అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?

2022 వింటర్ ఒలింపిక్స్ నాటికి డిజటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2022 వింటర్ ఒలింపిక్స్ నాటికి డిజటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న చైనా
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్థలం:బీజింగ్

విశేషం: వింటర్ ఒలింపిక్స్ 2022

ఒలింపిక్స్ మాత్రమే కాదు.. చైనా తన డిజిటల్ కరెన్సీ e-RMBని అధికారికంగా ప్రారంభించేది కూడా అప్పుడే.

2022లో వింటర్ ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు వెళ్లే ప్రేక్షకులంతా కచ్చితంగా e-RMB వర్చువల్ కరెన్సీని కొనడం - అమ్మడం చేయాల్సిందే. ఎందుకంటే అప్పటికల్లా ఆ దేశంలో కరెన్సీ నోట్లు ఉండవు.

ఇదేదో అభూత కల్పన కాదు. కల్పిత కథ అంతకన్నా కాదు. ఓ వైపు ప్రపంచమంతా కరోనావైరస్ కల్లోలం ఎదుర్కోవడంలో క్షణం తీరిక లేకుండా పోరాడుతుంటే.. చైనా మాత్రం తన మొట్ట మొదటి పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ యువాన్‌ను ప్రారంభించడంలో బిజీ బిజీగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన షెంజెన్, చాంగ్డు, స్యూజో, షియోంగ్‌లలో గత ఏప్రిల్ నెలలోనే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా.

ఆయా నగరాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా డిజిటల్ వాలెట్స్ ద్వారా డిజిటల్ కరెన్సీ రూపంలోనే ఇవ్వనున్నారు. స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్ వంటి మరో 20 ప్రైవేటు సంస్థలు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.

ఈ ప్రయోగం విజయవంతమైతే 2022 వింటర్ ఒలింపిక్స్ నాటికి దేశ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీని అధికారికంగా ప్రారంభించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది వివిధ దశలలో అమలు చేయవచ్చు. దేశమంతా పూర్తి స్థాయిలో డిజిటల్ కరెన్సీని వినియోగించడానికి బహుశా కొన్నేళ్లు పట్టవచ్చు. నిజానికి 2014 లోనే చైనా అధికారులు డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. అవి ఇప్పటికి ప్రయోగదశకు చేరుకున్నాయి.

చైనా ఇప్పటికిప్పుడు ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం అందులో ఒకటి కాగా, కరోనావైరస్ విషయంలో మొదట్లో ప్రాథమిక సమాచారాన్ని ప్రపంచ దేశాలకు ఇవ్వలేదంటూ ట్రంప్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు చైనాను దోషిగా చూపించేందుకు చేస్తున్న ప్రయత్నం రెండోది. ఇక మూడో అంశం.. ఫేస్‌బుక్ ఈ ఏడాదిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన లిబ్రా డిజిటల్ కరెన్సీ.

వంద యువాన్ల నోటు

ఫొటో సోర్స్, Reuters

ఎన్నో ఆశలు పెట్టుకున్న చైనా

21వ శతాబ్దం ద్వితీయార్థం నాటికైనా ప్రపంచంపై అమెరికా అధిపత్యానికి అంతం పలకాలని భావిస్తున్న చైనా, అందుకోసం అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ డిజిటల్ కరెన్సీ కూడా అందులో భాగమే. మరో రెండేళ్లలో అధికారికంగా డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న చైనా ఇది కచ్చితంగా తమను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దడంలో ఉత్ప్రేరకంగా పని చేస్తుందని బలంగా నమ్ముతోంది.

నిజానికి ఈ ప్రాజెక్టు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే ప్రారంభమయ్యింది. ఇందులో పెద్దగా రహస్యం ఏమీ లేకపోయినా చైనా ప్రభుత్వం మాత్రం ఈ విషయం మీడియాలో ఎక్కడా రాకుండా కావాలనే అడ్డుకుంటూ వచ్చింది. అయితే అధికారంగా 2022 నాటికి ఈ డిజిటల్ కరెన్సీని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించినా పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు 10-15 ఏళ్లు పట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచ రాజకీయాలు, వాణిజ్యం, కరెన్సీ విషయంలో ఇన్నాళ్లూ కొనసాగుతున్న పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి ఇది కచ్చితంగా గండికొడుతుందని వారు భావిస్తున్నారు.

“ఈ విషయంలో భారత్, అమెరికా దేశాలు కూడా లక్ష్మి, డిజిటల్ డాలర్ పేరుతో డిజటల్ కరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అప్పటి వరకు అవి వాస్తవ దూరంగానే కనిపిస్తాయి” అని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో చైనా వ్యవహారాల నిపుణులుగా పని చేస్తున్న డాక్టర్ ఫైసల్ అహమ్మద్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్‌ ఆధిపత్యానికి సవాల్ విసరనున్న చైనా డిజిటల్ యెన్ ?

