కరోనావైరస్: వీరికి చేతులు కడుక్కోవడం చాలా కష్టం, ఎందుకంటే...

- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్ సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు దాదాపు మూతపడుతున్నాయి.
ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, ఇతరుల నుంచి దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. కానీ, ఆ సలహాలను పాటించడం ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి అంత సులువు కాదు.
ప్రపంచ పట్టణ జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రజలు మురికివాడల లాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారికి సరైన నివాస సదుపాయాలు ఉండవు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండదు. దాంతో, అంటువ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతాయి.

ఫొటో సోర్స్, Mukuru Promotion Centre, Winnie Ogutu
43ఏళ్ల సెలెస్టీన్ అధియాంబో తన భర్త, ఆరుగురు పిల్లలతో కెన్యా రాజధాని నైరోబీలోని ముకురు మురికివాడలో నివసిస్తున్నారు. ఇరుకుగా ఒకే గది ఉన్న వారి ఇంటికి నీళ్లు రావు. విద్యుత్ సదుపాయం లేదు. ఇళ్ల మధ్య మురుగు నీరు ఏరులై పారుతుంది. చెత్త అంతా నేరుగా నదిలోకి వెళుతుంది.
ఈ మురికివాడలో 5 లక్షల మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు.
"ఏదైనా అంటువ్యాధి సోకితే ఒక పిల్లాడిని వేరుగా ఉంచేందుకు మా ఇంట్లో గది లేదు. ప్రభుత్వమే రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లాలి" అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Mukuru Promotion Centre, Winnie Ogutu
స్నానం చేసేందుకు కూడా సరిపడా నీళ్లు దొరకడంలేదని ఈ మురికివాడ వాసులు చెబుతున్నారు.
ఇక్కడ మెర్సీ ముకురు అనే స్వచ్ఛంద సంస్థ నాలుగు ప్రాథమిక పాఠశాలలు నడుపుతోంది. వాటిలో దాదాపు 7,000 విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో సగం మంది విద్యార్థులకు సబ్బు కొనుక్కొనే స్తోమత లేదని ఆ సంస్థ అధ్యక్షులు మేరీ కిల్లీన్ అంటున్నారు.
"ఈ పరిస్థితులను చూస్తుంటే నాకు భయమేస్తోంది. మా ప్రాంతంలో కరోనావైరస్ వ్యాప్తి చెందితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేం" అని అధియాంబో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

"ఆఫ్రికాలో చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న ఇంట్లోనే 12 మంది దాకా ఉంటారు. ఎవరికైనా కరోనావైరస్ లాంటిది సోకితే, వారిని నిర్బంధంలో ఉంచడం సాధ్యమయ్యే పనికాదు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రతినిధి డాక్టర్ పియరీ యంపీలే చెప్పారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాలలో ఆయన పనిచేశారు.
నీటి సమస్య మురికివాడలకే పరిమితం కాదు. భారత్‌లోని చెన్నై, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరాలు గత ఏడాది తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. చెన్నైకి తాగు నీటిని రైళ్లలో తరలించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
"ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే నీటి కొరత వస్తే, తరచూ చేతులు కడుక్కోవాలంటే మాకు నీళ్లు దొరకడం కష్టమే" అని చెన్నై శివారులో నివసిస్తున్న శాంతి శసింద్రనాథ్ బీబీసీతో అన్నారు.
గత ఏడాది నీటి కొరత సమయంలో, వారు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల నుంచి నీటిని కొనాల్సి వచ్చింది.
"పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు చాలా తక్కువ ఉన్నాయి. వైద్యుల సలహాలను చాలామంది పాటించడం లేదు" అని శాంతి చెప్పారు.

ఫొటో సోర్స్, Shanthi Sasindrantah
"రైళ్లలో జనాలు దగ్గుతారు, తుమ్ముతారు. ఎదుటివారి ముఖానికి వారికి మధ్య దూరం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంటుంది. అయినా కనీసం నోటికి రుమాలు అయినా అడ్డుపెట్టుకోరు. అదేంటని అడిగితే, కొందరు క్షమించండని అంటారు. మరికొందరు ఎదురు మాట్లాడతారు" అని ఆమె అంటున్నారు.
"చేతులను జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలని మా పిల్లలకు చెప్పాను. బయటి నుంచి వచ్చినప్పుడల్లా చేతులు కడుక్కోవాలని సూచించాను. అందుకే ఐదు నిమిషాలు బయట తిరిగినా చేతులను కడుక్కుంటున్నారు. చాలావరకు ప్రయాణాలను తగ్గించుకున్నాం" అని ఆమె చెప్పారు.
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ పాప్పీ లాంబెర్టన్ చెబుతున్నారు.
ఈ వైరస్ సోకిన వారందరినీ నిర్భంధంలో పెడితేనే పరిస్ధితి అదుపులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆఫ్రికాలో కరోనా మహమ్మారి మహా విపత్తులా మారకముందే ప్రభుత్వాలు, నాయకులు అప్రమత్తమై గట్టి చర్యలు చేపట్టాలని డాక్టర్ యం.పీలే అంటున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









