15 ఏళ్లకే మెనోపాజ్‌: ’ఇక నాకు పిల్లలు పుట్టరు'

రెండేళ్ల కిందటే అన్నెబెల్లె పీరియడ్స్ ఆగిపోయాయి

సాధారణంగా మహిళలకు 45 నుంచి 55 ఏళ్ల వయసులో మెనోపాజ్ దశలోకి వెళ్తారు. కానీ, అన్నెబెల్లేకు మాత్రం 15 ఏళ్లకే ఆ అనుభవం ఎదురైంది.

బ్రిటన్‌కు చెందిన అన్నెబెల్లేకు రెండేళ్ల క్రితం నెలసరి క్రమం తప్పింది. ఆ తర్వాత ఒళ్లంతా వేడి ఆవిర్లు (హాట్ ఫ్లషెస్) రావడం మొదలయ్యాయి. అలా కొన్నాళ్లకు పరిస్థితి మరింత దారుణంగా మారింది.

"ఒకరోజు సైన్స్ క్లాసులో ఉన్నాను. ఉన్నట్టుండి నా ఒళ్లంతా వేడెక్కి, ముఖమంతా ఎర్రగా మారిపోయింది. చెమటలు కారిపోతున్నాయి. మెనోపాజ్ దశకు చేరుకునే సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని మా టీచర్ చెప్పారు."

"మా టీచర్ చెబుతున్నది నిజమేనా? కాదా? అన్నది తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికాను. చాలా కథనాలు చదివాను. వాటిలోనూ చాలావరకు మా టీచర్ చెప్పినట్లుగానే ఉంది. దాంతో, అది నిజమవుతుందేమోనని భయపడ్డాను" అని గుర్తు చేసుకున్నారు ఈ టీనేజీ అమ్మాయి.

అన్నట్లుగానే కొన్నాళ్లకు అన్నెబెల్లే మెనోపాజ్ దశకు చేరినట్లు వైద్యులు చెప్పారు.

అమ్మాయి

ఫొటో సోర్స్, Anabelle

ఫొటో క్యాప్షన్, తల్లితో అన్నెబెల్లే

"నాకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదన్న విషయం తెలిసిన తర్వాత ఏడుపొచ్చింది. నా జీవితం ఇక ఇంతేనా? అని మానసికంగా కుంగిపోయాను. రాతల రూపంలో, చిత్రాల రూపంలో నాలోని భావాలను వ్యక్తం చేశాను" అని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

మెనోపాజ్ అంటే ఏమిటి?

ఇది మహిళలలో జరిగే శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది ఒక దశ. ఈ దశలోకి చేరేముందు కొన్ని నెలలు, సంవత్సరాల నుంచే నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంటుంది.

సాధారణంగా మహిళలకు 45-55 సంవత్సరాల వయసులో వరుసగా పన్నెండు నెలలు నెలసరి రాకుండా ఆగిపోతే దానిని "మెనోపాజ్" అంటారు.

Presentational grey line

కొన్ని లక్షణాలు:

  • కొంతమందిలో నెలసరి ఆగిపోతుంది
  • తొందరగా అలసిపోవడం
  • ఒళ్లంతా వేడి ఆవిర్లు రావడం(హాట్ ఫ్లషెస్), ఒళ్లంతా చెమటలు పట్టడం
  • రాత్రిళ్లు నిద్రలో ఒళ్లంతా చెమటలు పట్టి మెలకువ రావడం (నైట్ స్వెట్స్)
  • గుండెదడ
  • నిద్ర పట్టక పోవడం
  • మానసిక ఆందోళన, చిరాకు, కోపం, కుంగుబాటు, కారణం లేకుండా ఏడుపు రావడం
  • తలనొప్పి
  • శృంగారం మీద ఆసక్తి తగ్గడం
Presentational grey line

సమస్యలు

ముందస్తు మెనోపాజ్ దశకు చేరుకునే మహిళలకు పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వలన ఎముకల్లో కాల్షియం తగ్గి, అవి గుల్లబారి తొందరగా విరిగి పోతుంటాయి.

గుండెపోటు, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆధారం: బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్

Presentational grey line

20 ఏళ్లలోపు వయసున్న ప్రతి 10 వేల మంది మహిళల్లో ఒకరు మాత్రమే ముందస్తు మెనోపాజ్‌‌తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

90 శాతం కేసుల్లో ఈ సమస్యకు గల కారణాలను వైద్యులు కూడా గుర్తించలేకపోతున్నారు. అయితే, 50 ఏళ్ల మహిళల్లో అయినా, 15 ఏళ్ల బాలికల్లోనైనా మెనోపాజ్ లక్షణాలు ఒకేలా ఉంటున్నాయి.

అమ్మాయి

ఫొటో సోర్స్, Annabelle

అన్నెబెల్లేలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గిపోవడం వల్ల ఆమెలోని స్త్రీ బీజకోశాల్లో అండాల ఉత్పత్తి ఆగిపోయింది.

ముఖ్యమైన 'స్త్రీ' లక్షణాలు అభివృద్ధి చెందడంలో ఈస్ట్రోజెన్ హార్మోన్‌దే కీలక పాత్ర.

మెనోపాజ్ వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెఆర్‌టీ) చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో, ఆమె రోజూ ఒక పిల్ తీసుకుంటున్నారు.

అయితే, ఎప్పుడైనా మాత్ర వేసుకోవడం మరచిపోతే, మళ్లీ ఒళ్లంతా వేడి ఆవిర్లు వచ్చేస్తున్నాయని అన్నెబెల్లే అంటున్నారు.

అమ్మాయి

ఫొటో సోర్స్, Annabelle

ఫొటో క్యాప్షన్, అన్నెబెల్లే

మెనోపాజ్‌తో తన జీవితం ముగిసిపోదని, తాను కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపాలని ఈ యువతి నిర్ణయించుకున్నారు.

"ఎప్పుడూ బాధపడుతూ ఉండాలని అనుకోవట్లేదు. ప్రతికూల భావనలను దరిచేరనీయను. నా కంటే మరీ దారణమైన పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. నేనే అదృష్టవంతురాలిని అనుకుంటున్నా" అని అన్నెబెల్లే అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)