కరోనావైరస్: లాక్‌డౌన్ సమయంలో టెక్ ఇండస్ట్రీ విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు?

ఫొటో సోర్స్, AFP
"జూమ్" ధూమ్ ధామ్
మీ బాస్ మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) చెయ్యాలని ఒక్కసారి చెప్పగానే మీరు వెంటనే కొత్త సాఫ్ట్ వేర్ పై పట్టు సాధించేందుకు హడావుడి పడి ఉంటారు.
మీరే కాదు దాదాపు అందరూ అదే పని చేశారు. ఇదే ఆ సాఫ్ట్ వేర్‌ను తయారు చేసిన కంపెనీ పాలిట శుభవార్త అయ్యింది.
భద్రతా పరంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ గత డిసెంబర్లో జూమ్ వీడియో కాలింగ్ సాఫ్ట్ వేర్ షేర్ ధర స్టాక్ మార్కెట్లో రెట్టింపయ్యింది. అంతే కాదు ఆ యాప్ వినియోగదారుల సంఖ్య ఏకంగా కోటి నుంచి 20 కోట్లకు పెరిగింది.
నిన్న మొన్నటి పెద్దగా ప్రాచుర్యంలో లేని ఓ బిజినెస్ అప్లికేషన్ ఇవాళ హఠాత్తుగా క్యాబినెట్ సమావేశాల నుంచి సాధారణ సమావేశాల వరకు అన్నింటికీ దాన్నే ఆశ్రయిస్తున్నారు మెజార్టీ జనం.
కేవలం అది ఒక్కటే కాదు...
మార్చిలో మైక్రోసాఫ్ట్‌కి చెందిన టీం వ్యూయర్ అప్లికేషన్‌ను ఏకంగా 4 కోట్ల మంది ఉపయోంచారని ,ఆ వారంలో యూజర్లు ఏకంగా 40 శాతం మంది పెరిగారని ఆ సంస్థ వెల్లడించింది. రిమోట్ యాక్సిస్ సాఫ్ట్ వేర్‌గా పేరున్న టీం వ్యూయర్‌కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
ఇక అలాంటి ఫీచర్లున్న మరో అప్లికేషన్ “స్లాక్”. మార్చి నెలాఖరు నాటికి తమ అప్లికేషన్‌ను వినియోగించే వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిందని ఏ రోజుకారోజు సరికొత్త రికార్డులను నెలకొల్పిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
లాక్ డౌన్‌తో పండగ చేసుకున్న గేమింగ్ పరిశ్రమ
లాక్ డౌన్ కారణంగా మన ఆఫీస్ పని పూర్తయిన తర్వాత కూడా మనం ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. సరిగ్గా ఈ పరిస్థితినే క్యాష్ చేసుకొని రికార్డులు సృష్టించింది గేమింగ్ పరిశ్రమ. ప్రజలంతా నాలుగు గోడలకే పరిమితం కావడంతో వాటికి డిమాండ్ పెరిగింది.
నింటెండో సంస్థ తయారు చేసిన యానిమల్ క్రాసింగ్ గేమ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ గేమ్‌లో ఆటగాళ్లను ఓ నిర్మానుష్యమైన ఓ ద్వీపం యొక్క ద్వారం దగ్గరకు తీసుకెళ్తుంది. ఆపై మాట్లాడే జంతువులతో కూడిన ఓ అందమైన పట్టణాన్ని నిర్మించేలా చేస్తుంది.
కొత్త కొత్త డిజైన్లలో ఇళ్లను నిర్మించడాన్ని ఆటగాళ్లు ఎంతగానే ఇష్టబడతారు. ఇదే ఈ గేమ్‌ను సరికొత్త రికార్డుల సృష్టించేలా చేసింది. నింటెండో సంస్థ లాంచ్ చేసిన వీడియో గేమ్స్‌లో అన్నింటిలోనూ యానిమల్ క్రాసింగ్ గేమ్‌ను తిరుగులేని స్థానంలో నిలిపింది. ఏకంగా కోటి 34 లక్షల మదికి పైగా దీన్ని కొనుగోలు చేశారు.
అన్ని రకాల ఆన్ లైన్ గేమ్స్ కూడా లాక్ డౌన్ సమయం కలిసొచ్చిందనే చెప్పవచ్చు. కొత్తగా లాంచ్ చేసిన కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ కోట్లాదిమందిని ఆకర్షించింది. ఈ ఏడాదిలో వీడియో గేమ్స్ అమ్మకాలు సుమారు 35% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.
