వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ వసతి గృహం లైంగిక వేధింపుల కేసులో దిల్లీలోని ఓ కోర్టు 19మందిని దోషులుగా తేల్చింది.
వసతి గృహంలో ఉంటున్న బాలికలను శారీరకంగా హింసించడంతో పాటు లైంగికంగా వేధించిన ఘటన 2018లో చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో ఎన్జీవో డైరెక్టర్ బ్రజేష్ ఠాకూర్‌తో పాటు మరో 18 మందిని కోర్టు దోషులుగా ప్రకటించింది.
ఆ కేసులో మొత్తం 20 మందిని మొదట అదుపులోకి తీసుకున్న పోలీసులు తరువాత ఒకరిని విడిచిపెట్టారు. దోషులుగా తేలిన 19 మందికి జనవరి 28న శిక్ష ఖరారు చేస్తామని కోర్టు పేర్కొంది.


ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్ ఠాకూర్‌పై అత్యాచారంతో పాటు నేరపూరిత కుట్ర, విధినిర్వహణలో నిర్లక్ష్యం కేసులు సైతం నమోదయ్యాయి.
2018లో బాలికల వసతి గృహంలో లైంగిక వేధింపులకు సంబంధించి టాటా ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్), బిహార్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏంటీ కేసు?
2018లో టిస్‌కు చెందిన 8 మంది పరిశోధకులు బిహార్‌లోని 38 జిల్లాల్లో ఉన్న 110 వసతి గృహాల్లో పర్యటించారు. ఆర్నెల్లపాటు వాటిని పరిశీలించి ఆ గృహాల్లో పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
టిస్ నివేదిక ఆధారంగా మే 31న ముజఫుర్‌పుర్ వసతి గృహ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, అదే రోజు ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థకు ఒక ప్రభుత్వ టెండర్ మంజూరైంది. దానిపై సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతకం ఉంది.
ప్రభుత్వం కేవలం చిన్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటోందా లేక వాటిపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులను కూడా బాధ్యులుగా చేస్తున్నారా అని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ ప్రసాద్‌ను బీబీసీ ప్రశ్నించింది.
బ్రజేష్ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయిన తర్వాత కూడా ఆయనకు ఎలా టెండర్ మంజూరైంది?
దీనికి జవాబిస్తూ అతుల్ ప్రసాద్, ''బ్రజేష్ ఠాకూర్‌కు లభించిన టెండర్ బల్క్‌లో లభించింది. అయితే, జరిగిన సంఘటనతో దానిని రద్దు చేశాం'' అని తెలిపారు.
కానీ టిస్ నివేదిక ప్రభుత్వానికి మార్చి 15నే చేరింది. దానిలో బ్రజేష్ ఠాకూర్ తన ఇంట్లోనే బాలికల సంరక్షణ గృహాన్ని నిర్వహిస్తున్నాడని, అక్కడ బాలికలపై అత్యాచారం జరుగుతోందని పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు ఆయనకు టెండర్ ఎలా మంజూరు చేశారు?
దీనికి జవాబుబగా అతుల్ ప్రసాద్, టిస్ నివేదిక ప్రభుత్వానికి మే 27న అధికారికంగా అందిందని తెలిపారు. అయితే బీబీసీకి లభించిన పత్రాలను పరిశీలించినపుడు టిస్ తన నివేదికను ప్రభుత్వానికి మార్చి 15నే సమర్పించినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ నివేదికలో ఏముంది?
టిస్ ప్రభుత్వానికి సమర్పించిన రహస్య నివేదికలో కొంత భాగాన్ని బీబీసీ కూడా పరిశీలించింది. ముజఫర్‌పూర్‌లోని వసతి గృహంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఆ వసతి గృహంలో సిబ్బంది తమకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేవారని అక్కడి బాలికలు తెలిపారు. తాము నిద్రలోకి జారుకున్నాక ఆ ఎన్జీవో నిర్వాహకుడు ఠాకూర్ సహకారంతో బయటి వ్యక్తులు తమ గదుల్లోకి వచ్చి, తమపై అత్యాచారం జరిపేవారని బాలికలు విచారణ అధికారులకు వివరించారు.
''ఆహారం తీసుకున్నాక మత్తు కారణంగా మేం త్వరగా నిద్రలోకి జారుకునేవాళ్లం. మరుసటి రోజు ఉదయం అర్ధనగ్నంగా, ఒళ్లు నొప్పులతో మెలకువ వచ్చేది. 'చూడు... ఆమె కూడా వాళ్ల ఖాతాలో చేరిపోయింది' అంటూ మా ఆంటీలు (మహిళా సంరక్షకులు) గుసగుసలాడుకునేవారు'' అని ఒక బాలిక విచారణ అధికారులకు చెప్పారు.
చాలామంది అమ్మాయిలు ఉద్రేకంతో తమను తాము గాయపరచుకున్నట్లు కూడా విచారణలో తేలింది.
ఆ వసతి గృహంలో అమ్మాయిలను పరీక్షించిన వైద్యులు, 42మంది మైనర్లలో 34 మంది లైంగిక చర్యలో భాగమై ఉంటారని పేర్కొన్నారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి.
అనంతరం ఆ వసతి గృహాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. బాలికలను బిహార్‌లోని వేర్వేరు వసతి గృహాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి:
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
- CAA: కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అర్ధ రాత్రి వరకు మహిళల ఆందోళన
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









