కరోనావైరస్: జనతా కర్ఫ్యూ... యావత్ భారత నిర్బంధానికి ఆరంభమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో కొత్త పదాన్ని పరిచయం చేశారు. అతి జనతా కర్ఫ్యూ.
''మార్చి 22న, అంటే ఆదివారం దేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దాం'' అని ఆయన పిలుపునిచ్చారు.
తప్పనిసరైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మార్చి 22న చేపట్టే జనతా కర్ఫ్యూ విజయవంతం చేయడం, ఆ అనుభవాలు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సన్నద్ధం చేస్తాయన్నారు.
ప్రధాని ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ప్రజలు ఈ జనతా కర్ఫ్యూపై చర్చించుకుంటున్నారు. రానున్న కొద్దిరోజుల్లో ఎదొర్కొనబోయే పరిస్థితుల సమయంలో విధించబోయే మరింత తీవ్రమైన కర్ఫ్యూకు ఇది సంకేతమా, సన్నాహమా అన్న చర్చ సాగుతోంది.
ప్రజలు భయాందోళనలకు లోనయి అవసరానికి మించి కొనుగోళ్లు చేయడం మానుకోవాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. కానీ, ఆ పిలుపునెవరూ పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా దుకాణాలు, మాల్స్ వద్ద ప్రజలు బారులు తీరుతూ నిత్యవసరాలను పెద్ద ఎత్తన కొనుగోలు చేయడం కనిపిస్తోంది.
చాలా రాష్ట్రాల్లో రాత్రి బాగా పొద్దుపోయేవరకు కూడా సూపర్ మార్కెట్ల వద్ద జనం బారులు తీరడం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
జనతా కర్ఫ్యూతో ఫలితం ఉంటుందా?
ప్రధాని ఆలోచన, ఆయన వేసిన ఈ అడుగు ప్రశంసనీయమని వాలంటరీ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(వీహెచ్ఏఐ) చెప్పింది. వీహెచ్ఏఐ అనే ఈ స్వచ్ఛంద సంస్థ భారత్‌లోని హెల్త్ అసోసియేషన్స్‌తో కలిసి అతి పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య సేవలతో సంబంధమున్న ఎందరో వ్యక్తులు ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.
వీహెచ్ఏఐ సీనియర్ డైరెక్టర్ పీసీ భట్నాగర్ బీబీసీతో మాట్లాడుతూ.. ''కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అత్యంత సమర్థమైన మార్గం సోషల్ డిస్టెన్సింగే. ప్రధాని ఏమీ రోజంతా కర్ఫ్యూ పాటించమని కోరలేదు.. కేవలం 14 గంటలు పాటించాలని కోరారు. సోషల్ డిస్టెన్సింగ్‌కి ఇది కొత్త మార్గం. దీనివల్ల జనసంచారం అదుపులోకి వస్తే చాలా మార్పు వస్తుంది'' అన్నారు భట్నాగర్.
ఈ ప్రయత్నం వల్ల ఫలితం ఉంటుందని తాను చెప్పడానికి గల కారణాన్నీ డాక్టర్ భట్నాగర్ వివరించారు.
''ఎలాంటి ఉపరితలంపైనైనా కరోనావైరస్ కొద్దిగంటలే జీవిస్తుంది. ప్రజలు 14 గంటల పాటు ఒకరితో ఒకరు కలవకుండా ఉంటే వైరస్ వ్యాప్తి ఆగుతుంది.
జనతా కర్ఫ్యూ వల్ల వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగిపోతుందని నేనేమీ చెప్పను. కానీ, కచ్చితంగా దీని వల్ల అదుపులోకి వస్తుంది'' అన్నారాయన.

అయితే, ఒక్క రోజు ఇలా చేయడం వల్ల లాభం ఉంటుందా? దీనికి శాస్త్రీయ ఆధారాలున్నాయా? అన్నదానికీ ఆయన సమాధానమిచ్చారు. ''ఇప్పటికే తీసుకున్న అనేక చర్యల ఫలితంగానే భారత్‌లో తక్కువ కేసులు, తక్కువ మరణాలు నమోదయ్యాయి. దీనివల్ల ఫలితం ఉంటుంది'' అన్నారాయన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 10 మంది కరోనా వైరస్ రోగుల నుంచి మరో 22 మందికి అది సంక్రమిస్తుంది. భారత్‌లో ఈ సగటు నిష్పత్తి 10:17 గా ఉంది. ఇది భారత్ తీసుకున్న జాగ్రత్తల ఫలితమేనని చెబుతున్నారాయన.
