'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో' - భారత్‌లో నిరుపేదల ఆందోళన

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి భారతదేశం మొత్తాన్ని లాక్‌డౌన్ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. కానీ చాలా మంది రోజు వారీ కూలీలకు ఇది సాధ్యంకాదు.
మంగళవారం నాడు చేసిన లాక్‌డౌన్ ప్రకటనకు ముందు వీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటో తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే ప్రయత్నించారు.
నోయిడాలోని లేబర్ చౌక్ సాధారణంగా ఉపాధి కోసం ఎదురుచూసే వందలాది మంది నిర్మాణ కార్మికులతో నిండిపోయి రోజూ రద్దీగా ఉంటుంది.
బిల్డర్లు తమకు అవసరమైన కూలీల కోసం దిల్లీ సమీపంలోని పట్టణ ప్రాంతంలో గల ఈ కూడలికి వస్తుంటారు.
మొదట లాక్‌డౌన్ ప్రకటించినపుడు ఆదివారం నేను అక్కడకు వెళ్లి చూస్తే ఆ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది. అంతా నిశ్చలంగా ఉంది. ఇంత బిజీగా ఉండే ప్రాంతంలో పక్షుల కిలకిలారావాలు వినగలమని ఎప్పుడూ ఊహించలేం.
కానీ, నేను విన్నాను. నమ్మలేకపోయాను.

ఒక మూల గుమిగూడిన కొంతమంది పురుషులు కనిపించారు. అక్కడ ఆగి వారికి కొంచెం దూరంగా నిలుచుని.. ''లాక్‌డౌన్ ఉంది కదా.. పాటిస్తున్నారా?'' అని అడిగాను.
"మమ్మల్ని కూలికి తీసుకెళ్లేవాళ్లు ఎవరూ ఉండరని మాకు తెలుసు. కానీ.. మా ప్రయత్నం చేయాలి. అదృష్టం పరీక్షించుకోవాలి. అందుకే వచ్చాం'' అని చెప్పాడు రమేష్ కుమార్. అతడిది ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లా. పని కోసం ఇక్కడికి వచ్చాడు.
''నేను రోజుకు రూ. 600 సంపాదిస్తాను. ఐదుగురిని పోషించాలి. ఇంట్లో సరుకులు ఒకటి, రెండు రోజుల్లో నిండుకుంటాయి. ఎవరికీ తిండి ఉండదు. కరోనావైరస్ ప్రమాదం ఉందని నాకు తెలుసు. కానీ నా పిల్లలను ఆకలితో చూడలేను'' అని చెప్పాడతడు.
కోట్లాది మంది రోజువారీ కూలీలు ఇలాంటి పరిస్థితిల్లోనే ఉన్నారు. దేశం యావత్తూ ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్‌డౌన్ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అంటే ఈ కోట్లాది మంది రోజువారీ కూలీలకు రాబోయే మూడు వారాల పాటు కూలీ దొరకదు. వీరిలో కొందరి ఇళ్లలో కొద్ది రోజుల్లోనే ఆహారం అడుగంటే పరిస్థితి ఉంటుంది.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా

భారతదేశంలో దాదాపు 600 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 10 మంది చనిపోయారు.
ఉత్తరప్రదేశ్, కేరళ, దిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. రమేష్ కుమార్ వంటి కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చాయి. లాక్‌డౌన్ వల్ల ప్రభావితమయ్యే కూలీలకు సాయం చేస్తామని మోదీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది.
కానీ ఇందుకు సవాళ్లు ఉన్నాయి. భారతదేశ కార్మిక శక్తిలో 90 శాతం మంది సెక్యూరిటీ గార్డులు, క్లీనర్లు, రిక్షా పుల్లర్లు, వీధుల్లో విక్రేతలు, చెత్త సేకరించేవారు, ఇళ్లలో పనిచేసే వారు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ చెప్తోంది.
వీరిలో చాలా మందికి పెన్షన్లు, అనారోగ్య సెలవులు, వేతనాల చెల్లింపుతో సెలవులు కానీ.. బీమా సౌకర్యం కానీ లేవు. చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవు. వారి రోజువారీ అవసరాల కోసం నగదు మీదే ఆధారపడతారు.

