డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు

కార్డు ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, కమలేష్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇప్పటివరకూ డెబిట్, క్రెడిట్ కార్డు జారీ చేయగానే వాటిని ఆన్‌లైన్ లావాదేవీలకు ఉపయోగించడం మొదలుపెట్టేవారు. కానీ, ఇక నుంచి అలా చేయడం కుదరదు.

భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త నిబంధనల ప్రకారం, 2020 మార్చి 16 నుంచి బ్యాంకులు కొత్తగా జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆన్‌లైన్ లావాదేవీల సౌకర్యాన్ని డిజేబుల్ (పనిచేయకుండా) చేస్తారు.

ఆ కార్డులతో ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చు. కానీ, ముందుగా వారు ఆ సౌకర్యాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త కార్డులో కేవలం రెండు సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. ఒకటి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, రెండోది పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) డివైస్‌ కోసం ఉపయోగించడం.(దీనినే కార్డ్ స్వైప్ చెల్లింపులు అంటారు)

అలాగే, డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎవరైనా ఇప్పటివరకూ తమ కార్డు ఉపయోగించి ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు చేయకపోతే, వారి కార్డులకు కూడా ఆ సౌకర్యం డిజేబుల్ అవుతుంది. వారు కూడా దీనిని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ సౌకర్యం ద్వారా కార్డు వినియోగదారులు తమకు కావాల్సినప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు, లేదంటే ఆపివేసుకోవచ్చు.

ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులకు ఈ సౌకర్యం అలాగే కొనసాగుతుంది. కానీ, వారికి వద్దనుకున్నప్పుడు నిలిపివేసే ప్రత్యామ్నాయం ఉంటుంది.

కానీ, ఆన్‌లైన్ లావాదేవీల సౌకర్యం కోసం వినియోగదారులకు మూడు ప్రత్యామ్నాయాలు ఇస్తారు. మొదటిది కార్డ్ నాట్ ప్రెజెంట్(దేశీయ, అంతర్జాతీయ) లావాదేవీలు, రెండోది కార్డ్ ప్రెజెంట్(అంతర్జాతీయ) లావాదేవీలు, మూడోది కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు.

కార్డు ఉన్నవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్), ఏటీఎం, 24 గంటల హెల్ప్ లైన్ సౌకర్యం ద్వారా ఆన్‌లైన్ లావాదేవీల సౌకర్యాన్ని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు.

ఈ సౌకర్యం బ్యాంకు శాఖలు/కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

కార్డు ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్

ఫొటో సోర్స్, AFP

ఈ నిబంధనలు ఎందుకు?

దీనిని అన్ని బ్యాంకులూ అమలు చేసేలా 2020 జనవరి 15న ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

భారత్‌లో డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య కోట్లలో ఉంటుంది. వారిపై ఈ నిబంధనల ప్రభావం ఉండవచ్చు.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం, 2019 మార్చి 31 వరకూ భారత్‌లో 92 కోట్ల 50 లక్షల డెబిట్ కార్డులు, 4 కోట్ల 70 లక్షల క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. డెబిట్ కార్డుల విషయంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన చెల్లింపుల్లో 25 శాతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే జరిగాయని ఆర్బీఐ డేటా చెబుతోంది.

కానీ, లావాదేవీల భద్రత కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. కార్డు వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ ఉద్దేశమని చెప్పింది.

కానీ, కొత్త నిబంధనల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుంది?

బ్యాంకింగ్ నిపుణులు అభినవ్ వాటి గురించి వివరంగా చెప్పారు.

"డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల్లో రకరకాల మోసాలు జరుగుతాయి. ఈ మోసాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అందుకే, ఆర్బీఐ ఈ నిబంధనలు మోసగాళ్ల నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి సహకరిస్తాయి" అని ఆయన వివరించారు.

కార్డు ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్

ఫొటో సోర్స్, Getty Images

"ప్రస్తుతం ఒకరి కార్డుతో మరొకరు ఆన్‌లైన్ లావాదేవీలు చేయగలుగుతున్నారు. హోటల్ బుకింగ్ నుంచి ఏదైనా వస్తువు కోసం చెల్లింపుల వరకూ కార్డు నంబర్ ఉంటే చాలు. అలాంటి సమయంలో కార్డు నంబర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఆ కార్డు నిజంగా అతడిదేనా అనేది తెలుసుకోవడం చాలా కష్టం" అని అభినవ్ అంటారు.

