కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాలిటీ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి విషయంలో తను చేపట్టిన చర్యలను ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు యూరప్‌లోని దాదాపు అన్ని దేశాల నుంచీ ఎవరూ అమెరికాకు రావద్దంటూ ప్రయాణ ఆంక్షలు కూడా విధించారు.

ట్రంప్ ఇటీవల చెప్పుకొచ్చిన అంశాల్లో కొన్నిటిలో నిజమెంత అనేది మేం తనిఖీ చేశాం.

News image

1. వైద్య పరీక్షలు

''కరోనావైరస్ వైద్య పరీక్షల విషయంలో అమెరికా చాలా బాగా పనిచేసింది. జనానికి పరీక్ష అవసరమైతే వాళ్లు పరీక్ష చేయించుకోవచ్చు.''

అమెరికాలో టెస్టింగ్ కిట్‌లు (పరీక్ష పనిముట్లు) తగినంత లేవని అధ్యక్ష భవనం శ్వేత సౌధం మార్చి ఆరంభంలో అంగీకరించింది. కొన్ని ఆరేగ్య కేంద్రాలయితే.. ఉన్న టెస్టింగ్ కిట్లను ఉపయోగించటం కూడా కష్టంగా ఉందని నివేదించాయి. ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా కిట్లను పంపిణీ చేశామని, మరిన్ని రాబోతున్నాయని ప్రభుత్వం చెప్తోంది.

కానీ.. ఇతర దేశాల కన్నా అమెరికా చాలా చాలా తక్కువ పరీక్షలే నిర్వహించింది. జనవరి 3 నుంచి మార్చి 11 మధ్య.. దక్షిణ కొరియా ప్రతి పది లక్షల మందిలో 4,000 మందికి పరీక్షలు నిర్వహిస్తే.. అమెరికా కేవలం 26 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించింది. మార్చి 10 వరకూ బ్రిటన్ ప్రతి పది లక్షల మందిలో 400 మందికి, ఇటలీ 1,000 మందికి ఈ పరీక్షలు చేసింది.

పరీక్షలు అతి తక్కువగా నిర్వహించటం వల్ల ఈ వైరస్ అమెరికాలో వివిధ సమాజాల్లో చాపకింద నీరులా విస్తరించివుండవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కరోనానవైరస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియా తీరంలో నిలిపిన గ్రాండ్ ప్రిన్సెస్ నౌకలో చాలా మంది ప్రయాణికులకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది

2. ప్రయాణ ఆంక్షలు

''చైనా విషయంలో సత్వరం స్పందించటం ద్వారా ప్రాణాలు కాపాడే చర్య చేపట్టాం. ఇప్పుడు అవే చర్యలు యూరప్ విషయంలోనూ చేపట్టి తీరాలి.''

అమెరికాలో కరోనావైరస్ కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండటానికి కారణం తాము విధించిన ప్రయాణ ఆంక్షలేనని, తద్వారా చాలా ప్రాణాలను కాపాడామని ట్రంప్ పలుమార్లు ఉటంకించారు. విదేశీయులెవరైనా గడచిన 14 రోజుల్లో చైనాకు వెళ్లి ఉన్నట్లయితే వారు అమెరికాలో ప్రవేశించరాదంటూ జనవరి 31వ తేదీన నిషేధించారు. చైనాకు విమానాలు నడుపుతున్న మూడు ప్రధాన అమెరికా ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆ విమానాలను నిలిపివేశాయి కూడా.

అనంతరం.. ఫిబ్రవరిలో ఇరాన్‌ విషయంలోనూ ఇదే తరహా ఆంక్షలు విధించారు. గడచిన 14 రోజుల్లో ఆ దేశానికి వెళ్లిన విదేశీయులకు అమెరికాలో ప్రవేశం నిరాకరించారు. ఇప్పుడు యూరప్‌లోని 26 దేశాల నుంచి అమెరికన్లు కాని వారు తమ దేశంలో ప్రవేశించటానికి వీలులేదంటూ నిషేధించారు.

అమెరికా పౌరులు, వారి కుటుంబాలకు ఈ ఆంక్షలన్నింటి నుంచీ దాదాపుగా మినహాయింపు ఉంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వం సంసిద్ధం కావటానికి సమయం లభించిందని.. కరోనావైరస్ సోకిన కేసుల సంఖ్య కూడా తగ్గటానికి దోహదపడిందని నిపుణులు చెప్తున్నారు. అయితే.. దానివల్ల ప్రాణాలు పోకుండా కాపాడారా అన్నది తెలియదంటున్నారు.

ప్రయాణ ఆంక్షలు ప్రమాదకరం కాగలవని.. అవి సమాచార మార్పిడి, వైద్య పరికరాల సరఫరాలకు అవరోధంగా మారటంతో పాటు ఆర్థిక వ్యవస్థలకూ చేటు చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

3. మరణాల రేటు...