చాలా మంది వలస కార్మికులు. అంటే సాంకేతికంగా వారు పనిచేసే ప్రాంతానికి వెలుపల ఉండే వేరే రాష్ట్రంలో నివసిస్తున్న వారు. దీనివల్ల 'కదిలే జనాభా' అనే సమస్య తలెత్తుతుంది: అంటే జనం ఏ రాష్ట్రంలోనైనా ఎక్కువ కాలం నివసించని వారు.. వారు పని కోసం సంచరిస్తూ ఉంటారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఈ సవాళ్లు చాలా పెద్దవని అంగీకరిస్తారు. "ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలోనూ ఎవరూ ఇటువంటి సవాళ్లు ఎదుర్కోలేదు" అని ఆయన పేర్కొన్నారు.
"రోజు రోజుకూ పరిస్థితి మారుతోంది. కాబట్టి అన్ని ప్రభుత్వాలూ మెరుపు వేగంతో పనిచేయాలి. మనం పెద్ద పెద్ద సామూహిక వంటశాలలను ఏర్పాటు చేసి, అవసరంలో ఉన్న ప్రజలకు ఆహారం అందించాల్సిన అవసరముంది'' అని చెప్పారు.
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ గురించి ఆయన ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఈ రాష్ట్ర జనాభా 22 కోట్ల మంది.
''ఎవరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారనేదానితో సంబంధం లేకుండా.. వారికి నగదు, బియ్యం, గోధుమలను పంపిణీ చేయాల్సిన అవసరముంది'' అంటారు అఖిలేష్ యాదవ్.
''జనం నుంచి జనానికి వైరస్ సంక్రమించకుండా నివారించటానికి.. ప్రజలు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళకుండా ఆపాలి. ఆహార భద్రత కల్పించటం అందుకు ఒక మార్గం. సంక్షోభ సమయాల్లో జనం తమ గ్రామాలకు వెళ్తుంటారు'' అని ఆయన పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఒక అధికార బృందం పరిశీలిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు.
భారతీయ రైల్వే.. ఇప్పుడు అన్ని ప్రయాణికుల రైళ్లనూ మార్చి 31 వరకూ నిలిపివేసింది. ఈ రైళ్ల రద్దు మార్చి 23న అమలులోకి రావటానికి ముందు.. కరోనావైరస్ తాకిన దిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి వందలాది మంది వలస కార్మికులు కిక్కిరిసిన రైళ్లలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని తమ గ్రామాలకు ప్రయాణించారు.
ఇది.. ప్రజా సమూహంలో వైరస్ వ్యాప్తి, సంక్రమణ ప్రమాదాన్ని పెంచింది. రాబోయే రెండు వారాలు భారతదేశానికి అత్యంత సవాలు అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అయినా కానీ.. అందరూ తమ గ్రామాలకు వెళ్లలేకపోయారు.

అలహాబాద్ నగరంలో రిక్షా తొక్కుతూ జీవించే కిషన్ లాల్.. గత నాలుగు రోజులుగా తనకు ఆదాయం ఏదీ లేదని చెప్పారు.
"నా కుటుంబాన్ని పోషించడానికి నేను సంపాదించాలి. ప్రభుత్వం మాకు డబ్బు ఇస్తుందని చెప్తున్నారు. ఎప్పుడిస్తుందో, ఎలా ఇస్తుందో నాకు మాత్రం తెలియదు'' అన్నారు.
ఆయన స్నేహితుడు అలీ హసన్.. ఓ దుకాణంలో క్లీనర్‌గా పనిచేస్తుంటారు. తన దగ్గర డబ్బులు ఐపోయాయని.. తిండికి కూడా డబ్బులు లేవని ఆయన చెప్పాకు.
"రెండు రోజుల కిందట షాపు మూసేశారు. నాకు డబ్బులేమీ ఇవ్వలేదు. షాపును మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. నాకు చాలా భయంగా ఉంది. నాకు కుటుంబం ఉంది. వారికి తిండి పెట్టటం ఎలా?'' అని అడిగారాయన.
కోట్లాది మంది భారతీయులు వీధి వ్యాపారాలతో జీవనోపాధి పొందుతుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. తమ లాంటి వారికి పనులు కూడా కల్పిస్తుంటారు.
దిల్లీలో లస్సీ, మజ్జిగ వంటి పానీయాలను విక్రయించే ఒక చిన్న స్టాల్‌ను నడుపుతున్న మహ్మద్ సబీర్.. వేసవిలో వ్యాపారం పెరుగుతుందని ఆశిస్తూ ఇటీవలే మరో ఇద్దరు వ్యక్తులను పనిలో పెట్టుకున్నారు.
"ఇప్పుడు వాళ్లకి కూలీ చెల్లించలేను. నా దగ్గర డబ్బులు లేవు. నా కుటుంబం గ్రామంలో వ్యవసాయం చేస్తూ కొంత ఆదాయం పొందుతుంది. కానీ ఈ సంవత్సరం వడగళ్ల కారణంగా వారి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వాళ్లు కూడా నా మద్దతు కోసం చూస్తున్నారు.

