ఫేస్‌బుక్ పరిచయంతో ప్రేమ జంటగా మారిన ఒక అంధ జంట

దీపక్, ఆర్తి

ఫొటో సోర్స్, Niraj Gera

    • రచయిత, గీత పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రేమ గుడ్డిదంటారు. కానీ ఇద్దరు అంధులు ప్రేమలో పడితే ఏమవుతుంది?

"అటువంటి ప్రేమ వినూత్నంగా, భౌతిక సౌందర్యానికి అతీతంగా ఉంటుందని, ప్రముఖ ఫోటోగ్రాఫర్ నీరజ్ గెరా అన్నారు.

అయన ఒక అంధ ప్రేమికుల కథని 13 చిత్రాల ద్వారా తన 'సేక్రెడ్ లవ్' అనే సిరీస్‌లో చెప్పారు.

"గత సంవత్సరం జులైలో నేను ఒక రోజు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో షాపింగ్ చేస్తుండగా ఒక అంధ జంటని చూసాను. ఆ జంట చేతిలో చేయి వేసుకుని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారని", గెరా బీబీసీతో చెప్పారు.

"వాళ్లిద్దరూ కన్నాట్ ప్లేస్‌లోని మెట్రో స్టేషన్ వైపు వెళ్ళడానికి దారిలో ఉన్న ఒక వ్యక్తి సహాయం చేయడం చూసాను".

మొదటి సారి ఒక అంధ జంటని చూడడంతో వాళ్ళ పట్ల ఆకర్షితుడైనట్లు గెరా చెప్పారు.

నేను వారి దగ్గరకి వెళ్లి వాళ్ళతో పాటు స్టేషన్ వరకు వస్తానని అడిగాను.

"మాటల్లో వారిద్దరూ జంట అని అర్ధం అయింది. వారి కథని నాతో పంచుకోగలరా అని అడిగాను. వాళ్ళు తమ కథని చెప్పడానికి ఒప్పుకున్నారు".

దీపక్, ఆర్తి

ఫొటో సోర్స్, Niraj Gera

ఫేస్ బుక్‌లో పరిచయమయి ప్రేమ జంటగా మారిన 21 ఏళ్ల దీపక్ యాదవ్, ఆర్తి చౌరాసియా‌ల ప్రేమ కథని 'సెక్రేడ్ లవ్' సిరీస్ ద్వారా గెరా పరిచయం చేశారు.

వాళ్ళిద్దరి ఫోన్లలోనూ అంధులు ఫోన్ వాడేందుకు వీలుగా యాక్సిసిబిలిటీ యాప్ ఉందని దీపక్ చెప్పారు. ఆ యాప్‌లో టాక్ బ్యాక్ సౌకర్యం ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సౌలభ్యం ఉందని తెలిపారు.

జూన్ 2018లో ఒక రోజు ఆర్తి పేరు ఫేస్ బుక్ ఫ్రెండ్ సూచనలలో వచ్చినపుడు ఆమెకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టానని దీపక్ చెప్పారు.

ఆర్తి దీపక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌‌ని ఆమోదించడానికి రెండు వారాలు పట్టింది. "నాకు దీపక్ ఎవరో తెలియదు. అందుకే నేను వెంటనే ఆమోదించలేదు". కొంచెం సమయం తీసుకుని అతని ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని ఆమోదించానని ఆర్తి చెప్పారు.

నెమ్మదిగా ఇద్దరి మధ్యా సంభాషణలు మొదలయ్యాయి. ముందు కబుర్లు, నెమ్మదిగా వారి కధలు తర్వాత వారి ఫోన్ నంబర్లను పంచుకున్నారు.

వారిద్దరూ మొదటి సారి జులై 31న ఫోన్లో మాట్లాడుకున్నట్లు దీపక్ చెప్పారు. అప్పుడు 90 నిమిషాలు పాటు మాట్లాడుకున్నామని ఆర్తి చెప్పారు. అప్పటి నుంచి వారిద్దరూ ప్రతి రోజు మాట్లాడుకోవడం మొదలు పెట్టామని ఆర్తి చెప్పారు.

"ఒక రోజు మాటల్లో దీపక్‌కి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగాను. లేదు, ఆ స్థలం ఖాళీగా ఉందని దీపక్ అన్నారని ఆర్తి నవ్వుతూ చెప్పారు.

ఆమెకి దీపక్ పై ఉన్న ప్రేమని వ్యక్తపరచడానికి ఎక్కువ కాలం పట్టలేదు.

ఆగష్టు 10వ తేదీన ఆమె ప్రేమని అతనికి తెలియచేసారు.

దీపక్, ఆర్తి

ఫొటో సోర్స్, NIRAJ GERA

"ఒక రోజు నేను నా స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండగా దీపక్‌కి నా ప్రేమని చెప్పే ధైర్యం చేయగలవా అని నా స్నేహితురాలు అడిగింది. వెంటనే నేను ఫోన్‌లో దీపక్‌కి నా ప్రేమ సంగతి చెప్పేసాను", అని ఆర్తి చెప్పారు.

ఒక్క క్షణం దీపక్ మౌనంగా ఉండిపోయానని చెప్పారు. "నేను కొన్ని క్షణాలు మౌనంగా ఉండి నా అంగీకారాన్ని తెలిపానని" దీపక్ చెప్పారు.

రెండు నెలల తర్వాత దీపక్ ఆర్తి‌ని కలవడానికి ఆమె హాస్టల్‌కి వెళ్లారు, అప్పటి నుంచి వారి బంధం మరింత బలపడింది.

దీపక్ ఇప్పటి వరకు తన ప్రేమ కథని తన కుటుంబం నుంచి రహస్యంగా ఉంచానని చెప్పారు.

"మా నాన్నగారు, ప్రేమ, పెళ్ళి లాంటి విషయాలకి దూరంగా ఉండమని, ముందు చదువు మీద దృష్టి పెట్టి ఒక మంచి కెరీర్ లో స్థిరపడమని చెపుతున్నారని", దీపక్ చెప్పారు.

దీపక్, ఆర్తి

ఫొటో సోర్స్, NIRAJ GERA

తన తండ్రికి తప్ప ఇంట్లో మిగిలిన వాళ్లందరికి తమ ప్రేమ కథ తెలుసని ఆర్తి చెప్పారు.

ఒక వేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బీబీసీ రిపోర్ట్ చదివితే ఎలా స్పందిస్తారని నేను అడిగాను.

వాళ్ళు ఈ రిపోర్ట్ చూడాలనే అనుకుంటున్నట్లు దీపక్ అన్నారు.

మీడియా మా ప్రేమ పట్ల హర్షం వ్యక్తం చేయడం చూస్తే మా ఇంట్లో కూడా మా ప్రేమ పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశ ఉందని దీపక్ అన్నారు.

మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా మేము పెళ్లి గురించి ఆలోచిస్తామని ఆర్తి చెప్పారు. కానీ మాకు ఉద్యోగం వచ్చి, జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకునే సమయం వచ్చేసరికి ముసలివాళ్ళమయిపోతామేమో అనే భయం ఉందని ఆర్తి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)