ఆత్మీయిలు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా? #FeedingABrokenHeart

ఫొటో సోర్స్, Katie Horwich
- రచయిత, ఎమిలీ థామస్
- హోదా, బీబీసీ, ద ఫుడ్ చెయిన్
కుటుంబంలో ఆత్మీయుల మరణం సంభవించినపుడు శోకంలో మునిగిపోయిన వారికి ఆహారం తినటం వల్ల ఊరట లభిస్తుందా?
ఒక మరణం కలిగించే వేదన నుంచి కోలుకోవటానికి మంచి పోషకాహారం ముఖ్యం. కానీ, శోకంలో ఉన్నపుడు తినాలన్న కోరిక కోల్పోవటం సాధారణం.
ఇలా ఆకలి కోల్పోవటం అమెరికాలోని మినెసొటాలో నివసించే లిండ్సే ఓస్ట్రామ్‌కి బాగా తెలుసు. ఆమె ఐదున్నర నెలల గర్భవతిగా ఉన్నపుడే తన కొడుకు ఆఫ్టన్‌కి జన్మనిచ్చారు. నెలలు నిండకుండా పుట్టిన ఆ శిశువు మరుసటి రోజే చనిపోయాడు.
ఆఫ్టన్ మరణంతో ఆమెను ముంచెత్తిన శోకం ఆమె మీద మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపింది. అప్పుడు తిండి, నీళ్లు, నిద్రా లేకుండా రాత్రంతా ఏడుస్తూనే ఉండేది.
''మా కొడుకు చనిపోయాడన్నది మాత్రమే నా మదిలో ఉండేది. అతడి గురించి, అతడు లేని మా జీవితాల గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. ఇంక వేరే దేనిమీదా ఆసక్తి ఉండేది కాదు'' అని ఆమె చెప్తారు.
కానీ, లిండ్సేకి ఆహారం అనేది ఆమె కెరీర్. 'ఎ పించ్ ఆఫ్ యుమ్' అనే ఫుడ్ బ్లాగ్ నిర్వహించేది.
ఆహారం రుచి కోల్పోయిందని, తన కడుపులో కొండంత శోకానికి తప్ప మరి దేనికీ ఖాళీ లేదని ఆ బ్లాగ్‌లోనే వివరించింరామె.
''ఆహారం గురించి ఆలోచన వస్తేనే వెగటుగా అనిపించేది. మామూలుగా ఆహారం గురించి అమితాసక్తిగా ఉండే నేను అప్పుడు పూర్తిగా బిగుసుకుపోయాను'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, A Pinch of Yum
''మామూలుగా బాగా కారం, మసాలాలు ఉన్న ఆహారం తినటానికి ఇష్టపడేదాన్ని. మంచి రుచులు, రంగులు, రకాలు చాలా ఇష్ట పడేదాన్ని. కానీ, ఆ సమయంలో కేవలం పొటాటో సూప్ కోరుకునేదాన్ని. లేదంటే బ్రెడ్, బటర్ తినేదాన్ని. ఉప్పూ, కారం రుచి లేని సాధారణ ఆహారం... అంతే'' అని ఆమె చెప్పారు.
ఆకలి లేకపోయినప్పటికీ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులు తాజాగా చేసిన రొట్టెలు తన ఇంటికి వచ్చి అందించేవారని, అందుకు వారికి చాలా రుణపడి ఉన్నానని ఆమె అంటారు.
''అది మాకు ఒక సంపూర్ణ జీవధారగా మారింది. ఒకసారి ఒక బౌల్ సూప్ తీసుకుందాం అనిపించేది. దానితో సాంత్వన పొందుతూ, తిరిగి జీవితంలోకి వస్తాం. మనం సజీవంగా ఉన్నాం.. మనం జీవించి ఉండాల్సిన అవసరముంది అనే వాస్తవాన్ని అది మన ఎరుకలోకి తెస్తుంది'' అని వివరించారు.
ప్రేమగా చేసిన అటువంటి చిన్న చిన్న వంటకాలు ఎంత ముఖ్యమో లిండ్సే తెలుసుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు అందించిన సాధారణ వంటకాలు తయారు చేసే విధానం వారినే అడిగి తెలుసుకున్నారు. వాటిని 'ఫీడింగ్ ఎ బ్రోకెన్ హార్ట్' అనే శీర్షికతో తన బ్లాగ్‌లో పోస్ట్ ప్రచురించారు.
ఇతరులు శోకంలో ఉన్నపుడు సాయపడిన ఆహార పదార్థాల ఫొటోలతో #feedingabrokenheart హ్యాష్‌ట్యాగ్ ఇన్‌స్టాగ్రామ్‌కి విస్తరించింది.

