కరోనావైరస్: స్వచ్ఛత, సమైక్యత, సృజనాత్మకత, దాతృత్వం... సంక్షోభంలో ఆశాదీపాలు

ఫొటో సోర్స్, AFP
ఇది చీకటి కాలం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ గడ్డు కాలం. కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.
కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య, దానికి బలవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
నగరాలు, దేశాలు సైతం మూతపడుతున్నాయి. జనం ఒంటరి జీవితాలు, ఏకాంతవాసాలు గడపాల్సిన పరిస్థితి.
అయితే, ఆందోళన కలిగిస్తున్న ఈ వార్తల మధ్య.. ఆశలు రేకెత్తిస్తున్న అంశాలూ కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, NASA
కాలుష్యం తగ్గిపోయింది
వైరస్ కారణంగా దేశాలు దిగ్బంధనం చేసుకుంటుండంతో కాలుష్యం స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయి.
చైనా, ఇటలీ రెండు దేశాల్లోనూ తీవ్ర వాయు కాలుష్య కారకం, వేడెక్కించే శక్తివంతమైన రసాయనం నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా పడిపోయినట్లు నమోదైంది. పారిశ్రామిక కార్యకలాపాలు, కార్ల ప్రయాణాలు భారీగా తగ్గటం దీనికి కారణం.
ప్రధానంగా కార్ల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గిపోయినట్లు ప్రాధమిక ఫలితాలు చెప్తున్నాయని న్యూయార్క్‌లోని పరిశోధకులు బీబీసీకి తెలిపారు.
విమానయాన సంస్థలు భారీ సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేస్తుండటంతో పాటు.. కోట్లాది మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్న కారణంగా.. ప్రపంచ దేశాల్లో కాలుష్యం తగ్గిపోవటం కొనసాగుతుందని భావిస్తున్నారు.

నదులు శుభ్రపడుతున్నాయి
వాయు కాలుష్యం తగ్గుతున్నట్లుగానే.. ఇటలీలోని వెనిస్ నగరం గుండా ప్రవహించే ప్రఖ్యాత కాలువల్లో నీటి నాణ్యత చాలా మెరుగుపడినట్లు స్థానికులు గుర్తించారు.
ఈ పర్యాటక కేంద్రంలోని వీధులు వైరస్ వ్యాప్తి కారణంగా ఖాళీ అయ్యాయి. దీనివల్ల జలమార్గాల్లో ప్రయాణం దాదాపుగా ఆగిపోయింది.
జలమార్గాల ప్రయాణం వల్ల ఈ కాలువల్లో కాలుష్యం చేరుతుంటుంది. మామూలుగా మురికిగా కనిపించే జలాలు ఇప్పుడు ఎంత శుభ్రంగా కనిపిస్తున్నాయంటే, నీటిలో తిరుగుతున్న చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దాతృత్వం పెరిగింది
కరోనావైరస్ వ్యాప్తి, మాల్స్ మూసివేతలతో భవిష్యత్ భయంతో విపరీతంగా కొనుగోళ్లు, టాయిలెట్ పేపర్ కోసం పోట్లాటలకు సంబంధించిన వార్తలు చాలా వచ్చాయి. కానీ, ఇదే వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దాతృత్వ చర్యలనూ ప్రేరేపించింది.
ఇద్దరు న్యూయార్క్ పౌరులు 72 గంటల్లో 1,300 మంది వలంటీర్లను సమీకరించి.. నగరంలోని వయోవృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారికి నిత్యావసర సరకులు, మందులు పంపిణీ చేశారు.
బ్రిటన్‌లో వైరస్ కోసం ఏర్పాటు చేసిన స్థానిక మద్దతు బృందాల్లో లక్షలాది మంది జనం చేరారని ఫేస్‌బుక్ చెప్పింది. కెనడాలోనూ ఇదే తరహా బృందాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాన్ని అక్కడ 'కేర్‌మాంగరింగ్' ట్రెండ్ అని వ్యవహరిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని సూపర్‌మార్కెట్లు ''ఎల్డర్లీ అవర్'' పేరుతో ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నాయి. తద్వారా వారు ఇబ్బందులు పడకుండా, ఇతరులతో పోటీపడకుండా షాపింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
చాలా మంది ప్రజలు డబ్బులు కూడా విరాళంగా ఇచ్చారు. వంటలు, వ్యాయామాల ఆలోచనలు పంచుకున్నారు. స్వయంగా ఏకాంతవాసం చేస్తున్న పెద్దలకు ఉత్సాహపరిచే సందేశాలు పంపిస్తున్నారు. వ్యాపార కేంద్రాలను ఆహార పంపిణీ కేంద్రాలుగా మారుస్తున్నారు.

