అభినందన్ భార్యతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారా? - BBC FactCheck

సెల్పీ వీడియో

ఫొటో సోర్స్, Screen grab/Yuv Desh

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్
    • హోదా, బీబీసీ న్యూస్

పాక్‌ చేతిలో బందీగా ఉన్న అభినందన్ వర్ధమాన్ భార్య ఈవిడేనంటూ సోషల్ మీడియాలో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజం ఎంత?

బుధవారం నాడు భారత యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసి, వింగ్ కమాండర్ అభినందన్‌ను అదుపులోకి తీసుకుంది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో అభినందన్ పాకిస్తాన్‌కు పట్టుపడటం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

అభినందన్ భార్య అంటూ వైరల్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, Screen shot/YouTube

ఇరు దేశాలు సంయమనం పాటించాలని బయటి నుంచి ఒత్తిడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో శాంతి సూచకంగా అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ గురువారం ప్రకటించింది.

ఇక అసలు విషయానికి వస్తే, మొదటి వీడియోను 'ఆజ్‌తక్ క్రికెట్' యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్ చేసి, ఇతర వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో కూడా షేర్ చేశారు. కాంగ్రెస్ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూతోపాటు కొన్ని వేలమంది రెండో వీడియోను షేర్ చేశారు.

అభినందన్ భార్య అంటూ వైరల్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, Screen shot/YouTube

ఇది మొదటి వీడియో

ఈ వీడియో గురించి మోదీ ట్వీట్ కూడా చేశారు.

మోదీ ట్వీట్ స్క్రీన్ గ్రాబ్

ఫొటో సోర్స్, Screen grab/Narendra Modi

ఈ మహిళ ఎవరు? అసలు విషయం ఏమిటి?

2013లో పాట్నాలో జరిగిన మోదీ ర్యాలీలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో మున్నా శ్రీవాస్తవ అనే వ్యక్తి మరణించారు. ఆయన భార్యతో మోదీ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో అది.

ఆ వీడియోలో.. ''నాకు మీ ఇంటికి రావాలని ఉంది. కానీ వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో హెలీకాప్టర్‌ కిందకు దిగలేకపోయింది. మా కార్యకర్తలు మిమ్మల్ని కలుస్తారు. మా పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది'' అన్న మోదీ మాటలను వీడియోలో వినవచ్చు.

పుల్వామా దాడి జరిగినపుడు కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పట్లో, పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి భార్యతో మోదీ ఫోన్‌లో మాట్లాడారంటూ ఈ వీడియోను కొందరు పోస్ట్ చేశారు.

ఓ మహిళ సెల్ఫీ వీడియో

ఫొటో సోర్స్, Screen grab/Yuv Desh

ఇది రెండో వీడియో

పాకిస్తాన్ చేతిలో బందీగా ఉన్న తన భర్త విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ అభినందన్ భార్య ప్రధాని మోదీని కోరుతున్నట్లుగా ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలోని మహిళ..

''మన సైనికుల త్యాగాలను రాజకీయం చేయొద్దని సైనికుల కుటుంబాల తరపున భారత ప్రజలను, ముఖ్యంగా రాజకీయ నాయకులను కోరుతున్నాను. సైనికుడిగా ఉండటం చిన్నవిషయం కాదు. అభినందన్ కుటుంబం అనుభవిస్తున్న బాధను, టెన్షన్‌ను ఓసారి ఊహించండి..'' అని మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్ నేతలు నవజ్యోత్‌సింగ్ సిద్ధూతోపాటు రాజేష్ ఎస్.పి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షల్లో షేర్లు, వ్యూస్ వచ్చాయి.

కానీ ఈ వీడియోలోని మహిళ వింగ్ కమాండర్ అభినందన్ భార్యలా కనిపించడం లేదు. ఆ వీడియోలోని మహిళ కూడా తను ఓ ఆర్మీ ఆఫీసర్ భార్యను అని చెబుతారు. కానీ అభినందన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అభినందన్ కుటుంబాన్ని కూడా వేరొకరి కుటుంబం అన్నట్లుగానే ఆమె మాట్లాడారు.

ఈ వీడియో గురించిన రివర్స్ సెర్చ్‌లో భాగంగా, డి.ఎన్.ఎ వార్తాపత్రిక విడుదల చేసిన ఫొటోలతోపాటు ఇతర మీడియాలో వచ్చిన అభినందన్ భార్య ఫొటోలతో ఈ వీడియోలోని మహిళ సరిపోలడం లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)