క‌రోనావైర‌స్: తిరుమల బోసిపోయింది... ఆదాయం నిలిచిపోయింది

తిరుమల
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

తిరుమ‌ల బోసిపోయింది. మాడ‌ వీధులు స‌హా మొత్తం ఖాళీగా మారాయి. ప్ర‌స్తుత త‌రంలో ఇలాంటి ప‌రిస్థితి తొలిసారి చూస్తున్నామ‌ని తిరుమ‌లవాసులు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ తదుపరి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేమ‌ని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో వారం రోజుల వ్య‌వ‌ధిలోనే తిరుమ‌ల, తిరుప‌తి ప‌రిధిలో రూ. 200 కోట్ల ఆదాయానికి నష్టం వస్తుందని అంచ‌నాలు వేస్తున్నారు.

తిరుమల ఆలయం

అసలు ఆదాయం ఎలా వస్తుంది

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాలకు వివిధ రూపాల్లో ఆదాయం ల‌భిస్తుంది. అందులో హుండీ ద్వారా వ‌చ్చే దానితో పాటుగా ద‌ర్శ‌నాల టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణ క‌ట్ట స‌హా ప‌లు మార్గాల్లో ఆదాయం వ‌స్తుంది.

తాజా పరిస్థితులతో తిరుమ‌ల పూర్తిగా ఖాళీ కావ‌డంతో ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌కు కేవ‌లం ఉద్యోగులు, తిరుమ‌ల‌లో ఉండే స్థానికుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్డులు మూసివేశారు. మెట్లు మార్గంలో కూడా ప్ర‌వేశాలు నిలిచిపోయాయి.

ఆదాయం ఎంతంటే..

టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది.

అంటే నెల‌కు వంద కోట్ల‌కు పైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది.

ఏటా ఫిబ్ర‌వ‌రి, మార్చిలలో భక్తుల సంఖ్య కొంత తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి జులై వ‌ర‌కు ఆ సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది. బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో అత్య‌ధికంగా న‌మోద‌వుతుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆదాయం కూడా ఉంటుంది. దాంతో ఈ సీజన్ లో క‌నీసంగా హుండీ ద్వారానే రోజుకి స‌గ‌టును రెండున్న‌ర కోట్ల రూపాయాల ఆదాయం రావాల్సి ఉంది. ఈ ఆదాయం మొత్తం కోల్పోతున్నట్లేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో గెస్ట్‌హౌస్‌లు
ఫొటో క్యాప్షన్, తిరుమలలో గెస్ట్‌హౌస్‌లు

ఇత‌ర మార్గాల్లో వచ్చే రాబడిపైనా ప్ర‌భావం

ప్ర‌స్తుతం యాత్రికులు రాక‌పోవ‌డంతో టీటీడీకి ఇత‌ర ఆదాయ మార్గాలూ నిలిచిపోయాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది ల‌డ్డూ ప్ర‌సాదం విక్రయం. 2018-19లో ల‌డ్డూ ప్ర‌సాదం విక్రయాలతో రూ. 270 కోట్ల రాబడి వచ్చింది. స‌గ‌టున రోజుకి రూ.80 ల‌క్ష‌లు దీనిపై ఆదాయం వచ్చింది.

శీఘ్ర ద‌ర్శ‌నం, ఇత‌ర ద‌ర్శ‌న టికెట్ల ద్వారా గ‌త ఏడాది రూ.235 కోట్ల ఆదాయం ల‌భించింది. క‌ల్యాణ క‌ట్ట‌లో స‌మ‌ర్పించే త‌ల‌నీలాలు ద్వారా రూ. 100 కోట్లు, క‌ల్యాణ మండ‌పాల అద్దె రూపంలో రూ.105 కోట్లు, ఇత‌ర వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాల అద్దెలతో పాటుగా టోల్ ఫీజు అన్నీ క‌లిపి మ‌రో రూ. 204.85కోట్ల ఆదాయం వ‌చ్చింది.

