ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?

సంచయిత గజపతిరాజు

ఫొటో సోర్స్, facebook/sanchaitagajapatiraju

    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

సింహాచల దేవస్థానం ట్రస్టు బోర్డుకు, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించడం వివాదాస్పదమైంది.

సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం ఇటీవల నియమించింది.

ఆ మరుసటి రోజే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించింది.

రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

వీడియో క్యాప్షన్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచయిత నియామకంపై వివాదం ఏంటి?

అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు తరువాత ఆయన పెద్ద కుమారుడు, అంటే అశోక గజపతి అన్నయ్య ఆనంద గజపతి రాజు ధర్మకర్తగా ఉండేవారు. 2016లో ఆనంద గజపతి మరణం తరువాత నుంచీ అశోక్ గజపతిరాజు సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు.

నిజానికి గత 15 ఏళ్లుగా సింహాచల దేవస్థానానికి పాలక మండలి లేదు. గత నెల 20న సింహాచల దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ అందులో సంచయితకు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు.

ప్రమాణ స్వీకారం

మాన్సాస్ ట్రస్ట్ ఏం చేస్తుంది?

విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చిట్టచివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరాం గజపతి రాజు (పీవీజీ రాజు) తన తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్‌(మాన్సాస్)ను 1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు. విద్య, సంస్కృతి, సంగీతాలకు పెద్దపీట వేస్తూ ఈ మాన్సాస్ ట్రస్టు‌ను ఏర్పాటు చేశారు.

మాన్సాస్ నిర్వహణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కలపి మొత్తం దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు (ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి) పైగా విలువైన 14,800 ఎకరాల భూమి సాంకేతికంగా ఈ ట్రస్టు నియంత్రణలో ఉంది. ఇంతే కాకుండా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి.

ట్రస్టు

ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ 12 విద్యా సంస్థలు నడుస్తున్నాయి. 1,800 మంది ఉద్యోగులు ఉన్నారు. 15,000 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంస్థలలోనే మాజీ రాష్ట్రపతి వీవీ గిరి వంటి వారు చదువుకున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జల్లాలో కూడా ఈ ట్రస్టు కార్యకలాపాలను సాగిస్తోంది.

మాన్సాస్ ట్రస్టు ఏర్పడిన నాటి నుంచి గజపతుల వంశస్తులే ఈ ట్రస్టుకూ, సింహాచల దేవస్థానానికీ ఛైర్మన్లుగా వ్యవహారిస్తున్నారు.

విగ్రహం

ప్రస్తుత వివాదం ఏమిటి?

1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక ఛైర్మన్ గానూ, ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పీవీజీ రాజు మరణించిన తరువాత ఆనంద గజపతి రాజు ఛైర్మన్ అయ్యారు. 2016లో ఆయన మరణం తరువాత అశోక్ గజపతిరాజు ఛైర్మన్ అయ్యారు.

కానీ, అకస్మాత్తుగా ప్రభుత్వం 2020 మార్చి 4న ఆనందగజపతి రాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చింది. సంచయితతో పాటుగా పూసపాటి వంశానికే చెందిన అశోక్ గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతి రాజు, ఆనంద గజపతి మరో కుమార్తె ఊర్మిళా గజపతి రాజు, పి.వి.జి. రాజు కుమార్తె ఆర్.వి. సునీతా ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కే. సోంధీ, విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లను ప్రభుత్వం ట్రస్ట్ బోర్టు సభ్యులుగా నియమించింది. జీవో నంబరు 75లో ఈ వివరాలన్నీ ప్రకటించింది.

సంచయిత

ఎవరీ సంచయిత గజపతిరాజు?

విజయనగరం సంస్థానాన్ని ఒకప్పుడు పాలించిన పూసపాటి ఆనంద గజపతి రాజు, ఆయన తమ్ముడు పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. మాన్సాస్ ట్రస్టు ఏర్పాటు చెసిన పీ.వీ.జీ రాజు (పూసపాటి విజయరాం గజపతిరాజు)కు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజులు ఇద్దరు మగ సంతానం. ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలుండేవి. అశోక్ మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుండగా, ఆనంద్ కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు.

అయితే, ఆనంద గజపతి మొదటి వివాహం తర్వాత రెండో వివాహం కూడా చేసుకున్నారు. ఆయన రెండో భార్య ఉమ, ఒకసారి విశాఖ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఉమా గజపతి రాజు రెండో కుమార్తె సంచయిత. ప్రస్తుతం సంచయిత దిల్లీలో ఉంటూ అక్కడ బీజేపీలో చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

రాజకీయంగా బీజేపీ కూడా ఆమెకు ప్రాధాన్యత ఇస్తోంది. గత ఎన్నికల సమయంలో సంచయిత గజపతి విశాఖలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే సంచయితకు, తన పిన తండ్రి అశోక్ గజపతి కుటుంబంతో ఎటువంటి సన్నిహిత సంబంధాలూ లేవు. ఇక్కడి వ్యవహారాలకు సంచయిత చాలా దూరంగా ఉంటూ వచ్చారు.

