విశాఖపట్నం: వందలాది కుటుంబాల నోట్లో మట్టి కొడుతున్న కల్యాణపులోవ రిజర్వాయర్ వద్ద గ్రానైట్ తవ్వకాలు

కల్యాణపులోవ రిజర్వాయర్
    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

రావికమతం మండలం తాడపర్తీ గ్రామంలోని రాజులమ్మకు.. రోచ్చుపోనుకు గ్రామంలో 5 ఎకరాలు భూమి ఉండేది. అందులో ఆమె జీడితోటల సాగు చేసుకుంటూ జీవించేవారు.

గత నాలుగేళ్లుగా అది సరిగా పండడం లేదు. గ్రానైట్ మైనింగ్ మొదలయిన తర్వాతే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రాజులమ్మ చెప్పారు.

క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళితో జీడి తోటలు చిరుగు వెయ్యడం లేదు. పోనీ నీళ్లైనా ఉన్నాయా, అంటే ఊటగెడ్డలు ఎండిపోయాయి. దీంతో పంటలు కాపాడుకోలేక బతుకుతెరువు కోసం ప్రస్తుతం రాజులమ్మ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అడవిలో కట్టెలు కొట్టుకుని బతుకుదామంటే, అటవీశాఖ అధికారులు కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు.

ఇలాంటి స్దితిలో ఉన్నది ఒక్క రాజులమ్మ మాత్రమే కాదు.

తవ్వకాలు

గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్న కల్యాణపులోవ రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఎరియాలోని అన్ని గ్రామాలలో ఇలాంటి పరిస్థితే ఉంది.

రిజర్వాయర్‌కు నీళ్లొచ్చే కాలువన్నింటిలో తవ్వకాల వల్ల వచ్చే రాళ్లు, మట్టితో నిండిపోవడం వల్ల ఆయకట్టు పరిదిలోని 4500 ఎకరాలకు నీళ్లు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు.

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని కల్యాణపులోవ పరీవాహక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. కల్యాణపులోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో జరిగే మైనింగ్‌ను వెంటనే ఆపేయాలంటూ ఆదివాసీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చెస్తున్నాయి. విచ్చలవిడిగా జరిగే తవ్వకాలు, పేలుళ్ల వల్ల డ్యాం ఉనికికే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న ప్రభుత్వం, అక్రమ తవ్వకాలపై ఎందుకు దృషి పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కల్యాణపులోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాల్లో, మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో బీబీసీ పర్యటించింది. అక్కడి పరిస్థితులను తెలుసుకుంది.

కళ్యాణపులోవ తవ్వకాలు

ఎమిటీ కళ్యాణపులోవ?

కల్యాణపులోవ రిజర్వాయర్ విశాఖ జిల్లా రావికమతం మండలంలో చీమలపాడు పంచాయితీలో ఉంది. విశాఖ రూరల్ జిల్లాలో ఇది తొలి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్‌ను 1978లో నిర్మించారు.

కళ్యాణలోవ రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియా 21.05 చదరపు మైళ్ల విస్థీర్ణంలో ఉంది. ఈ రిజర్వాయర్‌ను ఆనుకొని సోమాలమ్మకొండ, ఇతర కొండలు ఉన్నాయి. ఈ కొండలలో 8 పీటీజీ ఆదివాసీ గ్రామాలున్నాయి.

ఆయకట్టు కింద దాదాపు 4484 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. మరో 200 మత్స్యకార కుటుంబాలు ఈ కళ్యాణలోవ రిజర్వాయర్‌పై అధారపడి పొట్టపోసుకుంటున్నాయి. ఇక ఇక్కడి గిరిజనులు పోడువ్యవసాయం చేస్తూ, జీడి తోటలు సాగు చేస్తున్నారు.

ఈ రిజర్వాయర్ గ్రాస్ స్టోరేజీ 465 ఎంసీఎఫ్టీ కాగా లైవ్ స్టోరేజీ 431 ఎంసీఎఫ్టీ .. డెడ్ స్టోరేజీ 34 ఎంసీఎఫ్టీ. కళ్యాణ లోవ నీటి నిల్వ సామర్థ్యం 113 లక్షల ఘనపుటడుగులు.

