థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు

పందితో బంగీ జంప్

ఫొటో సోర్స్, THE PAPER/SCREENSHOT

సాహసాలంటే ఇష్టపడే చాలామంది మనుషులు బంగీ జంప్ చేస్తుంటారు. కానీ, చైనాలో మాత్రం ఓ థీమ్ పార్క్‌లో పందితో బంగీ జంప్ చేయించారు. 68 మీటర్ల ఎత్తయిన టవర్ నుంచి ఇద్దరు మనుషులు కలిసి ఆ పందిని కిందకు తోసేయడం వివాదాస్పదమైంది.

సోషల్ మీడియాలో చాలామంది యూజర్లు ఆ థీమ్ పార్క్ నిర్వాహకులను విమర్శిస్తున్నారు.

చాంకింగ్ ప్రావిన్సులో ఉన్న మెగ్జిన్ రెడ్ వైన్ టౌన్ థీమ్ పార్క్‌లో కొత్తగా బంగీ జంప్‌ యాక్టివిటీని మొదలుపెట్టారు. ఆ ప్రారంభత్సోవానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని వాళ్లు ఇలా పందితో బంగీ జంప్ చేయించారు. దీనికి వాళ్లు గోల్డెన్ బంగీ జంప్ అని పేరు పెట్టారు.

ఆ ఫీట్ ముగిశాక పందిని కబేళాకు తరలించారని స్థానిక మీడియా తెలిపింది.

ఇటీవలి కాలంలో చైనాలో జంతు సంరక్షణపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ థీమ్ పార్క్ చేసిన పని చాలామందికి కోపం తెప్పించింది.

అయితే, తమపై వస్తున్న విమర్శలను స్వీకరిస్తున్నట్లు ఆ థీమ్ పార్క్ ప్రకటించింది.

గమనిక: ఈ కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపెట్టొచ్చు

''మేం మనస్ఫూర్తిగా నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలను స్వీకరిస్తున్నాం. వారికి క్షమాపణలు కూడా చెబుతున్నాం. మేం మా మార్కెటింగ్ ప్రణాళికలను మెరుగుపరచుకుంటాం. టూరిస్టులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం'' అని పార్క్ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది.

పందితో బంగీ జంప్ చేయించేప్పుడు దానికి ఒక పర్పుల్ రంగు కేప్‌ను కూడా కట్టారు. కానీ, చివరికి ఆ పందికి ఏమైంది అన్నది మాత్రం వీడియోలో చూపించలేదు.

చైనాలో జంతువులపై జరిపే హింసకు చట్టపరంగా ఎలాంటి శిక్షా ఉండదు. కానీ, ఇటీవలి కాలంలో అక్కడ జంతువులపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి.

ఆ థీమ్‌ పార్క్ చేసిన పనిని సమర్థించిన వాళ్లూ కొందరున్నారు. తినడం కోసం పందిని చంపడానికీ, వాళ్లు చేసిన పనికీ పెద్ద తేడా లేదని వాళ్లు వాదించారు. కానీ, ఆ ఘటనను విమర్శించిన వాళ్లే ఎక్కువ.

'జంతువులపై హింసకు ఇది పరాకాష్ఠ' అని జంతువుల సంరక్షణ కోసం పనిచేసే 'పెటా' వ్యాఖ్యానించింది.

'పందులకు కూడా మనుషుల్లానే నొప్పి, భయం ఉంటాయి. ఇది చాలా నీచమైన పీఆర్ స్టంట్. దీన్ని చట్టవ్యతిరేకం చేయాలి' అని పెటా పేర్కొంది.

''చైనా ప్రజలు దీనిపై స్పందిస్తున్న విధానాన్ని చూసైనా ఆ దేశ పాలకులు జంతువులపై హింసకు పాల్పడిన వారిని శిక్షించేలా చట్టాలు చేయాలి'' అని పెటా సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)