నిర్భయ కేసు హంతకుల ఉరితీత: ఆ నలుగురి చివరి కోరికలేంటి

నిర్భయ నిందితులు

ఫొటో సోర్స్, DELHI POLICE

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. దిల్లీలోని తీహార్ జైలులో ఈ నలుగురికీ అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు.

నలుగురు దోషులూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తీహార్ జైలు డైరక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారని ఏఎన్ఐ తెలిపింది.

"తన కుమార్తె హత్యకు కారకులు నలుగురికీ ఎట్టకేలకు శిక్ష అమలైంది. ఇదో సుదీర్ఘ పోరాటం. ఈరోజు మాకు న్యాయం దక్కింది. ఈ రోజును ఈ దేశంలోని అమ్మాయిలందరికీ అంకితం చేస్తున్నా. ఈ దేశంపై, న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది. మాకు తోడ్పడిన అందరికీ ధన్యవాదాలు" అని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

శిక్ష అమలు సందర్భంగా తీహార్ జైలు బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలుచేయడం తీహార్ జైలులో ఇదే మొదటిసారి.

పోస్ట్ మార్టమ్ కోసం నలుగురి మృతదేహాలు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌కు తరలించారు. శిక్ష అమలు చేసే సమయంలో కూడా ఇద్దరు వైద్యులు జైలులో ఉన్నారు.

ఘటన జరిగిన ఏడేళ్ల మూడు నెలల 4 రోజుల తర్వాత వారికి శిక్ష అమలైంది.

జైలులో గడిపిన సమయంలో అక్షయ్ సింగ్ వివిధ పనులు చేయడం ద్వారా మిగిలిన ముగ్గురు కన్నా ఎక్కువ సంపాదించారు. వినయ్ శర్మ జైలు నిబంధనలను అతిక్రమించడం వల్ల ఎక్కువసార్లు శిక్షకు గురయ్యారు. ముకేశ్ సింగ్ ఏ పనీ చేయలేదు. పవన్ గుప్తా చిన్నచిన్న పనులు చేశారు.

వినయ్ (దాదాపు) రూ.39000, అక్షయ్ రూ.69000, పవన్ రూ.29000 సంపాదించారు.

వినయ్ 11సార్లు, పవన్ 8సార్లు, ముకేశ్ 3సార్లు, అక్షయ్ ఒకసారి జైలు నిబంధనలను అతిక్రమించి శిక్షకు గురయ్యారు.

జైలులో నిర్భయ కేసులో నలుగురు దోషులూ ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు.

ఆ తర్వాత తీహార్ జైలులో శిక్ష అమలు చేసే ప్రదేశానికి నలుగురు దోషులనూ జైలు అధికారులు తీసుకొచ్చారు.

శిక్ష అమలు పూర్తయ్యే వరకూ జైలును పూర్తిగా మూసి ఉంచారు.

తీహార్ జైలు వద్ద భద్రత

ఫొటో సోర్స్, ANI

నిర్భయ దోషుల చివరి కోరికలేంటి?

దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ తన అవయవాలను దానం చేయాలని కోరుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా జైలు అధికారులకు తెలిపారు.

మరో దోషి వినయ్ శర్మ తను వేసిన పెయింటింగ్‌లను జైలులోనే ఉంచాలని కోరారు. అలాగే, తనతోపాటు ఉంచుకున్న హనుమాన్ చాలీసా, మరో ఫొటోను తన కుటుంబానికి అందచేయాలని కోరారు.

మిగిలిన ఇద్దరు దోషులు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ ఠాకూర్‌లు ఎలాంటి కోరికనూ వెలిబుచ్చలేదు.

వీరికి మార్చి 3న శిక్ష అమలుచేయాలని పటియాలా హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. కానీ, దోషి వేసుకున్న పిటిషన్ మూలంగా అది వాయిదా పడింది.

నిర్భయ దోషులను ఉరి తీయాలని పటియాలా కోర్టు ఇప్పటివరకూ మూడుసార్లు డెత్ వారెంట్ జారీ చేసింది.

ముందు, 2020 జనవరి 22న వీరి ఉరిశిక్ష తేదీని కోర్టు ఖరారు చేసింది. కానీ, ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉండడంతో ఉరిశిక్ష తేదీని వాయిదా వేశారు.

తర్వాత కోర్టు ఫిబ్రవరి 1న వీరికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఆరోజు కూడా ఉరిశిక్ష విధించలేకపోయారు. దానిని తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేశారు.

మార్చి 2న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ

మార్చి 20 ఉదయం 5.30 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేయాలని మార్చి 5న దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఆ వారెంట్‌పై స్టే విధించాలంటూ వారు మరోసారి పిటిషన్ వేశారు. దానిని పటియాలా కోర్టు గురువారం తిరస్కరించింది.

