తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అధికారులు

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో దర్శనాలకు అనుమతి లేకపోవడంతో జన సంచారం బాగా తగ్గిపోయింది. కేవలం టీటీడీ ఉద్యోగులు, కొందరు స్థానికులు మినహా ఎవరూ తిరుమలలో లేరు. దీంతో ఆలయ ప్రాంగణం, ఘాట్ రోడ్లు అన్నీ బోసిపోయాయి. దీంతో తిరుమలలో అడవి జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే చిరుత పులుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని టీటీడీ అటవీ విభాగం అధికారులు చెబుతున్నారు. జంతువులు తిరుగుతుండడంతో స్థానికులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏటా వేసవిలో సాధారణమే..
శేషాచలం కొండల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో 2,280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. 25 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతం అనేక రకాల జంతువులకు అవాసం.
అందులో ప్రధానంగా నాలుగు రకాల జింకలు, ఎలుగు బంట్లూ, చిరుతలు, ఏనుగులు, పునుగు పిల్లులు, ముళ్ల పందులు వంటివి ఉన్నాయి.

ఏటా వేసవి కాలంలో వాటిలో కొన్ని జంతువులు అడవి నుంచి బయటకు వస్తుంటాయని టీటీడీ సహాయక పౌర సంబంధాల అధికారిణి నీలిమ బీబీసీకి తెలిపారు.
"వేసవిలో ముఖ్యంగా తాగునీటి కోసం కొన్ని జంతువులు రోడ్డు మీదకు వస్తూ ఉంటాయి. ఇంకొన్ని సార్లు ముల్లగుంట, కల్యాణ వేదిక వంటి పరిసరాల్లో కనిపిస్తాయి.
దానికి తగ్గట్టుగా రాత్రి సమయాల్లో కాలినడకన వెళ్ళే భక్తులకు రక్షణ నిమిత్తం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం.
తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి 11 నుంచి వేకువన 4 గంటల మధ్య ద్విచక్ర వాహనాలకు.. రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య మిగతా వాహనాలకు అనుమతి ఉండేది కాదు. భక్తుల భద్రతకు ప్రమాదం లేకుండా చూడడంతో పాటు జంతువులకూ ఇబ్బంది రాకుండా ఈ ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు కరోనావైరస్ భయం నేపథ్యంలో స్థానికుల భద్రత కోసం తిరుమల ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్రవాహనాలకు, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మిగతా వాహనాలకు ప్రవేశం నిలిపివేశాం’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, TIRUMALA.ORG
స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అటవీ అధికారులు
ఏటా మే నెలలో ఎక్కువగా జంతువులు అడవి నుంచి బయటకు వచ్చిన ఘటనలు నమోదవుతున్నట్టు టీటీడీ ఫారెస్ట్ రేంజర్ శివ కుమార్ తెలిపారు.
ఈసారి భక్తుల రాకపోకలు లేకపోవడం, వాహనాల శబ్దాలు కూడా లేకపోవడంతో జంతువులకు అవకాశంగా మారినట్టు చెబుతున్నారు.
అయన బీబీసీ తో మాట్లాడుతూ "రాత్రి సమయంలో చిరుతలు, ఎలుగుబంట్లు బయటకు వస్తున్నట్లు సమాచారం ఉంది. కల్యాణవేదిక, ముల్లగుంటలో చిరుత సంచారానికి సంబందించిన ఆనవాళ్లు ఉన్నాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఎలుగుబంటి తిరుగుతోందని సమాచారం ఉంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, TIRUMALA.ORG
‘‘ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో ఘాట్ రోడ్డులో వాహనాలను నిలిపివేశారు.
స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించాం. ముందు జాగ్రత్తలు తప్పవు. మళ్లీ భక్తుల రాకపోకలు మొదలయితే కొంత తగ్గుతాయి. ఇప్పటికే జంతువులకు తాగు నీటి ఏర్పాట్లు చేశాం" అని శివకకుమార్ వివరించారు.
తిరుమల కొండల్లో ప్రస్తుతం జంతువులు స్వేచ్ఛగా తిరుగాడుతుండడంతో అలిపిరి సమీపంలోని తిరుపతి వాసులూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.


- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- కరోనావైరస్: ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు ఏం చేశాయి?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్
- ఫేస్‌బుక్ పరిచయంతో ప్రేమ జంటగా మారిన ఒక అంధ జంట
- కరోనావైరస్ అప్డేట్: భారత్‌లో 360 కేసులు, 7 మరణాలు; ప్రపంచవ్యాప్తంగా 3,00,000లు దాటిన బాధితులు
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్: ముంచుకొస్తున్న ఈ సునామీ నుంచి భారత్ తప్పించుకోగలదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









