ముజఫర్‌పూర్ బాలికల సంరక్షణ గృహం కేసు: ప్రభుత్వం పెద్ద తలకాయలను రక్షిస్తోందా?

- రచయిత, రజనీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముజఫర్‌పూర్‌లోని బాలికల సంరక్షణ గృహంలో 34 మంది బాలికలపై అత్యాచారం జరిగిన కేసులో ప్రభుత్వం శనివారం 21 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరి సస్పెన్షన్‌కు సిఫార్సు చేసింది.
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ ప్రసాద్ బీబీసీకి సస్పెన్షన్ విషయాన్ని ధృవీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు ఉంటాయన్నారు.
సస్పెండైన వారిలో ముజఫర్‌పూర్ బాలల సంరక్షణ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ దేవేశ్ కుమార్ శర్మ కూడా ఉన్నారు.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (టిస్) సోషల్ ఆడిట్ నివేదిక ఆధారంగా మే 31న శర్మే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
దేవేశ్ శర్మకు అందజేసిన సస్పెన్షన్ ఆర్డర్‌లో, టిస్ రిపోర్టులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయన ఆ సంరక్షణ గృహం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్‌పై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

'చిన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు'
దేవేశ్ శర్మ బాలికల సంరక్షణ గృహాన్ని సందర్శించినా, అక్కడ బాలికల పట్ల ఏదో జరగరానిది జరుగుతోందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ పై అధికారులకు చెప్పలేదని సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలకు సమాధానంగా, తనకు టిస్ నివేదిక అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు దేవేశ్ శర్మ తెలిపారు. మే 29న తనకు టిస్ నివేదిక అందిందని, తాను మే 31నే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశానని ఆయన వెల్లడించారు.
బాలికల సంరక్షణ గృహాన్ని సందర్శించినపుడు ఆయనకు అక్కడ ఎలాంటి అసహజమైన సంఘటనలూ కనిపించలేదా? దీనికి జవాబిస్తూ ఆయన, తనకు ఆ బాలికలు ఎన్నడూ ఏమీ చెప్పలేదన్నారు. తానే కాకుండా అక్కడికి మహిళా సంక్షేమ శాఖ అధికారులు కూడా వెళుతుంటారని, కానీ వాళ్లకూ ఎలాంటి సమాచారమూ లేదని తెలిపారు.

టిస్ నివేదిక ఆధారంగా మే 31న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, అదే రోజు ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థకు ఒక టెండర్ మంజూరైంది. దానిపై సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతకం ఉంది.
ప్రభుత్వం కేవలం చిన్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటోందా లేక వాటిపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులను కూడా బాధ్యులుగా చేస్తున్నారా అని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ ప్రసాద్‌ను బీబీసీ ప్రశ్నించింది.
బ్రజేష్ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయిన తర్వాత కూడా ఆయనకు ఎలా టెండర్ మంజూరైంది?
దీనికి జవాబిస్తూ అతుల్ ప్రసాద్, ''బ్రజేష్ ఠాకూర్‌కు లభించిన టెండర్ బల్క్‌లో లభించింది. అయితే, జరిగిన సంఘటనతో దానిని రద్దు చేశాం'' అని తెలిపారు.

కానీ టిస్ నివేదిక ప్రభుత్వానికి మార్చి 15నే చేరింది. దానిలో బ్రజేష్ ఠాకూర్ తన ఇంటిలోనే బాలికల సంరక్షణ గృహాన్ని నిర్వహిస్తున్నాడని, అక్కడ బాలికలపై అత్యాచారం జరుగుతోందని పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు ఆయనకు టెండర్ ఎలా మంజూరు చేశారు?
దీనికి జవాబుబగా అతుల్ ప్రసాద్, టిస్ నివేదిక ప్రభుత్వానికి మే 27న అధికారికంగా అందిందని తెలిపారు. అయితే బీబీసీకి లభించిన పత్రాలను పరిశీలించినపుడు టిస్ తన నివేదికను ప్రభుత్వానికి మార్చి 15నే సమర్పించినట్లు తెలుస్తోంది.
'బాలికా సంరక్షణ గృహాన్ని డీఎమ్ ఎంపిక చేశారు'
సస్పెండ్ అయిన అధికారుల్లో ఒకరు, సంరక్షణ గృహం పరిశీలన కోసం మహిళా కమిషన్ సభ్యులు కూడా వచ్చేవారని, అయితే వాళ్లు కూడా ఎన్నడూ అక్కడి పరిస్థితులపై ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
తనను సస్పెండ్ చేసినపుడు, మరి వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

తన పేరు వెల్లడించరాదన్న షరతు కింద, సస్పెండైన మరో అధికారి - బ్రజేష్ కుమార్ బాలికల సంరక్షణ గృహానికి ఐదేళ్ల నుంచి డీఎమ్ ధర్మేంద్ర కుమార్ సింగ్ అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.
బ్రజేష్ కుమార్ నివాసం సంరక్షణ గృహానికి సరిపోదన్న విషయం డీఎమ్‌కు తెలుసని, అయినా ఆయనకు టెండర్ మంజూరు చేశారని ఆయన తెలిపారు. అలాంటప్పుడు డీఎమ్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
''మమ్మల్ని బలిపశువులను చేశారు'' అని ఆ అధికారి అన్నారు.
ఈ విషయం గురించి అతుల్ ప్రసాద్‌ను ప్రశ్నించినపుడు - విచారణ ఇంకా పూర్తి కాలేదని, ముందు ముందు మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపారు.
మరోవైపు, తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ సస్పెండైన దేవేశ్ శర్మ ప్రస్తుత డీఎమ్‌కు లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది తానేనని, అందుకే తనకు చాలా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.
చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








