కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ల కష్టాలేమిటో తెలుసా? వారి మనసులోని మాటేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీప్తి బత్తిని, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
''ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు దేశమంతా మాకోసం చప్పట్లు కొట్టింది. మేం ఆ ఊపులో ఓ మూడు గంటలు ఉండుంటాం. కానీ, తరువాత మామూలే. ఎప్పట్లాగే కోవిడ్-19 రోగులకు చికిత్స చేయటానికి వెళ్లిపోయాం'' - ఈ మహమ్మారితో ముందుండి పోరాడుతున్న ఓ డాక్టర్ చెప్పిన మాట ఇది.
డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది కోవిడ్-19 మీద పోరాడటంలో ముందున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వాళ్లీ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటున్నారనేది తెలుసుకునేందుకు ఆ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బందితో మాట్లాడాం.
బీబీసీతో మాట్లాడిన వైద్యులు తమ పేరు గోప్యంగా ఉంచాలని కోరారు. డాక్టర్లను కూడా క్వారంటైన్‌లో ఉంచాలని వారు అధికారులకు సూచిస్తున్నారు.
గాంధీ ఆసపత్రిలో జనరల్ మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్న రెసిడెంట్ డాక్టర్లు ఐదు రోజులకు ఒకసారి ఇరవై నాలుగు గంటల షిఫ్టులో పనిచేస్తున్నారు. మిగిలిన రోజుల్లో జనరల్ డ్యూటీలో ఉంటున్నారు. వాళ్ల ఇరవై నాలుగు గంటల షిఫ్టు ఎలా ఉంటుందని వారిని అడిగాం.

ఫొటో సోర్స్, HEALTH DEPARTMENT
‘కేసుల సంఖ్య ఇంకా పెరుగవచ్చు...’
''పేషెంట్లు నిరంతరం వస్తూనే ఉన్నారు. వాళ్లకు చికిత్స ఇచ్చేప్పుడు ఐసోలేషన్ వార్డుల్లో మేం వ్యక్తిగత రక్షణ కిట్ ధరిస్తున్నాం. ప్రస్తుతం మాదగ్గర ఉన్న కరోనావైరస్ రోగులంతా యువతే. దీంతో స్థిరంగా ఉండటం వాళ్లకు కాస్త సలభమే. కానీ వీళ్లను కలిసిన వాళ్లకు కూడా వైరస్ సోకుతోంది కాబట్టి.. ఈ కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. అంటే, తట్టుకునే శక్తి తక్కువ ఉండే వృద్ధులు కూడా వస్తారని అంచనా వేస్తున్నాం. అప్పుడు సవాళ్లు ఎదురుకావచ్చు'' అని ఒక రెసిడెంట్ డాక్టర్ చెప్పారు.
''ఇలా ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. కేసుల సంఖ్యలో అకస్మాత్తుకా పెరుగుదల కనిపిస్తోంది'' అన్నారు.
ఇప్పుడు గాంధీలో 29 మంది రెసిడెంట్ డాక్టర్లున్నారు. అందులో ఇద్దరు ఇరవై నాలుగు గంటల రొటేషన్ షిఫ్టుల్లో ఉన్నారు. తాము బాగా అలసిపోతున్నట్టు ఆ డాక్టర్ తెలిపారు. తోటి డాక్టర్లలో చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నట్టు చెప్పారాయన.


- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

''డాక్టర్ల ముఖంలో నవ్వు కనిపించటం లేదు...''
''మాకు చాలా భయంగా ఉంది. ఇటలీలో చాలా మంది వైద్య సిబ్బందికి కరోనావైరస్ సోకింది. వాళ్లు ఎప్పుడూ పేషెంట్ల దగ్గరే ఉండటం వల్ల అలా జరిగింది. పేషెంట్లకు వైద్యం చేయడం మా వృత్తి. కానీ ఇది ఎంత కాలం కొనసాగుతుందోనన్న భయం ఉంది మాలో. గత మూడు రోజుల్లో నా తోటి డాక్టర్ల ముఖంలో చిన్న నవ్వు కూడా కనిపించలేదు'' అని తెలిపారు.
వాళ్లలో చాలా మంది ఇళ్లకు వెళ్లడం లేదని కూడా చెప్పారు. ''ఎందుకంటే ఇంట్లోని వాళ్లను రిస్కులో పెట్టడం ఇష్టం లేక. మా ఇళ్ళల్లో వాళ్లకు మా గురించి భయం పట్టుకుంది. కానీ, ఇప్పుడు మేం చేయగలిగింది ఏమీ లేదు. ఈ వ్యవహారం అంతా తేలే లోపు మేం ఇలాగే ఉండగలుగుతామా అని కూడా చెప్పలేని పరిస్థితి. ఈ చీకటి ఇంకెన్నాళ్లో చెప్పలేకపోతున్నాం. ప్రజారోగ్యం అంశాన్ని మనం చూసే పద్ధతిని ఇది మారుస్తుందని మాత్రం చెప్పగలను'' అని వివరించారు.