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్‌ ఆధిపత్యానికి సవాల్ విసరనున్న చైనా డిజిటల్ యువాన్?

అమెరికా డాలర్ Vs డిజిటల్ కరెన్సీలు

డిజిటల్ కరెన్సీ “లక్ష్మి” విషయంలో ఇంకా భారత్ ఆలోచనల్లోనే ఉండగా.. చైనా మాత్రం ఎప్పుడో ఇండియాను దాటి వెళ్లిపోయింది. అయితే కింగ్ ఆఫ్ కరెన్సీ అమెరికా డాలర్ స్థాయిని అందుకునేందుకు చైనాకు ఇంకా చాలా సమయం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

అసలు ప్రపంచానికి అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ అవసరం నిజంగా ఉందా అంటే అవును అంటున్నారు ముంబైలోని చౌడీవాలా సెక్యూరిటీస్‌కు చెందిన అలోక్ చౌడీవాలా. “ఫెడరల్ రిజర్వ్‌ అప్పులను పరిగణనలోకి తీసుకుంటే అమెరికన్ డాలర్‌ అదనంగా ఎక్కువ విలువ పొందుతోంది. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా ఓ కొత్త కరెన్సీ రావాలి. దానికి స్వాగతం పలకాల్సిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా అది ఆమోదం పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది” అని వ్యాఖ్యానించారు.

“అమెరికన్ డాలర్‌కి ప్రత్యామ్నాయంగా డిజిటల్ యువాన్ రావడం కచ్చితంగా చెప్పుకోదగ్గ పరిణామం. 1970లలో బంగారాన్ని ప్రామాణికంగా తీసుకునే ప్రక్రియకు మంగళం పాడినప్పటి నుంచి అమెరికన్ డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారిపోయింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తోడు ఇప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా డీగ్లోబలైజేషన్ పెరిగిపోతోంది. ఇది కచ్చితంగా ప్రపంచమంతా రిజర్వ్ కరెన్సీగా భావిస్తున్న అమెరికన్ డాలర్‌కు పెద్ద దెబ్బే. అయితే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం లేదు. ఈ మార్పు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. చైనా కదలికలపై యావత్ ప్రపంచం కచ్చితంగా దృష్టి పెడుతుంది” అని సింగపూర్‌కి చెందిన మాడ్యులర్ ఎసెట్ మేనేజ్మెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ విశేష్ అభిప్రాయపడ్డారు.

2019లో జరిగిన అంతర్జాతీయ లావాదేవీల్లో సుమారు 90 శాతం అమెరికన్ డాలర్ రూపంలోనే జరిగాయి. ప్రపంచంలో 60 శాతానికి పైగా విదేశీ మారక నిల్వలన్నీ యూఎస్ డాలర్ రూపంలోనే ఉన్నాయి. అదే చైనా యువాన్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు లేదా విదేశీ మారక నిల్వలు కేవలం 2 శాతం మాత్రమే. భారత విదేశీ మారక నిల్వలు కూడా అమెరికన్ డాలర్ రూపంలోనే ఉన్నాయి. అదే చైనా విషయానికొస్తే 3 ట్రిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలతో ఆ దేశం బలంగా ఉంది.

గ్లోబల్ మార్కెట్లో చైనా ఆధిపత్యం చెలాయించేందుకు డిజిటల్ యువాన్ కచ్చితంగా తోడ్పడుతుందని చైనా వ్యవహారాల నిపుణులు డాక్టర్ పైసల్ అహమ్మద్ అన్నారు.

డాలర్ ప్రభావం కారణంగా అమెరికా అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా కూడా పెత్తనం చెలాయిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం, బ్యాంకులు ఎక్కువగా అమెరికన్ డాలర్‌పై ఆధారపడటం వల్ల రష్యా, ఇరాన్ దేశాలపై ఆంక్షల పేరిట రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమయ్యింది. రోజూ ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగే న్యూయార్క్ నగరం ప్రపంచ ఆర్థిక రాజధాని అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.

చైనా ప్రవేశపెడుతున్న డిజిటల్ యువాన్ ప్రపంచ శక్తుల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని తమ పరిశోధనలో వెల్లడయినట్టు దాయిచ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసిన ఓ నివేదికలో వివరించింది.

