విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు

ఫొటో సోర్స్, facebook/PlatypusEscapes
- రచయిత, సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి
- హోదా, విజయ్ గజాం, బీబీసీ కోసం
‘‘ఈ స్కూబా డైవర్లు రెండు వారాల్లోనే 4 వేల కిలోల ప్లాస్టిన్‌ను సముద్రం నుంచి వెలికి తీశారని తెలిసింది. చాలా చిన్నగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఉద్యమంగా మారుతోంది. వీళ్ల నుంచి మనం కూడా స్ఫూర్తి పొంది.. మన చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు నడుం బిగించాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది నవంబర్‌లో తన ‘మన్ కీ బాత్’లో విశాఖపట్నం స్కూబా డైవర్ల గురించి చెప్పారు.
దీంతో అందరి దృష్టీ ఈ స్కూబా డైవర్లపై పడింది.
'స్వచ్ఛ భారత్' అంటూ చాలామంది వీధులు, వాడలు శుభ్రం చేస్తుంటే... వీళ్లు సముద్రాన్ని కూడా శుభ్రం చేస్తున్నారు. అందుకే ప్రధాని మెప్పు పొందారు.


నిజానికి సముద్రంలో అడుగు వరకూ వెళ్లి ఈత కొట్టే ‘స్కూబా డైవింగ్’ నేర్పించేందుకు వీళ్లు విశాఖపట్నం బీచ్‌లో దిగారు. అక్కడ సముద్రంలో చెత్త కనిపించడంతో తాము ఈత కొట్టే ప్రాంతం వరకూ శుభ్రం చేద్దామని పని మొదలు పెట్టారు. ఇప్పుడు ప్లాస్టిక్ తీయడం కోసమైనా ఈతకొడుతున్నామని చెబుతున్నారు.
వీళ్లు ఎవరు? ఎందుకు సముద్ర గర్భాన్ని శుభ్రం చేస్తున్నారు?
కేరళకు చెందిన సుభాష్ చంద్రన్, రాజమండ్రికి చెందిన పద్మావతిలకు అండమాన్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి స్కూబా డైవింగ్ చేసేవారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు.
తర్వాత ప్లాటిపస్ ఎస్కేప్స్ అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించి, రుషికొండ సమీపంలో స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు.
"సముద్రానికి పన్ను చెల్లించు అని నాకు స్కూబా డైవింగ్ నేర్పిన గురువు చెప్పారు. సముద్రంలో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించడం ద్వారా నేను సముద్రానికి పన్ను కడుతున్నా’’ అని సుభాష్ అంటున్నారు.
''మొదట మా స్కూబా డైవింగ్ యాక్టివిటీకి అనుకూలంగా ఉండేలా సముద్ర గర్భాన్ని శుభ్రం చెస్తే చాలనుకున్నాం. కానీ, మేం ప్లాస్టిక్ వ్యర్ధాలను తీస్తున్న కొద్దీ అవి వస్తూనే ఉన్నాయి. పైగా, చిన్న చిన్న చేపలు, ఇతర సముద్ర జీవులు ప్లాస్టిక్ కవర్లలో చిక్కుకుని చనిపోతున్నాయి. అలా చిక్కుకున్న వాటిని కాపాడుతున్నప్పుడు చెప్పలేని సంతోషం కలిగేది. మాకు స్కూబా డైవింగ్ యాక్టివిటీ ఉన్నా లేకపోయినా ఇప్పుడు రోజూ ఉదయం 8 నుంచి 11 వరకూ మూడు గంటలు మా బృందంతో కలిసి సముద్ర గర్భం నుంచి వ్యర్థాల వెలికితీత కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ వివరించారు.
‘‘మేం నలుగురం డైవర్లం.. ఒక్కో రోజు 500 కేజీల ప్లాస్టిక్ వ్యర్ధాలను, టూరిస్టులు సముద్రంలో వదిలేసిన దుస్తులను బయటకు తీసుకొస్తుంటాం '' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/PlatypusEscapes
తాము చేస్తున్న 'బీచ్ అండర్ క్లీనింగ్' కార్యక్రమం గురించి మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి ప్రస్తావించడం తమకు మరింత స్పూర్తి ఇచ్చిందని ఆయన చెబుతున్నారు.
సముద్రంలో ఉన్న ప్లాస్టిక్‌ను తీసేందుకు తన వంతు సహకారం ఇస్తున్నారు సుభాష్ చంద్రన్ భార్య పద్మవతి. తెలుగమ్మాయి అయిన పద్మవతి క్వాలిఫైడ్ స్కూబా డైవర్.
భర్తతో పాటు ఆమె కూడా స్కూబా డైవింగ్‌కు వస్తుంటారు. ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి బయటకు తీస్తున్నప్పుడు, ముఖ్యంగా ప్లాస్టిక్ సంచుల్లో ఇరుక్కుపోయిన చేపలను
బయటకు తీస్తున్నప్పుడు చెప్పలేని సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఈ వినూత్న సంకల్పం అత్యంత ఆకర్షణీయంగా మారడమే కాకుండా చాలా సత్ఫలితాలనిస్తోందని, రిషికొండ తీరంలో ఇప్పటివరకు సుమారు ఐదు టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశామని వెల్లడించారు.
బీచ్‌లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన చెత్త కుండీ ప్రతి రోజూ తాము వేసే చెత్తతోనే నిడిపోతోందని అన్నారు.

