విరేచనాలు ఎందుకు వస్తాయి.. అరికట్టడం ఎలా?

- రచయిత, డాక్టర్ రొంపిచర్ల భార్గవి
- హోదా, బీబీసీ కోసం
''పసిపిల్లాడికి ఆగకుండా ఒకటే విరేచనాలు. నాకేదో భయంగా ఉంది. ఆసనమంతా ఎర్రగా పుండు పడింది'' అంటూ బావురు మంది భవానీ.
''ఏం ఫర్వాలేదమ్మాయి.. ఇలాంటి వాటి గురించి నాకు బాగా తెలుసు. అనాసలయ్యుంటాయి. నువ్వేమీ దిగులు పడకు. దీనికి ఇంగ్లీషు మందులు పనిచేయవు. నాటు మందే పనిచేస్తుంది. మన దగ్గరలోనే అనాస ఆంజనేయులు దగ్గరకెళదాం. నాలుగు రోజుల్లో పిల్లాడు బాగైపోతాడు'' అని అతని దగ్గరకు తీసికెళ్లింది భవానీ అత్త.
అతనేవో పొట్లాలిచ్చి వెయ్యమన్నాడు. అవి వేసిన దగ్గర నుంచీ పిల్లాడు మాటిమాటికీ వెళ్లడం తగ్గింది. కానీ, కాస్త మగతగా పడుకుంటున్నాడు.
అది చూసి భయపడ్డ భవానీ భర్త ''ఈ నాటుమందులేవిటీ?'' అని కేకలేసి పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు.
ఆయన పిల్లాడిని పరీక్షించి ఇదంతా ఆ పొట్లాల ప్రభావమనీ, అందులో ఉండేది నల్లమందనీ (opium) తల్లి పాలు తాగే బిడ్డకు మూడు నెలలు గడిచే వరకూ రోజుకు పదీ ఇరవై సార్లు విరేచనాలవ్వడం మామూలే అనీ, పేగులో బలం చేకూరిన తర్వాత అంతా సర్దుకుంటుందనీ, దానికి ప్రత్యేకం మందులు అవసరం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పార్వతికి పొద్దుటి నుంచి కాళ్లూచేతులూ ఆడటం లేదు. రెండేళ్ల బాబుకి నిన్నటి నుంచి నీళ్ల విరోచనాలు. అక్కడికీ కాచిచల్లార్చిన నీళ్లల్లో ఉప్పూ, పంచదార కలిపి ఇస్తూనే ఉంది. పక్కింటి పిన్నిగారినడిగితే పళ్లొచ్చేటప్పుడు అలాగే విరోచనాలవుతాయి కంగారుపడకు అంది.
చూస్తుండగానే పిల్లాడు తోటకూర కాడలా వేళ్లాడిపోయి కళ్లు తేలేశాడు. అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ''పాస్ పోశాడా తెల్లారి?'' అని అడిగాడు. ఏమో ఎవరికి తెలుసు? విరోచనాలు నీళ్లగా అవుతుంటే అదే యూరిన్ అనుకున్నారు. తర్వాత డాక్టర్ పరీక్షించి బాగా డీహైడ్రేషన్లో ఉన్నాడని సెలైన్ పెట్టడానికి ప్రయత్నిస్తే, నరం దొరకలేదు. చివరికెలాగో తంటాలు పడి చీలమండ దగ్గర చర్మం కట్ చేసి అక్కడున్న నరం నుంచి అవసరమైన ఫ్లూయిడ్సూ, మందులూ ఎక్కించారు. చాలాసేపటి తర్వాత బిడ్డ మూత్రం పోశాడు. అప్పుడు బిడ్డకు ప్రమాదం గడిచినట్టేనని డాక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ఇక పక్కఊళ్లో సంబరానికి వెళ్లిన పద్మనాభం అక్కడ వేటపోతును కోశాం, ప్రసాదం తింటే గానీ వీల్లేదని అక్కడి వారు అంటే భోజనం చేసి ఇంటికి వెళ్లాడు. సాయంత్రానికే వాంతులు విరోచనాలు, నీరసించి పోయిన అతన్ని చేతుల మీద ఆస్పత్రికి మోసుకువెళ్లారు. అతన్ని పరీక్షించిన డాక్టర్ పల్స్, బీపీ రెండూ అందటం లేదన్నారు. పది సెలైన్ సీసాలు పెట్టాకే ఆయన పల్స్, బీపీ సాధారణ స్థితికి వచ్చాయి. కానీ,మూత్రం రాలేదు.
తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయని. వెంటనే డయాలసిస్ చేయాలని డాక్టర్ చెప్పారు. అదృష్టం కొద్దీ కొంతకాలానికి అతను కోలుకున్నాడు.
అసలు విరేచనాలు అంటే ఏమిటి? వీటి వల్ల కలిగే అనర్థాలేంటీ? చిన్న పిల్లల్లో వచ్చే అనాసల గురించి, పళ్లు వచ్చేటప్పుడు వచ్చే విరేచనాల గురించి డాక్టర్లేమంటున్నారు?
విరేచనాలు లేదా డయేరియా పసిపిల్లల నుంచి వృధ్ధుల వరకు అన్ని వయసుల వారికి వచ్చే సాధారణ వ్యాధి.
సాధారణం కంటే రోజుకు మూడు,నాలుగు సార్లు మలవిసర్జన ఎక్కువగా పెద్దగా, పల్చగా అయితే విరేచనాలు అంటారు.
ఇందులో ప్రధానంగా రెండు రకాలు. ఒకటి నీళ్ల విరోచనాలు- విరోచనం పలచగా నీళ్లు లాగా అవుతుంది. దీనినే డయేరియా అంటారు.
రెండు నెత్తురు, బంక(జిగురు)తో వచ్చే విరేచనాలు- దీనినే డిసెంట్రీ అంటారు.

ఫొటో సోర్స్, iStock
స్వల్పకాల, దీర్ఘకాల విరోచనాలు
స్వల్పకాలం డయేరియా లేక అకస్మాత్తుగా వచ్చే డయేరియా.. ఇది మూడు నాలుగు రోజుల పాటు బాధిస్తుంది. అన్ని వయసుల వారిలో కనపడుతుంది.
దీర్ఘకాల క్రానిక్ డయేరియా- ఇది నాలుగు వారాలు లేదా అంతకు మించి బాధ పెడుతుంది.
ఇంకో రకమైన వర్గీకరణ ఇన్ఫెక్టివ్ డయేరియా, నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియా. మొదటి దానిలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు కారణమైతే రెండోదాంట్లో పేగుల్లోనూ, జీర్ణశక్తిలోనూ వచ్చే మార్పుల వల్ల కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడం వల్ల డయేరియా వస్తుంది.
ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో దీనిని సరైన సమయంలో గుర్తించి తగిన చికిత్స అందించకపోతే ప్రాణాపాయానికి దారి తీస్తుంది.
పెద్దల్లో వ్యాధి తీవ్రతను వెంటనే గుర్తించాల్సిన అవసరం ఉన్నప్పటికీ వారిలోని వ్యాధి నిరోధక శక్తి కొంత వరకు కాపాడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 200 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వారిలో దాదాపు 2 కోట్ల మంది ఐదేళ్ల వయసువారే. శిశు మరణాలకు ఇది రెండో ప్రధాన కారణం.
దీని వల్ల ఏటా అయిదు లక్షల ఇరవై అయిదు వేలమంది అయిదేళ్ల లోపు పిల్లలు చని పోతున్నారు. పిల్లల్లో పోషకాహార లోపానికి ఇదే ప్రధాన కారణం.
తల్లిపాలు తాగే పిల్లలలో కొద్దిపాటి జిగురుతో ఎక్కువసార్లు అయ్యే విరోచనాలను వ్యాధిగా పరిగణించకూడదు. అవి సర్వ సాధారణం. కొంచెం ఎదిగాక వాటంతటదే సర్దుకుంటుంది.
