మహిళలందరికీ స్ఖలనం అవుతుందా? ఈ సందేహం వచ్చిన ఓ జంట ఏం చేసింది?

ఫొటో సోర్స్, María Conejo/BBC
- రచయిత, స్టెఫానియా గోజర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలందరికీ స్ఖలనం అవుతుందా?
2016లో అమెరికన్ జర్నలిస్ట్ జో మెండెల్సన్, అప్పటి ఆమె బాయ్‌ఫ్రెండ్ ఈ ప్రశ్న గురించి తగవులాడుకున్నారు. వారిద్దరి మధ్య ఎంతకూ ఒక ఏకాభిప్రాయం రాలేదు. దీంతో సమాధానం కోసం గూగుల్‌లో వెతికారు.
‘‘గూగుల్‌లో దీని గురించి అంతా చెత్త సమాచారమే కనిపించింది. అందుకని మెడికల్ జర్నల్స్‌లో ఈ విషయం గురించి చూశా. వాటిలో ఉన్న విషయాల్లో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. అసలు వారు ఏ అవయవాన్ని ఏమని పిలుస్తున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో ఏమీ తెలియలేదు’’ అని జో మెండెల్సన్ బీబీసీతో చెప్పారు.
‘‘దొరికే సమాచారం అర్థం కానిదో, అభ్యంతరకరమైనదో అయ్యుంటుంది. అయితే, అసలు నా శరీరం గురించి నాకేమీ తెలియదని అప్పుడు అర్థమైంది’’ అని ఆమె అన్నారు.
ఇదంతా జరిగిన రెండేళ్ల తర్వాత జో, తన స్నేహితురాలు మరియా కనెజోతో కలిసి ‘పుస్సీపీడియా’ అనే వెబ్‌సైట్ మొదలుపెట్టారు. వికీపీడియా తరహాలో మహిళల శరీరానికి సంబంధించిన వివిధ అంశాల గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని ఉచితంగా అందించే వెబ్‌సైట్ ఇది.
మహిళల మర్మావయవాన్ని ఇంగ్లిష్ నాటు భాషలో ‘పుస్సీ’ అంటారు. అందుకే ఈ వెబ్‌సైట్‌కు ఆ పేరు పెట్టారు.
‘‘యోని, గర్భాశయం, మూత్రాశయం.. ఇలా అన్నింటి గురించీ దీనిలో చర్చించాలన్నది మా లక్ష్యం. ఏదో ఒక రోజు వృషణాల గురించి దీనిలో మాట్లాడుకుంటామేమో’’ అని జో అన్నారు.

అసలు ఇలాంటి వెబ్‌సైట్ అవసరం ఉందా?
#MeToo ఉద్యమం తర్వాత ప్రపంచవ్యాప్తంగా సెక్స్ ఎడ్యుకేషన్ పెరిగింది. ఇంటర్నెట్ ద్వారా దేని గురించైనా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు వచ్చింది.
‘‘సమాచారమే మనకు శక్తి. సిగ్గుపడటం చాలా ప్రమాదకరం’’ అని మరియా అంటున్నారు.
ఆమె బొమ్మలు గీసే నిపుణురాలు. పుస్సీపీడియాలో వివిధ విషయాల గురించి వివరించేందుకు ఆమె ఎన్నో బొమ్మలు వేశారు.
‘‘లింగ సమానత్వ విషయంలో మనం సాధిస్తున్న పురోగతిని మనం ఎక్కువగా ఊహించుకుంటున్నాం. సమాజంలో ఇంకా అసమానతలు చాలా ఉన్నాయి. మన శరీరం, సెక్స్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుకునేందుకు ఇంకా సిగ్గుపడుతుంటాం. సమాజం రోజురోజుకీ కొత్త విషయాలను స్వాగతిస్తున్నా, ఈ అంశంలో మనం ఇంకా ఏదో గోప్యత పాటిస్తున్నాం’’ అని జో అభిప్రాయపడ్డారు.
‘‘మన శరీరం గురించి మనకు బాగా తెలుసన్న భావనలో మనం ఉంటాం. కొన్ని విషయాల గురించి ఏ ప్రశ్నలూ అడగం. ఇలాంటి వైఖరి వల్ల చాలా సమస్యలు వస్తాయి’’ అని జో స్నేహితురాలు మరియా అన్నారు.