దీంతో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

వివిధ కోర్టుల్లో కొన్ని పిటిషన్లు పెండింగులో ఉండటం వల్ల ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని వారు కోర్టును కోరారు. కానీ, దిల్లీ హైకోర్టు కూడా ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ సుప్రీం కోర్టులో అత్యవసర విచారణకు పిటిషన్ దాఖలు చేశారు.

దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అర్థ రాత్రి 3 గంటల సమయంలో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.

పవన్ గుప్తాకు సంబంధించిన స్కూల్ సర్టిఫికెట్, స్కూల్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్‌లను ఏపీ సింగ్ కోర్టుకు సమర్పిస్తూ, నేరం జరిగిన సమయంలో అతడు మైనర్ అని తెలిపారు.

కానీ జస్టిస్ భూషణ్ దీన్ని తిరస్కరించారు. "ఇవన్నీ మీరు ఇంతకుముందు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలపై విచారణ సమయంలో చూపించారు. మీరు మళ్లీ మళ్లీ ఒకే అంశాన్ని లేవనెత్తుతున్నారా? మీరు మా తీర్పును సమీక్షించాలని చాలా తెలివిగా అడుగుతున్నారు. న్యాయం అనేది ఎప్పటికప్పుడు పునర్నిర్వచించడం కుదరదు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేయడానికి ఇది వేదిక కాజాలదు" అని స్పష్టం చేశారు.

ఏపీ సింగ్ వాదనలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ జరిగిన వాదనలు, పిటిషన్లను ఆయన కోర్టుకు సమర్పించారు.

"మీరు వేసిన ఎస్ఎల్పీ విచారణ సమయంలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. అప్పుడు కూడా మీరు ఇదే స్కూల్ సర్టిఫికెట్ చూపించారు. మళ్లీ దాన్నే ఎలా తీసుకొస్తారు?" అని జస్టిస్ భానుమతి లాయర్ ఏపీ సింగ్‌ను ప్రశ్నించారు.

ఆర్టికల్ 72 ప్రకారం (క్షమాభిక్షపై రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలు) తీసుకోవాల్సిన నిర్ణయం నిష్పాక్షికంగా తీసుకోలేదని దోషి పవన్ తరపున వాదించిన మరో లాయర్ షామ్స్ ఖ్వాజా కోర్టుకు తెలిపారు.

అన్ని వాదనలూ విన్న సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ పవన్ గుప్తా పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

అంతకు ముందు దిల్లీ హైకోర్టులో ఏం జరిగింది?

ముగ్గురు దోషుల తరపున లాయర్ ఏపీ సింగ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే, శిక్ష అమలుకు తగిన కారణాలు ఏవీ లేవని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పాటియాలా హౌస్ కోర్టు జారీచేసిన డెత్ వారెంట్‌ను సమర్థించింది.

జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నారులాలతో కూడిన బెంచ్ ఈ విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

"దోషులు మళ్లీ మళ్లీ ఒకే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం, మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి" అని ఏపీ సింగ్‌కు సూచించింది.

"ఉరిశిక్షను ఎందుకు వాయిదా వేయాలి? మీ దగ్గర ఏమైనా బలమైన వాదనలు ఉంటే వినిపించండి, పరిగణనలోకి తీసుకుంటాం" అని బెంచ్ స్పష్టం చేసింది.

అక్షయ్ సింగ్ భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై కూడా దిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ పిటిషన్‌కు, ఉరితీతకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

నిర్భయ నిందితులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?

2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.

2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.

2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.

2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.

2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.

2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.

2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.

2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.

2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.

2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.

2020 జనవరి 8: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.

2020 జనవరి 14:సుప్రీంకోర్టు వినయ్ కుమార్ శర్మ, ముకేశ్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

2020 జనవరి 15:దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు జనవరి 22న ఉరిశిక్ష వేయలేమని చెప్పింది. దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉందని చెప్పింది. 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాష్ట్రపతి వైపు నుంచి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా నిందితులకు కనీసం 14 రోజుల గడువు ఇవ్వడం తప్పనిసరి అని చెప్పింది.

2020 జనవరి 17: ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి. కొత్త డెత్ వారెంట్ జారీ. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష విధించాలని ఆదేశం.

2020 జనవరి 28: ముకేశ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

2020 జనవరి 31: దోషుల ఉరిశిక్షను తదుపరి ఆదేశాల వరకూ నిలుపుదల చేస్తున్నట్లు పటియాలా కోర్టు ప్రకటించింది.

2020 ఫిబ్రవరి 2: పటియాలా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

2020 ఫిబ్రవరి 17: మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 2: దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

2020 మార్చి 5: మార్చి 20న ఉరి తీయాలని పాటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 19:డెట్ వారెంట్‌పై స్టే విధించాలంటూ వేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు తిరస్కరించింది.

2020 మార్చి 20:అర్థరాత్రి అత్యవసరంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దోషుల్లో ఒకరు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.

2020 మార్చి 20:ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులనూ తీహార్ జైలులో ఉరితీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)