విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..

విశాఖపట్నం

ఫొటో సోర్స్, facebook/GVMC.OFFICIAL

    • రచయిత, విజయ్ గజాం
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌‌కు విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానుంది. ఈ మేరకు బిల్లును రాష్ట్ర క్యాబినెట్.. అసెంబ్లీకి పంపించగా.. అసెంబ్లీలో చర్చ అనంతరం ఆ బిల్లుకు ఆమోదం లభించింది. మంగళవారం శాసనమండలిలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

మరింతకీ విశాఖలో రాజధానికి సరిపడే భూములున్నాయా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.

వాస్తవానికి 2014వ సంవత్సరంలోనే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో రాజధానిగా పనికి వస్తాయని చెప్పిన నగరాల్లో విశాఖ నగరం ఒకటి.

ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ కూడా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని తెలిపింది.

దీంతో భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదం చేసే అత్యంత ధనిక 10 నగరాల్లో ఒకటిగా ఉండటానికి సూరత్‌తో పోటీపడుతోన్న వైజాగ్, ఒక రాష్ట్ర రాజధాని హోదా పొందనుంది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, తూర్పు నావికా దళ ప్రధాన కార్యాలయం, ఓడరేవు ఇలా పారిశ్రామికంగా, వ్యూహాత్మకంగా విశాఖ భారతదేశానికి కీలక నగరంగా గుర్తింపు పొందింది.

దానికితోడు రాజధానిగా ఉండడానికి విశాఖలో సరిపడినన్ని భూములు ఉన్నాయని అధికారులు, నాయకులు అంటున్నారు.

విశాఖ గత 15 ఏళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

నగరానికి ఈశాన్యం వైపున ఉన్న మధురవాడ, ఆనందపురం ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యాయి.

Presentational grey line
News image
Presentational grey line

దీంతో మధురవాడ - ఆనందపురం - భీమిలి జోన్‌లో భూముల లభ్యత ఎక్కువగా ఉంది.

ముడసర్లోవ, మధురవాడ, కాపులుప్పాడ, సొంఠ్యాం, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, గంభీరాలలో కూడా పెద్ద పెద్ద భూకమతాలు అందుబాటులో ఉన్నాయి.

ఒక్క ఆనందపురం మండలంలోనే వెయ్యి ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మరో 900 ఎకరాలు దక్షిణాన అగనంపూడిలో ఉంది. కొమ్మిడి దగ్గర 90 ఎకరాలు ఉన్నాయి.

వాస్తవానికి విశాఖ నగరం లోపల ప్రభుత్వ భూములు పెద్దగా లేవు.

ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన బిల్డ్ ఏపీ కార్యక్రమం కోసం 29 అధికారిక బృందాలు ఐదు రోజుల పాటూ సర్వే చేసి జిల్లాలో ఖాళీ భూముల్ని గుర్తించాయి. ఈ ప్రక్రియ ద్వారా భూములు గుర్తించడం, పరోక్షంగా రాజధాని భూముల ఎంపికకు సహకరించవచ్చు.

''విశాఖ ఎగ్జిగ్యూటివ్ రాజధాని అన్న వార్తలు విన్నాం తప్ప, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు'' అని బీబీసీతో చెప్పారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. అయితే బిల్డ్ ఏపీలో భాగంగా విశాఖలో ఎంత భూమి ఉందనే విషయం బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టరుకు పంపినట్టు ఆయన వివరించారు. ''వారి నుంచి ఆ నివేదికను కేంద్ర సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ ఏజెన్సీకి పంపారు. వారు ఆ భూములను చూశారు. వాళ్లొక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని బిల్డ్ ఏపీకి వెళ్ళింది'' అన్నారు కలెక్టర్.

విశాఖ నగరంలోని 7-8 పార్సిల్స్ (భూముల వివరాలు) రాష్ట్ర కమిటీ దృష్టికి వెళ్లాయి. ''ఇవన్నీ కేవలం ప్రభుత్వ భూముల వివరాలే. ఇవి కాకుండా సబ్ ఆప్టిమల్ యూజ్‌కు సరిపడా భూముల వివరాలు కూడా తెప్పించుకున్నాం. ఇక రాజధాని గురించి అయితే, మాకు అధికారిక సమాచారం అందిన తరువాతే స్పందించగలం'' అన్నారు కలెక్టర్ వినయ్ చంద్.

విశాఖపట్నం

విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 385 ఎకరాలు.

విశాఖపట్నం మెట్రోరీజియన్ డెవలప్‌మెంట్ అథార్టీ పరిధిలో 1700 ఎకరాలు.

గతంలో కాపులుప్పాడలో యూనిటెక్ కంపెనీకి 1350 ఎకరాలు భూమి ప్రభుత్వం కేటాయించింది. కాని ఆ కంపెనీ ఇంత వరకూ పనులు ప్రారంభించలేదు. ఆ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

స్వరే నెంబర్ 314లో 2 వేల ఎకరాలు.

భీమిలి పరిధిలో 1000 ఎకరాలు.

ఇవి కాకుండా ఏపీఐఐసీ దగ్గర 1344 ఎకరాలు.

ఇప్పటికిప్పుడు రాజధాని వస్తే?

