గోవా: బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

కర్నాటక తరువాత ఇప్పుడు గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.

గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఆ పార్టీని విడిచిపెట్టారు. వాళ్లంతా ఓ బృందంగా ఏర్పడి బీజేపీలో చేరారు. దీంతో 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ బలం ఇప్పుడు కేవలం 5 సీట్లకు పడిపోయింది.

40 సీట్లున్న గోవా అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ బలం 27కు పెరిగింది. విపక్ష నేత చంద్రకాంత్ కావలేకర్ నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలంతా పార్టీకి రాజీనామా చేశారు.

ఈ పరిణామంపై గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీశ్ చోడాకర్ మాట్లాడుతూ, ఒక దేశం, ఒకే పార్టీ అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని, తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ బీజేపీ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.

ఆ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేసి, వాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకొని వారిని బీజేపీలో కలుపుకున్నారని విమర్శించారు. బీజేపీ చెబుతున్న 'నయా భారత్' ఇదేనా అని ప్రశ్నించారు. అహంకారంతో నిండిన ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంపై గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ మాట్లాడుతూ, తన తండ్రి మరణం తరువాత రాష్టంలో బీజేపీ ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

ప్రమోద్ సావంత్

ఫొటో సోర్స్, @DRPRAMODSAWANT2/TWITTER

మనోహర్ పారికర్ మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్పల్ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఆశించారు. కానీ, బీజేపీ అతడికి టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా తాను బీజేపీలోనే కొనసాగుతానని, ఎన్నో ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో కలిసి నడుస్తానని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరక ముందు నుంచి కూడా గోవాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఈ చేరికలపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ఎలాంటి షరతులూ లేకుండానే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, దీంతో తమ సంఖ్యా బలం పెరిగిందని అన్నారు.

'గోవాలో జరిగిన మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. 10 మంది ఎమ్మెల్యేలు నేరుగా రాజీనామా చేయలేదు. ముందు వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి బీజేపీలో కలిశారు' అని సీనియర్ పాత్రికేయులు సందీప్ దేశాయ్, బీబీసీ ప్రతినిధి కుల్‌దీప్ మిశ్రాతో మాట్లాడుతూ చెప్పారు.

బీజేపీలో చేరిన 10 మందిలో చాలామంది సీనియర్ నేతలున్నారు. కాబట్టి, కాంగ్రెస్‌కు ఇది గట్టి దెబ్బే అని ఆయన అన్నారు.

కానీ, ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ముందు నుంచీ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా? అన్న ప్రశ్నకు.. 2017 ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లొచ్చాయి. ఇతర పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్నుంచే బీజేపీ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. తరువాతి ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇదొక వ్యూహం అని సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)