భారత్ లాంటి అభివృధ్ధి చెందుతున్న దేశాలలో డయేరియా,డీసెంట్రీ చాలా ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి. దీనికి కారణాలు శోధించి నివారించడం ద్వారా ప్రజారోగ్యం తద్వారా ఉత్పాదక శక్తి పెంచుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
డయేరియా కారణాలు
ఇన్ ఫెక్షన్లు : బాక్టీరియల్, వైరల్, ప్రోటోజోవల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు.
బాక్టీరియా: స్టెఫలో కోకస్ ఆరియస్, ఎస్కరీషియా కోలై, సాల్మొనెల్లా టైఫై మ్యూరియమ్,షిగెల్లా, విబ్రియో కలరా.
ఇవన్నీ విరేచనాలు కలగ జేస్తాయి. ఇందులో కొన్ని నీళ్ల విరోచనాలు కలగజేస్తే కొన్ని నెత్తురు బంక విరోచనాలు కలగజేస్తాయి.
కలరా చాలా ప్రమాదకరమైన వ్యాధి. వాంతులు, విరోచనాలు తీవ్రమయితే శరీరంలోని నీరూ,ఎలక్ట్రొలైట్సూ బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై తగిన చికిత్స తీసుకోకపోతే మరణం రావొచ్చు.
విబ్రియో కలరా క్రిమి వలన ఈ వ్యాధి వస్తుంది. బంగ్లాదేశ్ ,ఉత్తర భారత్‌లో వ్యాప్తిలోఉండి, అప్పుడప్పుడూ చెలరేగుతూ ఉంటుంది.
విరేచనాలు గంజి నీళ్లలాగా అవుతాయి. జనసాంద్రత ఎక్కువుండే ప్రాంతాలలో, కుంభమేళాల్లాంటి ఉత్సవాల్లో ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుంది.
రోటా వైరస్: ఇది డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా రెండేళ్లలోపు వారిలో వచ్చే డయారియాల్లో నూటికి యాభై మందికి ఇదే కారణం. చాలా ప్రమాదకరమైన వ్యాధి.
దీనినే 'స్టమక్ ఫ్లూ ' అని కూడా అంటారు. ఏటా 5 లక్షల మంది దీని బారిన పడుతున్నారు. డీహైడ్రేషన్‌కు దారి తీసి మరణం సంభవిస్తుంది.
నోరో వైరస్: పెద్దవాళ్లలో విరోచనాలకు కారణమవుతుంది.
ప్రోటోజోవల్ పేరసైట్లు... ఎంటమీబా హిస్టోలిటికా అమీబిక్ డిసెంట్రీ అంటే నెత్తురు బంక విరోచనాలకి ప్రధాన కారణం. అభివృధ్ధి చెందుతున్న దేశాలలో దీని బెడద ఎక్కువ. శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది. లివర్ లో వృధ్ధిచెంది అక్కడ చీముగడ్డలు కలగ జేస్తుంది. దీనిని అమీబిక్ లివర్ యాబ్సెస్ అంటారు.
జియార్డియా... ఇదికూడా నెత్తురు బంక విరేచనాలు కలగ జేస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు... కాండిడా ఆల్బికన్స్ లాంటి రకాల ఫంగస్‌లు, వ్యాథి నిరోధక శక్తి తగ్గినప్పుడు జీర్ణ వ్యవస్థ లో చేరి విరేచనాలు కలగ జేస్తాయి.

ఫొటో సోర్స్, SURYA
నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియాలు
ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర కారణాల వలన వచ్చేవి. .ఆహార పదార్థాలు విష తుల్య మవడంవలన, పాలు, పాల పదార్థాలూ, తాగేనీరూ, మాంసాహారాలూ, నిలవబెట్టిన ఆహారం తొందరగా పాడై, అవి తీసుకున్న తర్వాత విరేచనాలకి దారి తీస్తాయి. అలాగే పుట్ట గొడుగుల వలన కూడా వాంతులూ,విరోచనాలూ వస్తాయి,దీనినే ఫుడ్ పాయిజనింగ్ అంటారు.
