కరోనావైరస్: ఆస్పత్రికి తలనొప్పిగా మారిన కనికా కపూర్

కనికా కపూర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

లఖ్‌నవూలో కనికా కపూర్ వల్ల కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం పెరిగింది. ఇప్పుడు ఆమె వల్ల నగరంలోనే కాదు, మొత్తం రాష్ట్రమంతటా కలకలం నెలకొంది. అంతే కాదు, కనికా కపూర్ ఇప్పుడు తనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కూడా పెద్ద తలనొప్పిగా మారారు.

కరోనావైరస్ పాజిటివ్ రావడంతో కనికా కపూర్‌ను శుక్రవారం లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కానీ ఒక రోజు తర్వాత అక్కడి పరిస్థితి గురించి ఆస్పత్రి వర్గాలు ఒక మీడియా ప్రకటన విడుదల చేశాయి. చికిత్సకు సహకరించాలని కనికా కపూర్‌కు వారు ఆ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

కనికా కపూర్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడామె రోగి.. స్టార్ కాదు

కనికా కపూర్‌కు హాస్పిటల్లో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, అయితే, ఆమె ఒక రోగిలా ఉండకుండా, స్టార్‌లా ప్రవర్తిస్తున్నారని ఎస్‌జీపీజీఐ ఆస్పత్రి తరఫున జారీ అయిన ఆ ప్రకటనలో వారు ఆరోపించారు.

పీజీఐ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే ధీమాన్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

"మేం ఆస్పత్రిలో ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఏసీ రూం ఇచ్చాం. అందులో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది. అది పరిశుభ్రంగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఆమె గదిలో టీవీ కూడా పెట్టాం.

కానీ, ఆమె మొదట తనకు ఇంటి నుంచి తెచ్చే ఆహారమే కావాలన్నారు. కానీ ఈ చికిత్సలో అది సాధ్యం కాదు. ఆమెకు గ్లూటెన్ లేని ఆహారం ఇస్తున్నాం. అది కిచెన్‌లో ప్రత్యేకంగా తయారవుతుంది. ఆమెకు ఇక ముందు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటాం. కానీ, కనిక కూడా ఆస్పత్రిలో తను ఒక రోగి అని, స్టార్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి" అని ధీమాన్ అన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కనికా కపూర్ ఆరోపణలు

నిజానికి, కనికా కపూర్ ఒక న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పీజీఐలో తనను ఒక నేరస్థుడిలా చూస్తున్నారని ఆరోపించారు. తనను ఉంచిన గదిలో దుర్గంధం ఉందని, దోమలు వస్తున్నాయని చెప్పారు. దానిని శుభ్రం చేయాలని డాక్టర్లకు చెబితే, ఇది ఆస్పత్రి అని, ఫైవ్ స్టార్ హోటల్ కాదని అన్నారని చెప్పారు.

దీని గురించి బీబీసీ కనికా బంధువులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అది సాధ్యం కాలేదు. అటు, కనికా ఆరోపణలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

వసుంధర రాజె

ఫొటో సోర్స్, Getty Images

అసలు విషయం ఏంటి?

గాయని కనికా కపూర్‌ కరోనావైరస్ పాజిటివ్ అని తెలీడంతో శుక్రవారం పతాక శీర్షికల్లో నిలిచారు. అంతకు ముందు కనిక లఖ్‌నవూ, కాన్పూర్‌లలో జరిగిన కొన్ని బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లఖ్‌నవూలో ఇలాంటి ఒక కార్యక్రమానికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఎంపీ దుష్యంత్ సింగ్, యూపీ ఆరోగ్యమంత్రి జయప్రతాప్ సింగ్ లాంటి హై-ప్రొఫైల్ అతిథులు కూడా హాజరయ్యారు.

కనికా కపూర్ కరోనా పాజిటివ్ అనే వార్త బయటికి రాగానే లఖ్‌నవూలో కల్లోలం రేగింది. ఎందుకంటే కనిక ఎవరెవరితో టచ్‌లో ఉన్నారో వారిలో చాలా మంది వేరే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేశారని, సమాచారం దాచారనే ఆరోపణలతో శుక్రవారం అర్థరాత్రి కనికపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

దాని గురించి మాట్లాడిన లఖ్‌నవూ సీపీ సుజీత్ పాండే.. "సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కనికపై ఐపీసీ సెక్షన్ 269 (ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించేలా చేయడం), మరో రెండు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. లఖ్‌నవూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదుతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు" అని చెప్పారు.

అయితే, దీనిపై సోషల్ మీడియాలో వివరణ ఇచ్చిన కనికా కపూర్, తను ఎయిర్‌పోర్టులో నిర్ధరిత ప్రక్రియ నుంచే బయటకు వచ్చానని, తనకు వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలీగానే, స్వయంగా టెస్ట్ చేయించుకున్నానని, కుటుంబ సభ్యులతో సహా తనకు తానుగా ఐసొలేషన్‌లోకి వెళ్లానని చెప్పారు.

ఈ కేసు బయటపడిన తర్వాత లఖ్‌నవూలోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, ఆఫీసులు, సంస్థలను మార్చి 23 వరకూ మూసివేశారు. నగరంలోని అన్ని రెస్టారెంట్లు, దాభాలు, కెఫేలను కూడా మార్చి 31 వరకూ మూసివేశారు.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)