మాతో మాట్లాడిన డాక్టరుకు మేలో పెళ్లి కావాల్సి ఉంది. కానీ ఇప్పడు పరిస్థితులు మారాయి. ''మా రెండు కుటుంబాలూ బాధపడుతున్నాయి. పెళ్లి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నాం. ఇది ఒక చిన్న విషయం మాత్రమే. అసలు మా జీవితాలే తలకిందులయ్యాయి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకోవాలి’
''ఐసొలేషన్‌లో ఉన్న వాళ్లం ఎవరమూ ఇళ్లకు వెళ్లడం లేదు. కాస్త విశ్రాంతి కోసం కొన్ని రోజులకు ఒకసారి మాత్రం కొందరు వెళ్తున్నారు. కానీ అప్పుడు కూడా వాళ్లు తినే ప్లేట్లలో, టేబుళ్లపై తినటం లేదు. వాళ్లు తాగే బాటిళ్లు, గ్లాసులు తాకటం లేదు. వాళ్లంతా కూర్చునే చోట కూర్చోవటం లేదు. ఓ రకంగా ఇంట్లో కూడా మాకు మేమే మమ్మల్ని క్వారంటైన్ చేసుకున్నాం. కేవలం మేం ఇళ్లకు వెళ్లేది ఇంట్లో వాళ్ల ముఖాలు చూడటానికి. అదే మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది'' అని తెలిపారు.
ఈ డాక్టరును, ఆయన సహచర డాక్టర్లను కలవరపెట్టే మరో అంశం, యాజమాన్యం ఇప్పటికీ సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవటం. ''శుభ్రత విషయంలో జరగాల్సినంత జరగటం లేదు. ఐసొలేషన్ వార్డులోని చోట్లను మరిన్ని సార్లు శుభ్రపరచాలి. కానీ జరగాల్సినంతగా జరగడం లేదు'' అని అన్నరాయన.
ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదని ఆయన భావిస్తున్నారు. ''భారతదేశంలో మొదటి కేసు కేరళలో జనవరిలో నమోదయింది. అప్పట్లోనే ఏం చేయాలనే దానిపై మేం మాట్లాడుకున్నాం. కానీ పెద్దగా ఏం జరగలేదు. తెలంగాణలో మొదటి కేసు మార్చి మొదటి వారంలో నమోదయింది. అప్పుడే ఇది పెరుగుతుందని అంచనా వేశాం. ఈ వైరస్ పదుల సంఖ్యలో రెట్టింపు అవుతూనే ఉంటుంది. కానీ మనం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాం. ఇక ఇప్పుడు ఎవర్నీ నిందించి ప్రయోజనం లేదు. దీన్నించి గుణపాఠాలు నేర్చుకోవాలి. అంతే'' అని వ్యాఖ్యానించారు.
కరోనావైరస్ వ్యాధి విషయంలో దగ్గరగా పనిచేస్తున్న వైద్యుల చెప్తున్న ప్రకారం.. ఇది కేవలం ఆరంభం మాత్రమే. పెద్ద యుద్ధం ముందు ఉంది. ''భవిష్యత్తుపై ఆశతో ఎదురు చూస్తున్నాం'' అన్నారా వైద్యులు.

‘ఒక్కటే భద్రత కిట్... అదే అందరూ మార్చుకోవాల్సి వస్తోంది’
మరోవైపు తెలంగాణ జూనియర్ వైద్యులు ఆరోగ్య మంత్రికి ఒక వినతిపత్రం ఇచ్చారు. మిగిలిన్న అన్ని విభాగాల్లో ఔట్ పేషెంట్లను చూడటం రద్దు చేసి అక్కడి వైద్యులను కూడా అత్యవసర సేవలకు వినియోగించాలని వారు కోరుతున్నారు. దీనివల్ల వ్యాధికి దగ్గరగా ఒకే వైద్యులు ఎక్కువ సేపు ఉండే అవకాశం తగ్గుతుంది.
ఆసుపత్రుల్లో ఉన్న అందరికీ సరిపడా వ్యక్తిగత భద్రతా పరికరాలు, మూడు పొరలున్న మాస్కులు డాక్టర్లకే కాకుండా, అటెండర్లు, శుభ్రం చేసేవారు, నర్సులకు కూడా ఇవ్వాలని వారు కోరారు. రోగులకు చికిత్స అందిస్తున్న ఫీవర్ ఆసుపత్రిలో కనీస వసతులు చర్యలు తీసుకోలేదని ఈ సంఘం ఆరోపిస్తోంది.