ఫొటో సోర్స్, Instagram
ఆప్తుల మరణం కలిగించే దిగ్భ్రాంతి తొలి దశల్లో ప్రథమంగా పోరాటం లేదా పలాయనం అనే తక్షణ స్పందన కలుగుతుందని.. అందువల్ల మనం ఆకలి కోల్పోతామని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ లిసా షుల్మన్ చెప్పారు.
ప్రొఫెసర్ లిసాకు ఆస్పత్రిలో విధుల రీత్యా మరణానికి సంబంధించిన విషయాలపై మంచి అవగాహన ఉంది. అయినప్పటికీ.. తన భర్త బిల్ మరణంతో తాను ఎదుర్కొన్న కష్టాలను చూసి ఆమె దిగ్భ్రమకు లోనయ్యారు. ఆ అనుభవం నుంచి.. శోకం, మెదడుల గురించి వివరిస్తూ ఆమె 'బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాస్' (ఆప్తుల మరణానికి ముందూ తర్వాతా) అనే పుస్తకం రాశారు.
మరణ శోకం మన శరీరం మీద చూపే ప్రభావాలను అర్థం చేసుకోవాలని, ఆ సమయంలో ఆహారం ఎలా సాయపడుతుందనేది తెలుసుకోవాలని ఆమె భావించారు.
ఆప్తుల మరణం మనకు తీవ్ర మనోవేదన కలిగించినపుడు.. మన మెదడు ఒక రక్షక కవచంలా పనిచేస్తున్నట్లు ఉంటుందని ప్రొషెసర్ లిసా చెప్తారు. ఆ సమయంలో మనకు అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలను అడ్డుకుని.. భావోద్వేగ పరంగా మనం తట్టుకోగల జ్ఞాపకాలను మాత్రమే మెదడు అనుమతిస్తుందని పేర్కొన్నారు.
''మనం ఆప్తుల మరణ శోకంలో ఉన్నపుడు.. మనకు - పరిసరాలకు మధ్య ఒక మందపాటి తెర ఉన్నట్లు లేదా శూన్యం నెలకొన్నట్లు ఉంటుంది. మన జ్ఞానేంద్రియ అనుభవాలను అది మూసివేస్తుంది. ఇది.. ఆహారం రుచిని ఆస్వాదించటం కూడా కష్టతరంగా చేస్తుందని నేను అనుకుంటున్నా'' అని ఆమె వివరించారు.
ఈ స్థితి నుంచి కోలుకోవటానికి మనం క్రమక్రమంగా ఆ జ్ఞాపకాలను తిరిగి స్వాగతించాల్సి ఉంటుందని.. ఇందులో ఆహారం పాత్ర ఉండవచ్చునని ప్రొఫెసర్ లిసా చెప్పారు.
''శోకం నుంచి కోలుకోవటానికి సాయపడేందుకు మనం ఆహారాన్ని ఉపయోగించవచ్చు. అర్థవంతమైన, మన జ్ఞాపకాలను తిరిగి తెచ్చే ఆహారాల మీద నేను దృష్టి కేంద్రీకరిస్తాను. నా గురించి చెప్తే.. నా భర్తకు ఇష్టమైన వంటకాలను తీసుకునేదాన్ని.. అది నాకు స్వాంతన కలిగించేది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Katie Horwich
కొన్నేళ్ల కిందట అమీ తండ్రి చనిపోయినపుడు.. ఆమెకు ఆహారం తినటమనేది తన తండ్రి చెంత ఉండే ఒక మార్గంగా మారింది. యూదు-రొమేనియన్ వలస అయిన ఆయన ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తూ.. సరదా కోసం పాస్ట్రామి రెస్టారెంట్ కూడా నడిపేవారు. ప్రత్యేకించి.. పచ్చి ఉల్లిపాయ ఆయనను వెంటనే జ్ఞప్తికి తెచ్చేది.
''మా నాన్న చాలా ఆహార పదార్థాల మీద వాటిని చల్లేవాడు'' అని అమీ చెప్పారు.
ఆ రుచి తనకు నచ్చకపోయినప్పటికీ.. వారంలో పలుమార్లు పచ్చి ఉల్లిపాయ తినటం మొదలుపెట్టారామె.
''ఆయన కోసం నేను ఈ ఉల్లిపాయ తింటాను'' అంటారు.
తన తండ్రికి ఇష్టమైన స్కోన్ కేకులు కూడా ఆమె తనకు ఇష్టం లేకపోయినా సొంతంగా చేసుకుని తింటుంటారు. ఇది ఈ ఆహారం ఆమెకు ఒక వ్యక్తిగత ఆచారంగా మారింది.