వైరస్ మరణాల రేటుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల గురించి అడిగినపుడు: ''ఈ వైరస్ వల్ల మరణాల రేటు 3.4 శాతం అనేది తప్పుడు లెక్క అని నేను అనుకుంటున్నా. ఆ సంఖ్య 1 శాతం కన్నా చాలా తక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నా.''

కరోనావైరస్ మరణాల రేటు 3.4 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్క తప్పు అని ట్రంప్.. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్ఓ ఈ గణాంకాలను మార్చి 3వ తేదీన నివేదించింది. నిర్ధారిత కరోనావైరస్ కేసులు, అందులో మరణాల ప్రాతిపదికగా ఈ లెక్కలు వేసినట్లు చెప్పింది.

వాస్తవ మరణాల రేటు తన ఉద్దేశం ప్రకారం ఒక శాతం కన్నా చాలా చాలా తక్కువగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మరణాల రేటు ఎక్కువగా కనిపించటానికి కారణం.. వైరస్ స్వల్పంగా సోకిన వారు చాలా మంది డాక్టరును కలవలేదని, కాబట్టి నిర్ధారిత కేసుల్లో అవి లెక్కలోకి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి.. కరోనావైరస్ వల్ల చనిపోయే అవకాశం ఎంత అనేది మనకు తెలియదు. దీనికి ప్రధాన కారణం ఈ వైరస్ ఎంతమందికి వ్యాపించిందనే వివరాలు లోపించటం. అయితే.. శాస్త్రవేత్తలు ప్రస్తుత ఉత్తమ అంచనా ప్రకారం అది ఒక శాతం.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

4. సీజనల్ ఫ్లూ మరణాలు

మార్చి 9వ తేదీన: ''గత ఏడాది 37,000 మంది అమెరికన్లు ఫ్లూ వల్ల చనిపోయారు. ఏదీ ఆగిపోలేదు. జనజీవనం, ఆర్థిక వ్యవస్థ యధావిధిగా సాగాయి... ఆలోచించండి.''

ట్రంప్ చేసిన ఈ ప్రకటన నేపథ్యాన్ని తెలుసుకోవాలి. ఫ్లూ వల్ల ఎంత మంది అమెరికన్లు చనిపోయారనేది మనకు ఖచ్చితంగా తెలియదు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) అంచనాల ప్రకారం.. గత శీతాకాలంలో (2019 అక్టోబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ) ఫ్లూ మరణాల సంఖ్య 26,339 నుంచి 52,664 వరకూ ఉండవచ్చు. ఉత్తమ అంచనా 34,157గా కూడా చెప్పింది. కాబట్టి ఫ్లూ వల్ల ప్రతి ఏటా చాలా మంది చనిపోతుంటారని ట్రంప్ చెప్తున్నారు.

అయితే.. చాలా రకాల ఫ్లూలను వ్యాక్సిన్లు కానీ, గతంలో ఆ వైరస్‌లు వ్యాపించినపుడు అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తి కానీ నిరోధించినట్లు ఈ కొత్త కరోనావైరస్ విస్తరణను ఇప్పటివరకూ నిరోధించలేదు. సీజనల్ ఫ్లూ మరణాల రేటు 0.1 శాతంగా ఉంటే.. కొత్త కరోనావైరస్ మరణాల రేటు దానికన్నా గణనీయంగా అధికంగా ఉందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, KAREN DUCEY

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలోని ఒక నర్సింగ్ హోంలో పలు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి

5. అతిత్వరలో వ్యాక్సిన్

మార్చి 7వ తేదీన: ''అతి త్వరలో మేం (వ్యాక్సిన్) తయారు చేయబోతున్నాం.''

కొత్త కరోనావైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ లేదు. వాస్తవంగా అయితే.. వచ్చే సంవత్సరం మధ్య వరకూ వ్యాక్సిన్ సిద్ధం కాబోదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

జంతువుల మీద వ్యాక్సిన్ పరీక్షలు ఇప్పటికే మొదలయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివర్లో మనుషుల మీద పరీక్షించే అవకాశముంది.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

6. కఠిన చర్యలు

ఫిబ్రవరి 29వ తేదీన: ''కరోనావైరస్ మీద పోరాడటానికి మేం చాలా తీవ్రమైన చర్యలు చేపట్టాం. మరే దేశమూ చేపట్టనంత కఠిన చర్యలు చేపట్టాం.''

అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. క్వారంటైన్ చర్యలు చేపట్టింది. కానీ.. వైరస్‌ను ఎదుర్కోవటానికి అమెరికా అత్యంత కఠిన చర్యలు చేపట్టిందని చెప్పటం సరికాదు. ఉదాహరణకు.. చైనా, ఇటలీలు విస్తృతస్థాయిలో క్వారంటైన్ చర్యలు చేపట్టాయి. అవి కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఆ తరహా చర్యలేవీ చేపట్టలేదు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)