కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోరీ సెలాన్ జోన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారితో పోల్చేందుకు, ఇంత పెద్ద స్థాయిలో జనజీవితాన్ని ప్రభావితం చేసిన ఘటనలేవీ నాకు తట్టడం లేదు.
సహోద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటూ, లండన్‌లో చిక్కుకుపోయిన నా కొడుకు, మనవరాలితో ఫేస్‌టైమ్‌లో మాట్లాడుతూ, సోషల్ మీడియా వెబ్‌సైట్లలో పోస్ట్‌లు పెడుతూ నా రోజులు గడుపుతున్నా.
స్మార్ట్‌ఫోన్‌లు రాకముందు, అంటే 2005లో ఒకవేళ కరోనావైరస్ వ్యాపించి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవన్న ఆలోచన నాకు వచ్చింది.
ఇప్పుడు మనం అందరితో అనుసంధానమయ్యేందుకు, సమయాన్ని వెళ్లదీసేందుకు ఉపయోగిస్తున్న చాలా డిజిటల్ సదుపాయాలు అప్పుడు లేవు. కొన్ని ఉన్నా, అందరికీ అందుబాటులో లేవు.
ఫేస్‌బుక్‌కు అప్పటికి ఒక ఏడాది నిండింది. కానీ, అమెరికా యూనివర్సిటీల్లో మాత్రమే ఉపయోగంలో ఉంది. బ్రిటన్ యూనివర్సిటీలకు అప్పుడప్పుడే పాకుతూ ఉంది.
ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్ లేవు. ‘సోషల్ మీడియా’ అన్న పదమే అప్పటికి వాడుకలో లేదు.
యూట్యూబ్ అదే ఏడాది పుట్టింది. ట్విటర్ ఆ తర్వాత ఏడాది వచ్చింది. యాపిల్ ఐఫోన్లు 2007లో గానీ రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఇంటర్నెట్‌ను వినియోగించేందుకు స్మార్ట్ ఫోనే మనకు ప్రధాన ద్వారం అయిపోయింది.
కానీ, 15 ఏళ్ల క్రితం 80 లక్షల ఇళ్లకు మాత్రమే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉంది. పది మెగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ వచ్చేది. మరో 70 లక్షల ఇళ్లు డయల్ అప్ కనెక్షన్లతో నెట్టుకువచ్చేవి.
ఇప్పుడు చాలా ముఖ్యంగా మారిన సేవలన్నీ అప్పుడే పునాదులు వేసుకుంటున్నాయి.
2003లో స్కైప్ మొదలైనా, అప్పటికి అది ఇంటర్నెట్ ద్వారా ఫోన్లు, కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. 2006లో వీడియో చాట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఎవరితోనైనా వీడియో చాట్‌లో మాట్లాడాలంటే చాలా ఖరీదైన అధునాతన పరికరాలను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడంటే ఫేస్‌టైమ్, వాట్సాప్‌ల్లో వీడియో కాల్స్ ద్వారా ఒకరిని ఒకరం పలకరించుకోగలుగుతున్నాం.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా

జూమ్, బ్లూజీన్స్ లాంటి వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లనూ ఇప్పుడు జనాలు వాడేస్తున్నారు. నిన్నమొన్నటివరకూ జనం ఆఫీసు వ్యవహారాల కోసమే ఎక్కువగా ఉపయోగించే జూమ్ యాప్ డౌన్‌లోడ్ల విషయంలో యాపిల్ యాప్ స్టోర్ రెండో స్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం బ్రిటన్‌లోని 96 శాతం ఇళ్లకు సగటున 54 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందుతోంది. ఫలితంగా లక్షల మంది ఇప్పుడు ఇళ్ల నుంచే పని చేసుకోగలుగుతున్నారు. కూర్చున్న చోటు నుంచి నేను అమెరికాలోని నా బాస్‌లను నేరుగా చూస్తూ మాట్లాడగలుగుతున్నా. సహోద్యోగులతో కలిసి చర్చించగలుగుతున్నా.
లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థపై చాలా ప్రభావం పడుతుంది. కానీ, ఈ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని పాత రోజుల్లో ప్రభావం ఇంకా ఎంత తీవ్రంగా ఉండేదో ఊహించుకోండి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పట్లోనూ కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు ఉన్నాయి. అయితే మొత్తం రిటైల్ అమ్మకాల్లో వాటి వాటా మూడు శాతమే. ప్రస్తుతం అది ఇరవై శాతంగా ఉంది. ఈ డెలివరీ సర్వీసులు ఎంత ముఖ్యమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థం అవుతుంది.
క్లౌడ్ కంప్యూటింగ్ పుణ్యమా అని ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాల స్థాయిని సులువుగా పెంచుకునే వీలు ఏర్పడింది. 15 ఏళ్ల క్రితమైతే వాళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేది.
లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. 2005లో ‘కంప్యూటర్ విద్య’ గురించి చర్చ జరుగుతూ ఉంది కానీ, అదంతా స్కూళ్లలో కంప్యూటర్ విద్య బాగా ఉండాలన్న విషయం గురించి. ఇలా, ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఇళ్ల నుంచే నేర్చుకోవడం గురించి కాదు.

ఫొటో సోర్స్, EMMA RUSSELL
వైద్యం విషయంలో ఇప్పుడున్న అధునాతన సాంకేతికత అప్పట్లో లేదు. కరోనావైరస్ లాంటి సంక్షోభాన్ని ఆ కాలంలో ఎదుర్కోవాల్సి రావడం చాలా సవాళ్లనే విసిరేది.
వినోదం విషయానికి వస్తే, ఇప్పట్లా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే టీవీలు 15 ఏళ్ల క్రితం లేవు. స్ట్రీమింగ్ సర్వీసులు లేవు. యూట్యూబ్‌లో చూస్తూ ఇంట్లో యోగా చేసుకోలేకపోయేవాళ్లం.
మన చుట్లూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు యాప్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. అప్పట్లో అది సాధ్యమయ్యేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలపై చూపుతున్న ప్రభావం గురించి ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో ఉండే స్నేహితులు మనకు నిజమైన స్నేహితులు కాదని కొందరు అంటుంటారు. మనుషులతో నేరుగా మాట్లాడటానికి ప్రత్యామ్నాయమేదీ లేదని చెబుతుంటారు. స్క్రీన్ల వంక పదే పదే చూడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచిస్తుంటారు.
కానీ టెక్నాలజీ, దాని వల్ల వచ్చిన సదుపాయాల వల్ల కలిగే ప్రయోజనం, తెలివిగా వాడుకుంటే ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చన్న విషయం ఈ సంక్షోభం నుంచి తేరుకున్నాక మనం గుర్తిస్తామేమో.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ‘నాలాంటి నాలుగు వేల మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి’
- కరోనా లాక్‌డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’
- ‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం... లాక్‌డౌన్ ఎత్తేసిన హుబే, త్వరలోనే వుహాన్‌లో కూడా సడలింపు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









