అంతా కలిసి కరువు తీరా ఏడుస్తున్నారు..!

‘సంతోషం పంచే కొద్దీ పెరుగుతుంది. బాధలు పంచుకునే కొద్దీ తగ్గుతాయి’ అంటారు. కానీ ఎవరితో పడితే వాళ్లతో బాధల్ని పంచుకోవడానికి కుదరదు.
అందుకే ఒకరికొకరు తమ సమస్యల్ని పంచుకుంటూ మొహమాటం లేకుండా కన్నీరు కార్చేందుకు వీలు కల్పిస్తూ సూరత్‌లో కొందరు ఔత్సాహికులు ఓ వేదికను ఏర్పాటు చేశారు. దాని పేరు ‘హెల్తీ క్రయింగ్ క్లబ్’.
అక్కడికి ఎవరైనా వచ్చి తనివితీరా ఏడవచ్చు. సహజ సిద్ధంగా ఏడుపు రావడం కోసం ఒకరికొకరు తమ బాధల్ని పంచుకునేలా నిర్వహకులు ప్రోత్సహిస్తున్నారు. సందర్భానికి అనుగుణంగా భావోద్వేగపూరిత సంగీతాన్ని వినిపిస్తున్నారు.
ఆ ‘ఏడుపు’ ఎలా ఉంటుందో, వాళ్లేమంటున్నారో తెలియాలంటే ఈ వీడియో చూడండి.
మనస్ఫూర్తిగా ఏడవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు తేలికపడుతుందన్నది క్లబ్ నిర్వహకులతో పాటు సభ్యుల నమ్మకం. అందుకే రోజురోజుకీ వీటికి ఆదరణ పెరుగుతున్నట్లు క్రయింగ్ క్లబ్ నిర్వహకులు పేర్కొంటారు.
ప్రజలు తమ సమస్యలను పంచుకోవడానికి ఓ వేదికను ఏర్పాటు చేసే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పి, నెలకొసారి ఈ సెషన్లను నిర్వహిస్తున్నట్లు కమలేష్ చెబుతారు.
‘‘ఎలాంటి మొహమాటం లేకుండా సభ్యులు తమ భావోద్వేగాలను ఇక్కడ బయటపెట్టొచ్చు. అందుకే 'టియర్స్ నుంచి చియర్స్' అనే నినాదంతో మేం ముందుకెళ్తున్నాం’’ అని ఆయన వివరిస్తారు.

‘మనం చాలా విషయాల్ని కుటుంబ సభ్యుల నుంచి దాచిపెడతాం. ఫలితంగా మనలో ఒత్తిడి పెరిగిపోతుంది. నాక్కూడా జీవితంలో చాలా సమస్యలున్నాయి. ఆ ఒత్తిడి నుంచి ఊరట పొందడానికి ఈ సెషన్లు ఉపయోగపడుతున్నాయి’ అని తనూజా అనే మహిళ చెబుతారు.
‘ఈ సెషన్ తరవాత నా మనసు తేలిక పడింది. నా ఒత్తిడి దూరమైన భావన కలుగుతోంది’ అని జీవన్ భాయ్ పటేల్ అనే మరో వ్యకి తన భావనను పంచుకుంటారు.
కానీ ఏడుపు వల్ల నిజంగా ఒత్తిడి తగ్గుతందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానివల్ల కొంత సానుకూల ఫలితాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నా, పూర్తిగా ఆ ఫలితాలను తేల్చడానికి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