కాని ప్రస్థుతం అది 5.8 లక్షల ఘనపుటడుగులు మాత్రమే ఉంది..

కళ్యాణపులోవ తవ్వకాలు

గ్రామస్థుల ఆందోళనలకు కారణం

కల్యాణపులోవ రిజర్వాయర్‌ను ఆనుకుని అటు, ఇటు చివర్లో కొండలున్నాయి. 2013-14లో గత ప్రభుత్వం 8 వైట్ గ్రానైట్ మైనింగ్ కంపెనీలకు ఈ కొండల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చింది.

ప్రస్తుతం రెండు కంపెనీలు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించగా, మరో కంపెనీ మూతబడింది. కొత్తగా ఒక కంపెనీ మైనింగ్ అనుమతులు సాధించింది.

కల్యాణపులోవ రిజర్వాయర్‌ను కాపాడుకోవడానికి ఇక్కడ జరిగే తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆందోళనలకు దిగాయి.

ఈ కొండల్లో నుంచి వచ్చే ఎన్నో పిల్ల కాలువలు, ఊట గెడ్డల నుంచి రిజర్వాయర్లోకి నీళ్లు చేరుతాయి. శారదా నదికి ప్రధాన నీటి వనరులు ఇవే. ఈ కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో పేరుంది.

జోగంపేట, పోట్టిమెట్ట, అజయ్‌పురం గ్రామాల మధ్య సింగాపురం గెడ్డ, సోమాలమ్మగెడ్డ లాంటి చాలా వాగులు ఉన్నాయి. ఈ గ్రామాలకు సమీపంలో గ్రానైట్ కంపెనీలు తవ్వకాలు జరుపుతున్నాయి.

ఈ కంపెనీల తవ్వకాల నుంచి వచ్చే వ్యర్థాల వేయడం వల్ల ఈ కొండల నుంచి పారే ఎన్నో ఊట కాలువలు, కొండ వాగులు పూడిపొయ్యాయి. దీంతో వర్షపు నీరు కల్యాణపులోవ రిజర్వాయర్లోకి రావడం లేదు.

కళ్యాణపులోవ తవ్వకాలు

మైనింగ్‌తో పంటనష్టం

దీంతో గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా, రిజర్వాయర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది.

అందుకే, ఈ ఏడాది ఆయకట్టుకు నీరు విడుదల చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఇక భారీ వాహనాలు తిరుగుతుండడంతో పరీవాహక ప్రాంతం పూర్తిగా దెబ్బతిందని గిరిజనులు చెబుతున్నారు.

మైనింగ్ భారీగా జరుగుతుండడంతో క్యాచ్ మెంట్ ఎరియా పూర్తిగా నాశనం అవుతుందని గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. తవ్వకాల వల్ల గిరిజనులు ఇప్పటికే ఉపాధి కోల్పోయారు.

మైనింగ్ వల్ల వారు సాగు చేసే జీడితోటల్లో కాపు లేకుండా పోయింది. తవ్వకాల వ్యర్థాలతో ఊట కాలువలు పూడుకుపోవడంతో నీరులేక పంటలు పండడం లేదు. దీంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెబుతున్నారు..

గంపవానిపాలెంలో 5 ఎకరాల భూమి ఉన్న రమణ బీబీసీతో "గత రెండేళ్లుగా ఆయకట్టు పూర్తిగా ఎండిపోయింది. కొండల నుంచి వచ్చే ఊట నీళ్లు రావడం లేదు. గతంలో రిజర్వాయర్ కింద బోరు వేస్తే 40 నుంచి 50 అడుగుల్లో నీళ్లు పడేవి. కాని ఇప్పుడు వందల అడుగులు వేస్తేగానీ నీళ్లు పడడ లేదు. పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి" అని చెప్పాడు.

