కూలి డబ్బుల కోసం ఘర్షణ, ట్రాక్టర్‌తో తొక్కించి ఇద్దరి హత్య.. అసలేం జరిగింది- గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
'నా పెనివిటి జ్వరంతో ఇంట్లో ఉంటే ఆయప్ప (చంద్రా నాయక్ ) ఇంటికాడికొచ్చి ... పనికాడికొస్తే డబ్బిస్తానని చెప్పి తీసుకుపోయి చంపేసినాడు. కష్టపడి పనిచేసి కూలీ డబ్బు అడిగితే ట్రాక్టరుతో తొక్కిచ్చాడు. మా ఆయన్ను దారుణంగా చంపినవాణ్ని ప్రభుత్వం అంతే దారుణంగా శిక్షించాలి' అంటోంది రెడ్డమ్మ.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో మే 30న ఇద్దరు యువకులను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేసిన ఘటనలో చనిపోయిన హరికుమార్ భార్యే ఈ రెడ్డమ్మ.
ఈ ఘటన పలువురిని కలచివేసింది. దీనికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, మానవ హక్కుల సంఘాలను బీబీసీ కలిసి వివరాలు సేకరించింది.
'ఘర్షణ... హత్య'
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన ట్రాక్టర్ యజమాని చంద్రా నాయక్ వద్ద హరికుమార్, నాగభూషణం లోడింగ్ కూలీలుగా పనిచేసేవారు. పుంగనూరు మండలంలోని ఎల్.ఆర్. బయలు క్వారీ వద్ద చంద్రా నాయక్‌కు హరికుమార్‌కు గొడవ జరిగింది. ఈ గొడవలో చంద్రానాయక్ ఆగ్రహంతో హరికుమార్‌ను గడ్డపారతో కొట్టారు. గాయపడిన హరికుమార్ అక్కడి నుంచి వెళ్లి కొద్దిసేపటి తర్వాత నాగభూషణంతో కలిసి బైక్ పై వచ్చారు. ఇసుక లోడుతో వెలుతున్న చంద్రానాయక్ ట్రాక్టరును అడ్డగించారు.
దీంతో ఆగ్రహానికి గురైన చంద్రా నాయక్ డబ్బు తీసుకుని పనిచేయకుండా తననే బెదిరిస్తారా అంటూ హరికుమార్, నాగభూషణంలను తన ట్రాక్టరుతో తొక్కించి పారిపోయారు.

'కూలీ డబ్బులడిగితే చంపేశారు'
కూలీ డబ్బులు అడిగారనే కారణంతోనే తన భర్తను చంపేశారని హరికుమార్ భార్య రెడ్డమ్మ అన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ, 'కూలి అడ్వాన్సుగా చంద్రానాయక్ దగ్గర నా భర్త మూడు వేలు తీసుకున్నాడు. మూడు వారాలకు పైగా ట్రాక్టరుకు ఇసుక ఎత్తినాడు. ఈ మధ్య ఆరోగ్యం సరిలేదు. దాంతో బండికి పోవడం మానేశాడు.
అడ్వాన్స్ డబ్బు మూడువేలు పట్టుకొని తనకు రావాల్సిన మిగిలిన డబ్బు ఇవ్వమని నా భర్త ఎన్నిసార్లు అడిగినా ఆయప్ప (చంద్రా నాయక్) ఇవ్వలేదు. మొన్న ఆయప్పే ఇంటికాడికొచ్చి పనికాడికొస్తే డబ్బులిస్తానని చెప్పి బండ్లో ఎక్కిచ్చుకుపోయి చంపేశాడు. నాకు ముగ్గురు పిల్లలున్నారు. సొంత ఇల్లు కూడా లేదు. బిడ్డలను ఏలా బతికించుకోవాలో అర్థం కావడంలేదు " అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

'అదే గొడవకు కారణం'
చంద్రా నాయక్ వద్దే పనిచేసే శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ 'మా బామార్ది (హరికుమార్ )కి ఒళ్లు బాగా లేకుండే. పనికి రాలేను కూలీ డబ్బులిస్తే ఆస్పత్రికి వెళుతానని ఓనర్‌తో అన్నాడు. కానీ, ఒక లోడు వేసి పో దానికి కూడా డబ్బులిస్తానని ఓనర్ చెప్పాడు. కానీ, పనికి వచ్చేసరికి ప్రాణం ఎక్కువ సుస్తైపోయింది. మేమందరం ఇసుకేస్తుంటే అతను పని చేయలేకపోయాడు. ఓనర్ వచ్చి పనిచేస్తేనే డబ్బులిచ్చేది ఏదోకటి చెప్తే కుదరదు అని దబాయించాడు. దీంతో హరికుమార్ ఎదురుతిరిగాడు.దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. మావాడ్ని కిందపడేసి కొట్టినాడు' అని చెప్పారు.

