పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?

బంధం

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నిమ్మీ (పేరు మార్చాం) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. పదేళ్లుగా ఆమె దిల్లీలో ఉంటున్నారు.

బాయ్‌ఫ్రెండ్ గురించి అడిగితే... ‘‘చాలా మంది అయ్యారు. కానీ, నా కన్యత్వాన్ని మాత్రం పెళ్లాడబోయే వ్యక్తి కోసం దాచుంచా’’ అని ఆమె బదులిచ్చారు.

పెళ్లయ్యేవరకు కన్యగా ఉండాలని నిమ్మీ గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

అయితే, పెళ్లికి ముందు సెక్స్ సాధారణమని అభిప్రాయపడే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. 22-30 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ల మధ్య క్యాజువల్ సెక్స్ సహజమైన విషయమేనని నాతో చాలా మంది అన్నారు.

మరోవైపు గత 15 ఏళ్లుగా హైమనోప్లాస్టీ సర్జరీలు చేయించుకుంటున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

అడ్డగీత
News image
అడ్డగీత

యోనిలో హైమన్ పొర ఉంటుంది. దీన్ని ‘కన్నె పొర’ అని కూడా అంటుంటారు. అమ్మాయిలు తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ పొర చిరిగి, రక్తం వస్తుంది. కొందరు అమ్మాయిల్లో ఆడుకునేటప్పుడో, సైకిల్ తొక్కేటప్పుడో కూడా ఈ హైమన్ పొర చిరుగుతుంటుంది.

చిరిగిన హైమన్ పొరను తిరిగి ఎప్పటిలాగే మార్చే శస్త్ర చికిత్సే హైమనోప్లాస్టీ.

పెళ్లికి ముందు ఈ చికిత్స చేయించుకునేందుకు అమ్మాయిలు వస్తున్నారని, వారిలో ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువాళ్లు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

హైమనో‌ప్లాస్టీ చేసుకుంటున్న అమ్మాయిల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, మధ్య, అల్పాదాయ వర్గాలకు చెందినవాళ్లు ఉంటున్నారని గైనకాలజిస్ట్ భావన చౌధరీ చెప్పారు.

పెళ్లాడే వ్యక్తి‌కి తాము కన్య కాదన్న విషయం తెలియకూడదని వాళ్లు ఈ చికిత్స చేయించుకుంటున్నారని ఆమె చెప్పారు.

చికిత్స చేయించుకునేందుకు వస్తున్న అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారని... అక్కాచెల్లెళ్లు లేదా స్నేహితురాళ్లను తోడుగా పెట్టుకుని వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

టాంపాన్

ఫొటో సోర్స్, Thinkstock

హైమన్ పొర చిరగడానికి చాలా కారణాలుంటాయని భావన చౌధరీ చెప్పారు.

‘‘ఎక్కువగా ఆటలు ఆడేవారికి, గుర్రపు స్వారీ చేసేవారికి, రుతుస్రావ సమయంలో టాంపాన్స్ వాడేవారికి కూడా సెక్స్‌తో సంబంధం లేకుండా హైమన్ పొర చిరగొచ్చు’’ అని ఆమె చెప్పారు.

హైమనోప్లాస్టీ చేసుకునే వారిలో రెండు రకాల వాళ్లు ఉంటున్నారని గంగారాం ఆసుపత్రిలో సర్జన్ లలిత్ చౌధరీ అభిప్రాయపడ్డారు.

‘‘ఈ అమ్మాయిల్లో 80 శాతం మంది 25 ఏళ్లలోపు ఉండేవాళ్లే. వీళ్లు పెళ్లికి ముందు ఈ చికిత్స చేయించుకుంటారు. ఇంకో వర్గం విడాకులైనవాళ్లు. వీళ్ల సంఖ్య చాలా తక్కువ’’ అని ఆయన అన్నారు.

హైమనోప్లాస్టీ గురించి వివరాలు తెలుసుకునేందుకు, తమ ఆసుపత్రికి వారానికి నాలుగైదు ఫోన్ కాల్స్ వస్తుంటాయని ఆయన అన్నారు. ఇలా కాల్ చేసిన వారిలో చికిత్స చేయించుకునేవారి సంఖ్య 10 శాతం వరకూ ఉంటోందని లలిత్ చౌధరీ చెప్పారు.

