టైప్-2 మధుమేహం ఉన్నవారికి ఒమేగా-3తో ఉపయోగం లేదా

ఫొటో సోర్స్, Getty Images
టైప్-2 మధుమేహం ఉన్నవారిని ఒమేగా-3 ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకొనేలా ప్రోత్సహించకూడదని ఇంగ్లండ్‌లోని 'యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ అంగీలా' పరిశోధకులు చెప్పారు.
ఈ సమస్య ఉన్నవారికి ఒమేగా-3 హాని కలిగించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి.
బీఎంజే సంస్థ 80కి పైగా అధ్యయనాలను సమీక్షించగా, ఒమేగా-3 వల్ల వారికి హాని కలుగుతుందనే ఆధారాలు లభించలేదు. అయితే దీనివల్ల ప్రయోజనం కలుగుతుందనే దాఖలాలూ లేవు.
ఆరోగ్యకర ఆహారంలో భాగంగా ఆయిలీ ఫిష్‌ను తినడం ద్వారా ఒమేగా-3ని పొందడం మేలని చారిటీ సంస్థ 'డయాబెటిస్ యూకే' చెప్పింది.
మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో 90 శాతం మంది టైప్ 2 డయాబెటిస్ బాధితులే.
ఈ సమస్య ఉన్నవారిలో క్లోమ గ్రంథి(పాంక్రియాస్) తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు, లేదా శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు స్పందించలేవు.
అధిక బరువు, ఊబకాయం, మధుమేహం ఉన్నవారితో దగ్గరి బంధుత్వం ఉంటే ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.

ఫొటో సోర్స్, PA Media
పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ లీ హూపర్ బీబీసీతో మాట్లాడుతూ, ఒమేగా-3 సప్లిమెంట్లు గ్లూకోజ్ నియంత్రణను మరింత కష్టతరం చేస్తాయని, దీనివల్ల టైప్-2 మధుమేహ బాధితులకు హాని కలగొచ్చనే ఆందోళనలు ఉన్నాయని చెప్పారు.
ఈ సమస్య ఉన్నవారికి లేదా ఈ సమస్య తలెత్తే ముప్పున్నవారికి ట్రైగ్లిజరాయిడ్లు అధిక స్థాయిలో ఉండొచ్చు. ట్రైగ్లిజరాయిడ్లు ఒక రకమైన బ్లడ్ ఫ్యాట్. దీనిని ఒమేగా-3 తగ్గిస్తుందని చెబుతారు.
అయితే ఒమేగా-3తో హానిగాని, ప్రయోజనంగాని ఉండదని లీ హూపర్ చెప్పారు.
ఒమేగా-3 సప్లిమెంట్లు ఖరీదైన వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు. మధుమేహం ముప్పుంటే ఈ సప్లిమెంట్లపై కంటే ఆయిలీ ఫిష్ లేదా శారీరక శ్రమ కోసం డబ్బు వెచ్చించాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
'డయాబెటిస్ యూకే' డిప్యూటీ హెడ్ ఆఫ్ కేర్ డగ్లస్ ట్వెనెఫోర్ మాట్లాడుతూ- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ప్రధానమైన అంశమన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, యోగర్ట్, చీజ్ లాంటి కొన్ని ఆహార పదార్థాలు టైప్ 2 మధుమేహం ముప్పును తగ్గిస్తాయని తెలిపారు.
ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కీలకమని, టైప్ 2 మధుమేహం ఉన్నవారు సప్లిమెంట్ల రూపంలో కంటే వారానికి రెండుసార్లు ఆయిలీ ఫిష్ తినడం మేలని డగ్లస్ వివరించారు.
హెల్త్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(హెచ్‌ఎస్‌ఐఎస్)కు చెందిన డాక్టర్ క్యారీ రుక్స్‌టన్ భిన్నమైన వాదన వినిపించారు.
ప్రభుత్వ సలహా ప్రకారం ప్రజలు చేపలు ఎక్కువగా తినాలనే తాను కూడా చెబుతానని ఆమె తెలిపారు. కానీ వాస్తవానికి ఫిష్ ఆయిల్ నుంచి లేదా ఆల్గే నుంచి తయారుచేసిన ఒమేగా-3 సప్లిమెంట్లు తీసుకున్నా సరిపోతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- బేర్ గ్రిల్స్ నా హిందీని ఎలా అర్థం చేసుకున్నారంటే... ‘రహస్యాన్ని’ వెల్లడించిన మోదీ
- ఆరోగ్యం: హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది?
- ‘కశ్మీర్లో మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత భారత ప్రభుత్వానిదే’
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాక్ అధీనంలోని కశ్మీర్లో 'స్వాతంత్ర్యం' ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