ఫొటో సోర్స్, JAYA SAI BHARADWAJ MANCHIKALAPUDI
ప్లాస్టిక్ సముద్రంలో కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి?
32 కిలో మీటర్ల పొడవున విస్తరించిన విశాఖ తీరంలో కైలసగిరి, రుషికొండ, యారాడ, ఆర్కే బీచ్, సాగరనగర్, బీమిలీ అందాలు పర్యటకులకు కనువిందు చేస్తాయి.
హోటళ్లు, రిసార్టులు, విమానాశ్రయం, సువిశాలమైన రహదారులు అందుబాటులో ఉండటంతో వైజాగ్ టూరిజం హబ్‌గా మారింది.
22 లక్షల జనాభా కలిగిన విశాఖలో రోజుకు 1200 టన్నల ఘన వ్యర్ధాలు ఉత్పత్తవుతున్నాయి. ఇందులో దాదాపు 900 టన్నుల మాత్రమే డంపింగ్ యార్డులకు చేరుతోందని, మిగిలిన వ్యర్థాలు వివిధ రూపాల్లో సముద్రంలోకి వదిలేస్తున్నారని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
పర్యావరణ ఉద్యమకారుడు రత్నం బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘దాదాపు 200 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు డ్రేనేజీతో పాటు సముద్రంలో కలుస్తోంది. విశాఖ తీరంలో దాదాపు 21 మురుగు కాల్వలు సముద్రంలో కలుస్తున్నాయి. గతంలో ఇవి మంచి నీటి కాల్వలు. నగరం అభివృద్ది చెందిన తరువాత డ్రైనేజీలను ఈ కాల్వల్లో కలిపారు. దీంతో ఇవి కలుషితం అవ్వడంతో పాటు సముద్రంలోకి ప్లాస్టిక్ కూడా చేరుతోంది. డ్రైన్లు సముద్రంలో కలిసే చోట మడ అడవులను పెంచితే ప్లాస్టిక్ సముద్రంలో వెళ్లకుండా అడ్డుకోవచ్చు. ప్రజలు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా.. అరిటాకులు, విస్తరాకులు లాంటి వాడితే బాగుంటుంది’’ అని సూచించారు.

ఫొటో సోర్స్, JAYA SAI BHARADWAJ MANCHIKALAPUDI
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన బీబీసీతో మాట్లాడుతూ... నగర పరిధిలో మొత్తం 17 డ్రైన్లు ఉన్నాయని, వీటిలో 8 డ్రైన్లు పూర్తిగా సముద్రంలో కలుస్తున్నాయని, కొన్ని డ్రైన్ల నుంచి మాత్రం తాము ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసి వేస్తున్నామని చెప్పారు.
డ్రైన్లను దారి మళ్లించి, వాటి నుంచి ప్లాస్టిక్‌ను తీసేసి, మురుగు నీటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో రెండు మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్‌లు (అప్పుఘర్, లక్ష్మీ టాకీస్ వద్ద) ఉన్నాయని చెప్పారు.
వర్షాలు అధికంగా పడుతుండటంతో డ్రైన్ల ద్వారా ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోందని, దీని కోసం డ్రైన్ల వద్ద ఇనుప జాలీలు వేసి రోజూ ఆ ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ ను వాడటం తగ్గించాలని.. లేదంటే తిరిగి ఉపయోగించే వాటిని వాడాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- ట్విన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్: ఒకేచోట చేరిన 14 వేల కవలలు
- ప్లాస్టిక్ ఇలా పుట్టింది
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- #BBCSpecial: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం
- రూల్ 71 అంటే ఏంటి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