ఇప్పుడీ ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి. అధికారుల అంచ‌నా ప్ర‌కారం రూ. 50 కోట్లు నేరుగా కోల్పోతోంది టీటీడీ. శుక్ర‌వారం పాక్షికంగా ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తివ్వ‌డంతో హుండీ ద్వారా రూ. 1.9 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అదే స‌మ‌యంలో పోటులో త‌యారైన 4 ల‌క్ష‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో 2.5ల‌క్ష‌లు మిగిలిపోయాయి. వాటిని కొండ దిగువ‌కు త‌ర‌లించి రాయితీ పై అమ్మ‌కాలు సాగించే యోచ‌న‌లో టీటీడీ యంత్రాంగం ఉంది.

అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఖాళీగా ఉన్న రోడ్డు
ఫొటో క్యాప్షన్, అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఖాళీగా ఉన్న రోడ్డు

ప్రజారోగ్యం కోసం జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వు

తిరుమ‌ల‌లో ఆదాయం ప‌డిపోతున్న‌ప్ప‌టికీ యాత్రికుల ఆరోగ్య ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని దర్శ‌నాలు నిలిపివేయాల్సి ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌య్యింద‌ని టీటీడీ ప్ర‌జా సంబంధాల అధికారి డాక్ట‌ర్ టి ర‌వి తెలిపారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ ప్ర‌స్తుతానికి వారం రోజుల పాటు తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ క‌నిపించ‌దు. దాని కార‌ణంగా బోర్డుకి ఆదాయం త‌గ్గిపోతుంది. అయినా, ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఇలాంటి నిర్ణ‌యాలు త‌ప్ప‌వు. యాత్రికుల‌తో పాటుగా తిరుమ‌ల‌లో వివిధ సేవ‌ల్లో విధులు నిర్వ‌హించే 15వేల మందికి త‌గిన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వు. అందుకే ఆదాయం కోల్పోతున్నా ఆరోగ్య ప‌రిస్థితుల మీద దృష్టి పెట్టాం. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కూ ఇలాంటి ప‌రిస్థితి త‌ప్ప‌దు.అంటూ వివ‌రించారు.

మూత‌ప‌డిన వ్యాపారాలు

తిరుమ‌ల‌లో వివిధ వ్యాపారాలు చేసేవారు సుమారుగా 3,000 మంది ఉంటారు. వ్యాపారులు, వాటిపై ఆధార‌ప‌డిన వారందరి ఉపాధిపై ఇప్పుడు ప్రభావం పడింది.

ఆట‌బొమ్మ‌లు విక్ర‌యిస్తూ జీవ‌నం సాగించే ప‌సుపులేటి వెంక‌టేశం బీబీసీతో మాట్లాడుతూ ''తిరుప‌తిలో నివాసం ఉంటాను. మాషాపులో న‌లుగురు ప‌నిచేస్తాం. నేను ఉద‌యాన్నే టీటీడీ బ‌స్సులో కొండ‌పైకి వ‌స్తాను. రాత్రి 8 గంటల వ‌ర‌కు ఉంటాను. అన్న‌ప్ర‌సాదం తిని గ‌డిపేస్తాను. రోజూ ఐదారు వేల రూపాయ‌ల వ్యాపారం జ‌రిగేది. మాకు క‌నీసం రూ. వెయ్యి మిగిలేది. ఇప్పుడు వ్యాపారాలు లేవు. అయినా రోజూ కొండపైకి వ‌చ్చి, దుకాణం చూసుకుని వెళ్లాల్సి వ‌స్తోంది. మాకే కాదు..అంద‌రిదీ ఇదే ప‌రిస్థితి'' అన్నారు.