బీజేపీలో చేరిన తర్వాత విశాఖ, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు ప్రజలకు అందించడం, స్వచ్ఛభారత్ వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. తొలి నుంచీ స్వచ్ఛంద సంస్థను నడుపుతోన్న సంచయిత, బీజేపీలో చేరిన తర్వాత మరింత క్రియాశీలకంగా పనిచేస్తూ విశాఖకు కార్యకలాపాలను విస్తరించారు. ఇప్పుడు ఆమెను సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ గానూ, మన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

అశోక్ గజపతిరాజు
ఫొటో క్యాప్షన్, అశోక్ గజపతిరాజు

అశోక్ గజపతిరాజు ఏమంటున్నారు?

అయితే, ఈ ఉత్తర్వులపై అశోక గజపతి రాజు హైకోర్టుకు వెళ్లారు. ట్రస్టు నిబంధనల ప్రకారం కుటుంబలోని వయసులో పెద్ద వారైన మగ వారుసలే ఈ బాధ్యతలు చేపట్టాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్రస్టు నిర్వహణలో రొటేషన్ అనే పద్ధతే లేదని ఆయన నివేదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌లో, రెవెన్యూ, దేవాదాయ వాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ కమిషనర్, మాన్సాస్ ట్రస్టు, సంచయిత గజపతిరాజు, ఉర్మిళా గజపతి రాజు, ఆర్.వి. సునీత ప్రసాద్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

''(ఇలాంటి వివాదాల్లో) సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఏ ఫౌండర్ సెటిలర్ ఆస్తి ఇస్తారో వారి ఉద్దేశాలు మార్చడానికి వీల్లేదని స్పష్టంగా ఉంది. మాన్సాస్ ఎడ్యూకేషన్ ట్రస్ట్. 1958లో దేవాదాయ శాఖలో రిజిష్టర్ అయ్యింది. ఆ రిజిస్ట్రేషన్‌ను మార్చే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. ఈ ప్రభుత్వం ఆ నిబంధనలు పాటించలేదు. ప్రభుత్వం ఇంతగా దిగజారుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఏ ఒక్కరూ మాన్సాస్ గురించి మాట్లాడలేదు. కానీ, ఈ ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం లేని ఈ ట్రస్టు మీద కన్నేసింది. ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తుంది. రూల్ ఆఫ్ లా ప్రకారమే వెళతాం, గెలుస్తాం. కానీ, ఇప్పటి వరకూ స్థిరంగా ఉన్న ఒక వ్యవస్థను ఆస్థిరపరిచారు. 1995 నుంచి ప్రభుత్వ దేవాదాయ శాఖ తరపున ఈవో మాన్సాస్‌లో ఉన్నారు. ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని చెప్పి ఇలా చెయ్యడం లేదు. ఆ ట్రస్టు డీడ్ అమలు కావాలనే మేం కోరుతున్నాము. మాన్సాస్ మీద కోపంతోనో ఇంకెవరి మీద కోపంతోనే మాస్సాస్ సంస్థ ఆధీనంలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న వేల మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టారు. ఇది మంచి పరిణామం కాదు'' అని అశోక్ గజపతిరాజు బీబీసీతో అన్నారు.

సంచయిత

‘అర్ధరాత్రి జీవో.. తెల్లవారే సమయంలో ప్రమాణ స్వీకారం’

ఒకేసారి సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు నుంచి, మాన్సాస్ ట్రస్టు నుంచి అశోక్ గజపతిరాజును తొలగించడం రాజకీయ కారణాలతో కూడుకున్నదని విజయం నగరం జిల్లా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విజయనగరం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజును దెబ్బతీయడం ద్వారా ఆ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

