రూల్ 71 అంటే ఏంటి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Facebook/CBN, YS Jagan
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిపాదిస్తూ అసెంబ్లీ ఆమోదించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన మండలిలో మంగళవారం ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై చర్చను ప్రారంభించి, ఆమోదించాలని ఆయన ప్రతిపాదించారు.
అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 కింద తీర్మానం ప్రవేశపెట్టింది. రాజధాని మార్పుపై చర్చించాలని, బిల్లును తిరస్కరించాలని కోరింది.
రూల్ 71 ఏంటి?
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నిబంధనల్లో 71వ నిబంధన ఇది.
రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని ఈ నిబంధన శాసన మండలి సభ్యులకు ఇస్తోంది.
దీని ప్రకారం.. ఏదైనా మంత్రిత్వ శాఖ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా సభ్యుడు చైర్మన్ అనుమతితో తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
అయితే, ఆ రోజు సభా కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరాలి. ఈ మేరకు సంబంధిత సభ్యుడు, సంబంధిత తీర్మానాన్ని లిఖితపూర్వక నోటీసు రూపంలో శాసన మండలి కార్యదర్శికి అందజేయాలి.


ఈ నోటీసు నిబంధనలకు అనుగుణంగానే ఉందని చైర్మన్ భావిస్తే.. దానిని చదివి సభలోని మిగతా సభ్యులకు వినిపించాలి. దీనికి ఎంత మంది మద్దతు ఇస్తున్నారో.. ఆయా సభ్యులంతా తమతమ స్థానాల్లో నిలబడాలని కోరాలి.
ఒకవేళ తీర్మానం నోటీసుకు అనుకూలంగా 20 మంది లేదా అంతకు మించి సభ్యులు అనుకూలంగా ఉంటే, సదరు తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలి.
తీర్మానం నోటీసులో కోరిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోపు, లేదంటే సభా సమావేశాలను నిరవధిక కాలంపాటు వాయిదా వేసేలోపు ఎప్పుడైనా ఒకరోజు ఈ చర్చను చైర్మన్ అనుమతించాలి.
ఒకవేళ తీర్మానానికి అనుకూలంగా కనీసం 20 మంది సభ్యులు కనుక లేచి నిలబడకపోతే అప్పుడు ఆ తీర్మానం నోటీసు చెల్లదని చైర్మన్ ప్రకటిస్తారు.
టీడీపీ, వైసీపీల వ్యూహాలు ఏంటి?
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు శాసన మండలిలో కనుక ఆమోదం పొందకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చరిత్రలో తొలిసారి రూల్ 71ను ఉపయోగించి తీర్మానాన్ని పెట్టింది.
శాసన మండలిలో మొత్తం స్థానాల సంఖ్య 58.
ఇందులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది. టీడీపీ ఎమ్మెల్సీలు 34 మంది. అధికార వైసీపీ ఎమ్మెల్సీలు 9 మంది కాగా, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరుగురు, స్వతంత్ర ఎమ్మెల్సీలు ముగ్గురు, బీజేపీ ఎమ్మెల్సీలు ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
మండలి ఆమోదించకపోతే బిల్లు ఏమౌతుంది?
వాస్తవానికి మూడు రాజధానుల బిల్లుపై ఇంకా శాసనమండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వం ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్టింది.
దీనికి వ్యతిరేకంగా టీడీపీ పెట్టిన రూల్ 71 తీర్మానంపైనే చర్చ జరుగుతోంది.
ఒకవేళ ఈ తీర్మానం తర్వాత బిల్లును చర్చకు స్వీకరించి, దానిని శాసన మండలి వ్యతిరేకిస్తే.. ఆ బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళుతుంది.
నిబంధనల ప్రకారం.. రెండోసారి అదే బిల్లును శాసనసభ ఆమోదిస్తే, మళ్లీ బిల్లు శాసన మండలికి వెళుతుంది. రెండోసారి కూడా మండలి బిల్లును తిరస్కస్తే, నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు.
దీనికి గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత చట్టంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు
- భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా?
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









