మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు? - ప్రభుత్వానికి గాంధేయ వాదుల ప్రశ్న

గాంధీ ఫొటోలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమలేష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని గాంధీ స్మృతి మ్యూజియంలో మహాత్ముడి జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తొలగించడంపై గాంధేయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

డిజిటలీకరణ సాకుతో మహాత్మాగాంధీ హత్య, ఆయన అంతిమ యాత్రకు సంబంధించిన ఫొటోలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, ఇతర గాంధేయవాదులు చెబుతున్నారు. మ్యూజియం డైరెక్టర్ మాత్రం ఈ ఆరోపణలు నిరాధారం అంటున్నారు.

మొదట గాంధీ స్మృతిలో గాంధీ జీవితంలోని కీలక ఘటనలను డిస్‌ప్లే బోర్డుపై ఉన్న ఫొటోల ద్వారా చూపించేవారు. వాటిలో ఆయన మరణం, అంతిమయాత్రకు సంబంధించిన ఫొటోలు కూడా ఉండేవి.

కానీ ఇప్పుడు గాంధీ మరణం, అంతియాత్ర ఫొటోలను తొలగిచారు. అక్కడ ఒక డిజిటల్ స్క్రీన్(టీవీ స్క్రీన్ లాగే) ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ మీద ఆరేడు ఫొటోలను చూపిస్తున్నారు. అవి ఒక దానితర్వాత ఒకటి వస్తుంటాయి.

ఈ డిజిటలీకరణపై గాంధేయవాధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

గాంధీ ఫొటోలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుషార్ గాంధీ

అభ్యంతరం ఎందుకు

డిజిటలీకరణ పేరుతో గాంధీ ఫొటోల ప్రాధాన్యం తగ్గించేశారని, ఇప్పుడున్నవి అంత జీవంతో, ఆకట్టుకునేలా లేవని చెబుతున్నారు. గాంధీ కాలం నాటి జ్ఞాపకాలను మరుగుపరిచే ప్రయత్నం జరుగుతోందని గాంధీ ముని మనవడు తుషార్ కపూర్ ఆరోపించారు.

‘‘గాంధీజీ హత్య అనే మాట ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే దాని చరిత్ర ఎంత బహిర్గతం అయితే, అంత ఎక్కువగా ఈ ప్రభుత్వానికి ప్రేరణగా నిలిచిన దాని గురించి ప్రజలకు తెలుస్తుంది. అందుకే వాళ్లు బాపూ చరిత్రను మరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు’’ అని చెప్పారు.

ఈ మ్యూజియంలో గాంధీ మరణానికి సాక్ష్యంగా నిలిచిన, ప్రత్యక్ష అనుభవం అందించే ఫొటోలు ఎన్నో ఉన్నాయి. డిజిటలైజ్ చేసిన ఫొటోల్లో గాంధీని కాల్చి చంపిన తుపాకీ ఫొటో కూడా ఉందని తుషార్ చెప్పారు.

గాంధీ ఫొటోలు

ఫొటో సోర్స్, GANDHI SMRITI

ప్రధానమంత్రిపై ప్రశ్నలు

"అక్కడ ఫొటోలు కనిపించకపోయేసరికి నాకు చాలా వింతగా అనిపించింది. అది ఒక స్క్రీన్‌గా మారిపోయింది. నేను దీన్ని ఎందుకు మార్చేశారు అని అడిగాను. పైనుంచి ఆదేశాలు వచ్చాయని స్టాఫ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది నవంబర్‌ పర్యటన తర్వాత ఆ ఆదేశాలు వచ్చినట్లు నాకు అక్కడ ఉన్న వారు చెప్పారు" అని తుషార్ గాంధీ చెప్పారు.

కానీ ఈ మాటలను పూర్తిగా కొట్టిపారేసిన గాంధీ స్మృతి డైరెక్టర్ దీపాంకర్ జ్ఞాన్, తమకు ఆ ఆదేశాలు మ్యూజియంను నియంత్రించే సంస్థ నుంచి వచ్చాయని చెప్పారు.

News image

"గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. దానిని నియంత్రించే ఒక ఉన్నత సంస్థ ఆదేశాలను మేం అమలు చేస్తాం. మాకు ఆ ఉన్నత సంస్థ నుంచి మ్యూజియంను డిజిటలీకరణ చేయాలని ఆదేశాలు అందాయి. దాని ప్రకారమే ఫొటోలను స్క్రీన్‌గా మార్చేశాం. చాలా ఫొటోలను మార్చేశాం. మరికొన్ని మార్చాలి. ఈ ప్రక్రియ 2019 డిసెంబర్ నుంచి మొదలైంది. డిజిటలీకరణ తప్ప దీని వెనుక వేరే ఉద్దేశం లేదు" అన్నారు.

