కరోనా లాక్‌డౌన్: దిల్లీ నుంచి బిహార్ 1200 కిలోమీటర్లు కాలి నడకన బయలుదేరిన కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీటూ తివారి
- హోదా, బీబీసీ కోసం
“ఆకలితో చస్తున్నప్పుడు.. దిల్లీలో ఎందుకు చావాలి.. మా ఊళ్లో మా వాళ్ల దగ్గరే చచ్చిపోతాం”..
బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతున్న రాజ్‌కుమార్ రాం వణుకుతున్న స్వరంలో ఆయన మనసులో ఎంత బాధ ఉందో తెలుస్తోంది.
రాజ్‌కుమార్ రాం స్వగ్రామం బిహార్ సహర్సా జిల్లాలోని కెచూలీ. ఆయన దిల్లీలోని చాందినీచౌక్‌లో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ షాపులో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు.

కానీ, కరోనా సంక్షోభంతో లాక్‌డౌన్ చేయగానే ఆయన ‘జుగాడ్ గాడీ’(ఇంజన్ అమర్చిన తోపుడు బండి లాంటిది)లో తిరిగి వచ్చేశారు.
ఆయన సహర్సాకు తిరిగొచ్చి 5 రోజులైంది. కానీ, తన ఊరిలోకి అడుగుపెట్టడానికి రాజ్‌కుమార్ ఇప్పటికీ ఒక పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
2500 పెట్రోల్, బిస్కట్లు, నీళ్లతో ప్రయాణం
దిల్లీ నుంచి సహర్సాకు సుమారు 1200 కిలోమీటర్లు ఉంటుంది. రాజ్ కుమార్ రాం, తనతోపాటూ పనిచేసే కార్మికులు రామచంద్ర యాదవ్, సత్యం కుమార్ రాం, రాం యాదవ్, ధనిక్ లాల్ యాదవ్‌తో కలిసి దిల్లీలోని శాస్త్రి పార్క్ దగ్గర ఒక అద్దె గదిలో ఉంటారు.
లాక్‌డౌన్ అయ్యాక, రాంయాదవ్ జుగాడ్ ఠేలాలో 2500 రూపాయలకు పెట్రోల్ నింపుకున్న వీళ్లంతా మార్చి 22న దిల్లీ నుంచి బయల్దేరి మార్చి 27 మధ్యాహ్నానికి సహర్సా చేరుకున్నారు.
సంచులు తగిలించిన జుగాడ్ గాడీని వీరంతా వంతులవారీగా నడిపారు. మొత్తం ఐదు రోజులూ బిస్కట్లు, మంచి నీళ్లతో కడుపు నింపుకున్నారు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

సహర్సా సదర్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్న నవహట్టా తాలూకా హాటీకి చెందిన రామచంద్ర యాదవ్ బీబీసీతో ఫోన్లో మాట్లాడారు.
“దారిలో చాలా ప్రాంతాల్లో అధికారులు మమ్మల్ని అడ్డుకుని మాట్లాడారు. ఇప్పుడు సహర్సా చేరుకోగానే ఇక్కడ ఆస్పత్రికి వచ్చాం. పరీక్షలు చేయించుకుంటే, అందరికీ మంచిది. డాక్టర్ 14 రోజులపాటు వేరే ఎవరినీ కలవద్దని చెప్పారు. మా ఊరికి వెళ్తే, లోపలికి రానిస్తారో.. లేదో తెలియడం లేదు” అన్నారు.

ఫొటో సోర్స్, MAYANK
గోరఖ్‌పూర్ నుంచి బేతియా వరకూ కాలినడకన...
దిల్లీ నుంచి వచ్చిన ఈ కార్మికులు ‘జుగాడ్ గాడీ’తో అప్పటికప్పుడు అక్కడనుంచి బయల్దేరితే.. యూపీలోని గోరఖ్‌పూర్‌లో పనిచేస్తున్న బిహార్ బేతియాకు చెందిన కొందరు కార్మికులు కాలినడకనే తమ గ్రామానికి చేరుకున్నారు.
గోరఖ్‌పూర్ జిల్లాలోని నర్కటియాగంజ్ వెళ్లే రైలు మార్గంలో పట్టాల పక్కనే నడిచిన ఈ కార్మికులు బెల్లం, బొరుగుల ఉండలతో ఆకలి తీర్చుకుంటూ 130 కిలోమీటర్లు ప్రయాణించారు.
“నడిచి ఎందుకొచ్చారు” అన్నప్పుడు బాబూలాల్ మహతో అనే కార్మికుడు కన్నీళ్లు పెట్టాడు.
“ఏం చేయమంటారు. ఏ ఇంట్లో పనిచేస్తామో, అదే ఇంట్లో ఉండేవాళ్లం. కానీ ఈ వ్యాధి రాగానే పని నుంచి, ఇంటి నుంచి కూడా వెళ్లగొట్టారు. ఖర్చులకు ఇవ్వలేను, వెళ్లండి అన్నాడు. కొత్త అద్దె ఇల్లు దొరకడం కష్టం. వేరే పని కూడా లేదు. తిండి కూడా కష్టమవడంతో ఇంటికెళ్లాలని అనుకున్నాం. రైళ్లు లేకపోయేసరికి నడిచే వచ్చేశాం. ప్రభుత్వమే అలా ఉంటే, మనమేం చేయగలం” అన్నారు.
ఆ కార్మికులు పది మందికి పైనే ఉన్నారు. వారిలో బాలేశ్వర్ కుమార్, రాంకుమార్, హరిరాం ప్రజాపతి అనే సోదరులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, MAYANK
పట్నా నుంచి కూడా సొంత ఊళ్లకు....
వీళ్లు ముగ్గురిదీ.. నర్కటియాగంజ్ దగ్గరున్న అవసాన్‌పూర్.
దాదాపు 20 ఏళ్లున్న బాలేశ్వర్ కుమార్ “బిస్కట్లు తింటూ నడిచాం. రాత్రి రిస్వా బజారులో ఆగాం. రెండు గంటలు నిద్రపోయాక, మళ్లీ బయల్దేరాం. ఇప్పుడు మళ్లీ మా ఊరైతే చేరుకోగలం. కానీ, ఇల్లెలా నడుస్తుంది. మేం ముగ్గురం కలిసి సంపాదిస్తేనే ఇంట్లోవాళ్ల కడుపు నిండుతుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇళ్లకు వెళ్లనివ్వదని, దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు” అన్నారు.
మిగతా రాష్ట్రాల నుంచే జనం బిహార్ తిరిగి వస్తున్నారని కాదు.. ప్రపంచాన్ని నిర్మించే ఈ శ్రామికులను సొంత రాష్ట్రంలో కూడా కష్టాలు చుట్టుముట్టాయి.
పట్నాలోని కంకడ్‌బాగ్‌లో కూలిపనులు చేసుకునే మొహమ్మద్ జమీమ్ తనతో పనిచేసే ఐదుగురితో కలిసి కాలినడకన తన గ్రామానికి చేరుకున్నారు.
వీళ్లందరూ మార్చి 25న ఉదయం పట్నా నుంచి సిమ్రీ బఖ్తియార్‌పూర్ పరిధిలో ఉన్న చక్మక్కా గ్రామానికి బయల్దేరారు.

