ఆర్ఎస్ఎస్‌తో గాంధీకి ఉన్న అసలు బంధం ఏమిటి? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఊర్విష్ కొఠారి
- హోదా, బీబీసీ కోసం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో గాంధీకి ఉన్న అసలైన బంధం ఏమిటి? ఈ ప్రశ్నలో 'అసలు' అన్న పదం నిజానికి అవసరం లేదు. కానీ, కొన్నిసార్లు వాస్తవాలు కూడా వక్రీకరణకు గురవుతాయి. చరిత్రను తమకు అనుగుణంగా మలుచుకునేందుకు కొందరు ఇలాంటివి చేస్తుంటారు.
''ముస్లిం సమాజంలోని అతివాద, జీహాదీ వర్గాలకు గాంధీ తలొగ్గిన విషయం వాస్తవమే అయినా, ఆర్‌ఎస్‌ఎస్ ఆయన పట్ల గౌరవంతోనే ఉండేది. ఆయన వారికి తలొగ్గారా అన్న విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి'' అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధి ఒకరు ఓ ఆర్టికల్ రాశారు.
ఇప్పటికే నిరూపితమైన చాలా వాస్తవాలను ఎత్తిచూపుతూ, ఈ ఆర్టికల్‌ను చాలా మంది తప్పుపట్టారు.
ఆర్‌ఎస్‌ఎస్, గాంధీల మధ్య బంధాన్ని అనుమానంతో కాకుండా, విశాల దృష్టితో చూడాలని మరో ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అన్నారు.
''గాంధీ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర లేదని సర్దార్ పటేల్‌కు ఓ సమయంలో నమ్మకం కుదిరింది. ఆర్ఎస్‌ఎస్‌పై బేషరతుగా ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది'' అని ఆయన వాదించారు.
అందుకే ఈ ప్రశ్న- ఆర్‌ఎస్‌ఎస్, గాంధీల మధ్య అసలు బంధం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
భరత మాత ఇద్దరికీ ఒకరు కాదు
1947లో మత అల్లర్లను చల్లార్చేందుకు గాంధీ దిల్లీకి వచ్చారు. అప్పట్లో భాంగి కాలనీగా ప్రాచుర్యం పొందిన చోట ఆయన ఉన్నారు.
దానికి సమీపంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ నడుస్తుండేది.
రోజూ అక్కడ కొందరు హిందూ యువకులు చేరేవారు. లాఠీలు పట్టుకుని కవాతులు, కసరత్తులు చేసేవారు. కాషాయ జెండాను ఎగురవేసి, భరత మాతకు సెల్యూట్ కొట్టేవారు.
''వాళ్ల హిందూ మాత, గాంధీ హిందూ మాత వేర్వేరు. గాంధీ చెప్పిన మాత ముందు కులం, వర్గం, మతం, జాతితో సంబంధం లేకుండా ఈ గడ్డపై ఉన్నవాళ్లందరూ సమానమే'' అని గాంధీ పర్సనల్ సెక్రటరీ ప్యారేలాల్ రాశారు.
''వాళ్ల తల్లి మహాకాళి లాంటిది. ఆమె ఉనికిని ప్రశ్నించినవాళ్లను, మిగతా మతాల వాళ్లను శిక్షించాలని ఆమె చెబుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.
