ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండున్నరేళ్ల పాప తల్లి అయిన షీబా మినాయ్ జనవరి 14న తెలంగాణ పోలీసుల కస్టడీలో దాదాపు 6 గంటలు ఉన్నారు. పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా జనవరి 12న రాత్రి హైదరాబాద్‌లో ఆకస్మిక నిరసన చేపట్టడమే అందుకు కారణం.
ఈ నిరసనే కాదు, నగరంలోని చాలా నిరసన కార్యక్రమాల్లో వినిపిస్తోన్న ప్రధాన డిమాండు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఎన్‌పీఆర్ ప్రక్రియను ఆపేయాలన్నదే. సీఏఏ వచ్చినప్పటి నుంచీ షిబా మినాయ్ లాంటి వారు చాలామంది ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.
"ముస్లిం మహిళలు వీధుల్లోకి వచ్చి కూర్చోవడం మామూలు విషయం కాదు. అయినా మేం వస్తున్నాం. మేం బయటకు వచ్చినందుకు ఒరిగిందేంటంటే బెదిరింపులు, శిక్షలు. మేం చాలా ప్రశాంతంగా ఇదంతా చేస్తున్నాం. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు" అని షిబా అంటున్నారు.


ఫాసిస్టు, నియంతృత్వ ధోరణిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానలపై నిరంతర, సుస్థిర నిరసనలు ఉండాలని ఆమె అంటున్నారు.
"ముస్లింలు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారో వివరించడం కష్టం. ఒక మైనార్టీ సముదాయానికి చెందిన మహిళగా ప్రస్తుత ప్రభుత్వంలో నిరంతరం ఒక అణచివేత, అలజడిని చూస్తున్నా. అది లవ్ జీహాద్‌పై వచ్చిన ప్రకటనలు కావచ్చు, ఆవు పేరుతో జరిగిన మూక దాడులు కావచ్చు, ఇప్పుడు సీఏఏ కావచ్చు... ముస్లిం వ్యతిరేక వ్యూహాలు ముదిరిన దశకు చేరుకున్నాయి. అందుకే ముస్లింలూ, అదే ఆలోచనా ధోరణి ఉన్న ఇతర వర్గాల ప్రజలూ నిరసనల కోసం బయటకొస్తున్నారు" అని ఆమె వివరించారు.

ఎందుకీ ఆందోళనలు?
ఎంఐఎం వంటి పార్టీలు సీఏఏకు వ్యతిరేకంగా భారీ సభలు నిర్వహిస్తున్నాయి. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ కూడా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాయి. ఈ సభల్లో వేలాది మంది పాల్గొంటున్నారు. పౌర సంఘాల బృందాలు పోలీసు అనుమతితో నిరసనలు నిర్వహించాయి. వీరు కాకుండా కొందరు రోజూ ఆకస్మిక నిరసనలు (ఫ్లాష్ ప్రొటెస్ట్స్) చేపడుతున్నారు. పోలీసు చర్యను తప్పించుకోవడానికి కేవలం 15 నిమిషాల ముందు మాత్రమే చోటు ఎక్కడ అనేది చెబుతారు.
ఈ తరహా నిరసన కార్యక్రమాల నిర్వాహకులు, పాల్గొనే వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పేది ఒక్కటే... "అధికారంలో ఉన్నవారు ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి, చర్యలు మొదలుపెట్టాలని."
"ఇదంతా జరగడానికి ఒకటే కారణం. అసలు ఈ చట్టాన్ని ఎలా అమలు చేయబోతున్నారు? ఏం జరగబోతోంది? అన్న దాంట్లో స్పష్టత లేకపోవడమే. ఈ నిరసనలు చేపట్టడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, వచ్చిన జనాలకు ఈ చట్టంపై అవగాహన కల్పించడం కూడా" అని వారు అంటున్నారు.