‘‘డాక్టర్‌ని కలిసి మొదట సర్జరీ వివరాలు తెలుసుకుంటారు. పెద్ద ఆసుపత్రుల్లోనైతే ఈ సర్జరీకి 50-70 వేల వరకూ ఖర్చవుతుంది. కొందరేమో ఇలా వివరాలు తెలుసుకున్నాక, చిన్న క్లినిక్‌లకు వెళ్తుంటారు. వాటిలో ఖర్చు తక్కువ అవుతుంది. పేపర్ వర్క్ కూడా తక్కువ. పని గోప్యంగా జరిగిపోతుంది’’ అని లలిత్ అన్నారు.

సర్జరీకి అర గంట సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ, పెద్ద ఆసుపత్రుల్లో చికిత్సకు రెండు గంటల ముందే వచ్చి, పేపర్‌వర్క్ మొత్తం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్యులు లోకల్ లేదా జనరల్ అనస్తీషియా ఇచ్చి, హైమనోప్లాస్టీ చేస్తారు.

ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఐదారు గంటలు పడుతుంది.

పెళ్లి

ఫొటో సోర్స్, EPA

‘వివరాలు దాస్తారు’

దిల్లీలో హైమనోప్లాస్టీ చేయడం మొదలుపెట్టిన వైద్యుడిని తానేనని అపోలో ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్‌గా ఉన్న అనూప్ ధీర్ అన్నారు. ఆయనకు దిల్లీలో ఓ ప్రైవేట్ క్లినిక్ కూడా ఉంది.

తన వద్దకు హైమనోప్లాస్టీ కోసం వచ్చేవారిలో మూడింట ఒకవంతు హరియాణా అమ్మాయిలేనని అనూప్ చెప్పారు. ముస్లిం కుటుంబాలు, మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలోనే వస్తుంటారని అన్నారు.

చాలా మంది వాళ్ల వివరాలు దాస్తారని.. పేరు, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు తప్పుగా చెబుతారని అనూప్ అన్నారు.

‘‘ఎక్కువగా ఆ అమ్మాయిల స్నేహితురాళ్లు మమ్మల్ని సంప్రదిస్తుంటారు. సర్జరీ తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కూడా మాకు కష్టంగా ఉంటుంది’’ అని చెప్పారు.

పెళ్లికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు హైమనోప్లాస్టీ చేయించుకోవడం మేలని అనూప్ సూచిస్తున్నారు. చికిత్స తర్వాత సమస్యలేవీ ఉండవని, కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. సెక్స్‌, ద్విచక్ర వాహనాలు నడపడం, సైకిల్ తొక్కడం వంటివాటికి కొన్ని రోజులు దూరం ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.

హైమనోప్లాస్టీ కోసం వచ్చే అధికాదాయ కుటుంబాలకు చెందిన యువతుల్లో కొందరు తమ తల్లులను తోడుగా తెచ్చుకుంటున్నారని డాక్టర్ లలిత్ చౌదరీ చెప్పారు. ఇలాంటి విషయాల గురించి అమ్మాయిలు తమ తల్లులతో చర్చిస్తున్నారనడానికి ఇది సంకేతమని ఆయన అన్నారు.

లైంగిక సంబంధాల విషయంలో స్వేచ్ఛ కలిగిన మహిళ... పెళ్లాడబోయే వ్యక్తి ముందు కన్యత్వానికి రుజువులు చూపించాల్సి వస్తుండటం సమాజంలోని వింత పరిస్థితికి అద్దం పడుతోంది.

‘పవిత్రత’

ఎవరినీ తాకకుండా పవిత్రంగా ఉన్న అమ్మాయి భార్యగా రావాలని ఓ పురుషుడు ఆశించడం పితృస్వామ్య ఆలోచన ధోరణి ప్రభావమే.

అయితే, నిమ్మీలా పెళ్లి అయ్యే వరకూ కన్యగా ఉండాలనుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు.

