ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు : అభిప్రాయం

ఫొటో సోర్స్, TRS/FB
- రచయిత, మాడభూషి శ్రీధర్
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఫిరాయింపుల దెబ్బకు విలవిలలాడిపోయింది. బలహీన పడిపోయింది.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికై ఆ తరువాత శాసనసభకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 18కి తగ్గింది. మిగిలిన 18 మందిలో చాలామంది కాంగ్రెస్ వదిలి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి వెళ్లిపోతారని ఇన్నాళ్లూ పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. వెళ్లిపోతున్నామని వారే చెప్పారు కూడా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు ప్రలోభ పెట్టారో బయటికి రాదు. కానీ, ఫిరాయింపు బహిరంగంగానే జరుగుతుంది.

ఫొటో సోర్స్, TRS/FB
ఇదో టోకు ఫిరాయింపు
ఇటీవల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి నాయకులు చేసిన ప్రకటనలను బట్టి వారిది ఫిరాయింపు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి టీఆర్ఎస్‌కు వెళ్లడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు కింద అది విలీనమే అవుతుంది గానీ ఫిరాయింపు కాదు. కనుక సంవిధాన బద్ధమే అనుకోవాలి. కాని సంవిధాన నీతికి, సంవిధానం రూపొందించిన రీతికి తగినదేనా అని ఆలోచించాల్సి ఉంటుంది.
విలీనం అని మర్యాదగా పిలుచుకునే ఈ పని నిజానికి టోకు ఫిరాయింపు. ఒక్కరు పార్టీ మారితే అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి ఊడుతుంది. కానీ, 12 మంది మారితే వారు గౌరవప్రదంగా విలీనమయ్యారని వారికి అనర్హత వేటు పడదని అంటే సామాన్యులకు ఈ న్యాయం అర్థం కాదు.

ఫొటో సోర్స్, TRS
ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా...
కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద జనం ఓట్లేస్తే గెలిచిన వీరు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా టీఆర్ఎస్‌తో కలిశారు. కనుక, వీరిని టీఆర్ఎస్ నేతలే తమవైపు తిప్పుకున్నట్టు అవుతుంది. కానీ, అందుకు రుజువులు, ఆధారాలు ఉండవు. టీడీపీ గుర్తు మీద 2014లో ఎన్నికై టీఆర్ఎస్ పార్టీలోకి మారి ఆ తరువాత ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ గులాబీ పార్టీపై వస్తున్న విమర్శలకు గట్టిగా జవాబిచ్చారు. 2004 ఎన్నికల తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం రాజ్యంగబద్ధమైనపుడు, ఈరోజు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుందని అడిగారు. ఇది సరైన ప్రశ్నే. ఎన్నికల ద్వారా బలం పెంచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపులతో బలహీన పడలేదని అనలేం. ఆ గండాన్ని దాటి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ చాలా శ్రమపడవలిసి వచ్చింది. ఆ రోజుల్లో టీఆర్ఎస్‌లో ఎవరిని పలకరించినా ప్రలోభాలతో ఫిరాయింపజేసే కాంగ్రెస్ రాజకీయాన్ని తీవ్రంగా విమర్శించారని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్‌ను విమర్శించడంలో తప్పు ఉండే అవకాశం లేదు. అయితే టీఆర్ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ.