ఎన్‌పీఆర్:
2003 నాటి పౌరసత్వ నిబంధనల కింద 2019 జూలై 31న భారత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పాపులేషన్ రిజిష్టర్‌ను అప్‌డేట్ చేసేందుకు ఉద్దేశించినది ఇది. ఇందుకోసం అస్సాం మినహా దేశమంతా ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ 2020 ఏప్రిల్ 1నుంచి సెప్టెంబరు 30 మధ్య జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పబ్లిష్ చేశాయి. కానీ, దీనికంటే ముందు 2021 జనాభా లెక్కలకు సంబంధించిన ప్రీ టెస్ట్ జరిగింది. 2019 ఆగష్టు 12 నుంచి 2019 సెప్టెంబరు 30 మధ్య ఈ ప్రీటెస్ట్ జరిగింది. 2019 డిసెంబరు24న ప్రభుత్వం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను ప్రకటించింది. దీనికోసం 3,900 కోట్ల నిధులు కేటాయించారు.
మరోవైపు 2019 మార్చిలోనే 2021 జనాభా లెక్కల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడా పనులు జరుగుతున్నాయి.
ఆంధ్రా, తెలంగాణల్లోని కొన్ని జిల్లాలు కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 73 జిల్లాల్లో ఎన్‌పీఆర్ ప్రీ టెస్ట్ జరిగింది. దాదాపు 30 లక్షల మంది వివరాలు సేకరించారు. ఆ ఫారంలో పేరు, కుటుంబ పెద్దతో బంధుత్వం, తల్లి, తండ్రి, భార్య లేదా భర్త పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన చోటు, జాతీయత, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా, వృత్తి, చదువు వంటి వివరాలున్నాయి.
ఈ ప్రీ టెస్టు సంతృప్తికరంగా సాగిందని ఒక ఉన్నతాధికారి చెప్పారు. "2019 సెప్టెంబరు- అక్టోబరుల్లో ఈ ప్రీటెస్ట్ జరిగింది. ఇందుకోసం ఎంపిక చేసిన వార్డులను ఎన్యూమరేటర్ సందర్శించారు. తల్లిదండ్రుల పుట్టిన ఊర్లు, గతంలో నివసరించిన చిరునామా, ఆధార్ (ఐచ్ఛికం), పాన్, ఓటర్ కార్డు వంటి వివరాలు తీసుకున్నారు. ఈ వివరాలు ఇవ్వడం స్వచ్ఛందం. వారికి ముందే చెబుతారు కాబట్టి పత్రాలు సిద్ధం చేసుకోవడానికి కూడా సులువవుతుంది" అని అధికారి వివరించారు.
అయితే, ఎన్‌పీఆర్‌లో ఏం అడుగుతారన్న ప్రశ్నల తుది జాబితా ఇంకా ఫైనల్ కాలేదు. "తెలంగాణ వరకూ ట్రైనింగ్, షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది" అని ఒక ఉన్నతాధికారి బీబీసీ తెలుగుకు చెప్పారు. జనగణన (సెన్సస్) గురించి చర్చించేందుకు శుక్రవారం (జనవరి 17వ తేదీ) దిల్లీలో సీఎస్‌లు, సెన్సస్ డైరెక్టర్ సమావేశం జరిగింది.
2018-19 నాటి కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం, 2010లో ఎన్‌పీఆర్ జరగ్గా, ఆ వివరాలను 2015లో అప్‌లోడ్ చేశారు. బయోమెట్రిక్‌తో 33.43 కోట్ల మంది వివరాలు నమోదయ్యాయి.

ఎన్నార్సీకి ముందు ఎన్‌పీఆర్?
ఆ నివేదికలోనే ఎన్‌ఆర్ ఐసీ, అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్‌కి ఎన్‌పిఆర్ మొదటి అడుగు అని రాసి ఉంది.
వెరిఫికేషన్ చేసే సందర్భంలో ఎవరి పౌరసత్వం మీద అనుమానం ఉందో వారి పేరు పక్కన రిమార్కు పెడతారు. వారి పేరు తుది జాబితాలో ఉంచాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రతీ ఒక్కరికీ మండల అధికారికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు.
సరిగ్గా ఈ ప్రక్రియే సమస్యకు మూలం అంటున్నారు 22 ఏళ్ల నాజిల్. "అస్సాంలో ఎన్నార్సీ పెట్టి అనేక మంది భారత పౌరులు కారని ప్రకటించినప్పటి నుంచీ మా కుటుంబ సభ్యుల్లో భయం కనిపించింది. మా వాళ్లు, వాళ్లకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి వాళ్లు పుట్టిన చోటుకు సంబంధించిన పత్రాలకు సంబంధించిన పత్రాలు సేకరించడం మొదలు పెట్టారు. ఒకవేళ వాటి అవసరం పడితే చూపించూందేరే మా కుటుంబ సభ్యులందరం ఒక కామన్ ఫోల్డర్ పెట్టుకుని, అందరం షేర్ చేసుకున్నాం. కానీ, మేం ఇక్కడే పుట్టి, ఇక్కడే బతుకుతూ, ఇక్కడే పన్నులు కడుతున్నప్పుడు మేం ఎందుకు మా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలో అర్థం కావడం లేదు" అని ప్రశ్నించారు నాజిల్.
సయ్యద్ మహమ్మద్ మరింత ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే అనేక మందిలాగే ఆయన కుటుంబం కూడా ఒకప్పుడు హైదరాబాద్‌కు వలస వచ్చింది. "మా ముత్తాతలు,వారి ముత్తాతలు హైదారాబాద్‌కు వలస వచ్చారు. నిజాం కాలంలో వ్యాపారం కోసం వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు ఉన్నట్టుండి మా మతాన్ని బట్టి మా పౌరసత్వం నిరూపించుకోమంటే, మాకు ఆ ఆలోచనే ఇబ్బందికరంగా ఉంది. ముస్లిం వ్యతిరేక భావజాలం ఒక కీలక దశకు చేరుకుంది" అని అన్నారాయన.
అమిత్ షా సహా ఎందరో కేంద్ర మంత్రులు ఎన్నార్సీ, సీఏఏల మధ్య సంబంధం లేదనీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదనీ చెబుతున్నారు. "''సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు లింకు లేదు. ఇస్లామిక్ దేశాల్లో మత హింసను ఎదుర్కొంటున్న వారికి పౌరసత్వం ఇచ్చేదే సీఏఏ" అన్నారు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
మరి, శరణార్థులను ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు... "వాళ్లంతట వాళ్లే మనకు చెబుతారు. ఎవరైనా అబద్ధం ఎందుకు చెబుతారు. ప్రజలు ఇచ్చే ఏ పత్రాన్నైనా మేం తీసుకుంటాం. కాబట్టి భారతదేశంలో నిజమైన పౌరులు భయపడనక్కర్లేదు" అని ఆయన సమాధానమిచ్చారు.
అయితే, ఎన్‌ఆర్‌సీ, సీఏఏల మధ్య ఎలా సంబంధం ఉందో వివరించారు సుప్రీం కోర్టు న్యాయవాది, రాజ్యాంగ నిపుణులు ప్రసన్న. ఎన్‌ఆర్‌సీ పౌరులందర్నీ ఎన్యూమరేట్ చేసే ప్రక్రియ అంటున్నారాయన.
"ఎన్‌ఆర్‌సీలో పేరుండని వారికి చాలా కష్టమే. తాము విదేశీయులం కామని వారు నిరూపించుకోవాలి. విదేశీయులుగా ముద్రపడిన వారందరూ తమను తాము నిరూపించుకోవాల్సిన చట్టం ఫారిన్ యాక్ట్. అటువంటి వారు అప్పీళ్లకు వెళ్లినా నిమిత్తం లేకుండా, వారిని వెనక్కు పంపడం లేదా డిటెన్షన్ సెంటర్లలోకి పంపడం జరగవచ్చు. అయితే, అలా ఎన్‌ఆర్‌సీ నుంచి తప్పించబడ్డ వారికి సీఏఏ ద్వారా కొన్ని దేశాల్లోని కొన్ని మతాలకు చెందిన వారు అని నిరూపించుకుంటే తిరిగి పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియలకు సంబంధించిన నిబంధనలు ఇంకా ఖరారు కావల్సి ఉంది" అని అన్నారాయన.

