పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?

సరోగసీ, మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన రెండో బిడ్డ పుట్టిన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.

ఆమె గతంలో 37 ఏళ్ల వయసులో తన తొలి బిడ్డకు జన్మనిచ్చినపుడు పిల్లల్ని కనడానికి ఒక వయసు ఉంటుందని, తాను ఇంత ఆలస్యంగా పిల్లల్ని కనాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. పిల్లల్ని కనాలనుకునేవారు తమ వయసును దృష్టిలో పెట్టుకోవాలని ఆమె కామెంట్ చేశారు.

అడ్డగీత
News image
అడ్డగీత

అయితే, ఈ కామెంట్‌కు మేఘన పంత్ అనే ఫెమినిస్ట్ రచయిత, జర్నలిస్టు తీవ్రంగా స్పందించారు.

"పిల్లల్ని ఏ వయసులోనైనా కనవచ్చు. అండాశయానికి కాల పరిమితి ఏమీ లేదు. కాల పరిమితి కేవలం ఆలోచనా ధోరణికి మాత్రమే ఉంటుంది" అంటూ మేఘన ట్వీట్ చేశారు.

"సారీ, శిల్పా శెట్టి! నేను మొదటి బిడ్డను 37 ఏళ్ల వయసులో, రెండో బిడ్డను 39 ఏళ్ల వయసులో కన్నాను. నాకు ఎటువంటి సమస్యలూ తలెత్తలేదు. మహిళలు ఒక నిర్ణీత వయసులోనే పిల్లల్ని కనగలరనే అర్థరహిత వాదనలను ప్రచారం చేయకండి" అని ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 73 ఏళ్ల వయసున్న ఒక మహిళ ఐవీఎఫ్ విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచారు.

ఈ నేపథ్యంలో పిల్లల్ని కనడానికి నిర్ణీతమైన వయసు ఉందా? అనే అంశం చర్చకు వచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటా 15- 19 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న సుమారు కోటీ 20 లక్షల మంది అమ్మాయిలు గర్భం దాలుస్తున్నారు.

అయితే, 15- 19 సంవత్సరాల వయసులో సంభవిస్తున్న మరణాల్లో అధిక శాతం ప్రసూతి మరణాలేనని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

శిశువు

ఫొటో సోర్స్, BERNIE_PHOTO

నెలసరి వస్తున్న స్త్రీలు ఎప్పుడైనా పిల్లల్ని కనవచ్చని అమెరికన్ కాలేజీ ఆఫ్ అబ్‌స్ట్రిషియన్స్ అండ్ గైనాకాలజిస్ట్స్ చేసిన ఒక అధ్యయనం పేర్కొంది. కానీ, పిల్లల్ని కనే సామర్ధ్యం 32 సంవత్సరాల తర్వాత క్రమంగా తగ్గిపోతూ వస్తుందని తెలిపింది.

ఆలస్యంగా పిల్లల్ని కనడం వలన పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ లాంటి సమస్యలు తలెత్తవచ్చని ఈ అధ్యయనం వివరించింది. ప్రీ ఎక్లాంప్సియా, జెస్టేషనల్ డయాబెటిస్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టే ప్రమాదం కూడా ఎక్కువేనని హెచ్చరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ధృవీకరించింది.

మంజుల అనగాని

ఫొటో సోర్స్, Manjula Anagani/FACEBOOK

ఫొటో క్యాప్షన్, డాక్టర్ మంజుల అనగాని

స్త్రీ వయసు పెరిగాక గర్భం ధరిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో గైనకాలాజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని బీబీసీకి వివరించారు.

30 ఏళ్ల వయసు దాటిన తర్వాత గర్భం దాల్చితే దానిని హై-రిస్క్‌గా పరిగణిస్తామని ఆమె చెప్పారు. అయితే, మారుతున్న కాలంలో చాలామంది ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వలన 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లల్ని కనేవారు ఎక్కువవుతున్నారని తెలిపారు.

వయసు పెరగడం వల్ల తల్లీ పిల్లలిద్దరికీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని మంజుల అంటున్నారు.

"పిల్లలు జన్యులోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. ప్రతి 45 మందిలో ఒకరికి ఇలా జరగవచ్చు. అలాగే అండాశయాలకు అండాన్ని విడుదల చేసే శక్తి తగ్గి, గర్భం నిలవడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ గర్భం దాల్చినప్పటికీ గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని ఆమె వివరించారు.

థైరాయిడ్, బీపీ, డయాబెటిస్ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవం తర్వాత ఈ లోపాలు కొనసాగుతాయా లేదా అనేది వారి లైఫ్ స్టైల్, శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు.

కొన్ని సమస్యలు వయసు పెరగడం వలన వస్తే, కొన్ని ఆలస్యంగా పిల్లల్ని కనడం వలన రావచ్చని చెప్పారు.

30 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉంటే తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పారు. వయసు పెరుగుతున్న కొద్దీ పెల్విక్ బోన్స్ బలహీనపడి సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలు తగ్గిపోవచ్చు.

ఈ సమస్య కేవలం మహిళలకే పరిమితం కాదు

పురుషుల్లో కూడా వయసు పెరిగాక పిల్లల్ని కంటే కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటాక పిల్లల్ని కంటే… పుట్టే పిల్లలకి ఐక్యూ స్థాయి తగ్గడం, పిల్లల్లో తగినంత మానసిక ఎదుగుదల లేకపోవడం వంటి పరిణామాలు తలెత్తవచ్చు.

తక్కువ బరువు, జన్యు లోపాలతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఆయుః ప్రమాణాలపై కూడా ప్రభావం పడొచ్చు.

వీర్యం

ఫొటో సోర్స్, Thinkstock

ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకుంటే...

ఒకవేళ ఆలస్యంగా పిల్లల్ని కనాలని అనుకుంటే గర్భం దాల్చక ముందే డాక్టర్ సలహా తీసుకోవాలి. ఏమైనా ఆరోగ్య లోపాలు ఉన్నాయా అని పరీక్ష చేయించుకోవాలి.

గర్భం దాల్చాక పిండంలో లోపాలుంటే తెలుసుకునేందుకు బేబీ అనామలీ టెస్ట్, ఎకో టెస్ట్ చేయించుకోవాలి.

స్త్రీ విడుదల చేసే అండాలని ఐవీఎఫ్ కేంద్రాలలో సంరక్షించి ఉంచితే ఎపుడు కావాలంటే అపుడు పిల్లల్ని కనవచ్చు. ఇది ఆరోగ్య సమస్యలని తగ్గించడానికి అందుబాటులో ఉన్న ఒక మార్గమని మంజుల అన్నారు.

20-30 సంవత్సరాల మధ్య వయసు శారీరకంగా పిల్లల్ని కనడానికి అనువైన సమయమని ఆమె చెప్పారు.

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్త్రీల పునరుత్పత్తి వయసుని 15 నుంచి 49 సంవత్సరాలుగా పేర్కొంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)