''మాన్సాస్‌లో 1958 డీడ్‌లో ఎల్డెస్ట్ మేల్ లీనియల్ డిపెండెన్సీ అని ఉంది. దాని ప్రకారం వయసులో పెద్దవారైన పురుషుడికే ట్రస్టు ఛైర్మన్‌గా అవకాశం ఉంది. మరి, ప్రభుత్వం ఆ నిబంధనలకు ఎందుకు మార్చింది? ఇప్పుడున్న ఛైర్మన్‌కు కనీసం నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలను మార్చుతున్నామని కూడా చెప్పకుండా, ఇలా చేయడం ఏమిటి? ట్రస్టు బోర్డులో నూతన సభ్యులను నామినేట్ చేస్తున్న పక్షంలో కనీసం అప్పటి వరకూ ఉన్న సభ్యులకు, ఛైర్మన్‌కు సమాచారం లేకుండా అర్ధరాత్రి జీవోలను ఇచ్చి తెల్లవారే సమయంలో చీకట్లో ఎవ్వరికీ తెలియకుండా ప్రమాణ స్వీకారం చేసే అవసరం ఎందుకు వచ్చింది. మానాస్స్ లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ అనే మంచి భావన ప్రజల్లో ఉందనీ ప్రభుత్వం చీకట్లో జీవోలు తీసుకు వచ్చి చీకట్లో ప్రమాణ స్వీకారం చేయించడం, వెబ్‌సైట్‌లో కూడా చేర్చక పోవడంపై కోర్టుకూ, ప్రజలకూ సమాధానం చెప్పాలి. మాన్సాస్ ట్రస్టు విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసింది. ఆ భూములన్నీ కొత్తగా వస్తోందని ప్రభుత్వం చెబుతోన్న రాష్ట్ర పరిపాలనా రాజధాని చుట్టూ ఉన్నాయి. ఆ భూములను కాజేయాలనే ఎక్కడో దిల్లీలో ఉన్న సంచయిత గజపతిరాజును తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నారు'' అని టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీశ్ విమర్శించారు.

ట్రస్టు

సంచయిత ఏమంటున్నారు?

''మహిళలు విద్యా, ఉపాధి పరంగా స్వయం సంమృద్ధి సాధించాలని మా తాత గారు పీవీజీ రాజు మాన్సాస్ పెట్టారు. వారి ఆశిర్వాదంతోనే నాకు మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌‌గా అవకాశం వచ్చింది'' అని సంచయిత గజపతిరాజు అన్నారు.

ట్రస్టు బోర్డు ఛైర్ పర్సన్‌గా తనపై ఎంతో బాధ్యత ఉందనీ, దాన్ని నిలబెట్టుకుంటాననీ అన్నారు. ఉత్సాహవంతమైన యువ మహిళగా ఉండటం నా బలహీనత కాదనీ, అది తన బలమనీ ఆమె అన్నారు.

''నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ మహిళలపై వారికున్న అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. నేను ఆనంద గజపతి, ఉమా గజపతుల కుమార్తెను. మాన్సాస్ ట్రస్ట్‌ను, దాని పరిధిలోని విద్యాసంస్థలను బలోపేతం చేస్తా. కొంత మంది ట్రస్ట్ బోర్డులో మహిళలకు స్థానం లేదని అంటున్నారు. అవి ఫ్యూడల్ మనస్తత్త్వాలు. ముందు నేను క్రిస్టియన్ అన్నారు. తరువాత వెస్ట్రన్ అన్నారు. తరువాత నా తల్లిదండ్రులు విడిపోయారన్నారు. ఈ మాటలు అనేవాళ్లు తమ గురించి తాము ఆలోచించుకోవాలి. గతంలో మగవారికే అన్ని అవకాశాలూ ఇచ్చేవారు. కానీ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆస్తి హక్కు మహిళలకు కల్పించడంతో పాటు మహిళలకు పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించారు. మా తాత ఏ పద్దతిని మార్చుదామని (మహిళల విద్య) అనుకొని ట్రస్ట్ ను ప్రారంభించారో దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా కొందరు లేరు. మహిళ విద్యా సంస్థలకు ఎందుకు ఛైర్ పర్సన్‌గా ఉండకూడదు? ఈ విధంగా మాట్లాడటం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా నిరూపించుకునే గొప్ప అవకాశం నాకు వచ్చింది. కోర్టుకు వెళ్లడం వారికి ఉన్న హక్కు. కానీ, నా గురించి, నా తల్లి గురించి తప్పుగా మాట్లాడడం బాగోలేదు. అలాంటి ప్రచారం నేను చేయను. మాకే న్యాయం జరుగుతుంది'' అని సంచయిత బీబీసీతో అన్నారు.

మాన్సాస్ విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలను విజయనగరం జిల్లాకే చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ప్రతిదానిపై ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారాయన.

10 ఏళ్ల క్రితం మాన్సాస్ ట్రస్ట్‌ను ప్రభుత్వంలో కలపాలని అశోక్ గజపతిరాజు ఎందుకు ప్రతిపాదించరని మంత్రి ప్రశ్నించారు.

"దానిపై ఈ సందర్భంలో మాట్లాడటం కరెక్టు కాదు. కోర్టుకు వెళ్లడం ఆయనకున్న హక్కు. ఏదైనా కోర్టు నిర్ణయిస్తుంది'' అని బొత్స సత్యనారాయణ చెప్పారు.

దీనిపై వ్యాఖ్యానించడానికి అశోక్ గజపతి రాజు తరపు న్యాయవాది నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)