''ముస్లిం నేషనల్ గార్డ్స్‌లాగే ఆర్ఎస్‌ఎస్ కూడా మతవాద హిందువులకు ఓ సైనిక సంస్థ లాంటిది. వాళ్ల మూఢ భావజాలమే జాతి పిత ప్రాణాలను బలి తీసుకుంది'' అని రాశారు. ('పూర్ణాహుతి-1', పేజీ 234, మనీబాయ్ దేశాయ్ చేసిన గుజరాతీ అనువాదం)
ఆర్ఎస్ఎస్ గురించి గాంధీ తన అనుచరుడు బ్రిజ్‌కృష్ణ చండీవాలాతో ఇలా అన్నారు:
''ఆ సంస్థ తొలి నాయకుడు మంచి ఉద్దేశాలతో ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ సంస్థ దొంగచాటుగా పనిచేస్తోంది. వారి కార్యకలాపాలు మారిపోయాయి. సంఘ్ వాళ్లు ఇప్పుడు హింసామార్గాన్ని నమ్ముతున్నారు'' ('బాపుని సేవమా', బ్రిజ్‌కృష్ణ చండీవాలా, పేజీ 74)
కొన్ని సంఘ్ శాఖలను గాంధీ సందర్శించారు. వీటిని, ముఖ్యంగా జమనలాల్ బజాజ్‌తో కలిసి 1934లో గాంధీ ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించిన సందర్భాన్ని చూపిస్తూ ఆయనతో ఆర్‌ఎస్‌ఎస్‌కు వైరమేదీ లేదని కొందరు చిత్రిస్తుంటారు. సంఘ్ విలువలపై గాంధీకి మంచి అభిప్రాయం ఉండేదని వాదిస్తుంటారు.
గాంధీ హత్యలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘ్ పాత్రను పోషించిందని నమ్ముతూ దాన్ని చీదరించుకుంటున్నవారి మనసు.. గాంధీకి ఒకప్పుడు ఆ సంస్థ పట్ల మంచి అభిప్రాయం ఉందని రుజువు చేస్తే మారుతుందా?
గాంధీజీ ఎవరి కీడూ కోరుకోలేదన్నది వాస్తవం.
మత ఘర్షణలు, హింసను ఎదుర్కొనే సమయంలోనూ ఎంతటి క్రూరుల్లోనైనా మంచితనం ఉంటుందనే గాంధీ నమ్ముతూ ఉండేవారు.
గాంధీకి ఉండే ఈ ఉదారభావాలను హిందూ ఛాందసవాద బృందాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్నే వాడుకుని చరిత్రను తమకు అనుకూలంగా కొత్తగా రాసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, RSS.ORG
గోల్వాల్కర్ మనస్పూర్తిగా చెప్పారా?
సంఘ్ చీఫ్ ఎమ్‌ఎస్ గోల్వాల్కర్ 'గురూజీ' గాంధీని చాలా ఉన్నతంగా చూసేవారు.
గాంధీ పట్ల ఆయన చాలా సార్లు మాటల్లో మాత్రమే చూపిన ఆదరణను కొందరు ఇప్పుడు తమ వాదనల్లో ప్రస్తావిస్తున్నారు. నిజంగా వాటిని ఆయన మనస్పూర్తిగా చెప్పి ఉంటారా?
గాంధీ, కాంగ్రెస్‌ల 'జాతీయవాదానికి' గోల్వాల్కర్ భావనలు పూర్తి వ్యతిరేకంగా ఉండేవి కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశం అందరిదీ అన్నది గాంధీ, కాంగ్రెస్‌ల విశ్వాసం. కానీ, దేశం హిందువులదేనన్నది సంఘ్ భావజాలం.
ప్రజాస్వామ్యం కోసం 'హిందూ రాజ్యం' ఆలోచనను వదులుకోవడాన్ని గోల్వాల్కర్ వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం 'పాత ఆక్రమణదారుల' (ముస్లింల)కు దేశంలో చోటు కల్పిస్తోంది.
ముస్లింలే కాదు, ఇతర మతాల వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని ఆయన సూచించారు. పౌరులుగా వాళ్లకు అధికారాలు కూడా ఇవ్వకూడదని అన్నారు. (ఇండియాస్ స్ట్ర్లగుల్ ఫర్ ఇండిపెండెన్స్, పేజీ 437-8)
గాంధీతో విభేదాలను వ్యక్తం చేసేందుకు గోల్వాల్కర్ వాడిన భాషను కూడా మనం తెలుసుకోవాలి. ‘‘ముస్లిం సమాజంలోని అతివాద, జీహాదీ వర్గాలకు గాంధీ లొంగిపోయారు'' అని ఆయన అన్నారు.
