తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం

కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానాన్ని పంపుతామని, దీనిపై మరోసారి సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు చేస్తున్నారని దీనిపై చర్చ సందర్భంగా కేసీఆర్ అన్నారు.

"ఇప్పటికే పార్లమెంటులో టీఆర్ఎస్ తన నిర్ణయం చెప్పింది. సీఏఏను దేశంలోని ఏడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి, దానికనుగుణంగా తీర్మానం చేశాయి. దేశవ్యాప్తంగా దీన్ని ఎంతోమంది వ్యతిరేకించారు. దీన్ని పునః సమీక్షించమని చెప్పారు. ఈ బిల్లు అనేక ఆందోళనలను సృష్టిస్తోంది" అని కేసీఆర్ అన్నారు.

"ఈ చట్టాన్ని మేం గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. అన్నీ అర్థం చేసుకొని, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే దీన్ని వ్యతిరేకిస్తున్నాం.

అమెరికా అధ్యక్షుడు దీల్లీ పర్యటనలో ఉండగా అక్కడ అనేక మంది చనిపోయారు. కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు" అని కేసీఆర్ అన్నారు.

ఈ దేశానికి ఈ చట్టం అవసరం లేదని, రాక్షసానందం పొందుతూ ఈ చట్టం అమలు చేయనవసరం లేదని సభలో ఆయన తెలిపారు.

ఇది హిందూ, ముస్లిం సమస్య కాదని దేశ సమస్య అని ఆయనన్నారు.

"నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాలు లేవు. నిన్ను ఎవరు బర్త్ సెర్టిఫికెట్ అడిగారు అని నన్ను అంటున్నారు. ఒక్క మాట అడుగుతా.. దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ లేదు, వారి పరిస్థితి ఏంటో కేంద్రం సమాధానం చెప్పాలి" అని కేసీఆర్ అన్నారు.

"ఏదైనా జాతీయ గుర్తింపు కార్డు ఇస్తామంటే, దానికి మేం మద్దతిస్తాం. ఈ దేశం తమ సంక్షేమానికే పనిచేస్తోందని ప్రజలు భావించాలి. దేశవ్యాప్తంగా అనేకమంది ఆందోళన చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని, దీనిపై పునరాలోచించాలి. ఈ చట్టంపై పునఃసమీక్ష జరగాలి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలి" అని తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

అక్బరుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, FACEBOOK/Akbaruddin Owaisi

అనంతరం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

ఈ చట్టం భారత్‌కు, దళితులకు, ఆదివాసీలకు వ్యతిరేకమని, స్పష్టంగా చెప్పాలంటే ఈ చట్టం పేద హిందువులకు కూడా వ్యతిరేకమని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

"నేను ఒక ముస్లిం అని చెప్పడానికి గర్విస్తున్నా. నేను ఒక భారతీయుడిని అని గర్వంగా చెబుతున్నా. కానీ నన్ను ముస్లింలాగే చూస్తున్నారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే. నన్ను ముస్లింగా చూడకండి, ఒక హిందూ ముస్లింగా చూడండి.

కానీ, నన్ను కేవలం ముస్లింగా చూస్తున్నారు. గోలీ మారో అంటారు, దేశద్రోహిగా చెబుతారు. పాకిస్తాన్ వెళ్లమంటారు. నేను ఈ దేశ పౌరుడిని, ఈ దేశంపై విశ్వాసం ఉన్నవాడిని, అవసరమైతే ఈ దేశం కోసం నా ప్రాణాన్నైనా అర్పిస్తాను. నా దేశం కోసం జరిగిన స్వతంత్ర్య పోరాటంలో హిందువులు, సిక్కులు, ముస్లింలు.. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు. ఈ దేశం అన్ని మతాల వారిది. కానీ, ఈరోజు ఈ చట్టం మన దేశాన్ని విభజిస్తోంది అని ఎంతో బాధగా చెబుతున్నా.

ఈ సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్ దేశాన్ని అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విభజించాయి. జామియా మిలియా విద్యార్థులపై దాడికి, జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడానికి, దిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోవడానికి, ఉత్తర్ ప్రదేశ్‌లో 23 మంది మృతికి ఈ చట్టం కారణం కాదా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా" అని అక్బరుద్దీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)