ఫొటో సోర్స్, Getty Images
టీఆర్ఎస్‌కు వచ్చే లాభమేమీ లేదు
కాంగ్రెస్ జాతీయ పార్టీ. శాసనసభలో ఘోర పరాజయం తరువాత లోక్‌సభలో తెలంగాణ నుంచి మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మొత్తంగా టీఆర్ఎస్‌లో విలీనం కాలేదు. కేవలం శాసనసభాపక్షంలోని మూడింట రెండు వంతుల మంది మాత్రమే చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా ఉంది. పూర్తిగా సమసిపోలేదు. పోతుందని చెప్పలేము కూడా. ఈ విలీనం వల్ల టీఆర్ఎస్‌కు రాజకీయంగా కొత్తగా వచ్చే లాభమేదీ లేదు. కానీ, ప్రతిపక్షం బలహీన పడుతుంది. ఇప్పడికే ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ శాసనసభలో టీఆర్ఎస్, మజ్లిస్ తరువాత మూడో స్థానానికి చేరింది. మజ్లిస్ ప్రభుత్వానికి మిత్రపక్షం కావడంతో, ఆరుగురు సభ్యులతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా మిగిలిపోతుంది. ఈ ఆరుగురైనా విమర్శలు, వాకౌట్లు చేయకుండా ఉండరు. శాసనసభలో ఎదురులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ కొనసాగుతుంది.
ఈ చీలిక వంటి విలీనం వెనుక లేని రాజ్యాంగ నైతికత గురించి ఆలోచిస్తే మరికొన్ని అంశాలు మనకు తెలుస్తాయి. ఒకరిద్దరుగా శాసన సభ్యులు తాము కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరతామని ఇదివరకే ప్రకటించారు. శాసనసభలో ఓటింగ్ సమయంలో విప్ ఉల్లంఘించడం ఒక్కటే ఫిరాయింపునకు నిదర్శనం కాదని, ఉన్న పార్టీకి రాజీనామా చేసినా... వేరే పార్టీలో చేరుతున్నట్టు బాహాటంగా ప్రకటించినా, అదికూడా ఫిరాయింపు కిందికే వస్తుందని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో తీర్పునిచ్చింది.

10వ షెడ్యూల్‌ను పరిహసించడమే
ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరతామని చెప్పి, మరికొందరు కూడా వస్తారని బహిరంగంగా చెప్పినప్పుడే వారు ఫిరాయించినట్టు. అది చీలికా కాదు, విలీనమూ కాదు. విడివిడిగా వచ్చిన ఆ ఎమ్మెల్యేల సంఖ్య 12 అయ్యే దాకా ఆగి, తరువాత తీరిగ్గా టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం జరిగింది. విలీనం చాటున ఇవి 12 ఫిరాయింపులు అనక తప్పదు. విలీనానికి కావలసిన సంఖ్య కన్నా తక్కువ మంది ఫిరాయించినట్టు ప్రకటించినపుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన స్పీకర్ ఈ ఫిర్యాదులను పక్కన బెట్టి, 12 మంది రాగానే విలీనమని అధికారులతో చెప్పించి వారిని టీఆర్ఎస్‌లో కలుపుకున్నట్టు ప్రకటించారు. ఒకరు ఇద్దరు చొప్పున వస్తూ ఉంటే ఫిరాయింపు నిషేధం కింద అనర్హుడిగా ప్రకటించకుండా 12 మంది కాగానే విలీనం అని స్పీకర్ ఆమోదించడం అంటే 10 షెడ్యూలును పరిహసించడమే.

ఫొటో సోర్స్, TRS/FB
స్పీకర్ అధినేత కాదు ప్రతినిధి మాత్రమే
1995లో టీడీపీలో ఎన్.టి.రామారావు, చంద్రబాబు నాయుడు మధ్య 'వైస్రాయి' సంక్షోభం తలెత్తినప్పుడు ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు.. ఇప్పడు తెలంగాణ స్పీకర్ శ్రీనివాసరెడ్డి చేసిన పనే చేశారు.
స్పీకర్ శాసనసభకు అధినేత కాదు. శాసనసభకు ప్రతినిధిమాత్రమే. శాసనసభను నడిపే ఒక కన్వీనర్ మాత్రమే. బ్రిటన్‌లో స్పీకర్ శాసనసభ ప్రతినిధిగా రాజుతో సభ పక్షాన మాట్లాడే వ్యక్తి కనుక స్పీకర్ అన్నారు. అధికార పార్టీకి చెందిన సభ్యుడే స్పీకర్ అవుతారు కనుక అతను ఒక న్యాయమూర్తిగా వ్యవహరించి ఫిరాయింపులు చేసిన వారిని అనర్హులుగా ప్రకటించే ధైర్యం చేసే అవకాశం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే తప్ప ఏ స్పీకరూ ఏ ఉపరాష్ట్రపతి (రాజ్యసభ చైర్మన్) సత్వరం చర్య తీసుకుని అధికార పార్టీకి నష్టం కలిగించే విధంగా ఫిరాయించిన సభ్యుడ్ని శిక్షించిన సంఘటనలు దాదాపు లేనే లేవు.