ఇంటర్న్‌షిప్ చేసే వైద్యులతో చికిత్స అందిస్తున్నారనీ, ఉన్న ఒకే ఒక్క వ్యక్తిగత భద్రతా కిట్‌ను అందరూ మార్చి మార్చి వేసుకోవాల్సి వస్తుందనీ వారు ఆరోపించారు.
వరంగల్ ఎంజీఎంలో పనిచేస్తున్న వైద్యులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కూడా జూనియర్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. రెసిడెంట్ డాక్టర్లు ఉండే హాస్టల్‌ను ఐసొలేషన్ వార్డుగా చేశారు. దీంతో డాక్టర్లు వేరే చోటు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, EPA
'మా ఇళ్లు కూడా ఖాళీ చేయిస్తున్నారు...'
తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియాలో వివరించారు ఎంజీఎంలో చదువుతున్న ఒక డాక్టర్. తాను ఉంటున్న ఇంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారని ఆ డాక్టర్ తన పోస్టులో ఆరోపించారు. కరోనా వైరస్ ఉన్న రోగుల దగ్గరకు ఈ డాక్టర్ వెళ్తారన్న అనుమానమే ఇందుకు కారణం.
కనీస వ్యక్తిగత రక్షణ కిట్లు, పరికరాలు లేకుండా పనిచేయాల్సి వస్తోందని ఆ డాక్టర్ విమర్శించారు. డాక్టర్ల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి ప్రయోజనం ఏముందని ఆయన ప్రశ్నించారు.
వైద్యులు వ్యక్తిగత రక్షణ పరికరాలపై చేసిన ఆరోపణలపై వివరణ కోసం ప్రయత్నించగా, వైద్య ఆరోగ్య మంత్రి, అధికారులు స్పందించలేదు.

ఫొటో సోర్స్, ANUWAR ALI HAZARIKA / BARCROFT MEDIA VIA GETTY IMA
‘130 కోట్ల మందికి 90 పరీక్షా కేంద్రాలు...’
బీహార్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఎవరికైనా ఒకరికి కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే.. వైద్య పరీక్షలు చేయించుకోవటానికి కనీసం 250 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం రెండు నగరాల్లో మాత్రమే కరోనావైరస్ పరీక్షలు నిర్వహించే వీలు ఉంది. మొత్తం 13 కోట్ల మంది జనాభా ఉన్న బీహార్‌లో రెండంటే రెండు కరోనావైరస్ పరీక్షా కేంద్రాలు. బీహార్ కంటే సంపన్నమైన తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే ఉంది.
మొత్తం 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కరోనావైరస్ పరీక్షా కేంద్రాలు, వైరస్ సోకిన వారికి వైద్యం చేసే ఆస్పత్రులు సుమారు 90 ఉన్నాయి. మరో 27 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
ఈ వైరస్ మీద ముందుండి పోరాడుతున్న డాక్టర్లలో ఈ పరిస్థితుల విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్95 మాస్కులు, గ్లవ్స్ వంటి కనీస సదుపాయాలకు కూడా కొరత ఉందని.. దానికి సాయం చేయాలని కోరుతూ కొంత మంది డాక్టర్లు, నర్సులు సోషల్ మీడియాలో కోరటంలో ఆశ్చర్యం లేదు.
లక్నోలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌లో పనిచేసే శశి సింగ్.. తమ ఆస్పత్రిల్ కనీస సదుపాయాలు లేని విషయాన్ని ఫేస్‌బుక్ వీడియోలో వెల్లడించారు. డాక్టర్లు, నర్సులకు అవసరమైన పరికరాలు, మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు.
మరో డాక్టర్ దేబబ్రత మహాపాత్ర.. ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
‘చప్పట్లు కాదు, సదుపాయాలు కావాలి...’
కరోనావైరస్ మీద పోరాడుతున్న వైద్యులకు గౌరవసూచకంగా గత ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ పాటించటం పట్ల కొంతమంది డాక్టర్లు వ్యంగ్యంగా స్పందించారు.
కరోనావైరస్ మీద పోరాడటానికి తమకు రక్షణ పరికరాలను అందించాలని, మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని చాలా మంది వైద్యనిపుణులు డిమాండ్ చేశారు.
ఈ అంశాలపై బీబీసీ దేశ వ్యాప్తంగా.. కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న, ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు డాక్టర్లతో మాట్లాడింది.
ఆ డాక్టర్లు తాము గత కొన్ని వారాలుగా 24 గంటలూ నిర్విరామంగా పనిచేస్తున్నామని చెప్పారు.