మైనింగ్ వల్ల మా గ్రామంలో కనీసం నీరు దొరకడం లేదు. కొండలమీద నుంచి ఊటలు ఎక్కువగా రావడం వల్ల ఒకప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండేవి. ఇప్పుడు నీళ్ల కోసం వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తోంది అని గిరిజనుడు సెగ్గా శంకరరావు చెప్పారు.

కళ్యాణపులోవ తవ్వకాలు

మైనింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి

సాధారణంగా మైనింగ్ చేసే ప్రాంతాలు గ్రామానికి కిలోమీటరు దూరం ఉన్నప్పుడే అక్కడ తవ్వకాలకు అనుమతి ఇస్తారు.

కాని ఇక్కడ రొచ్చుకొండ గ్రామానికి కేవలం మీటర్ల దూరంలో తవ్వకాలు జరిపేందుకు జీవీఎల్ కంపెనీకి అనుమతి ఇచ్చారు. మైనింగ్ జరిగే ప్రాంతానికి గ్రామం 50 మీటర్ల దూరంలో ఉంటే, అనుమతుల్లో మాత్రం 1.5 కిలోమీటర్ దూరం ఉన్నట్లు రాశారు.

గూగుల్ మ్యాపింగ్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు.

"మైనింగ్ అనుమతులు కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ విభాగం ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, కాలువలు, వాగులకు సంబందించిన అన్ని వివరాలు ఇవ్వాలి. రెవెన్యూ విభాగం సాగునీటి శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకొని అక్కడ ఎలాంటి రిజర్వాయర్లు లేవని మైనింగ్ వల్ల ఏ ముప్పూ లేదని నిర్ధారించాలి" అని అజయ్ కుమార్ చెప్పారు.

కానీ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఇవేవీ పాటించలేదని, మైనింగ్ శబ్దాలతో ఈ గ్రామంలోని స్కూలును కూడా మూసేశారని ఆందోళనలు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు.

"నీటి సంక్షోభం నుంచి కాపాడాలంటే నీటి వనరులను కూడా కాపాడాలి. కృష్ణ పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఎలా కూల్చేశారో, అలాగే తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో మైనింగ్ కంపెనీలను కూడా అపేయాలి" అని అజయ్ కుమార్ కోరారు.

కళ్యాణపులోవ తవ్వకాలు
ఫొటో క్యాప్షన్, కల్యాణపులోవ డ్యాం దగ్గర 'వాటర్ మ్యాన్' రాజేంద్ర సింగ్

'వాటర్ మ్యాన్' అని పిలిచే రాజేంద్ర సింగ్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు.

"కల్యాణపులోవ రిజర్వాయర్‌ను పరిరక్షించడంతో పాటూ ఆ ఆయకట్టును కాపాడాలి. దానికి ఆనుకుని మైనింగ్ జరగడం వల్ల డ్యాం ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్లు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి. క్యాచ్ మెంట్ ఎరియాలో నో మైన్ ఏరియాగా ప్రకటించాలి" ఆయన అన్నారు.

మైనింగ్ కోసం అన్ని రైతు హక్కులను ఉల్లంఘించారని రాజేంద్ర సింగ్ అన్నారు. కల్యాణపులోవ దగ్గర మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని కోరారు.

మైనింగ్‌కు తాము వ్యతిరేకం కాదని, తమ జీవితాలు నాశనం చేస్తూ, వ్యవసాయ ఆధారిత కల్యాణపులోవ డ్యాంకు ప్రమాదకరంగా మారిన తవ్వకాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అక్కడ ఆందోళనలు చేస్తున్న స్థానికులు చెబుతున్నారు.

కళ్యాణపులోవ తవ్వకాలు

మైనింగ్ కంపెనీలు ఏమంటున్నాయి

పక్కాగా అనుమతుల ప్రకారమే తవ్వకాలు కొనసాగిస్తున్నామని మైనింగ్ కంపెనీల ప్రతినిధులు, సైట్ మేనేజర్లు శ్రీనివాస్(సాయి కపి), ప్రసాద్(స్టోన్ ప్లస్) చెబుతున్నారు. సహజంగా ఏర్పడిన వాగులను తాము ఎక్కడా నాశనం చెయ్యడం లేదన్నారు. అక్కడ ఉన్న ఏ కాలువల్లోనూ తవ్వకాల వ్యర్థాలు వేయడం లేదని చెప్పారు.