''హిందూ-ముస్లిం ఐకమత్యం లేకుండా స్వరాజ్యం సాధ్యం కాదనే వ్యక్తి సమాజానికి అతిపెద్ద మోసం చేశారు. మన ప్రాచీన (హిందూ) ప్రజల జీవన బలాన్నే చంపేశారు'' అని గోల్వాల్కర్ రాశారు.
''హిందూ-ముస్లిం ఐకమత్యం సాధించేందుకు అత్యంత సులభమైన పద్ధతి హిందువులందరూ ముస్లింలుగా మారిపోవడమే'' అని వ్యంగ్యంగా కూడా వ్యాఖ్యానించారు. (ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, పేజీ 438)
సంఘ్ శాఖను గాంధీ సందర్శించినప్పుడు గాంధీని 'హిందూ మతం ద్వారా అవతరించిన గొప్ప వ్యక్తి'గా సంఘ్ వర్ణించింది. ఆ సమయంలో గాంధీ ప్రసంగిస్తూ.. ''నేను హిందువైనందుకు గర్విస్తా. కానీ, నా హిందూ మతం అసహనపూరితం కాదు. వర్గాలుగా చీలిపోదు'' అని అన్నారు.
''అన్ని మతాల నుంచి గొప్ప విషయాలను హిందూ మతం స్వీకరిస్తుంది. అదే దాని గొప్పతనం. ఒకవేళ తమతో కలిసి జీవించాలనుకునే ఇతర మతాల వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారాలని హిందువులు నమ్మితే, హిందూ మతానికి అదే అంతం అవుతుంది'' అని వ్యాఖ్యానించారు. (పూర్ణాహుతి-4, పేజీ 18)

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఇస్లాం పట్ల, వారి విధానాల పట్ల తమకు ఎలాంటి వైరమూ లేదని సంఘ్ ఆయనకు భరోసా ఇచ్చింది.
''ముస్లింల హత్యల వెనుక మీ సంస్థ ఉందన్న ఆరోపణలు రుజువైతే మీకు సమస్యలు తప్పవు'' అని కూడా గాంధీ అప్పుడు అన్నారు.
ప్రసంగం పూర్తయ్యాక, సంఘ్ భావజాలాన్ని ప్రతిబింబించే ఓ ప్రశ్న గాంధీకి ఎదురైంది.
''అణిచివేతకు పాల్పడేవారిని చంపేందుకు హిందూ ధర్మం అనుమతించదా? అలా అయితే, కౌరవులను చంపమని శ్రీకృష్ణుడు ఎందుకు సలహా ఇచ్చాడు?'' అని ఒకరు గాంధీని అడిగారు.
''అణిచివేతకు ఎవరు పాల్పడుతున్నారో నిర్ణయించేవారు ముందు దోషరహితంగా ఉండాలి. వారిపై ఏ నిందలూ ఉండకూడదు. సరైన న్యాయం చేయడం అన్నది ప్రభుత్వం, న్యాయమూర్తి బాధ్యత. చట్టాన్ని వ్యక్తులు చేతుల్లోకి తీసుకోకూడదు'' అని గాంధీ చెప్పారు. (పూర్ణాహుతి-4, పేజీ 18)
సంఘ్ చాలా సార్లు గాంధీకి హామీలు ఇచ్చింది. మిగతా మత వర్గాలు ఇచ్చిన మాటలు విన్నట్లుగానే, వాటిని కూడా గాంధీ ఆలకించారు.
''మీ సంస్థ, మీ చేతులకు రక్తపు మరకలున్నాయని నాకు సమాచారం వచ్చింది'' అని గాంధీ ఓసారి గోల్వాల్కర్‌తో సమావేశమైనప్పుడు ఆయన్ను ప్రశ్నించారు.
గోల్వాల్కర్ ఈ ఆరోపణను తోసిపుచ్చారు.