సీలియాక్ డిసీజ్ మనం తీసుకునే ఆహారంలో వుండే గ్లూటెన్ అనే ప్రోటీన్ పడక పోవడం వలన వచ్చే డయేరియా
లాక్టోజ్ ఇంటాలరెన్స్... ఇది చిన్న పిల్లలలో అంటే పాలు తాగే పసిబిడ్డలలో పాలు అరిగించుకోడానికి అవసరమైన లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపించడం వలన వచ్చే వ్యాథి,అంటే తల్లిపాలు కూడా బిడ్డ అరిగించుకోలేని పరిస్థితి. దీనిని వెంటనే గుర్తించి ప్రత్యామ్నాయంగా వుండే సోయా మిల్క్ లాంటి వాటిని ఇవ్వడం ద్వారానూ,లాక్టేజ్ ఎంజైమ్ సరఫరా చేయడం ద్వారానూ ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఐబీఎస్ - ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్
ఇది వచ్చిన వాళ్లలో తెరలుతెరలుగా కడుపునెప్పి, పొట్ట ఉబ్బరమూ, విరేచనాలూ, మలబధ్ధకమూ అనే లక్షణాలు కనపడతాయి. వ్యాధికి కారణం మానసికమైన డిప్రెషన్, జీర్ణవ్యవస్థలోని నరాలపై ఒత్తిడి, కుటుంబ నేపథ్యం, కొన్ని రకాల ఆహార పదార్థాలూ అనుకుంటున్నారు. సరైన కారణం ఇంకా తెలీదు.
కొన్ని రకాలయాంటి బయోటిక్స్ వాడకం వలన, జీర్ణవ్యవస్థ లోని ఉపయోగకరమైన బాక్టీరియల్ ఫ్లోరా దెబ్బతిన్నప్పుడు కూడా డయేరియా వస్తుంది.
ఇంకా కొన్ని మందులు కొంతమందిలో విరోచనాలు కలగ జేస్తాయి. ఉదాహరణకు, ఎమాక్సిసిలిన్. .కాన్సర్ లాంటి జబ్బులలో, .AIDS లో చాలా కామన్‌గా కనపడే లక్షణం డయేరియా. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం దీనికి కారణం.
ట్రావెలర్స్ డయేరియా అనేది ప్రయాణికులలో కనపడుతుంద. దీనికి కారణం బాక్టీరియా లేదా వైరస్ అయి వుండొచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ లాంటి జబ్బులలో కూడా డయేరియాతో బాధపడటం కనపడుతుంది.
డయేరియాలో కనపడే లక్షణాలు
- విరేచనం నీళ్లలాగా కావడం, లేదా నెత్తురూ జిగురుతో రావడం.
- విరేచనాలతో పాటు వాంతులు ఉండడం.
- కడుపునెప్పి తెరలు తెరలుగా వస్తుండడం.
- ఇన్ ఫెక్టివ్ డయేరియాల్లో సాధారణంగా జ్వరం ఉంటుంది.
- దాహం విపరీతంగా వుంటుంది.
- నీరసం,గుండెదడ
- కాళ్లూ, చేతులూ లాగడం
- ఒళ్లు చల్లబడటం
- కళ్లు లోతుకు పోవడం
- నోరెండి పోవడం
- చర్మం పొడిబారడం
చిన్నపిల్లలలో అయితే పొట్టమీద చర్మం రెండు వేళ్లతొ పట్టి లాగితే యథాస్థితికి రావడానికి రెండు సెకన్ల కంటే ఎక్కువ పడుతుంది. దీనిని తీవ్రమైన డీహైడ్రే షన్ కి సూచనగా భావిస్తారు.
గుండె కొట్టుకునే వేగం ఎక్కువవడం, బి.పి బాగా తక్కువవడం కూడా తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలే.
డయేరియాకు దారితీసే పరిస్థితులు
కలుషితమైన నీరు ,కలుషితమైన ఆహారం సర్వసాధారణమైన కారణాలు. మలంతో కలుషితమైన నీరు,ఆహారమూ ప్రధాన కారణాలు. అపరిపక్వమైన, నిల్వ ఆహారం తీసుకోవడం కూడా డయేరియాకు దారితీస్తుంది. అపరిశుభ్ర పరిసరాలు, వాతావరణం.