చనిపోయిన వారితో ఆహారం ద్వారా మళ్లీ అనుసంధానం కావటమనే ఆలోచన కొత్తది కాదు. ఉదాహరణకు ప్రాచీన రోమ్‌లో సమాధుల్లోని మృతుల నోటిలోకి వారి బంధువులు ఆహారం, వైన్ పంపించటానికి వీలుగా సమాధుల్లో రంధ్రాలు ఏర్పాటు చేయటం సర్వసాధారణంగా ఉండేది. మృతుల మరణానంతర జీవితంలోకి వెళ్లటానికి వేచి ఉన్నపుడు వారికి ఆహారం అందించటం ఆ ఆచారం ఉద్దేశం.
హిందువులు 12 రోజుల పాటు శోకదినాలు పాటిస్తారు. ఆ సమయంలో కేవలం శాకాహారం మాత్రమే తింటారు.
ప్రధానంగా బౌద్ధ దేశమైన జపాన్‌లో.. కుటుంబ గృహంలో త్సూయా అని పిలిచే జాగరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రతువులో మరణించిన వారి ఫొటో పక్కన అన్నం గిన్నె పెట్టి.. అందులో ఒక జత చాప్‌స్టిక్స్‌ను నిలువుగా ఉంచుతారు.
మెక్సికోలో తొమ్మిది రోజుల పాటు సంతాపం పాటిస్తూ రుచికరమైన ఆహారాలను వండి వడ్డిస్తారు.
మృతులకు ఆహారం అందించే ఆచారాలు చైనా వంటి సంప్రదాయ సమాజాల్లో ఇప్పుడు కొత్త రూపం దాలుస్తున్నాయని టెక్సస్‌లోని బేలార్ యూనివర్సిటీలో మతం గురించి బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ కాండీ కాన్ చెప్పారు.
''నారింజలు, పైనాపిళ్లు, తీయని పండ్లు బాగా వండిన పంది మాంసం వంటివి మృతుల సమాధుల దగ్గర ఆహారంగా పెట్టటం సాధారణంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు వాటి స్థానంలో ఫ్రెంచ్ ఫ్రైస్, షేక్ వంటి అమెరికా ఆహారాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి'' అని ఆమె తెలిపారు.
''ఆ ఆహారాన్ని కొన్నిసార్లు జనం తింటారు. కొన్నిసార్లు.. పూలు, బెలూన్లను శుభ్రం చేసినట్లే స్మశాన సిబ్బంది ఈ ఆహారాన్ని కూడా శుభ్రం చేస్తారు'' అని పేర్కొన్నారు.
పశ్చిమ ప్రపంచంలో ఇటువంటి ఆచారాలు చాలా తక్కువ. కానీ అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో కేసరోల్.. మృతుల ఆహార స్థానాన్ని తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
''మృతులు లేకుండా సామాజిక పాత్రను బలోపేతం చేయటానికి కేసరోల్ వేడుకను నిర్వహిస్తారు. మరణించిన వారి గురించిన కథనాలు చెప్పుకుంటూ ఈ కేసరోల్‌ను అందరూ పంచుకుంటారు'' అని ప్రొఫెసర్ కాండీ వివరించారు.
''అవి పంచుకోదగ్గ ఆహారాలు.. మరణించిన వ్యక్తి లేకుండా స్థానిక సమాజంలో ఒక రకంగా మళ్లీ కలసిపోవటం ఈ ఆచారం ఉద్దేశం'' అని చెప్పారు.
మరణించి వారు మన జీవితాల నుంచి అదృశ్యమైనప్పటికీ... వారు వారికి ఇష్టమైన ఆహారాల ద్వారా మన జ్ఞాపకాల్లో జీవిస్తుంటారు.
మరణ శోకాన్ని తరచుగా అసాధారణంగా పరిగణిస్తుంటారని, దాని నుంచి కోలుకోవటానికి ఉత్తమ మార్గం... మరణించిన తమ ఆప్తులతో అనుబంధాన్ని కొనసాగించటానికి తమవైన సొంత ఆహార ఆచారాలను సృష్టించడమే. కానీ దానికి బదులు ''ముందుకు సాగిపోవాల''నే ఆతృతలో జనం ఉన్నారని ప్రొఫెసర్ కాన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు: యూపీ ముస్లింలలో భయాందోళనలకు కారణాలేమిటి
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- కొత్త ఏడాది తీర్మానాలు చేసుకుంటున్నారా? అయితే, ఈ 5 విషయాలు మరచిపోవద్దు
- 2019లో అంతరిక్ష అందాలను కళ్లకు కట్టిన అత్యద్భుత ఛాయా చిత్రాలు ఇవి
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








