నా వంకే చూస్తున్నాడు.

"రెండో ట్యూబ్ వుంది కదా. జాగ్రత్తలు అవసరమే. ఎక్స్ప్రెస్ వే మూసేసినా , మీరు ద్వారకా నగర్ రూట్లో చేరుకుంటారు కదా! అలా"

Every head contains a thinking brain.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)