ఫొటో సోర్స్, BHUMA AKHILA/FB
రాజ్యాంగం పట్ల గౌరవం లేదు
2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి తగినంత ఆధిక్యత వచ్చినా వైసీపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా తమ పార్టీలోకి ఫిరాయింప జేసింది. ఒకరిద్దరికి మంత్రిపదవి కూడా ఇచ్చింది. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఎన్నడూ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని గౌరవించింది లేదు.
ప్రభుత్వాలను పడగొట్టడానికి మాత్రమే కాక ప్రతిపక్షాలను మరింత బలహీనం చేయడానికి ఫిరాయింపులను వాడుకోవడం బీజేపీ ప్రస్తుత విధానం. అయితే, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో చాలా మందికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. పెట్టిన ఖర్చులను లాభాలతో సహా వసూలు చేసుకోవడానికి అధికార పార్టీలో ఉండడమే మంచిదనే అవినీతిపరులు ఎక్కువ మంది. ఇప్పుడు ఏపీలో టీడీపీ సభ్యులను తన పార్టీలో చేర్చుకోవడానికి జగన్ సిద్ధంగా లేరు. ప్రలోభ పెట్టకుండానే చేరడానికి టీడీపీ సభ్యులే సిద్ధంగా ఉన్నారు.
అయితే టీడీపీ సభ్యులు వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ పొంచి ఉంది. బీజేపీ నేత రాంమాధవ్ అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి వారసులను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఫిరాయింపుల ద్వారా రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకుంటామనే రీతిలో ప్రత్యర్థులకు బీజేపీ సవాలు విసురుతున్నది.

ఫొటో సోర్స్, RAM MADAV/FB
అన్నిచోట్లా ఇదే తంతు
ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన రాజకీయం కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. పశ్చిమ బంగాలో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి ఫిరాయించడానికి సిధ్దంగా ఉన్నారని ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. 40 మంది వచ్చినా అది విలీనం కాబోదు. 40 ఫిరాయింపులే అవుతాయి. పశ్చిమ బంగా స్పీకర్ ముందుకు టీఎంసీ ఫిర్యాదు వస్తే ఫిరాయించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలను తొలగించడం మామూలు విషయమే. లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి పార్టీలను చీల్చి, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది.
రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా..
అధికార పార్టీ ప్రలోభాలు లేకుండా ఫిరాయింపు సాధ్యం కాని రోజులు ఇవి. ఫిరాయింపులే వ్యూహాలుగా బీజేపీ చెలరేగుతున్నది. పశ్చిమ బంగా, కర్నాటక, ఏపీ, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా సరే వారు లాక్కునేందుకు సిద్ధం. ఇప్పుడు మనకున్న 10 షెడ్యూలు ఫిరాయింపులు నిరోధించడంలో పూర్తిగా విఫలమైంది. పార్టీలు స్వచ్ఛందంగా చీలిపోవడం, విలీనం కావడం అనేది జరగనే జరగదు. తెలంగాణలో ఇప్పటికైనా ఈ విలీనం రాజ్యాంగ విరుద్ధమని వారిని అనర్హులుగా ప్రకటించాలని, స్పీకర్ వంటి పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆ పదవి నుంచి తొలగి పోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రిట్ పిటిషన్ వేయడం లేదో అర్థం కావడం లేదు.
ప్రజాస్వామ్యాన్ని పరిహసించి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలకు పాలించే అర్హత లేదు. ఇది రాజకీయుల రాజ్యాంగ అవినీతి. తమ పదవికి వన్నె తెచ్చే మంచి బుద్ధి స్పీకర్లకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
(రచయిత కేంద్రమాజీ సమాచార కమిషనర్, బెన్నెట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- ఏపీ శాసనసభలో ప్రొటెం స్పీకర్ విధులేంటి? ఈసారి ప్రొటెం స్పీకర్ ఎవరు?
- వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: ‘నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక ఆశ, అదేంటంటే..’
- ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000 పంచారు.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం’’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








