భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి గఫూర్ బదిలీ

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, అబిద్ హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక సైన్యం అధికార ప్రతినిధి జాతీయస్థాయి 'సెలెబ్రిటీ' కావడం, తనపై ఇంటర్నెట్‌లో మీమ్‌లు చక్కర్లు కొట్టడం, తన పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం అరుదు.
అలా ప్రాచుర్యం పొందిన ఓ అధికారి- పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. మూడేళ్లపాటు వార్తల్లో నిలిచిన ఆయన ప్రశంసలూ, విమర్శలు సమాన స్థాయిలో అందుకున్నారు.
ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ పోస్టు నుంచి గఫూర్ ఇటీవల బదిలీ అయ్యారు. బదిలీ ఊహించిందే. అయితే సోషల్ మీడియాలో టీవీ యాంకర్ సనా బుచాతో అనుచిత ఘర్షణ తర్వాత కొన్ని రోజులకే ఆయన బదిలీ అయ్యారు. ఈ వివాదంతో ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి.
ట్విటర్లో గఫూర్ చేసిన అనేక వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. వీటికి నెటిజన్ల నుంచి పెద్దయెత్తున స్పందన వచ్చింది.
ట్విటర్లో ఆయన చర్చకు తెచ్చే అంశాలు యాదృచ్ఛికమైనవిగా అనిపించేవి.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దిల్లీలో ఉద్యమిస్తున్న నిరసనకారుల వద్దకు వెళ్లినందుకు భారత ప్రముఖ నటి దీపికా పదుకోణ్‌ను గఫూర్ ప్రశంసించడం భారత్‌కు కోపం తెప్పించింది.
కాలిన గాయాలకు వాడే ఔషధం ఫొటో దగ్గర్నుంచి వీధికుక్కల వరకు ఏదైనా ఆయన తేలిగ్గా పోస్ట్ చేసేవారు.

ఫొటో సోర్స్, Twitter/sanabucha
ట్విటర్లో భారత మాజీ సైనికాధికారులు, జర్నలిస్టులతో ఆయన తరచూ వాదనలకు దిగేవారు. పాకిస్తాన్ సైన్యాన్ని విమర్శించే పాకిస్తానీ జర్నలిస్టులు, వ్యక్తులను ట్రాల్ చేసేవారు.
కొన్ని రోజుల క్రితం పాక్ సైన్యాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేసిన టీవీ యాంకర్ సనా బుచాతో గఫూర్ ఘర్షణకు దిగారు. కొంచెం హుందాగా ప్రవర్తించాలని ఆయనకు ఆమె సూచించారు. నర్మగర్భమైన హెచ్చరిక కూడా చేశారు.
వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో సనాను దుర్భాషలాడుతూ ట్విటర్లో ఇతర యూజర్లు పెద్దయెత్తున పోస్టులు పెట్టారు. తనకు ఇలా గతంలోనూ జరిగిందని సనా చెప్పారు.
"వాళ్లు నా కుటుంబాన్ని, నా స్నేహితులను, నా పరిచయస్తులను కూడా చర్చలోకి తీసుకొచ్చి దుర్భాషలాడుతుంటారు. మహిళను లొంగి ఉండేలా చేయడం తేలికని వాళ్లు అనుకుంటారు" అని సనా బీబీసీతో చెప్పారు.
పౌర-సైనిక సంబంధాల దృష్ట్యా సోషల్ మీడియాలో ఐఎస్‌పీఆర్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సనా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Twitter
ట్విటర్లో ఐఎస్‌పీఆర్ డీజీ వ్యక్తిగత హోదాలో స్పందించాలనుకుంటే వ్యక్తిగత ఖాతా పేరు మీద స్పందించవచ్చని అధికారిక సమాచారం చెబుతోంది.
వ్యక్తిగత ఖాతా అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
డీజీకి వ్యక్తిగత ఖాతాయే ఉండకూడదని ఒక మాజీ సైనిక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సైన్యంపై ఆన్‌లైన్‌లో విమర్శలకు సమాధానమిచ్చేందుకు వ్యక్తిగత ఖాతాను ఉపయోగించుకోవడం సముచితమేనని మరో మాజీ సైనిక ఉన్నతాధికారి గులామ్ ముస్తఫా చెప్పారు. అయితే కొన్నిసార్లు ఐఎస్‌పీఆర్ డీజీ వ్యక్తిగత హోదాలో గఫూర్ స్పందన అంత సానుకూల ప్రభావం కలిగించేలా లేదని వ్యాఖ్యానించారు.
నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సోషల్ మీడియా వాడకంలో, పదాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యూహాత్మక సమాచార పంపిణీ నిపుణుడు, మాజీ జర్నలిస్ట అనీఖ్ జాఫర్ బీబీసీతో చెప్పారు.
2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధిగా గఫూర్ ట్విటర్లో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సైనిక, పౌర వర్గాల్లో విమర్శలు వచ్చాయి.
గఫూర్ ఎత్తుగడలను భారత సైన్యంలో సైబర్ భద్రత సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) రాజేశ్ పంత్ డిసెంబరులో వ్యంగ్యంగా ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రచార యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ విజయం సాధిస్తోందని, ఉదాహరణకు కశ్మీర్ అంశాన్నే తీసుకుంటే, ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనే సందేశాన్ని ఐరోపా దేశాలకు పాక్ పంపించగలుగుతోందని ఆయన్ను ఉటంకిస్తూ 'ఇండియా టుడే' తెలిపింది.
పాకిస్తాన్ 'ఐదో తరం' యుద్ధాన్ని ఎదుర్కొంటోందని, ఇది సోషల్ మీడియాలో జరుగుతోందని, అక్కడ పాక్‌కు దీటైన రక్షణ వ్యవస్థ ఉండాలని గఫూర్ అనేకసార్లు మీడియా సమావేశాల్లో, ట్విటర్లో వ్యాఖ్యానించారు.
2019 ఏప్రిల్లో ఐఎస్‌పీఆర్ ఉద్యోగులకు సంబంధించినవంటూ 103 గ్రూపులను, ఖాతాలను ఫేస్‌బుక్ తొలగించింది.
నిరుడు కశ్మీర్‌పై భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే ఆరోపణలున్న చాలా మంది పాకిస్తానీ యూజర్ల ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేసింది.
యూజర్ల ఖాతాలపై చర్యల విషయంపై పరిశీలన జరపాలని తాను ట్విటర్‌ను కోరినట్లు గఫూర్ గతంలో ట్విటర్లో చెప్పారు. ట్విటర్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, బాధ్యతాయుతంగా మెలగాలని తన నాలుగున్నర లక్షల మందికి పైగా ఫాలోయర్లకు ఆయన అక్టోబర్లో సూచించారు.
ఇవి కూడా చదవండి:
- అభినందన్ భార్య ఈమేనా?
- ఇక అన్నింటికీ సిద్ధంగా ఉండండి.. పాక్ ప్రజలకు, సైన్యానికి ఇమ్రాన్ ఖాన్ పిలుపు
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- చమురు కోసం జరిగే అంతర్జాతీయ ఘర్షణలకు సౌర విద్యుత్ ముగింపు పలుకుతుందా...
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?
- 2020 నాటికి నేనేమవుతాను? ప్రపంచం ఏమవుతుంది? అని 29 ఏళ్ల కిందట ఊహించిన బాలుడు
- జపాన్‌లో డబ్బులిచ్చి ఉద్యోగాలు మానేస్తున్నారు.. ఎందుకు
- కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