“చైనా సెంట్రల్ బ్యాంక్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న డిజిటల్ యువాన్ కచ్చితంగా శక్తిమంతమైన ఆయుధమవుతుంది. చైనాలో వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ లావాదేవీలను ఆ కరెన్సీ రూపంలో జరిపి తీరాల్సిందే. ప్రపంచ మార్కెట్లలో అది కచ్చితంగా డాలర్ ఆధిపత్యానికి గండి కొడుతుంది. 20వ శతాబ్దం ఆరంభంలో అమెరికా డాలర్‌ను ఎలా బలీయ శక్తిగా మార్చాలనుకుందో ఇప్పుడు చైనా కూడా డిజిటల్ యువాన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో బలమైన శక్తిగా మలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది” అని ఆ నివేదికలో వివరించింది.

అయితే డిజిటల్ యువాన్‌ కానీ లేదా మరే ఇతర డిజిటల్ కరెన్సీలు కానీ నగదుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాబోవని.. ప్రస్తుతం థర్డ్ పార్టీలుగా ఉన్న క్రెడిట్ కార్డ్ వంటి వాటికి ప్రత్యామ్నాయం కావచ్చని దాయిచ్ బ్యాంక్ అభిప్రాయపడింది.

ఎంత త్వరగా డిజిటల్ కరెన్సీకి జనం అలవాటు పడతారన్న విషయం చాలా ముఖ్యమని ప్రవీణ్ విశేష్ వ్యాఖ్యానించారు. అలాగే వివిధ వర్గాల వ్యక్తులు, రిటైలర్లు, కార్పొరేషన్లు, ప్రభుత్వాలు, ఇతర దేశాలు ఈ మార్పును సహృదయంలో ఆదరించినప్పుడే డిజిటల్ యువాన్‌ విజయవంతమవుతుందని అన్నారు.

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ లిబ్రా

డిజిటల్ యువాన్‌ Vs ఫేస్‌బుక్ లిబ్రా

డిజిటల్ కరెన్సీ విషయానికొస్తే కేవలం చైనాకు చెందిన డిజిటల్ యువాన్‌ మాత్రమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా కొన్ని క్రిప్టో కరెన్సీలు ఇప్పటికే మార్కెట్లో అడుగుపెట్టగా, మరిన్ని త్వరలో రానున్నాయి. అందులో ఫేస్‌బుక్ మెగా ప్రాజెక్ట్ లిబ్రా ఒకటి. ప్రస్తుతం వివిధ అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. భారత్‌లో అన్ని రకాల క్రిప్టో కరెన్సీలపైనా నిషేధం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇండియన్ డిజిటల్ కరెన్సీ 'లక్ష్మి'ని ప్రారంభించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక మరో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్స్ ఇప్పటికే వివిధ దేశాల మార్కెట్లలో చెలామణీలో ఉంది.

ప్రస్తుతానికి అటు, చైనాకు చెందిన డిజిటల్ యువాన్‌.. ఇటు, ఫేస్‌బుక్‌కు చెందిన లిబ్రా మెయిన్ స్ట్రీమ్ మార్కెట్లో పోటీ పడుతున్నాయని దాయిచ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250 కోట్ల మంది.. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు బలం కాగా, సుమారు 140 కోట్ల జనాభా చైనా బలమని ఆ నివేదిక వివరించింది.

అయితే ఫేస్‌బుక్‌కి చెందిన లిబ్రా, అలాగే బిట్ కాయిన్స్‌కి చైనా ప్రవేశపెడుతున్న డిజిటల్ యువాన్‌కి చాలా తేడా ఉంది. చైనా డిజిటల్ కరెన్సీనీ ప్రభుత్వ ఆమోదంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేస్తోంది. దీంతో కచ్చితంగా ఆ కరెన్సీకి సాధికారిత, విశ్వసనీయత ఉంటాయి. మిగిలిన డిజిటల్ కరెన్సీలన్నీ ఎటువంటి అధికార పరిధిలోకి రావు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న చైనా ప్రభుత్వ ఆర్థిక బలం డిజిటల్ యువాన్‌కు ప్రపంచ డిజిటల్ కరెన్సీ మార్కెట్లో పోటీ లేకుండా చేయగలదు.

డిజిటల్ యువాన్‌కు ఒక కరెన్సీకి మించిన ఆదరణ ఉంటుందంటున్నారు చైనా వ్యవహారాల నిపుణులు డాక్టర్ ఫైసల్ అహమ్మద్. “ఆర్థిక రంగంలో డిజిటల్ యువాన్‌ ఒక వినూత్న ఆవిష్కరణ. ఇది ‘లిబ్రా’లా కాదు. ఎందుకంటే దీనికి చైనా ప్రభుత్వ మద్దతుంది. దాని ప్రభావం ప్రపంచ భౌగోళిక రాజకీయరంగంపై కూడా ఉంటుంది. ఉదాహరణకు డిజిటల్ యువాన్‌ కారణంగా ఉత్తర కొరియా వంటి దేశాలకు అమెరికా విధించే ఆంక్షల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది” అని ఆయన అన్నారు.