డయేరియా బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. అంటే భోజనానికి ముందూ, మల విసర్జన తర్వాత విధిగా సబ్బు, గోరు వెచ్చని నీళ్లతో చేతులు శుభ్రపరుచుకోవాలి. ఈ అలవాటు అనేక అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది.
గోళ్లు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అమీబా సిస్టులూ, క్రిముల గుడ్లూ గోళ్లకింద ఇరుక్కుని ఆహారంతో పాటు కడుపులో చేరి వ్యాధులను కలగజేస్తాయి. అమీబిక్ సిస్టులు గోళ్లకింద నలభై అయిదు నిమిషాల పాటూ, ధూళిలో నెలరోజులూ నిల్వ ఉండే అవకాశం ఉంది.
బహిరంగ మల విసర్జన కూడా డయేరియా విజృంభించడానికి కారణమవుతుంది.
వ్యాధి నిర్థరణ
లక్షణాలను బట్టి వ్యాధి నిర్థరణ చాలావరకు అయిపోతుంది. .కొన్ని కేసులలో మైక్రో స్కోపీ, కల్చర్ టెస్ట్ వంటివి అవసరమవుతాయి.
రక్త పరీక్షలతో ఇతరత్రా వ్యాధుల వల్ల కలిగే విరోచనాలను గుర్తించడానికి తోడ్పడుతుంది.
సిగ్మాయిడో స్కొపీ లేదా కొలనో స్కోపీ, బయాప్సీ లాంటి పరీక్షలు జీర్ణవ్యవస్థలోని వ్యాధుల గురించి సమాచారం తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి. యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలు చేయడం వల్ల షిగెల్లా, సాల్మొనెల్లా లాంటి ఇన్ఫెక్షన్లని ని ర్థరించవచ్చు.
విరేచనాల వల్ల కలిగే అనర్థాలు
- వ్యాధి తీవ్రతను బట్టి శరీరంలో నీరూ, ఎలక్ట్రొలైట్సూ తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది.
- బ్లడ్ ప్రెషర్ ప్రమాదకర స్థాయికి పడిపోయి పదినిముషాల పైన గుర్తించకుండా వుంటే కిడ్నీలు ఎక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అనే వ్యాధికి గురి కావచ్చు.
- బి.పి తక్కువ స్థాయికి పడిపోవడంతో బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతినవచ్చు.
ఈ లక్షణాల తీవ్రతను సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే మరణం సంభవించవచ్చు. ఏటా దాదాపు పదిలక్షల మంది ప్రజలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. దీర్ఘకాలం డయేరియాతో బాధపడే వారిలో మాల్ న్యూట్రిషన్ సమస్య ఏర్పడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వాలి. .విరేచనాలూ ,వాంతుల ద్వారా శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రొలైట్స్‌ను తిరిగి ఇవ్వడం, బ్లడ్ ప్రెషర్ సరైన స్థాయిలో మెయింటైన్ చెయ్యడం, మూత్రం సరిగా వచ్చేట్టు చూసుకోవడం ఈ వ్యాధి చికిత్సలో ప్రధాన సూత్రాలు.
అయిదేళ్ల లోపు చిన్న పిల్లలు తొందరగా డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి, వారిమీద ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాధి తీవ్రత స్వల్పంగా ఉంటే పలుచని ద్రవ పదార్థాలు, ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకాలు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తేవచ్చు.
తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు వున్నపుడు ఐ.వి లైను ద్వారా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. ఐ.వి ఫ్లూయిడ్సు ఎప్పుడు, ఎన్ని సీసాలు, ఎంత వేగంగా ఇవ్వాలనేది డాక్టర్ నిర్ణయిస్తాడు.
చిన్న పిల్లల చికిత్సలో జింక్, విటమిన్ ఎ సప్లిమెంట్స్ కూడా అవసరాన్ని బట్టి వినియోగిస్తారు.