దీపాంకర్ చెబుతున్న గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి, భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయంతో నడుస్తుంది. భారత ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు. గాంధీ స్మృతి వెబ్‌సైట్‌లో కూడా సీనియర్ గాంధేయవాధులు, ప్రభుత్వ విభాగాల ప్రతినిధుల మండలి దీని కార్యకలాపాలను నిర్దేశిస్తుందని రాశారు.

కానీ ఈ మండలి నుంచి తమను తొలగించారని గాంధేయవాదులు ఆరోపిస్తున్నారు.

గాంధీ ఫొటోలు

ఫొటో సోర్స్, GANDHI SMRITI

ఏ మార్పులు వచ్చాయి

"గాంధీ స్మృతి మహాత్మాగాంధీ జీవిత వృత్తాంతం. జనం ఇక్కడికి ఆయన జీవితానికి సంబంధించిన పెయింటింగ్స్, ఫొటోలు చూడ్డానికే వస్తుంటారు. ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేక వాతావరణం ఉంటుంది. కానీ ఫొటోలను స్క్రీన్‌పై చూపిస్తూ అలాంటి వాతావరణమే లేకుండా చేశారు" అని తుషార్ గాంధీ అన్నారు.

"మొదట జనం నిలబడి ఫొటోలను చూసేవారు. వాటికి సంబంధించిన వివరణను చదివేవారు. కానీ ఇప్పుడు వాళ్లు చదవాలనుకున్నా, ఫొటో కాసేపే ఉంటోంది, తర్వాత వెళ్లిపోతోంది. వాటిపై ఉన్న వివరణను ప్రజలు పూర్తిగా చదవలేకపోతున్నారు. ఒక్కోసారి స్క్రీన్ బ్లాంక్‌గా కనిపిస్తోంది. జనాలకు అదంతా ఎక్కడ అర్థమవుతుంది. స్క్రీన్ మీద నడిచే ప్రకటనల్లా అనిపిస్తున్న అది జనాలను ఆకట్టుకోవడం లేదు. భారత చరిత్రలోని ఒక ముఖ్యమైన ఘటనను ఫోటోల్లో చూడాలనుకుంటున్న వారు దానిని కోల్పోతున్నారు" అన్నారు.

ఫొటోల విషయానికి వస్తే, అక్కడ పెద్ద మార్పులేం రాలేదని, ఒక కొత్త ప్రయోగం మాత్రం చేశామని దీపాంకర్ శ్రీ జ్ఞాన్ చెబుతున్నారు.

"ఈ స్క్రీన్‌పై ఆరు నుంచి 8 ఫొటోలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో నిమిషం ఆగుతుంది. జనం ఆ సమయంలో వాటి గురించి చదవచ్చు. దానితోపాటు ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే వచ్చి చూడచ్చు. ఏ ఫొటోకూ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రశ్నలు వస్తున్న ఫొటోలు అదే గ్యాలరీలో డిజిటల్ స్క్రీన్‌పై ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

"ఫొటోల డిజిటలీకరణ వల్ల తనకు ఎలాంటి సమస్యా లేదని చెబుతున్న తుషార్ గాంధీ, ఇందులో సంయమనం పాటించాలని. గాంధీ జీవితానికి సంబంధించిన ఫొటోలను ఒకే విధంగా ఉంచడానికి అనుమతించాలని, స్క్రీన్ పెట్టాలి అనుకుంటే, దానిని వేరే ఎక్కడైనా పెట్టి ఫొటోలు వచ్చేలా చేయచ్చని" చెబుతున్నారు.

గాంధీజీ గదిలో కూడా తాము ఎలాంటి మార్పులు చేయలేదని, ఎప్పటికీ చేయబోమని కూడా గాంధీ స్మృతి డైరెక్టర్ దీపాంకర్ శ్రీ జ్ఞాన్ చెప్పారు.

గాంధీ ఫొటోలు

ఫొటో సోర్స్, Gandhi smriti

ఏ ఫొటోలు డిజిటల్ చేశారు

గాంధీ స్మృతి మ్యూజియంను బిర్లా హౌస్‌ అని పిలుస్తారు. నాథూరాం గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీపై కాల్పులు జరిపినపుడు, మహాత్మాగాంధీ బిర్లా హౌస్ పరిసరాల్లో తుదిశ్వాస వదిలారు.