అయితే ఇప్పుడున్న సక్సెస్ రేటు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మాత్రం చెప్పలేం. వీడియో గేమింగ్ పరిశ్రమపై కరోనావైరస్ ప్రభావం 2021లో బయటపడుతుందని ఎక్స్ బాక్స్ అధినేత తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వీడియో స్ట్రీమింగ్ విక్టరీ
కేవలం గేమింగ్ పరిశ్రమ మాత్రమే కాదు.. వినోద రంగంలో నిన్న మొన్నటి వరకు పీకల్లోతు కష్టాల్లో ఉన్న నెట్ ఫ్లిక్స్ ఏకంగా కోటి 60లక్షల మంది కొత్త వినియోగదారుల్ని ఆకర్షించింది. అంతేకాదు ఇప్పటికే ఏడాదికి సరిపడా కంటెంట్‌ను షూట్ చేసిన ఆ సంస్థ రానున్న నెలల్లో కొత్త కంటెంట్ షెడ్యూల్ చేయనున్నట్టు ప్రకటించింది.
ఇక డిస్నీ విషయానికొస్తే సరైన సమయంలో అడుగు పెట్టి తిరుగులేని విజయం సాధించింది. మార్చి చివరి నాటికి బ్రిటన్ సహా ఇతర మార్కెట్లలోనూ అడుగుపెట్టింది.
నిజానికి లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే డిస్నీకి 3 కోట్ల 30 లక్షల మందికిపైగా వినియోగదారులు ఉండేవారు. ఈ రెండు మాసాల్లో వారి సంఖ్య ఏకంగా 5 కోట్ల 50 లక్షలకు చేరింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌కు తీవ్రమైన పోటీ ఇచ్చే స్థాయికి చేరింది.
టీవీ, సినిమాల విషయాన్ని పక్కనబెడితే ఈ లాక్ డౌన్ సమయంలో ప్రముఖ ఆడియో ఆప్లికేషన్ స్పూటిఫై ఏకంగా 13 కోట్ల మంది పెయిడ్ కస్టమర్లను సంపాదించింది. అయితే ఉచిత సేవల్లో ప్రకటనల వల్ల వచ్చే ఆదాయం మాత్రం ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫిట్‌నెస్... కొంచెం ఫిట్ కొంచెం అన్ ఫిట్
జిమ్‌లను మూసేయాలని వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఆదేశించిన తర్వాత ప్రముఖ సంస్థ క్లాస్ పాస్ ఆన్ లైన్ తరగతుల్ని మొదలుపెట్టింది.
ప్రస్తుతం తాము కొత్తగా ప్రారంభించిన వెంచర్‌కు విపరీతమైన డిమాండ్ ఉందని ఆ సంస్థ పేర్కొంది. అయితే మొత్తం మీద 95% మేర ఆదాయాన్ని కోల్పోవడంతో తమ మెజార్టీ ఉద్యోగుల్ని తీసేయాల్సి వచ్చిందని మరి కొంత మందికి పాక్షికంగా మాత్రమే ఉపాధి కల్పించగల్గామని తెలిపింది.
ఇక తమ ఫిట్‌నెస్ బైకుల అమ్మకాల్ని పెంచుకునేందుకు పెలొటన్ సంస్థ వీడియో స్ట్రీమింగ్ క్లాసుల్ని ఇప్పటికే ప్రారంభించింది.
అయినప్పటికీ కరోనావైరస్ కారణంగా స్టూడియోలను మూసివేసింది. తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో తమ అమ్మకాలు ఏకంగా 60శాతం వరకు పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
కేవలం కంపెనీలే కాదు కొంత మంది వ్యక్తులు కూడా లాక్ డౌన్ సమయంలో తిరుగులేని విజయాలు సాధించారు. అందులో ప్రముఖ యూ ట్యూబర్, ఫిట్ నెస్ ట్రైనర్ జోయ్ విక్స్ ఒకరు. బ్రిటన్‌కు చెందిన ఆయన ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పిల్లల్ని, పెద్దలకు శిక్షణ ఇవ్వడంలో గిన్నిస్ రికార్డులు సృష్టించారు. దీంతో అత్యుత్తమ స్పోర్ట్స్ బ్రాండ్స్ ఆయన్ను స్పోన్సర్ చేసేందుకు పోటీ పడుతున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, REUTERS
ఆశ నిరాశల "అమెజాన్"
ఇక అమెజాన్ సంస్థకు మాత్రం లాక్ డౌన్ కష్టాల్ని కొని తెచ్చింది. అమెజాన్ గోడౌన్లలో పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అక్కడక్కడ సమ్మెలు కూడా జరిగాయి.