హోట‌ళ్ల నిర్వాహ‌కుల‌కు అపార‌న‌ష్టం త‌ప్ప‌ద‌ని కూడా చెబుతున్నారు. తిరుమ‌ల కొండ‌పై టీస్టాళ్లు, ఇత‌ర చిన్న చిన్న దుకాణాలు కాకుండా హోట‌ళ్లు, రెస్టారెంట్లు నిర్వ‌హించే వారు 100 మంది వ‌ర‌కు ఉన్నారు. ఇప్పుడు అవ‌న్నీ మూత‌ప‌డాల్సి వ‌చ్చింది. దాంతో పూర్తిగా ఆదాయం కోల్పోతున్నామ‌ని చెబుతున్నారు.

అద్దెలు, సిబ్బంది వేత‌నాలు త‌ప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ వ్యాపారాలు లేక భారీ నష్టం తప్పేలా లేదని పి.సాంబ‌శివ‌రావు తెలిపారు. హోట‌ల్స్ య‌జ‌మానుల‌కే ఈ వారంలో వంద కోట్ల ఆదాయ నష్టం వస్తుందని చెప్పారు.

ఘాట్ రోడ్లు

ఫొటో సోర్స్, Tirumala.org

ఫొటో క్యాప్షన్, రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు

నిలిచిపోయిన ర‌వాణా

తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వంద‌లాది వాహ‌నాలు రాక‌పోక‌లు సాగిస్తూ ఉంటాయి. అందులో యాత్రికుల సొంత వాహ‌నాల‌తో స‌మానంగా టూరిజం ఆప‌రేట‌ర్ల వాహ‌నాలుంటాయి. అందులో జీపులు, సుమో వంటి వాహ‌నాల్లో పెద్ద సంఖ్య‌లో భ‌క్తుల‌ను కొండ‌పైకి త‌ర‌లిస్తూ 10వేల‌ మంది ఉపాధిపొందుతూ ఉంటారు.

ఆర్టీఏ అంచ‌నాల ప్ర‌కారం 2300 వాహ‌నాలు ఉన్నాయి. రోజువారీగా రెండు కోట్ల వ్యాపారం జ‌రిగేది. కానీ ప్ర‌స్తుతం పూర్తిగా నిలిచిపోయింది. 300 ఆర్టీసీ బ‌స్సులూ నిలిపివేశారు. రోజుకి రూ. కోటిన్న‌ర ఆదాయం కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

తిరుప‌తి విమానాశ్ర‌యం నుంచి స‌గటున 2200 మంది ప్ర‌యాణీకులు రాక‌పోక‌లు సాగిస్తే శుక్ర‌వారం నాడు ఆ సంఖ్య కేవ‌లం 500 మాత్ర‌మే. విమాన‌యాన సంస్థ‌ల‌కు కూడా ఆమేర‌కు న‌ష్టం వాటిల్లుతోంది.

తిరుమలకు మెట్ల మార్గం

ఫొటో సోర్స్, Tirumala.org

ఫొటో క్యాప్షన్, తిరుమలకు మెట్ల మార్గం

వాటితో పాటుగా అనుబంధ రంగాల‌పై ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ఆధార‌ప‌డిన వేల మంది ఉపాధి కోల్పోవాల్సి వ‌స్తోంది. మొత్తంగా క‌రోనా ప్ర‌భావంతో తిరుమ‌ల కి యాత్రికుల‌ను అనుమ‌తించ‌ని కార‌ణంగా ఈ వారం రోజుల్లో రూ.200 కోట్ల మేర‌ న‌ష్టం ఏర్పడుతుందని అంచ‌నా వేస్తున్నారు.

శుక్ర‌వారం నుంచే బంద్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. స‌హ‌జంగా వారాంతాల్లో శ‌ని, ఆదివారాల్లో కిట‌కిట‌లాడే తిరుమ‌ల ప్రాంగ‌ణం పూర్తిగా నిర్మానుష్యంగా మారుతోంది. ఈ ప‌రిస్థితుల్లో అపార న‌ష్టాలు ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)