కెన్యా: నోట్ల రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై విమర్శలు

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.
ఇప్పుడు కెన్యా అధ్యక్షుడు అహురు కెన్యట్టా కూడా అలాంటి ప్రకటనే చేశారు. దేశంలో ప్రస్తుత కరెన్సీని కొత్త నోట్లతో మార్చేస్తున్నట్లు ప్రకటించారు.
అవినీతి, మనీ ల్యాండరింగ్‌ను అంతం చేసేందుకు కెన్యా ప్రజలు అక్టోబర్ 1 లోపు తమ దగ్గర ఉన్న వెయ్యి షిల్లింగ్ నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవాలని సూచించారు.
రకరకాల డినామినేషన్లతో ఉన్న కొత్త నోట్లను రాబోవు నెలల్లో దశలవారీగా చెలామణిలోకి తీసుకురానున్నారు.
కొత్త నోట్ల డిజైన్ దేశంలో కొందరికి ఆగ్రహం తెప్పించింది. కొత్త కరెన్సీపై కెన్యా తొలి అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడి తండ్రి జోమో కెన్యట్టా విగ్రహం ముద్రించడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నిర్ణయంపై కోర్టుకెక్కారు.

ఫొటో సోర్స్, Getty Images
కెన్యా నోట్లు ఎందుకు మారుస్తోంది
నిధుల దుర్వినియోగం అడ్డుకుని, భారీగా ఉన్న వెయ్యి షిల్లింగ్ నోట్ల సమస్యను పరిష్కరించాలని కెన్యా ఈ నోట్లు రద్దు చేసింది.
కెన్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పాట్రిక్ ఎంజోరోగే కూడా "కెన్యాలో, పొరుగు దేశాల్లో అక్రమ ఆర్థిక కార్యకలాపాల కోసం పెద్ద నోట్లు ఉపయోగిస్తున్నారు" అని ఆందోళన వ్యక్తం చేశారు.
కెన్యాలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ వెయ్యి షిల్లింగ్ నోటే. తూర్పు ఆఫ్రికాలో కెన్యా షిల్లింగ్‌కు అమెరికా డాలర్‌తో సమానంగా గుర్తింపు ఉందని ఆయన చెప్పారు.
2013లో అధ్యక్షుడుగా ఎన్నికైనప్పుడు అవినీతిని అంతం చేస్తానని కెన్యట్టా వాగ్దానం చేశారు.
"చెలామణి కోసం ఉపయోగించే నాణేలు, నోట్లు, విలువైన లోహాలను ఉపసంహరించడం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని కెన్యాలో నోట్ల రద్దు గురించి మాట్లాడిన బీబీసీ ఆఫ్రికా బిజినెస్ రిపోర్టర్ జియోర్జీ ఎండిరాంగూ అన్నారు.

మార్పు ఎలా జరగబోతోంది
కెన్యా ప్రజలు పాత వెయ్యి షిల్లింగ్ నోట్లు మార్చుకోడానికి ప్రభుత్వం ఇచ్చిన నాలుగు నెలల గడువు సరిపోతుందని ఎంజోరోగే అన్నారు.
"5 మిలియన్ షిల్లింగ్స్ కంటే తక్కువ డబ్బును మార్చుకునేవారు తమ స్థానిక బ్యాంకుల ద్వారా మార్చుకోవచ్చు. అంతకు మించితే మాత్రం కెన్యా సెంట్రల్ బ్యాంక్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అక్రమ నగదును తమ దేశంలో మార్చుకోకుండా చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది" అని తెలిపారు.

కొత్త కరెన్సీ గురించి కెన్యా ప్రజల ఆగ్రహం ఎందుకు
కొత్త నోట్ల డిజైన్లో దేశంలోని వన్యప్రాణులను, కెన్యా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను చూపిస్తూ మధ్యలో జోమో కెన్యట్టా ఉన్న విగ్రహాన్ని కూడా ముద్రించారు.
కెన్యాకు స్వాతంత్రం తీసుకురావడంలో జోమో కెన్యట్టా ప్రధాన పాత్ర పోషించారు. తర్వాత ఆ దేశానికి తొలి అధ్యక్షుడు అయ్యారు.
కానీ, నాణేలు, నోట్లు లాంటి వాటిపై వ్యక్తుల ఫొటోలు, బొమ్మలు ముద్రించకూడదని కెన్యా రాజ్యాంగం చెబుతోంది.
మానవ హక్కుల కార్యకర్త ఒకియా ఒంతతా ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. "నోట్లు డిజైన్ చేయడంలో, ప్రస్తుత వెయ్యి షిల్లింగ్ నోటు రద్దు చేయడంలో ప్రజల భాగస్వామ్యం కొరవడింది" అని అన్నారు.
కానీ దేశంలో కొందరు అధ్యక్షుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఆ చిత్రం నోటు మీద ఉండడం ఆయనకు ఇచ్చే గౌరవం అంటున్నారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN
నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న మిగతా దేశాలేవి
2016లో భారత్‌లో రాత్రికి రాత్రే వెయ్యి, 500 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అప్పుడు ఇది సుదీర్ఘ ఆర్థిక సమస్యలకు కారణమైందని కొందరు విమర్శించారు. కానీ, పన్ను ఎగవేతలు అడ్డుకోడానికి, తీవ్రవాదులకు నిధులు అందకుండా, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఇలా చేశామని ప్రభుత్వం చెప్పుకుంది.
నైజీరియా కూడా అవినీతిని అంతం చేసేందుకు 1984లో నోట్లు రద్దు చేసింది.
పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు 1982లో ఘనా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ఆత్మకు శాంతి కలగాలని చనిపోయిన 17 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు
- అమెరికా వీసా: ‘సరదాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రమాదంలో పడేయొచ్చు’
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది
- గూగుల్ యాప్స్ లేని మొబైల్ ఫోన్ల భవిష్యత్ ఎలా ఉంటుంది?
- ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