అలాగే అమెజాన్ తీసుకుంటున్న జాగ్రత్తలపై విచారణ జరిపిన తర్వాత నిత్యవసరాలు కాని వస్తువుల అమ్మకాలను నిషేధించింది ఫ్రాన్స్.
అయితే ఇంత జరిగినప్పటికీ ఇప్పటికీ ఈ భూమ్మీద అత్యంత ధనవంతుడు అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ కావడం విశేషం. అంతే కాదు లాక్ డౌన్ సమయంలోనూ ఆయన ఆస్తులు 24 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి.
అయితే అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీల్లో కూడా ఒకటి. ఓ వైపు కొన్ని సంస్థలు తమ బిల్లులను చెల్లించేందుకు కూడా ఇబ్బందిపడుతున్న ఈ తరుణంలో క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో అమెజాన్ విజయం సాధించే అవకాశం ఉందని కూడా కొందరు భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కుదేలైన రవాణా రంగం
లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాన్ని ఇంట్లోంచే పూర్తి చేయడం, ఆపై ఖాళీ సమయాల్లో అయితే వీడియోగేమ్స్ ఆడటం లేదంటే ఇంట్లో కూర్చొని సినిమాలూ చూడటం.. ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ జనం చేస్తున్నది అదే. ప్రయాణాలన్నింటికి పూర్తిగా స్వస్తి పలికేశారు. దీంతో బ్రిటన్లో అయితే గత 8 దశాబ్దాలలోఎన్నడూ లేని విధంగా కార్ల అమ్మకాలు పడిపోయాయి. భారత్‌లో అయితే గత ఏప్రిల్ నెలలో తమ కంపెనీకి చెందిన ఒక్క కారు కూడా అమ్ముడు పోలేదని స్కోడా ఇండియా డైరక్టర్ జాక్ హోలిస్ ట్వీట్ చేశారు.
ఉబర్ సంస్థ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ ప్రభావం కేవలం డ్రైవర్లపై మాత్రమే కాదు, ఆ సంస్థ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న మరి కొంత మందిపైనా పడింది. ఈ స్కూటర్లను నడిపే సంస్థలది కూడా అదే పరిస్థితి. కొన్ని నగరాల్లో ఆ సంస్థలు తమ సేవల్ని పూర్తిగా నిలిపేశాయి. అంతే కాదు బ్రిటన్ వంటి దేశాల్ల ప్రస్తుతం వాటిని రోడ్లపై నడపడాన్ని నిషేధించారు. అయితే త్వరలోనే తిరిగి తమ అమ్మకాలు మునుపటి స్థాయికి వస్తాయని స్థానిక రిటైలర్లు ఆశిస్తున్నారు.
"ఎయిర్ బీఎన్‌బి" గాలి తీసేసిన లాక్ డౌన్
వివిధ సంస్థలకు, వినియోగదారులకు మధ్యవర్తులుగా వ్యవహరించే కంపెనీలది అదే పరిస్థితి. ముఖ్యంగా ఎయిర్ బీఎన్‌బీ వంటి కంపెనీల పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. సామాజిక దూరం అన్న నియమం ఇప్పుడు ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల పాలిట శాపంగా మారింది. దీంతో ఆ సంస్థ నాల్గో వంతు అంటే సుమారు 1900 మంది ఉద్యోగుల్ని తొలగించింది.
అలాగే సమీక్షలు నిర్వహిచండంలో ప్రముఖంగా పేరున్న యల్ప్ వెబ్ సైట్ కూడా రెస్టారాంట్లను, బార్లను మూసివేయాలని ప్రభుత్వాలు ఆదేశించిన మూడు నాలుగు వారాల్లోనే మూడో వంతు ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పించింది.
కార్యాలయాలను అద్దెకు ఇవ్వడం ఆపై షేర్‌డ్ ఆఫీస్ స్పేస్‌గా మారిన వియ్ వర్క్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు లాక్ డౌన్ ప్రారంభం కాక మునుపు సాఫ్ట్ బ్యాంక్‌తో ఒప్పందం కుదిరింది. కానీ ప్రస్తుతం అది రద్దయ్యింది. అంతే కాదు చాలా అంకుర సంస్థల్లో సాఫ్ట్ బ్యాంక్ పెట్టిన పెట్టుబడులు పరిస్థితి ప్రస్తుతం డోలయామానంలో పడిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- ఊబకాయులకు కరోనావైరస్ వస్తే చనిపోతారా
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- నేసిన బట్టలు కొనేవారూ లేరు.. పని చేసేందుకు సరకూ లేదు: చేనేత కార్మికులపై లాక్‌డౌన్ ఎఫెక్ట్
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