గత జులైలో పుస్సీపీడియా ప్రారంభమైంది. మరికొందరి సహకారంతో ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో దీన్ని జో, మరియా నడిపిస్తున్నారు.
ఇప్పటివరకూ 1.3 లక్షలకుపైగా మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు.
‘మర్మావయవాలను ఎలా శుభ్రం చేసుకోవాలి? పురుగుల మందులు వాడి సాగు చేసే పళ్లు, కూరగాయల వల్ల సంతాన సామర్థ్యంపై ప్రభావం పడుతుందా? వంటి అంశాలపై వివరాలు తెలుసుకుంటున్నారు.
పుస్సీపీడియాలో ఉండే ఆర్టికల్స్‌లో ఆ సమాచారం ఎక్కడి నుంచి సేకరించారన్న విషయాన్ని కూడా రచయితలు పేర్కొంటారు.
పీనస్‌పీడియా కూడా తెస్తారా?
విశ్వసనీయమైన సమాచారాన్ని శోధించేందుకు జో, మరియా చాలా శ్రమిస్తారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంటుందని వారంటున్నారు.
పురుషుల శరీరం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలతో పోలిస్తే మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దాని పనితీరు గురించి తక్కువ అధ్యయనాలు జరగడమే అందుకు కారణం.
‘‘పుస్సీపీడియా పెట్టేందుకు కారణమైన నా ప్రశ్నకు ఇంకా సమాధానమే దొరకలేదు. మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దాని పనితీరు గురించి సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు క్లిటోరిస్ ఎలాంటి కణజాలంతో ఏర్పడుతుందో కూడా మనకు తెలియదు’’ అని జో చెప్పారు.

ఫొటో సోర్స్, María Conejo/BBC
‘‘మగవారి మర్మావయవం గురించి గూగుల్‌లో వెతికితే ఎన్నో మెడికల్ జర్నల్స్, వైద్య పుస్తకాల్లో బోలెడంత సమాచారం కనిపిస్తుంది. మహిళల మర్మావయవాల విషయంలో మాత్రం అలా జరగదు’’ అని జో అన్నారు.
అందుకే ‘పీనస్‌పీడియా’ (మగవారికి సెక్స్ ఎడ్యుకేషన్ కోసం వెబ్‌సైట్) అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే, సమాచారం అందుబాటులో ఉన్నంత మాత్రాన, అది అందరికీ తెలుసని అనుకోకూడదని మరియా అన్నారు.
‘‘మగవారికి ఇంకా తక్కువ తెలుసని నేను అనుకుంటున్నా. తమ శరీరం గురించి తెలుసుకోవాలన్న వైఖరి వారిలో చాలా తక్కువ’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళలకు మాత్రం తమ శరీరం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగానే ఉంది. అందుకే పుస్సీపీడియా ఏర్పాటు కోసం క్రౌడ్ ఫండింగ్ (ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ)కు వెళ్లినప్పుడు రూ.15 లక్షలకుపైగా నిధులను సాయంగా అందించారు. జో, మరియా పెట్టుకున్న లక్ష్యం కన్నా ఇది మూడింతలు ఎక్కువ.

ఫొటో సోర్స్, María Conejo/BBC
ఆ డబ్బుతో మరియా, జో.. పుస్సీపీడియా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మొదట్లో వీళ్లిద్దరూ ఉచితంగా పనిచేశారు. ఇప్పుడు ఆ సైట్ వల్ల ఆదాయం కూడా వస్తోంది. దీని కోసం పనిచేస్తున్నవారికి వారు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు.
వెబ్‌సైట్ సందర్శకులు తమకు నచ్చిన ఆర్టికల్స్‌కు విరాళాలు అందించే అవకాశం కూడా ఉంది. మరియా వేసే బొమ్మలతో ఉన్న ఉత్పత్తులను కూడా కొనుక్కోవచ్చు.
‘‘నగ్న శరీరాన్ని చూసే దృక్పథాన్ని నేను మార్చాలనుకుంటున్నా. లైంగిక పరమైన అంశాలను వివరించాలనుకుంటున్నా’’ అని మరియా అన్నారు.
ట్రాన్స్‌జెండర్‌ల లైంగిక ఆరోగ్యపరమైన విషయాలను కూడా వివరించేలా పుస్సీపీడియా ప్రాజెక్టును విస్తరించానుకుంటున్నట్లు జో చెప్పారు.
‘మహిళలందరికీ స్ఖలనం అవుతుందా?’ అన్న తన ప్రశ్నకు సమాధానం కూడా ఏదో ఒక రోజు దొరుకుతుందని, దాని గురించి కూడా పుస్సీపీడియాలో ఆర్టికల్ రాస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి
- పోర్న్ హబ్: రివెంజ్ పోర్న్ వీడియోల మీద డబ్బులు సంపాదిస్తున్న పోర్న్ సైట్ యజమానులు
- ఫిమేల్ వయాగ్రా ‘విలీజి’పై వివాదం.. ఎందుకు?
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది...
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