నేను ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. కరోనావైరస్ కన్నా ముందుగా ఆకలి మా లాంటి చాలా మందిని చంపేస్తుందని భయంగా ఉంది'' అని చెప్పాడు.
దేశంలోని అన్ని పర్యటక కేంద్రాలనూ మూసివేశారు. ఆ రంగం మీద ఆధారపడి జీవించే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దిల్లీలోని ప్రఖ్యాత ఇండియా గేట్ వద్ద ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటారు తేజ్‌పాల్ కశ్యప్. వ్యాపారం ఇంత దారుణంగా పడిపోవటం తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు.
"అసలు లాక్‌డౌన్ లేకపోయినా కూడా గత రెండు వారాలూ చాలా దారుణంగా ఉంది. పర్యటకులు ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఇక్కడ పనిచేయలేను.. నా ఊరికీ తిరిగి వెళ్ళలేను. నేను దిల్లీలో చిక్కుకుపోయాను. నా కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని మా ఊర్లో ఉంది. వాళ్లకు తిండి ఎలా అనే ఆందోళన నిత్యం వెంటాడుతోంది'' అని వివరించారు.
ఊబర్, ఓలా వంటి ప్రయాణ సర్వీసులు అందించే డ్రైవర్లు కూడా ఇక్కట్లు పడుతున్నారు.

దిల్లీలోని ఒక విమానయాన సంస్థ ఉద్యోగుల కోసం టాక్సీ నడుపుతున్న జోగిందర్ చౌదరి.. ''నా లాంటి వారికి ప్రభుత్వం కొంత సాయం చేయాలి'' అని కోరారు.
"లాక్‌డౌన్ ఎంత ముఖ్యమైన విషయమో నాకు తెలుసు. కరోనావైరస్ ప్రమాదకరమైనది. మనల్ని మనం రక్షించుకోవాలి. కానీ.. ఈ లాక్‌డౌన్ వారాల తరబడి కొనసాగితే.. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే ఆలోచన, ఆందోళన నన్ను వీడటం లేదు'' అని పేర్కొన్నారు.
కొందరైతే కరోనావైరస్ అనే మాటే వినలేదు. దాని గురించి వారికి తెలియదు.
"అలహాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎన్నో ఏళ్లుగా బూట్లు పాలిష్ చేస్తున్నా.. కానీ ఇప్పుడు ఎవరూ కనిపించటం లేదు" అని చర్మకారుడు ఒకరు చెప్పారు. జనం ప్రయాణాలు చేయటం ఎందుకు ఆపేశారో కూడా తనకు తెలియదన్నారు.
"ఏం జరుగుతోందో నాకు తెలియదు. ఇప్పుడు స్టేషన్‌కు జనం అసలు రావడం లేదు. ఏదో కర్ఫ్యూ అమలులో ఉందని నాకు తెలుసు. కానీ ఎందుకో తెలియదు'' అని చెప్పారాయన.
అదే ప్రాంతంలో వాటర్ బాటిల్స్ అమ్మే వినోద్ ప్రజాపతి.. "కరోనావైరస్ గురించి నాకు మొత్తం తెలుసు. అది చాలా ప్రమాదకరమైనది. ప్రపంచం మొత్తం తంటాలుపడుతోంది'' అని తెలిపారు.
''స్థోమత ఉన్నవారు, ఉండటానికి స్థలం ఉన్న వారు.. చాలా మంది ఇళ్లలోపల ఉన్నారు. కానీ మాలాంటి జనానికి.. భద్రత - ఆకలి మధ్య ఒక దానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి. మేం దేనిని ఎంచుకోవాలి?" అని ఆయన ప్రశ్నించారు.
(అదనపు రిపోర్టింగ్ , ఫొటోలు: అలహాబాద్ నుంచి వివేక్ సింగ్)
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్: ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు ఏం చేశాయి?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