"మేం రోజూ పంచాయితీకి నీళ్లు సరఫరా చేస్తున్నాం. పైనుంచి వచ్చే నీళ్లను డైవర్షన్ పెట్టి మరీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్నాం. గత రెండేళ్లుగా వర్షాలు పడకపోవడం వల్లే కళ్యాణలోవ ఎండిపోయింది. ఇందులో మా ప్రమేయం ఎమీ లేదు అని సాయి కపి కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ చెప్పారు.

కళ్యాణపులోవ తవ్వకాలు

ఇరిగేషన్ అధికారులు చెబుతున్నదేంటి

కల్యాణపులోవలో మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు పొందలేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ అనుమతులు రద్దు చెసే అధికారం తమకు లేదన్నారు.

నర్సీపట్నం సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం రాజేంద్రకుమార్ బీబీసీతో " కంపెనీలు మైనింగ్ అనుమతులు కోరినప్పుడు నీటిపారుదల శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎన్వోసీలు అడకుండానే వాటికి అనుమతులు ఇచ్చేశారు. ఈ మైనింగ్ వల్ల రిజర్వాయర్‌కు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశాను" అని తెలిపారు.

దీనిపై స్పందించిన విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ "కళ్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో మైనింగ్ జరుగుతున్నట్లు నాకు ఫిర్యాదులు అందాయి. వాటిపై అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది" అని చెప్పారు.

"గత ప్రభుత్వం హయాంలో కళ్యాణలోవ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో మొత్తం 8 కంపెనీలకు మైనింగ్ అనుమతులు ఇచ్చాం. వాటిలో 6 కంపెనీలు పని చేయటం లేదు. 2 కంపెనీలు అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నాయి అని మైన్స్ అధికారులు కలెక్టర్‌కు పంపిన నివేదికలో తెలిపారు.

కళ్యాణపులోవ తవ్వకాలు
ఫొటో క్యాప్షన్, మైనింగ్ శబ్దాల వల్ల మూతపడ్డ స్కూలు

"ప్రస్తుతం ఇక్కడ మైనింగ్ చెస్తున్న రెండు కంపెనీల్లో ఒకటి తవ్వకాలు జరిగే ప్రాంతంలో రిజర్వాయర్లోకి వర్షపు నీళ్లు తీసుకొచ్చే కాలువల్లో వ్యర్థాలను నింపుతోందని ఆరోపణలు వచ్చాయి. దానివల్ల ఆ ప్రాంతంలో నీటి కొరత ఎర్పడిందని తెలిసింది. దాంతో అక్కడ తనిఖీలు చేయాలని జిల్లా ఇరిగెషన్ అధికారులను ఆదేశించాం" అని కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఇరిగేషన్ అధికారుల ప్రాధమిక నివేదికలో ఒక కంపెనీ కళ్యాణలోవ పరివాహక ప్రాంతంలో మైనింగ్ జరుపుతోందని, కానీ దానివల్ల నేరుగా కల్యాణపులోవ డ్యాంపై ప్రభావం ఉండదని, కానీ భవిష్యత్తులో సమస్యగా మారవచ్చని, అక్కడ ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చెయ్యడం మంచిదని నివేదిక ఇచ్చారు" అని కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు.

దీనిపై పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకూ ఒక కంపెనీ తవ్వకాలను నిలిపివేస్తామని కలెక్టర్ తెలిపారు. నీటి వనరులకు ఇబ్బంది కలిగించే ఏ తవ్వకాలనూ తాము అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

అయితే, కల్యాణపులోవ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల గురించి దాని అనుమతుల గురించి బీబీసీ మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఆ శాఖ అధికారులు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)