ఎన్‌పీఆర్ స్టే ఉత్తర్వులు
ఎన్‌పీఆర్‌కు సంబంధించిన అన్ని పనులూ ఆపాలనీ, ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలనీ కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. "2019 పౌరసత్వ చట్ట సవరణ నేపథ్యంలో ఎన్‌పీఆర్ ప్రక్రియ ఎన్‌ఆర్సీకి దారి తీస్తుందన్న ప్రజల ఆందోళనలు అర్థం చేసుకుని ఎన్‌పీఆర్ అప్‌డేషన్ గురించిన అన్ని పనులనూ వెంటనే ఆపాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది" అని 2019 డిసెంబరు 20న కేరళ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఉంది. పంజాబ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా జీవో ఇచ్చింది.
"ఈ కేసు చట్టబద్ధత ఇంకా పరిశీలనలో ఉంది. సభలు పాస్ చేసిన తీర్మానాలు రాజ్యాంగబద్ధమైనవే. ఏదైనా అంశంపై అభిప్రాయం చెప్పే హక్కు లెజిస్లేచర్‌కి ఉంది. ఆ అంశం లెజిస్లేచర్ పరిధిలో లేకపోయినా పర్వాలేదు. కానీ, ఆర్టికల్ 256 ప్రకారం రాష్ట్రాలు కేంద్ర చట్టాలను అతిక్రమించలేవు. కాబట్టి లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉన్న చట్టం రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి దాన్ని తాము పాటించలేమని రాష్ట్రాలు వాదించవచ్చు" అన్నారు ప్రసన్న.
తెలంగాణలో ఎన్‌పీఆర్ ప్రక్రియకు సంబంధించిన అన్ని పనులూ ఆపేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌ని కోరారు. టీఆర్ఎస్ పార్లమెంటులో సీఏఏకు వ్యతిరేకంగా ఓటు వేసింది.
"ఆ చట్టం ఆమోదయోగ్యం కాదు. కానీ, ఆందోళనలకు తావు లేదు. మాకు ఇంకా కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలూ రాలేదు. ఒకవేళ వస్తే అప్పుడు కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటులో సీఏఏకు మద్దతు ప్రకటించింది. కానీ, రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని జగన్ ప్రకటించారు.
కానీ, షిబా వంటి ఎందరో ఆందోళనకారులు, అధికారంలో ఉన్న వారి ప్రకటనలను ఒక వ్యూహంగానే చూస్తున్నారు. "అవి కేవలం ప్రకటనలే. స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున ఆందోళనకారులను శాంతింప చేయడానికి వారు మాట్లాడుతున్నారు" అని షిబా అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..
- హైదరాబాద్: బాలాపూర్‌లో ఉన్న రోహింజ్యాలు బర్మాకు వెళ్లాల్సిందేనా?
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









