చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?

రిమూవ్ చైనా యాప్స్

ఫొటో సోర్స్, OneTouch Apps

ఫొటో క్యాప్షన్, చైనా యాప్‌లను గుర్తించి, తొలగించే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది
    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, .

ఇప్పటికే కోవిడ్-19 విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై కోట్లాది మంది భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికి తోడు దేశ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఇరు దేశాల సైన్యం మధ్య తలెత్తిన విభేదాలు భారతీయుల్లో చైనా పట్ల మరింత అసహనాన్ని పెంచుతున్నాయి. అందుకే వాళ్లు ఇప్పుడు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా చైనాపై ప్రతికారం తీర్చుకుంటున్నారు.

చైనాకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడానికి కారణం భారతదేశ ఉత్తర సరిహద్దుల్లోని తూర్పు లద్ధాఖ్ ప్రాంతం సమీపంలో ఉన్న ఆ దేశ బలగాలు కొద్ది రోజులుగా దూకుడును పెంచడమే.

అయితే చైనా చొరబాట్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేకపోయినప్పటికీ కొన్ని భారతీయ మీడియా సంస్థలు మాత్రం చొరబాట్లు జరుగుతున్నాయని చెబుతున్నాయి. ప్రస్తుతానికి రెండు దేశాలూ సరిహద్దుల్లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో తమ బలగాలను ఎదురెదురుగా మొహరించాయి.

.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, .

చైనాపై పెరుగుతున్న వ్యతిరేకత

ప్రస్తుతం భారతీయ సామాజిక మాధ్యమాల్లో యాంటీ చైనా మేసెజ్‌లు చాలా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో కొందరు చైనాకు సంబంధించిన, అలాగే చైనా సహకారం అందిస్తున్న అన్ని రకాల మొబైల్ అప్లికేషన్లను మొబైల్ నుంచి డిలీట్ చెయ్యాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విట్టర్‌లో "BoycottChina", "BoycottChineseApp", "BoycottChineseProducts" ఈ హ్యాష్ ట్యాగ్‌లు చైనా వ్యతిరేక భావాలను మరింత పెంచుతున్నాయి.

ఒకప్పుడు దేశంలో స్వదేశీ వస్తువుల తయారీకి మద్దతిచ్చే జనం అప్పుడప్పుడు చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తూ ఉండేవారు. కానీ చైనాకి చెందిన లేదా చైనా మద్దతిస్తున్న మొబైల్ అప్లికేషన్లను జనం పెద్ద ఎత్తున డిలీట్ చేస్తూ ఉండటం సరికొత్త పరిణామం.

చైనాపై వ్యతిరేకతను మరింత పెంచడంలో భాగంగా కొత్తగా విడుదలైన ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకంగా 50 లక్షల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ప్రముఖ ఆంగ్ల న్యూస్ వెబ్ సైట్ ఎన్డీటీవీ తెలిపింది. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే అది స్మార్ట్ ఫోన్‌ను స్కాన్ చేసి ఒక్క క్లిక్‌తోనే చైనాకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్లన్నింటినీ డిలీట్ చేసేస్తుందని గాడ్జెట్ వివరాలను అందించే ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ గాడ్జెట్స్ 360 వెల్లడించింది.

టిక్ టాక్, పబ్‌జి మొబైల్, షేర్ ఇట్, జెండర్, కామ్ స్కానర్, బ్యూటీ ప్లస్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, లైకీ, యూసీ బ్రౌజర్ వంటి చైనాకు సంబంధించిన అప్లికేషన్లను ఆ యాప్ లక్ష్యంగా చేసుకుంది.

అయితే, ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్ తొలగించింది. ఈ యాప్‌ను భారతదేశానికి చెందిన వన్ టచ్ యప్‌ల్యాబ్స్ సంస్థ ప్రవేశపెట్టింది. ఈ యాప్ నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పిన గూగుల్ అంతకు మించిన వివరాలు వెల్లడించలేదు.

బైట్ డ్యాన్స్‌కి చెందిన టిక్ టాక్ యాప్‌ను భారతీయులు అన్ ఇన్‌స్టాల్ చెయ్యడం మొదలుపెడితే ఆ కంపెనీకి రోజూ లక్షలాది డాలర్ల నష్టం వస్తుందంటూ వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇటీవల టిక్ టాక్ వీడియోలను చెయ్యడంలో దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఓ వ్యక్తి మహిళలపై యాసిడ్ దాడుల్ని ప్రోత్సహించేలా వీడియోలు రూపొందించడం కూడా టిక్ టాక్ అప్లికేషన్‌పై ప్రజల్లో ఆగ్రహం కలగడానికి మరో కారణమని ఇటీవల మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక వెబ్ సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఒకానొక సమయంలో ప్లే స్టోర్‌లో ఎప్పుడూ నాలుగు కన్నా ఎక్కువగా ఉండే టిక్ టాక్ రేటింగ్ భారతీయుల ఆగ్రహానికి గురికావడం వల్ల ఒక్కసారిగా రెండు కన్నా తక్కువకు పడిపోయింది. అయితే ఆ తరువాత గూగుల్ సుమారు 80లక్షల నెగిటివ్ రివ్యూలను తొలగించడంతో మళ్లీ ప్రస్తుతం టిక్ టాక్ రేటింగ్ 4.4కి చేరింది.

మొబైల్ యాప్స్

ఫొటో సోర్స్, iStock

వ్యతిరేక ప్రచారం వల్ల పెద్దగా ఉపయోగం లేదా?

చైనా యాప్స్‌పై చేస్తున్న యుద్ధం పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే భారత్‌లోని కీలక వ్యాపార సంస్థల్లోనూ, స్టార్టప్స్‌లోనూ చైనా ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఉదాహరణకు ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్, ప్రముఖ ఈ వాలెట్ పేటీఎం, దేశంలోనే అతి పెద్ద గొలుసు హోటళ్ల నిర్వహణ సంస్థ ఓయో, ఈ లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్ బైజూస్, రెంటెడ్ క్యాబ్ సర్వీస్ ఓలా, నిత్యావసర వస్తువుల్ని అందించే బిగ్ బాస్కెట్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సహా మరి కొన్ని సంస్థల్లోని కోట్లాది డాలర్ల పెట్టుబడులు చైనా దేశస్తులవే.

అధికారిక లెక్కల ప్రకారం భారత దేశంలో చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ సుమారు2.34బిలియన్ డాలర్లు. ముంబైకి చెందిన విదేశీ సంబంధాలపై నిశితంగా పరిశీలించే ప్రముఖ సంస్థ గేట్ వే హౌస్ నిపుణులు మాత్రం భారతీయ స్టార్టప్ కంపెనీల్లో చైనా యాప్స్‌పై ఆగ్రహం ఎంతో కాలం కొనసాగదని అంటున్నారు. వాటికి తగ్గ ప్రత్యమ్నాయాలు స్థానికంగా అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు.

“ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఏ చైనా టూల్ కూడా కేవలం జాతీయ సెంటిమెంట్ కారణంగా చీకట్లో కలిసిపోలేదు” అని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులు సుబిమల్ భట్టాచార్జీ తన ఫేస్ బుక్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)