విశాఖ రాజధానిగా వెంటనే మారిపోయేందుకు కొత్త భవనాలు వెతకనక్కర్లేదని, సచివాలయం, ముఖ్యమంత్రి నివాసాలు కూడా వెతకనక్కర్లేదని, వాటికి సరిపడా భవనాలు ఇక్కడ ఉన్నాయని మంత్రులు, వైసీపీ నాయకులు చెబుతున్నారు.

మధురవాడ ఐటీ హిల్స్‌లో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. మిలినియం బ్లాక్‌లో రెండు భారీ నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల (దాదాపు నాలుగు ఎకరాలు) విస్తీర్ణంలో ఈ భవనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

రూ. 145 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవంతులు ఒక్కో బిల్డింగ్ 10 అంతస్తులతో ఉన్నాయి. మిలినియం టవర్ పక్కనే టవర్ 2 పేరుతో రూ. 80 కోట్లతో నిర్మించిన భారీ నిర్మాణం ఉంది.

దీంతో సెక్రటేరియట్ ఇక్కడకు సులువుగా తరలించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవి కాక స్టార్టప్ విలేజ్‌లో మరో 50 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది.

గతంలో ఐటీ పరిశ్రమలకు అనేక భూములను మధురవాడ, కాపులుప్పాడ ప్రాంతాల్లో కేటాయించారు. కానీ చాలా కంపెనీలు ఇంకా పనులు ప్రారంభించలేదు. అలా పనులు ప్రారంభించని కంపెనీల నుంచి ఆయా భూములను వెనక్కు తీసుకుంటే అన్ని కార్యాలయాలకూ భూములు దొరికినట్లేనని భావిస్తున్నారు.

ఐతే ఈ ఐటీ కంపెనీలకు కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవడం అంత సులువు కాదు. దీనికి కేంద్రం అనుమతి తప్పనిసరి. సెజ్ ఉన్న ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చెయ్యాలి. అప్పుడే రాష్ర్ట ప్రభుత్వం ఆ భూములను తీసుకునే వీలు ఉంటుంది.

విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

సెక్రటేరియేట్, సీఎం నివాసం..

ఇక్కడి పరదేశిపాలెం లేదా సొంఠ్యాం, ఆనందపురం, భీమిలి మధ్య సచివాలయం ఉండే అవకాశం ఉందని కొందరు వైయస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి నివాసం భీమిలిలో వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు.

మధురవాడ సబర్బన్ ప్రాంతాలలో, అపార్ట్మెంట్ కాంప్లెక్సులలో సుమారు 15 వేల ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వసతికి ఉపయోగించుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

''విశాఖకు రాజధానిగా ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయని వివిధ కమిటీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. రాజధాని కోసం వేల ఎకరాలు భూములు తీసుకోవాల్సి అవసరం లేదు. ఇప్పుడున్న రాష్ర్ట పరిస్థితుల్లో ఒక రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చెయ్యాల్సిన అవససరం ఉందా అనేదే మా పార్టీ ఆలోచన. విశాఖలో అన్ని వసతులూ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడానికి ఉన్న దాంట్లో భూములు తీసుకుంటున్నాం. అనకాపల్లి, భీమిలి, ఆనందపురం లాంటి చోట్ల భూములు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే చాలు. ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్న సెక్రటేరియట్ విస్తీర్ణం దాదాపుగా 20 ఎకరాల్లో ఉంటుంది. తక్కువ భూ విస్తీర్ణంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం ద్వారా భూముల వినియోగం తగ్గించవచ్చు. మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని లేదు. ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఎలా తక్కువ జీతం వస్తే జాగ్రత్తగా పొదుపుగా ఉంటుందో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములు జాగ్రత్తగా వినయోగించుకుని పాలన అలానే చేస్తాం. ఐటీ టవర్స్ లోనూ ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూములను తాత్కాలికంగా తీసుకునే అవకాశం ఉంది. విశాఖ ఐటీ హబ్ గా ఉండాలని విశాఖ నగరంలో ఐటీని ప్రొత్సహించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే. ఆ భూములను తీసుకుని విశాఖలో ఐటీని నాశనం చేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదు'' అన్నారు వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్.

గత ప్రభుత్వ హయాంలోనే భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి భూములు సేకరించారు. ఇక్కడి నుంచి మధురవాడ-ఆనందపురం-భీమిలి ప్రాంతాలు చాలా దగ్గర. ఇక విశాఖ మెట్రో పాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక వేసింది.

విశాఖపట్నం కోసం మెట్రో రైలు ప్రాజెక్టు, బీచ్ రోడ్డులో ట్రాం ప్రాజెక్టు ప్రతిపాదనల్ని అధికారులు ఇప్పటికే సిద్దం చేశారు. బీచ్ రోడ్డు నుంచి భీమిలి వరకూ ట్రాం రైలు నడపాలని నిర్ణయించారు. మెట్రో రైలు మాస్టర్ ప్లాన్ మొదటి దశను కూడా మార్చారు. గతంలో మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు 34.23 కి.మీ. నిర్మించాలని భావించగా.. ఇప్పుడు దాన్ని భోగాపురం వరకు పెంచారు.

ఇప్పటికే అనకాపల్లి నుంచి ఆనందపురం వరకూ 6 లైన్ల రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)