తల్లిపాలు మానవలసిన పని లేదు. వాంతులుం, కడుపు నొప్పి, జ్వరం ఉంటే డాక్టర్ సలహాపై ప్రమాదం లేని మందులు వాడాలి. పారాసిటమాల్, డోమ్ పెరడోన్, డైసైక్లమిన్ లాంటివి ప్రమాదం లేనివి. డిక్లోఫినాక్, నిమసలైడ్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. వాటి వలన కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఎక్కువవుతుంది.
లోపెరమైడ్ ,లోమోఫెన్ లాంటి మాత్రలు షాపులలో కొని వేసుకోవడం చాలా ప్రమాదం. వీటి వలన తీవ్రమైన కాంప్లి కేషన్లు వస్తాయి. వీటిని చాలా దేశాలలో నిషేధించారు. అరుదుగా డాక్టర్ సలహా పై మాత్రమే వాడాలి. ప్రోబయాటిక్స్ లాంటివి డాక్టర్ సలహాపై వాడుకోవచ్చు.

ఫొటో సోర్స్, Andrew Burton
డయేరియా వచ్చినప్పుడు ఏం తినాలి.. ఏవి తినకూడదు?
- కాఫీలు, తీపి ఎక్కువగా వుండే పానీయాలు తీసుకోరాదు. ఇవి డీహైడ్రేషన్ ఎక్కువ చేస్తాయి. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ఉత్తమం.
- నీళ్లతో కాచిన సగ్గుబియ్యం జావ, ఓట్ మీల్, పల్చటి మజ్జిగ, గంజి లాంటివి తీసుకోవచ్చు.
- వేపుళ్లూ, క్రీములూ, ఆల్కహాల్ లాంటివి తీసుకోరాదు.
- తేనె, ద్రాక్షపళ్లు, పప్పులు, చెర్రీలూ లాంటివి తినరాదు.
- కోల్పోయిన నీటిని ఆహారం కొద్ది కొద్దిగా తీసుకోవడం ద్వారా రీప్లేస్ చేయవచ్చు.
- కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప తల్లిపాలు మానక్కరలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నివారణ చర్యలు
అభివృధ్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలలో నివారణ చర్యల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. పరిసరాల పరిశుభ్రత అవసరం. బహిరంగ మల విసర్జన జరగకుండా చూడటం, మురుగు కాల్వలు భూమి పైన ఓపెన్‌గా లేకుండా చూడటం చాలా ముఖ్యం.
ఆహార పరిశుభ్రత పాటించాలి. తాజాగా గులాబి రంగులో వుండే మాంసాహారాన్ని ఎంచుకోవాలి. వీలైనంతవరకూ ఫ్రిజ్‌లో నిల్వ చేసినవి కాకుండా తాజా కూరగాయలు వాడాలి.
రోటా వైరస్ వాక్సిన్ వలన చాలా వరకూ చిన్న పిల్లల్లో వచ్చే డయేరియాని అదుపులోకి తీసుకు రాగలిగారు.
అభివృధ్ది చెందుతున్న దేశాలలోని పిల్లలలో వుండే జింక్ లోపాన్ని, విటమిన్-ఎ లోపాన్ని సరిదిద్దడం ద్వారా కూడా పిల్లలలో వచ్చే విరేచనాలను చాలా వరకు అరికట్ట గలుగుతున్నారు.
బిడ్డలకు ఆర్నెల్ల నుండీ రెండేళ్లు వచ్చేవరకూ తల్లిపాలు ఇవ్వడం వల్ల విరోచనాల వ్యాధి నుండి రక్షణ దొరుకుతుందని, పోత పాలు తాగే పిల్లలలో విరేచనాల వలన సంభవించే మరణాల సంఖ్య ఎక్కువగా వుందనీ గమనించారు.
ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే డయేరియా వ్యాధిని నివారించవచ్చు. .
ఇవి కూడా చదవండి:
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
- సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?
- ముత్తులక్ష్మి రెడ్డిపై గూగుల్ డూడుల్: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
- అంతరిక్షం నుంచి తొలి నేరం... భూమ్మీద బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారని ఆరోపణలు
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...
- ఫ్లైబోర్డుతో గాల్లో ఎగురుతూ ఇంగ్లిష్ చానల్ దాటేశాడు
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