మహాత్మా గాంధీ తన జీవిత చరమాంకంలో ఇక్కడే గడిపారు. చనిపోవడానికి ముందు ఆయన ఉన్న గది ఇక్కడే ఉంది. ఒక విధంగా ఈ మ్యూజియం మహాత్మాగాంధీ జీవితానికి సాక్ష్యం లాంటిది

ఫ్రాన్స్ ఫొటోగ్రాఫర్ హెన్రీ కాట్రియర్ బ్రెసన్ మహాత్మాగాంధీ హత్య, అంత్యక్రియల ఫొటోలు తీశారు. వాటిని ఆయన గాంధీ స్మృతికి బహుమతిగా ఇచ్చేశారు. ఈ ఫొటోలను మ్యూజియం లాబీలో ఏర్పాటు చేశారు.

ఉద్దేశాలపై సందేహాలు

గాంధీ శాంతి ప్రతిష్ఠాన్ అధ్యక్షుడు కుమార్ ప్రశాంత్ కూడా గాంధీ స్మృతిలో ఒక మార్పు చూశానని, అది సరికాదని బీబీసీతో అన్నారు.

"డిజిటలీకరణ మరోలా చేసుండచ్చు. మీరు ఫొటోలను వాటి మూలాలు మార్చేసేలా తారుమారు చేయకూడదు. ఇప్పుటు టెక్నాలజీ ఎంత ముందుకెళ్లిదంటే, మీరు అవే ఫొటోలను మరింత అద్భుతంగా చూపించవచ్చు. ఇప్పుడు చేస్తున్నది చూస్తుంటే, ఆ ఫొటోల ప్రాధాన్యం పెంచడానికి, బదులు వాటిని తగ్గిస్తున్నట్లు ఉంది" అన్నారు.

బీజేపీని గాంధీ హత్యకు సంబంధించిన సమాచారం ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఎందుకంటే ఆయన్ను చంపినవారు వారికి సంబంధించిన వాడే అని కుమార్ ప్రశాంత్ అన్నారు.

గాంధీ ఫొటోలు

ఫొటో సోర్స్, Gandhi smriti

"గాంధీజీ పనులకు సంబంధించిన ఒక కలెక్షన్ ఉంది. '100 వాల్యూమ్స్. ద కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ'. దీని 100 ఎడిషన్లు వేశారు. గాంధీజీ ఏం చెప్పారో, ఏం రాశారో అవన్నీ ఒక దగ్గర ఇందులో ముద్రించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం పాడవకుండా కాపాడ్డానికి ఈ మొత్తం సేకరణలను డిజిటలీకరణ చేసింది. కానీ దానిని డిజిటలైజ్ చేసినప్పుడు, అందులో గాంధీజీ ఆర్ఎస్ఎస్ గురించి అన్న చాలా మాటల్ని తొలగించారు. దాదాపు 700 పేజీలు వాటిలో లేవు" అన్నారు.

దానిపై అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత ఆ అంశాలను డిజిటల్ ఎడిషన్లలో మళ్లీ జోడించారు. వారి రికార్డ్ ఎంత చెత్తగా ఉందంటే, వారిపై నమ్మకం ఉంచడమే అసాధ్యం. ఇది టెక్నికల్ అంశం. గాంధీజీ హత్య జ్ఞాపకాలను మరుగుపరచడంతోపాటూ, ఆయన హత్యను కూడా మరిచేలా చేయగలమని వారికి అనిపిస్తోంది. హత్య చేసిన వ్యక్తి వారిలోని ఒకరు. అందుకే వారి దారుణమైన ఆ ఇమేజ్ జనాల మనసుల్లోకి చేరకుండా, మొత్తం ఫొటోలను వారి కళ్ల ముందు నుంచి తొలగించేశారు.

"మ్యూజియంలో 1947 వరకూ చిత్రాలను చెక్కు చెదరకుండా ఉంచారని, 1948లో ఒక నెల పాటూ ఉన్న చిత్రాలను తొలగించి వాటి బదులు గాంధీజీ గ్రామ సభ ఆలోచన గురించిన వాటిని ఉంచారని సెంట్రల్ గాంధీ స్మారక నిధి అధ్యక్షుడు రామచంద్ర రాహీ చెప్పారు. గాంధీజీ జీవిత క్రమాన్ని అలా ముక్కలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కానీ ఈ ఆరోపణల వెనుక నిజాన్ని తెలుసుకోవాలంటే, అందరూ తమ మ్యూజియంకు రావాలని గాంధీ స్మృతి డైరెక్టర్ దీపాంకర్ శ్రీ జ్ఞాన్ చెబుతున్నారు.

నేను పాత, కొత్త మార్పులను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయో స్వయంగా అవే చెబుతాయి అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)