జనం ఐక్యమవుతున్నారు
ఇంటా బయటా తీరికలేని పనుల మధ్య మన చుట్టూ ఉన్న వారితో మనకు సంబంధం లేకుండా ఉన్నామని తరచుగా అనిపిస్తుండటం సహజమే. కానీ, వైరస్ అందరి మీదా ప్రభావం చూపుతుండటం.. ప్రపంచమంతటా చాలా సమాజాలను మరింతగా ఐక్యం చేస్తోంది.
దేశమంతటా దిగ్బంధనంలో ఉన్న ఇటలీలో జనం ఒకరినొకరు ఉత్సాహపరచుకోవటానికి తమ తమ బాల్కనీల్లో చేరి పాటలు పాడుతున్నారు.
స్పెయిన్‌లో ఒక వ్యాయామ శిక్షకుడు ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ మధ్య కొంచెం దిగువగా ఉన్న డాబా మీద నిలుచుని వ్యాయామ తరగతి నిర్వహిస్తే, తమ తమ అపార్ట్‌మెంట్లలో ఏకాంతంగా ఉన్న వారు తమ బాల్కనీల్లో నుంచుని ఆ తరగతిలో పాల్గొన్నారు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

చాలా మంది ఈ అవకాశాన్ని తమ స్నేహితులు, సన్నిహితులతో ఫోన్ ద్వారా కానీ, వీడియో కాల్స్ ద్వారా కానీ మళ్లీ అనుసంధానం కావటానికి ఉపయోగించుకుంటున్నారు. స్నేహితుల బృందాలు మొబైల్ యాప్‌లను ఉపయోగించుకుంటూ వర్చువల్ (ఆన్‌లైన్‌లో) భేటీలు, పార్టీలు చేసుకుంటున్నారు.
వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేసే కార్మికులు, ఇతర కీలక సేవల్లోని శ్రామికుల ప్రాధాన్యత ఎంతగా ఉందో ఈ వైరస్ చాటిచెప్పింది. లక్షలాది మంది యూరోపియన్లు తమ బాల్కనీల్లో నిలుచుని కరోనావైరస్ మీద పోరాడుతున్న వైద్యులు, నర్సులకు అభినందనలు చెప్పారు.
లండన్‌లో ఆరోగ్యరంగ నిపుణులకు తోడ్పాటునందించేందుకు వారి పిల్లలను చూసుకోవటానికి, ఇంటి పనులు చేయటానికి వైద్య విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

సృజనాత్మకత వెల్లివిరుస్తోంది
కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు రావటంతో చాలా మంది సృజనాత్మక పనులు చేయటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటన్నారు.
సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు.. పుస్తక పఠనం, వంటలు, అల్లికలు, చిత్రలేఖనం వంటి తమ కొత్త హాబీలను షేర్ చేసుకుంటున్నారు.
వాషింగ్టన్‌లోని డీసీ పబ్లిక్ లైబ్రరీ సహా చాలా గ్రంథాలయాలు ఆన్‌లైన్ బుక్ క్లబ్‌లు నిర్వహిస్తున్నాయి. ఇటలీకి చెందిన ప్రఖ్యాత చెఫ్ మాసిమో బొటురా 'కిచెన్ క్వారంటైన్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సిరీస్ ప్రారంభించారు. ఇళ్లలో చిక్కుకుపోయిన వారిలో అభిలాష ఉన్నవారికి ప్రాధమిక వంటలు నేర్పుతున్నారు.
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఒక చిత్రలేఖనం బోధకుడు ఇళ్లలో ఉన్న పిల్లల కోసం సృజనాత్మక తరగతులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
జనం ఇళ్లలో ఉండి ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియంలను వర్చువల్‌గా వీక్షిస్తున్నారు. పారిస్‌లోని లోరీలో గల వర్ణచిత్రాలు, వాటికన్ మ్యూజియంలోని విగ్రహాలను తమ ఇళ్ల నుంచే చూస్తూ ఆశ్వాదిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ అబ్జర్వేటరీ. ఇళ్లలో ఉన్న వారికి రాత్రిపూట ఆకాశ విహారాన్ని అందిస్తోంది.
క్రిస్ మార్టిన్ వంటి పాప్ స్టార్లు, కీత్ అర్బన్ వంటి గాయకులు కూడా ప్రత్యక్ష ప్రసారాల్లో పాటలు పాడుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్‌తో కొత్త ఉద్యోగాలు.. ఆన్‌లైన్ అమ్మకాలు పెరగడంతో లక్ష మందిని నియమించుకుంటున్న అమెజాన్
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