ఇక భారత్ విషయానికి వస్తే డిజిటల్ కరెన్సీ ‘లక్ష్మి’ ఆలోచన 2014లో పుట్టింది. ఆ ఏడాదిలోనే చైనా మదిలో డిజిటల్ యువాన్‌ ఆలోచన కూడా పుట్టింది. భారత ప్రభుత్వం అధ్యయనం పేరిట కమిటీలను వేసి తన దైన శైలిలో పని చేసుకుంటూ వెళ్తోంది. అటు చైనా మాత్రం తమ ఆలోచనను అమలు పరచడంపై శరవేగంతో పని చేసింది. ఇండియా డిజిటల్ వాలెట్లను ప్రోత్సహిస్తూ ఉంటే చైనా ఏకంగా డిజటల్ కరెన్సీనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని ఓ పరిశీలకుడు వ్యాఖ్యానించారు.

అయితే డిజిటల్ యువాన్‌ వల్ల భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు ఏమీ లేదని సింగపూర్‌లోని మాడ్యులర్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ విశేష్ వ్యాఖ్యానించారు. “డిజిటల్ యువాన్‌ను మనం ఓ ప్రమాదంలా చూడాల్సిన పని లేదు. మనం ప్రస్తుతం ఉన్న డిజిటల్ విప్లవంలో అది మనం వెళ్లాల్సిన మార్గానికి దారి చూపించే ఓ గుర్తులాంటిది. ఇప్పుడు చాలా దేశాలు ఎవరికి వారు ప్రత్యేకంగా ఓ డిజిటల్ కెరన్సీని డిజైన్ చేయించుకుంటున్నాయి. భారత్ కూడా ఆధార్ ఆధారిత పేమెంట్లు, యూపీఐ పేమేంట్లు వంటి స్థానిక విధానాల నుంచి బయటకు రావాలి. డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తూ దేశంలోని మెజార్టీ ప్రజల్ని బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చెయ్యాలి” అని సూచించారు.

బిట్ కాయిన్‌కు లేని సాధికారిత చైనా డిజిటల్ యెన్‌కు బలం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బిట్ కాయిన్‌కు లేని సాధికారిత చైనా డిజిటల్ యువాన్‌కు బలం

డిజిటల్ కరెన్సీల వల్ల లాభనష్టాలు

డిజిటల్ యువాన్‌ వల్ల లాభనష్టాలను ఓ సారి పరిశీలిద్దాం.

లాభాలు

  • నకిలీల బెడద ఉండదు
  • అప్పటికప్పుడే పరిష్కారం
  • ముఖ్యంగా ఇతర దేశాల వ్యవహారాలలో లావాదేవీల రుసుములు పెద్దగా లేకపోవడం
  • ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటం
  • సెంట్రల్ బ్యాంక్ మద్దతు ఉండటం

నష్టాలు

  • అపనమ్మకం
  • చివరి వ్యక్తికి వరకు చేరే అవకాశం లేకపోవడం
  • డిజిటల్ వాలెట్లపై ఆధారపడాల్సి రావడం

ఏ కొత్త వ్యవస్థపైనైనా నమ్మకం కుదరటానికి సుదీర్ఘ సమయం పడుతుంది. 1770 నుంచి అమెరికన్ డాలర్ చెలామణీలో ఉన్నప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే దానికి అంతర్జాతీయంగా ఆమోదం లభించింది. ఆపై రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే అది గ్లోబల్ కరెన్సీగా ప్రపంచాన్ని శాసించడం మొదలుపెట్టిందని అలోక్ చౌడీవాలా అన్నారు.

అసలు డాలర్ సిద్ధాంతమన్నది ప్రపంచమంతా విలువైనదిగా గుర్తిస్తున్న ఓ అభూత కల్పన అంటారు ఇజ్రాయెల్‌కి చెందిన ప్రముఖ చరిత్రకారుడు, మేథావి యువల్ నొవా హరారి. ఈ భూమ్మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరి ఆమోదం పొందబట్టే దానికి ఆ విలువ వచ్చిందన్నది ఆయన అభిప్రాయం. ప్రతి ఒక్కరికీ డాలర్‌పై విశ్వాసం ఉంది. అందుకే దానికి అందరూ విలువనిస్తారు. ఎప్పుడైతే అమెరికా శక్తి సామర్థ్యాలు క్షీణించడం మొదలవుతుందో అప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరొకరికి అవకాశం వస్తుందని ఆయన చెబుతారు. చూస్తుంటే ఇప్పుడు చైనా ఆ పనిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)