బంధం

ఫొటో సోర్స్, Getty Images

కన్యత్వ పరీక్షలు

భారత్‌లోనే కాదు, చాలా దేశాల్లో మహిళల ‘పవిత్రత’ను కన్యత్వానికి లంకె పెట్టి చూడటం ఉంది.

సినిమాల్లో అత్యాచారానికి గురైన మహిళల గురించి.. ‘‘ఆమె శీలం పోయింది. ఆమె భర్త లేదా తండ్రి పరువు పోయింది’’ అని సంభాషణలు ఉంటాయి.

పేద, ధనిక, గ్రామాలు, నగరాలు.. ఇలా అన్ని వర్గాలూ కన్యత్వానికి ప్రాధాన్యతను ఇస్తున్నవే.

ఇదే అంశం గురించి ‘ఫెమినిజం ఇన్ ఇండియా’ వ్యవస్థాపకురాలు జేపలీన్ పస్రీచా మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో ‘డీఫ్లవర్’ అన్న పద ప్రయోగం గురించి ప్రస్తావించారు.

‘‘డీఫ్లవర్ అంటే అర్థం ఏంటి? అమ్మాయిలు పూవులా? ఎవరైనా తాకితే లేక సెక్స్‌‌లో పాల్గొంటే వాడిపోతారా?’’ అని ఆమె ప్రశ్నించారు. పరువు హత్యల్లోనూ పరువుకు అర్థం ‘మహిళ శరీరమే’ అని జేపలీన్ అన్నారు.

‘‘భారత సమాజంలో అమ్మాయికి పెళ్లి జరిగితే, కన్యత్వానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? మరి, ‘బ్రహ్మచారివేనా?’ అని అబ్బాయిని ఎవరైనా అడుగుతారా? చాలా ప్రాంతాల్లో తమ కోడలు పవిత్రురాలు అనే చెప్పేందుకు తొలి రాత్రి తర్వాత బెడ్ షీట్లను బయట ప్రదర్శించే సంస్కృతి ఉంది. ఆమెను ఇదివరకు ఎవరూ తాకకపోవడంపైనే తమ కుటుంబ పరువు ఆధారపడి ఉందని వాళ్లు చూపించుకుంటారు. భారత్‌లోనే కాదు, ఆఫ్రికాలోనూ ఇలా జరుగుతోంది’’ అని ఆమె అన్నారు.

మహారాష్ట్రలోని ఓ సంచార జాతిలో నూతన వధువులకు 'కన్యత్వ' పరీక్షలు చేసే ఆచారం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ వర్గంలో అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేసేయడం కూడా ఉంది.

మహిళ

ఫొటో సోర్స్, REBECCA HENDIN / BBC THREE

ఆ ఆలోచనా ధోరణే వల్లే...

అంతటా ఒత్తిడిని ఎదుర్కొనేది మహిళలేనని మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్న జాగృతి గంగోపాధ్యాయ్ అంటున్నారు.

‘‘ఓ పురుషుడితో సంబంధం పెట్టుకుంటే గర్భ నిరోధక మాత్రలు వేసుకోవాలి. పెళ్లి కోసం హైమనోప్లాస్టీ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆమె భర్తకు, అతడి కుటుంబానికి సొత్తులా మారాలి. తమ మానవ హక్కులను హరిస్తున్నారన్న విషయం కూడా మహిళలు తెలుసుకోలేకపోతున్నారు’’ అని జాగృతి అన్నారు.

యోని నుంచి కృత్రిమంగా రక్తం తెప్పించే క్యాప్సుల్స్ ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయని, జనాల ఆలోచన ధోరణే ఈ పరిణామానికి కారణమని ఆమె వ్యాఖ్యానించారు.

హైమనోప్లాస్టీ గురించే కాదు... యోనిని తెల్లగా, అందంగా మార్చే ఉత్పత్తుల గురించి కూడా ప్రకటనలు వస్తున్నాయి. కాన్పు తర్వాత మహిళ యోనిని బిగుతుగా మార్చేందుకు ‘హస్బండ్ స్టిచ్’ అన్న పేరుతో కుట్లు వేసే పద్ధతి కూడా ఉంది.

ఇప్పుడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు మహిళలు.

కానీ, కన్యత్వం విషయంలో కేవలం వాళ్లు మాత్రమే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)