రానున్న రోజుల్లో తీసుకోబోయే మరిన్ని చర్యలకు ఇది ఆరంభం కావొచ్చనీ ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవేళ భారత్‌లోనూ కేసుల సంఖ్య పెరిగి చైనా, ఇటలీ మాదిరిగా దేశమంతా నిర్బంధంలోకి వెళ్లాల్సి వస్తే ఇప్పుడు జనతా కర్ఫ్యూ సమయంలో సన్నద్ధమైన అనుభవం అప్పుడు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఇంతకుముందెప్పుడైనా జనతా కర్ఫ్యూ విధించారా?
''గతంలో సార్స్, మెర్స్ వంటి వైరస్‌లు ప్రబలినప్పుడు కూడా దేశంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. కానీ, జనతా కర్ఫ్యూ అనేది ముందెన్నడూ లేదు.
కరోనావైరస్ వల్ల మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ కానీ వైరస్ వ్యాప్తి ముప్పు మాత్రం చాలా తీవ్రంగా ఉంది.
ఈ విషయంలో సార్స్, మెర్స్ కంటే కరోనా చాలా భిన్నమైనది. సూరత్‌లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు కూడా భారత్ ఇలాగే సన్నద్ధమైంది.
అప్పుడు కూడా ప్రజల్లో ప్రాణభయం ఏర్పడింది.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కరోనావైరస్ ప్రబలడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని సమర్థంగా ఎదుర్కొనే విధానాలేవీ నిర్దిష్టంగా కనిపించడం లేదు. ప్రతి దేశమూ తన సామర్థ్యం, అనుకూలతలను బట్టి దీంతో పోరాడుతోంది.
జనతా కర్ఫ్యూ అనేది మునుపెన్నడూ చేయని ప్రయత్నం. వీహెచ్ఏఐ ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రజలు భాగస్వాములయ్యేలా మా వలంటీర్లు పనిచేస్తున్నారు. మా సంస్థతో సంబంధాలున్న 40 కోట్ల మంది ఇందులో పాల్గొని ఇంటికే పరిమితం కానున్నారు'' అని చెప్పారు భట్నాగర్.

ఫొటో సోర్స్, Getty Images
జనతా కర్ఫ్యూ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది
ప్రధాని తన ప్రసంగంలో ఒక మాట చెప్పారు. ఈ తరానికి తెలియదు కానీ ఒకప్పుడు యుద్ధ సమయాల్లో గ్రామాలను అంధకారంలో ఉంచేవారని.. ప్రజలు ఇళ్లలో దీపాలు ఆర్పేసి కిటికీలకు నల్లని కాగితాలు అతికించేవారని మోదీ చెప్పారు.
ప్రత్యేక గుజరాత్ రాష్ట్రం కోసం 1956-60లో ఆందోళన జరిగినప్పుడు కూడా ఇలాంటి జనతా కర్ఫ్యూ పాటించారని చరిత్రకారుడు రిజ్వాన్ ఖాద్రి చెప్పారు.
అప్పుడు మహా గుజరాత్ ఉద్యమానికి ఇందులాల్ యాజ్ఞిక్ నాయకత్వం వహించేవారని.. ఇందులాల్ జనతా కర్ఫ్యూ ప్రకటించడం వల్ల నెహ్రూ నిర్వహించే సభలకు ఎవరూ వెళ్లేవారు కాదని ఖాద్రి గుర్తు చేశారు.
గుజరాత్‌లో విద్యార్థి ఉద్యమం నవ నిర్మాణ్ ఆందోళన్ సాగినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులున్నాయని చెప్పారు.
ఇక మోదీ తన ప్రసంగంలో సాయంత్రం అయిదు గంటలకు అంతా ఇళ్ల ముందు కానీ, బాల్కనీల్లో కానీ నిల్చుని ఈ క్లిష్ట సమయంలోనూ మన కోసం పని చేస్తున్న వైద్య, ఇతర సిబ్బందిని అభినందిస్తూ అయిదు నిమిషాలు చప్పట్లు కొట్టాలన్నారు. ఇది కూడా ఇటీవల ఇటలీలో చేసిందే.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్‌తో కొత్త ఉద్యోగాలు.. ఆన్లైన్ అమ్మకాలు పెరగడంతో లక్ష మందిని నియమించుకుంటున్న అమెజాన్
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