మృతులిద్దరూ అన్నదమ్ములు
ట్రాక్టర్ ఘటనలో మృతి చెందిన హరికుమార్, నాగభూషణం చిన్నాన్న పెదనాన్న కొడుకులు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హరికుమార్‌కు తల్లిదండ్రులు గంగులప్ప, పార్వతమ్మతో పాటు భార్య రెడ్డెమ్మ, కుమార్తె స్వర్ణలత (8), కుమారులు సుదర్శన్ (5), యశ్వంత్ (2) ఉన్నారు.
నాగభూషణం తండ్రి గంగులప్ప చిన్నప్పుడే చనిపోయారు. దీంతో తల్లిని, మరో సోదరుడిని నాగభూషణమే కూలీ పనులు చేసి పోషిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవటంతో అతని తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు.

ఒప్పందం పేరుతో శ్రమ దోపిడీ
మదనపల్లి రూరల్ పరిసరాల్లో పెద్దగా పరిశ్రమలు లేకపోవటంతో ఉపాధి అవకాశాలు తక్కువ. దీనికితోడు కరువు ప్రాంతం కావటంతో వ్యవసాయ ఆధారిత పనులు దొరకటం కష్టమే. దీంతో వీరంతా రాళ్లు కొట్టడం .. మట్టి, ఇసుకను ట్రాక్టర్లకు నింపటం వంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు.
వీరి అవసరాలను ఆసరాగా చేసుకునే కాంట్రాక్టర్లు, వ్యాపారులు ముందుగా వారికి కొంత డబ్బు అడ్వాన్సుగా ఇచ్చి కూలీ పని చేయాలని నోటిమాటగా ఒప్పందం చేసుకుంటారు. ఎవరైనా ఒప్పందం రద్దు చేసుకోవాలంటే అడ్వాన్సు డబ్బు తిరిగి కంట్రాక్టరుకు లేదా యజమానికి చెల్లించి మరో చోటి పనికి వెళ్లవచ్చు.
కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఈ గ్రామంలోనే కాకుండా మదనపల్లి టౌనుతోపాటు సమీప గ్రామాల్లోని పేదలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ కూలి బీబీసీతో మాట్లాడుతూ "ఇసుకగాని, మట్టిగాని తవ్వి శుభ్రం చేసి ట్రాక్టర్ నింపితే రూ. 350 నుంచి రూ. 400 వరకు ఇస్తారు. ఆ పని ఒకరు చేసినా పదిమంది కలిసి చేసినా ఇచ్చేది మాత్రం అంతే . మామూలుగా నలుగురం కలసి ఒక ట్రాక్టర్ నింపుతాం. రోజుకు మూడు లేదా నాలుగు ట్రాక్టర్లు లోడ్ చేస్తాం. రోజుకు రూ. 350 వస్తుంది. రెక్కల కష్టంతో కూడుకున్న పని కాబట్టి రోజూ చేయలేం. అనారోగ్యంతోనూ, సొంత పని వల్లో పనికి రాకపోతే కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ యజమానుల నుంచి బెదిరింపులు ఎదుర్కోవాల్సిందే.
కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ యజమానులు ఒకే మాటపై ఉంటారు. వాళ్లు నిర్ణయించిన కూలీకే పనిచేయాలి.
గతంలో చంద్రానాయక్ ఒక లోడుకు రూ.400 ఇచ్చేవాడు. ఇప్పుడు రూ.350 ఇస్తున్నాడు. మా శ్రమను దోచుకుంటున్నారు. బెదిరించే స్థాయి నుంచి ప్రాణాలు తీసేంతగా బరితెగిస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రానాయక్ స్వస్థలం పెద్దమండెం . 10 ఏళ్ల కిందట మదనపల్లికి వచ్చి స్థిరపడ్డాడు. హరికుమార్, నాగభూషణం హత్యకేసులో ఇతనిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు మదనపల్లి రూరల్ సీఐ కె.రమేశ్ బీబీసీకి తెలిపారు.

'ప్రభుత్వం ఆదుకోవాలి'
కూలీ అడుగితే ట్రాక్టరుతో తొక్కించి చంపటం దారుణమని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పౌరహక్కుల సంఘం ప్రకటించిది. తమ దగ్గర పనిచేసేవారిని చంపే హక్కు యజమానులకు ఎవరిచ్చారని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. తక్షణమే ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని, హత్య చేసిన చంద్రానాయక్ పై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