''ముస్లింలను చంపే ఎజెండా మాకు లేదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే మా సంస్థ కృషి చేస్తోంది. శాంతినే కోరుకుంటోంది. ఈ విషయాన్ని మీరు కూడా ప్రచారం చేయాలి'' అని గోల్వాల్కర్ బదులిచ్చారు. (దిల్లీ డైరీ, పేజీ 11)
అప్పుడు గాంధీ.. ''నిజంగా మీ మాటలు గుండె లోతుల్లో నుంచే వస్తే, వాటిని జనాలు మీ నోటి నుంచి వినడమే బాగుంటుంది'' అని అన్నారు. (పూర్ణాహుతి-4, పేజీ 17)
ఆ తర్వాత ఓ ప్రార్థన సమావేశంలో గోల్వాల్కర్ అభ్యర్థన గురించి గాంధీ ప్రస్తావించారు.
కానీ, ఆ తర్వాత కూడా ఆర్‌ఎస్ఎస్ హింసాత్మక కార్యకలాపాల గురించి గాంధీకి ఫిర్యాదులు వస్తూనే ఉండేవి.

ఫొటో సోర్స్, Getty Images
గోల్వాల్కర్‌తో సమావేశం సందర్భంగా గాంధీతో ఆయన అనుచరుడు ఒకరు.. శరణార్థి శిబిరాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో క్రమశిక్షణ, తెగువ, శ్రమించేతత్వం కనిపించిందని అన్నారు.
దానికి గాంధీ.. ''హిట్లర్ నాజీలు, ముస్సోలిని ఫాసిస్టులు కూడా ఇలాంటి సేవలే చేసిన విషయాన్ని మరిచిపోవద్దు'' అని బదులిచ్చారు.
జమనలాల్ బజాజ్‌తో కలిసి ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించినప్పుడు అక్కడి కార్యకర్తల క్రమశిక్షణ, నిరాడంబరత్వాన్ని చూసి గాంధీ ముగ్ధుడైపోయారనే చెప్పేవారికి, ఆ తర్వాత రోజుల్లో గాంధీకి ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో దీని ద్వారా తెలుసుకోవచ్చు.
గోల్వాల్కర్, గాంధీల మధ్య జరిగిన సంభాషణను ప్యారేలాల్ అక్షరబద్ధం చేశారు.
దాని ప్రకారం గాంధీ ఆర్ఎస్ఎస్‌ను 'నియంతృత్వ వైఖరి కలిగిన మత సంస్థ'గా వర్ణించారు. (పూర్ణాహుతి-4, పేజీ 17)
గాంధీ హత్యతో, అతివాద హిందూ భావజాలానికి ఏ సంబంధమూ లేదని, గాంధీ గొప్ప హిందువని సంఘ్ అనుచరులు నిరూపించాలనుకుంటున్నారు. సగం నిజాలతో గాంధీ, ఆర్ఎస్‌ఎస్ మధ్య బంధాన్ని కొత్త కోణంలో చూపిస్తున్నారు.
కానీ, హిందువులు, ముస్లింల ఐక్యత కోసమే గాంధీ గొప్ప కృషి చేశారు. అలాంటి భావనను వ్యతిరేకిస్తూ, గాంధీ పట్ల చూపే గౌరవానికి అర్థం ఉండదు. అసత్యాల ప్రచారానికో, రాజకీయ మాయలకు మాత్రమే అది పనికివస్తుంది.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ గురించి పాకిస్తానీలు ఏమనుకుంటుంటారు?
- మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- కశ్మీర్లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
- గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు కారణమైన ఫోన్ సంభాషణ ఇదే
- 'బహిరంగ మల విసర్జన చేశారని ఇద్దరు దళిత చిన్నారులను కొట్టి చంపారు'
- పెళ్లిలో బీఫ్ బిర్యానీ వడ్డించిన కేసులో జైలుకెళ్లిన వ్యక్తిని విడుదల చేసిన గుజరాత్ హైకోర్టు
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- ఈ చైనా మహిళ గాంధీ ప్రభావంతో శాకాహారిగా మారారు, పాత దుస్తులు ధరిస్తారు, ఇంకా..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