''మేం ఎనిమిది గంటల షిఫ్టులో పనిచేశాం. ఆ తర్వాత ఎనిమిది గంటలు మేం ఏకాంతంగా గడిపాం'' అని ముంబైలోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్ ఫర్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌లోని కరోనావైరస్ వార్డుల్లో పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్ యష్ శభర్వాల్ తెలిపారు.
దిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌లో ఏర్పాటుచేసిన కరోనావైరస్ వార్డుల్లో పనిచేసే కొంతమంది డాక్టర్లు కూడా.. పరికరాలు తక్కువగా ఉన్నాయని, డాక్టర్లకు తగిన విశ్రాంతి లభించటం లేదని ఫిర్యాదు చేశారు. తాము గత 20, 25 రోజులుగా విరామం లేకుండా పనిచేస్తున్నామని.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు.
టెస్ట్ సెంటర్ల సంఖ్యను, వాటిలో సదుపాయాలను పెంచటానికి ప్రభుత్వం పని చేస్తోంది. రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘‘కేవలం 500 మంది రోగులకే ఇంత హైరానా ఎందుకు?’’
అయితే.. డాక్టర్లు అనవసరంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారని కొందరు పరిశీలకులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది డాక్టర్లు ఎంతగా ఫిర్యాదులు చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని దిల్లీకి చెందిన ఒక రిటైర్డ్ వైద్యుడు బీబీసీతో పేర్కొన్నారు.
''వాళ్లు మూడు నెలల్లో కేవలం 18 వేల నుంచి 19 వేల మందిని మాత్రమే పరీక్షించారు. మొత్తం 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కేవలం 500 మంది రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ వేలాది మంది రోగులకు చికిత్స చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది?'' అని ఆయన వ్యాఖ్యానించారు.
డాక్టర్ల సహనంగా వ్యవహరించాలని, గొడవ చేయకుండా తమ విధులు నిర్వర్తించాలని ఆయన సలహా ఇచ్చారు.

ఫొటో సోర్స్, EPA
కేసులు పెరిగిపోతే ఎదుర్కొనే సామర్థ్యం ఏదీ?
కానీ.. ఫిర్యాదు చేస్తున్న డాక్టర్లతో చాలా మంది జనం ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి.. భారతదేశం మార్చి 19వ తేదీ వరకూ వైద్య పరికరాలను ఎగుమతి చేయటం కొనసాగించటంలో భారత ప్రభుత్వం విజ్ఞతను ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఈ విమర్శలతో ఇబ్బందిపడిన ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసింది. అయినప్పటికీ.. చైనా ప్రజలకు సుహృద్భావ సూచనగా ఊహాన్ నగరానికి వైద్య పరికరాలను భారతదేశం పంపించింది.
ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు కానీ.. రాబోయే రోజులు, వారాల్లో దేశంలో కరోనావైరస్ కేసులు వేగంగా పెరిగిపోతాయని స్వయంగా ప్రధానమంత్రి కూడా భయపడుతున్నారని అభిజ్ఞవర్గాలు చెప్తున్నాయి.
జనతా కర్ఫ్యూ పాటించాలన్న మోదీ పిలుపుకు, అనంతరం లాక్‌డౌన్ విషయంలో అధికారులు తీవ్రంగా అమలుచేయటానికి ప్రయత్నించటం అతి ప్రతిస్పందన కాదు. అది ప్రణాళిక ప్రకారమే జరిగింది. మహమ్మారిని ఎదుర్కొనే చర్యలను తీవ్రతరం చేయాలని మోదీ తన మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలను చాలా బలంగా కోరారు.
ప్రభుత్వం సరైన సమయంలో స్పందించిందని కొందరు భావిస్తుంటే.. ఈ చర్యలను ఒక వారం, పది రోజుల ముందుగానే చేపట్టి ఉండాల్సిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షమేమో.. మోదీ ప్రభుత్వం కరోనావైరస్‌ను ఎదుర్కోవటానికి పటిష్ట ప్రణాళికను రచించటం కన్నా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టటంలో తలమునకలైపోయిందని విమర్శిస్తోంది.
చాలాబలహీనంగా ఉన్న ఆరోగ్యరక్షణ వ్యవస్థను వేగంగా బలోపేతం చేయటానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని చాలామంది ఆరోగ్యనిపుణులు, వైద్యులు నిరీక్షిస్తున్నారు. సమీప భవిష్యత్తులో కరోనావైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం ప్రస్తుత వైద్య వ్యవస్థకు లేదని వారు భావిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచమంతా ఇంట్లో ఉంటే... వీళ్ళు బీచ్‌లో ఏం చేస్తున్నారు?
- తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అధికారులు
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- ఈ కుర్రాడు రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్...
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








