భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ భారత్ గురించి చాలా విషయాలు మాట్లాడారు.
జియో టీవీలో ప్రసారమైన 'జిరగా' కార్యక్రమంలో మాట్లాడిన షోయబ్ అఖ్తర్ భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ 'ఇండియా చాలా అద్భుతమైన, మంచి దేశం' అన్నారు.
"నేను భారతీయుల మధ్య ఉన్నప్పుడు ఎప్పుడూ వారు పాకిస్తాన్‌తో యుద్ధాన్ని కోరుకున్నట్లు నాకు అనిపించలేదు. కానీ, వాళ్ల విధాన నిర్ణేతలను, చానళ్లను చూస్తుంటే, రేపే యుద్ధం వస్తుందేమో అనిపిస్తుంది" అన్నారు.
షోయబ్ ప్రస్తుత భారతదేశాన్ని పాకిస్తాన్ గతంతో పోల్చారు.
"పాకిస్తాన్ 1970ల్లో తీవ్రవాదంలోకి అడుగుపెట్టింది. 2000లో దాన్నుంచి బయటపడింది. పాకిస్తాన్ 1970లలో చేసిన అదే తప్పును భారత్ చేస్తోంది. 70లో పాకిస్తాన్ ఉన్న స్థితికి భారత్ వెళ్తున్నట్లుంది. అది భారత్‌కు మంచిది కాదు. భారత్ జీడీపీ కూడా పడిపోయింది" అని షోయబ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ తపిస్తోంది
భారత్‌లో రియాలిటీ షోల వల్ల తను చాలా డబ్బు సంపాదించానని షోయబ్ ఈ కార్యక్రమంలో చెప్పారు.
"భారత్‌లో 130 కోట్ల మంది ఉన్నారు. నేను ఇండియాలో చాలా ట్రావెల్ చేశాను. అంత ట్రావెల్ బహుశా ఇమ్రాన్ ఖాన్ కూడా చేసుండడు. నేను భారతీయులను చాలా దగ్గరనుంచి చూశాను. దిల్లీ నుంచి మహారాష్ట్ర వరకూ వెళ్లాను. నాకు తెలిసినంతవరకూ, పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడానికి భారత్ తపిస్తోంది" అన్నారు.
"భారత్ అభివృద్ధికి దారులు పాకిస్తాన్ నుంచే వెళ్తాయి. వాళ్లు దీన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే, అంత మంచిది" అని షోయబ్ చెప్పారు.
షోయబ్ అఖ్తర్ కరోనా గురించి చేసిన ప్రకటనలు గత కొన్నిరోజులుగా చర్చల్లో నిలిచాయి.
కరోనావైరస్ వల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ పోటీలను కుదించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.
"నా కోపానికి అతిపెద్ద కారణం పీఎస్ఎల్. చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో క్రికెట్ తిరిగి వచ్చింది. పీఎస్ఎల్ మన దేశంలో మొదటిసారి జరుగుతోంది. ఇప్పుడు దానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. విదేశీ ఆటగాళ్లు తిరిగి వెళ్లిపోతున్నారు. ఇది మూసిన తలుపుల వెనక జరుగుతుంది" అన్నారు.
యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో షోయబ్ "నాకు అర్థం కావడం లేదు... మీరు గబ్బిలాలు ఎందుకు తింటారు? వాటి రక్తం, మూత్రం తాగి, మొత్తం ప్రపంచమంతా వైరస్ వ్యాపించేలా చేస్తారా.. నేను చైనీయుల గురించి చెబుతున్నా. వాళ్లు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలో పడేశారు. మీరు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు ఎలా తింటారో నాకు అసలు అర్థం కావడం లేదు. నాకు నిజంగా చాలా కోపమొస్తోంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- కరోనావైరస్: స్పెయిన్ ప్రధాన మంత్రి భార్యకు కోవిడ్-19.. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో సమస్తం బంద్.. ప్రజలు బయటకు రావటంపై నిషేధం
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