ఫొటో సోర్స్, Getty Images
200 కిలోమీటర్ల ప్రయాణం
భుజాలకు సంచులు తగిలించుకుని, అరిగిపోయిన చెప్పులు, పాత మినరల్ వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపుకున్న ఈ 18- 22 ఏళ్ల మధ్య ఉన్న యువకులు సుమారు 200 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు.
మార్చి 27న వీళ్లంతా సిమ్రీ బఖ్తియార్‌పూర్ దగ్గరున్న దుర్గాస్థాన్ మీదుగా వెళ్తున్నప్పుడు స్థానికులు వీళ్లను అడ్డుకున్నారు. దార్లో రెండు సార్లు వీరిని ఆపి వివరాలుతెలుసుకున్న పోలీసులు వారికి తినడానికి కొన్ని పదార్థాలు ఇచ్చారు.
మొహమ్మద్ జసీమ్ స్థానిక టీవీ జర్నలిస్ట్ షౌకత్ ద్వారా బీబీసీతో ఫోన్లో మాట్లాడాడు.
“వాహనం ఏదీ దొరకలేదు, దాంతో నడిచి బయల్దేరాం. ఖుస్రూపూర్‌లో పోలీసులు తినడానికి కొన్ని ఇచ్చారు. తర్వాత ఖగడియా నుంచి ఇక్కడికి చేరుకున్నాం” అని చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
యజమాని డబ్బు ఇవ్వక పట్నాలో ఇరుక్కుపోయా...
51 ఏళ్ల మొహమ్మద్ ఫిరోజ్ చాలా ఆందోళనలో ఉన్నారు.
పట్నాలోని కంకడ్‌బాగ్ పోలీస్ స్టేషన్ అధికారి మనోరంజన్ భారతి మార్చి 25న ఆయన రోడ్డు మీద తచ్చాడుతుండడం చూశారు. ఆయన్ను ఎవరిని అడిగితే, మార్చి 1న ఫిరోజ్ పుణె నుంచి దానాపూర్ స్టేషన్‌కు చేరుకున్నట్టు తెలిసింది.
కానీ, దేవఘర్(జార్ఖండ్) వెళ్లడానికి రైళ్లు, వేరే వాహనాలేవీ లేకపోవడంతో ఆయన నాలుగు రోజులుగా ఖాళీ కడుపుతో పట్నాలోనే తిరుగుతూ ఉండిపోయారు.
“బీబీసీతో ఫోన్లో మాట్లాడిన ముగ్గురు పిల్లల తండ్రి ఫిరోజ్ తను పుణెలో నెలకు 8 వేల రూపాయల జీతానికి పనిచేసేవాడినని, కానీ కరోనా లాక్‌డౌన్‌తో యజమాని జీతం” ఇవ్వకుండానే తరిమేశాడని చెప్పారు.
“నేను మసీదులో ఉండచ్చా అని అడగడానికి వెళ్లాను. కానీ వాళ్లు కూడా స్టేషన్లో వెళ్లి ఉండండి అని తరిమేశారు. స్టేషన్‌లో కూడా ఉండనివ్వలేదు. ఇంట్లో సంపాదించే వాడిని నేనొక్కడినే. ఎక్కువ రోజులు ఇక్కడే ఉండిపోతే, నా భార్య, పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. ఇక్కడ పోలీసులు మాకు ఇప్పుడే తినడానికి పెట్టారు” అన్నారు
21వ శతాబ్దంలో మనుషులు తిరగడానికి అన్ని సౌకర్యాలూ ఉంటాయని చెబుతున్నారు. ప్రభుత్వం మాటలో చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్స్ లాంటివి వచ్చేస్తాయి. కానీ కార్మికుల పుండ్లు పడిన పాదాలు, కన్నీళ్లు పెట్టించే కష్టాలు మనతో కచ్చితంగా ఒక మాట అంటున్నట్టు అనిపిస్తుంది. “రైళ్లు లేకపోయినా, మేం మా పాదాలతోనే ఈ భూమిని కొలిచేస్తాం”.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- కరోనావైరస్: మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు జరిగే మేలు ఎంత?
- ‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









