ఐవీఎఫ్: తమకు పుట్టిన పిల్లల్లో తమ లక్షణాలు లేవంటూ కేసు వేసిన దంపతులు

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

"ఐవీఎఫ్ ద్వారా మాకు పుట్టిన శిశువుల్లో మా లక్షణాలు లేవు" అంటూ ఆసియాకు చెందిన దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక సంతాన సాఫల్య కేంద్రంపై దావా వేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు ఆ క్లినిక్‌లో వైద్యులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.

న్యూయార్క్‌లో ఆ దంపతులు దావా వేశారని అమెరికా మీడియా తెలిపింది. తమకు ఇద్దరు మగశిశువులు పుట్టారని, ఇద్దరిలోనూ ఆసియా సంతతి లక్షణాలు లేకపోవడంతో షాకయ్యామని వారు తమ దావాలో పేర్కొన్నారు.

డీఎన్‌ఏ పరీక్షల్లో ఆ శిశువులు తమకు సంబంధించిన వారు కాదని తేలడంతో వారిని పోషించే బాధ్యతను ఈ దంపతులు వదులుకున్నారని ఆ దావాలో ఉంది.

ఈ ఆరోపణలపై సదరు క్లినిక్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Science Photo Library

"ఇబ్బందులను, అవమానాలను" తగ్గించుకునేందుకు ఫిర్యాదుదారులు తమ పూర్తి పేర్లను వెల్లడించకుండా ఏపీ, వైజెడ్ అని మాత్రమే దావాలో పేర్కొన్నారు.

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు మందులు, ల్యాబ్ ఫీజులు, ప్రయాణాలు, ఇతర ఖర్చులు కలిపి 1,00,000 డాలర్లకు (దాదాపు రూ.68 లక్షలు) పైగా వెచ్చించామని తెలిపారు.

ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)లో భాగంగా ప్రయోగశాలలో అండాన్ని ఫలదీకరణం చెందించి, దానిని తిరిగి గర్భాశయంలో ప్రవేశపెడతారు. సాధారణంగా పిల్లలను కనడంలో సమస్యలు ఎదుర్కొనే దంపతులు ఈ ప్రక్రియను ఆశ్రయిస్తుంటారు.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వైద్యపరమైన అవకతవకలకు పాల్పడటంతో పాటు, ఉద్దేశపూర్వకంగా తమను మానసిక క్షోభకు గురిచేశారంటూ సీహె‌చ్‌ఏ అనే సంతాన సాఫల్య కేంద్రంతో పాటు, మరో ఇద్దరు డైరెక్టర్లపై న్యూయార్క్‌లో దంపతులు కేసు వేశారు.

"30న ప్రసవమైంది. ఆ శిశువులు మా జన్యువులతో పుట్టిన వారిలా లేరని తెలిసి షాకయ్యాం" అని ఆ దంపతులు చెప్పారు.

చికిత్స సమయంలో తాము పురుష పిండాలను గర్భంలో ప్రవేశపెట్టలేదని వైద్యులు చెప్పారు. కానీ, ఇద్దరు మగశిశువులు పుట్టే అవకాశం ఉందని ప్రసవానికి ముందే స్కానింగ్‌లో తెలిసింది.

ఆ విషయం వైద్యులకు చెబితే, స్కానింగ్‌లో స్పష్టత లేదని చెప్పినట్లు దంపతులు ఆరోపించారు.

ఈ వ్యవహారంపై స్పందన కోసం సదరు సంతాన సాఫల్య కేంద్రాన్ని బీబీసీ సంప్రదించింది. కానీ, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దంపతుల లాయర్ బీబీసీతో మాట్లాడుతూ.. ఆ క్లినిక్ నిర్లక్ష్యం కారణంగా చాలామంది ఇబ్బందిపడ్డారని ఆరోపించారు.

బాధితులకు పరిహారం ఇవ్వాలి, ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం వేశామని లాయర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)