"ఆన్‌లైన్ మోసగాళ్లు కార్డు నంబర్, ఓటీపీ కూడా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కార్డులు ఉన్నవారి డేటా కూడా అక్రమంగా అమ్ముడవుతోంది. అప్పుడు నేరగాళ్లకు ఒక్క ఓటీపీ మాత్రమే అవసరం అవుతుంది. ఎందుకంటే కార్డు నంబర్, సీవీవీ నంబర్లను మోసగాళ్లు ముందే సేకరిస్తున్నారు. మనం ఓటీపీ చెప్పగానే తమ దగ్గర సమాచారం ఉపయోగించి వారు ఆన్‌లైన్‌లో డబ్బు కాజేస్తారు."

"ఇక్కడ సమస్య ఏంటంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. కానీ, వారిలో చాలా మందికి కార్డుతో డబ్బులు తీసుకోవడం, జమ చేయడం మాత్రమే తెలుసు. చాలా మందికి ఆన్‌లైన్ చెల్లింపుల గురించి తెలీదు. వారిలో ఆర్థిక నిరక్షరాస్యత ఎక్కువ. అందుకే, వారు సులభంగా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ కార్డు ఆపేస్తున్నామని చెప్పగానే, వారు భయపడిపోయి మొత్తం సమాచారం ఇచ్చేస్తారు. కానీ కొత్త నిబంధనల వల్ల అలాంటివారిని టార్గెట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది" అని చెప్పారు.

"ఇప్పుడు కార్డుతో ఎప్పుడూ ఆన్‌లైన్ లావాదేవీలు జరపని వారి ఆన్‌లైన్ లావాదేవీలు డిజేబుల్ చేస్తే, కార్డు నంబర్, ఖాతా సంబంధిత సమాచారం ఉన్నప్పటికీ మోసగాళ్లు దానిని దుర్వినియోగం చేయలేరు. ఆ కార్డును ఆన్‌లైన్ లావాదేవీలకు ఉపయోగించాలంటే, కార్డుదారుడు మొదట ఆ సౌకర్యాన్ని అనేబుల్ చేయాల్సి ఉంటుంది" అని అభినవ్ వివరించారు.

కార్డు ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్

ఫొటో సోర్స్, Thinkstock

ఆన్‌లైన్ లావాదేవీలు చేసేవారికి మంచిదే

దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నా, వాటిని ఆన్‌లైన్ లావాదేవీలకు ఉపయోగించేవారు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో వృద్ధులు. కానీ, వీరు ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారి కార్డులకు ఆన్‌లైన్ లావాదేవీలు డిజేబుల్ చేయడం వల్ల అవి దుర్వినియోగం కావు.

ఆన్‌లైన్ చెల్లింపులకు కార్డ్ వాడేవారికి కూడా ఈ నిబంధనతో ప్రయోజనం ఉంది. ఎవరి దగ్గరైనా ఒకటికి మించి కార్డులు ఉంటే, వారు ఒక్క కార్డునే ఆన్‌లైన్ లావాదేవీలకు ఉపయోగించి, మిగతా కార్డులకు ఆ సౌకర్యాన్ని డిజేబుల్ చేయవచ్చు. దానివల్ల కార్డు సంబంధిత సమాచారం ఉన్నా, ఎవరూ దానిని ఉపయోగించలేరు.

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ఆన్‌లైన్ మోసాలను అడ్డుకోవడం బ్యాంకింగ్ వ్యవస్థకు ఒక పెను సవాలుగా మారింది.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2018-19లో డెబిట్/క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసపోయినట్లు 921 కేసులు నమోదయ్యాయి. గత కొన్నేళ్లుగా నమోదవుతున్న ఇలాంటి కేసులు కొన్ని వేలల్లో ఉన్నాయి.

వీటిని ఎదుర్కోడానికి భారత రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ నిబంధనలు మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఓటీపీ ఎవరికీ చెప్పవద్దని సందేశాలు కూడా పంపిస్తూ ఉంటుంది.

ఆర్బీఐ కొత్త నిబంధన వల్ల భయపడాల్సిందేమీ లేదని, దీనిని వినియోగదారుల భద్రత కోసమే అమలు చేశారని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)