కరోనావైరస్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాక్‌డౌన్... అత్యవసర సేవలకు మినహాయింపు, తెలంగాణలో 27, ఏపీలో 6కు చేరిన కరోనా కేసులు

కేసీఆర్, జగన్

ఫొటో సోర్స్, facebook/telanganacmo/apIandPr

రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో ఈరోజు వరకు 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ మీడియా బులెటిన్ విడుదల చేశారు. అంటే, ఈ ఒక్క రోజే 6 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం మరో కేసు వెలుగు చూడడంతో కరోనా బాధితుల సంఖ్య 6కు చేరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆంధ్రప్రదేశ్‌లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చి 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆపివేస్తున్నట్లు చెప్పారు.

నిత్యవసర, అత్యవసర సరకులు రవాణా చేసే వాహనాలు.. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

ఇదీ సాయం

మార్చి 29నే రేషన్ కార్డుదారులందరికీ సరకులు, అదనంగా కేజీ కందిపప్పు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఏప్రిల్ 4న ప్రతి తెల్లరేషన్ కార్డుదారుకూ రూ.వెయ్యి ఇస్తామన్నారు.

ఇది చిన్న సాయమేనని.. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

ధరలు పెంచితే దండనే

ప్రజలు నిత్యవసర సరకులు, మందుల కోసమే బయటకు రావాలన్నారు.

ఇదే అదనుగా ఎవరైనా సరకుల ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కూరగాయలు, ఇతర నిత్యవసరకుల ధరలను కలెక్టర్లు ప్రకటిస్తారని.. ఆ ధరల కంటే ఎక్కువ మొత్తానికి విక్రయిస్తే కేసులు పెడతామన్నారు.

కలెక్టర్లు ఇచ్చే అడ్వర్టయిజ్‌మెంట్లలో టోల్ ఫ్రీ నంబర్ ప్రకటిస్తారు.. దానికి ఫిర్యాదు చేస్తే చాలన్నారు.

పది మంది దాటి గుమిగూడొద్దు

ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడా 10 మందికి మించి గుమిగూడరాదన్నారు.

బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున దానికి మినహాయింపు ఇస్తున్నామన్నారు.

పదేళ్ల లోపు చిన్నారులు, వయోధికులు బయటకు వెళ్లొద్దని సూచించారు.

ఏపీ మెరుగ్గా ఉంది..

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని ఏపీ సీఎం జగన్ చెప్పారు.

‘‘దేశవ్యాప్తంగా 341 కేసులు నమోదైతే.. ఏపీలో 6 కేసులే నమోదయ్యాయి. అందులోనూ ఒక కేసు నయమైంద’’న్నారు..

వలంటీర్ల వ్యవస్థ సహాయంతో విదేశాల నుంచి వచ్చిన 11670 మంది వివరాలు తెప్పించి 10091 మందిని హోం ఐసోలేషన్లో ఉంచినట్లు చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటీన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో 200 పడకలతో అత్యున్నత స్థాయి వైద్యం అందించే కేంద్రాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

పది, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతధం

విద్యార్థుల కెరీర్ దృష్ట్యా పరీక్షల నిర్వహణ యథాతధంగా కొనసాగుతుందని చెప్పారు.

అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, ప్రజలు గుమిగూడే అన్ని ప్రదేశాలు మార్చి 31 వరకు మూసేయాలని ఇప్పటికే ఆదేశించాం.

ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లోకి వచ్చామన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

తెలంగాణలో..

జనతా కర్ఫ్యూ ఈ రోజు పాటించినట్లుగా మార్చి 31 వరకు తెలంగాణ ప్రజలంతా ఇళ్లకు పరిమితమైతే కరోనావైరస్‌పై విజయం సాధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు.

‘నిత్యవసరాల కోసం కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావడానికి అనుమతి’

‘‘నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కుటుంబానికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకున్నప్పుడు రెండుమూడు రోజులకు సరిపడేలా ఒకేసారి తెచ్చుకోవాలి.

87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు 12 కేజీల చొప్పున వీలైనంత త్వరగా బియ్యం అందిస్తాం.

రూ.1103 కోట్ల విలువైన 3,36,000 టన్నుల పైచిలుకు బియ్యం వీరికి ఉచితంగా పంపిణీ చేస్తాం.

నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి వీలుగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 చొప్పున నగదు అందిస్తాం.

రూ. 1314 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ నిధులన్నీ తక్షణం ప్రభుత్వం విడుదల చేస్తుంద’’ని చెప్పారు.

20 శాతం ఉద్యోగులతో పనిచేయనున్న కార్యాలయాలు

విద్యుత్, ఆరోగ్య, అగ్నిమాపక వంటి అత్యవసర సర్వీసుల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని.. మిగతా అన్ని శాఖల వారు 20 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరుకావాలని చెప్పారు. దీనికి రొటేషన్‌ పద్ధతి అమలు చేస్తారని కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బార్లు, పబ్‌లు ఇప్పటికే మూసివేసినట్లు చెప్పారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, I&PR Telangana

ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి

అంటురోగాల నివారణ చట్టం ప్రకారం ఈ లాక్‌డౌన్ కాలంలో కూడా ప్రయివేటు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులు అందరికీ యాజమాన్యాలు జీతాలు చెల్లించాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తున్నామని.. అయితే, పిల్లలకు ఇబ్బందులు లేకుండా వారికి సరకులు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

గర్భిణుల కాన్పు కోసం ఏర్పాట్లు

ఈ నెల, వచ్చే నెలలో ప్రసవించాల్సిన గర్భిణుల వివరాలు సేకరిస్తున్నామని.. వారికి ఆసుపత్రులకు తేవడం, కాన్పులు చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రజారవాణా బంద్

ప్రజారవాణా పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్ని సర్వీసులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేసీఆర్ అన్నారు.

ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలంతా స్వీయ నియంత్రణలు పాటించాలని, మనల్ని మనం రక్షించుకోవడానికి సమాజమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితం కావాలన్నారు.

తెలంగాణకు మిగతా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

నిత్యవసర, అత్యవసర సరకులు తెచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారని కేసీఆర్ తెలిపారు.

‘ఇటలీలా స్వయంకృతాపరాధం వద్దు.. స్వీయ నియంత్రణ పాటించండి’

ప్రస్తుతం ప్రపంచంలో ఇటలీ ఈ కరోనావైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిందని, రోజూ వందలాది మంది చనిపోతున్నారని.. వైరస్ ఆ దేశంలో వ్యాపించడం మొదలైనప్పుడు ప్రజలు ఆషామాషీగా తీసుకోవడం, ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టడం వల్ల నష్టపోయారని.. మనం అలా కాకుండా స్వీయ నియంత్రణతో ఈ విపత్తు నుంచి బయటపడదామన్నారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమైన తరువాత తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నివారణ చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంది.

విద్యాసంస్థలు, ప్రజలు గుమిగూడే అవకాశమున్న అన్ని ప్రదేశాలు మూసివేయడమే కాకుండా వివాహాలు, ఇతర వేడుకలపైనా నియంత్రణ విధించింది.

తొలుత తెలంగాణలో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన పాజిటివ్ కేసులే వెలుగుచూసినప్పటికీ ఇప్పుడు వారి నుంచి స్థానికులకూ వైరస్ సోకడం ఇది మరింత తీవ్రం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలకు ఉపక్రమించింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

ప్రగతి భవన్‌లో చప్పట్లు

మరోవైపు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ చప్పట్లు కొట్టారు.

మంత్రులు, అధికారులు, మీడియా ప్రతినిధులూ చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.

ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త జనతా కర్ఫ్యూని సోమవారం ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)